అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్లుగానే రష్యా వ్యతిరేక ఆంక్షల బిల్లుపై సంతకం చేశాడు. బిల్లు ఆమోదం తనకు ఇష్టం లేదని చెప్పి మరీ సంతకం చేశాడు. సంతకం చేసిన వెంటనే బిల్లుని ప్రవేశపెట్టినందుకు హౌస్, సెనేట్ లపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.
రష్యా-ఉత్తర కొరియా-ఇరాన్ వ్యతిరేక ఆంక్షల బిల్లు అమెరికా పాలనా వ్యవస్ధ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఉన్న విభేదాలని మరోసారి బహిర్గతం చేసింది. ప్రభుత్వాధికారంపై పట్టు కోసం అమెరికా డీప్ స్టేట్, ట్రంప్ ల మధ్య వైరుధ్యాలు తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయని తెలియజేసింది.
బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ లు భారీ మెజారిటీతో ఆమోదించాయి. రష్యాకు చెందిన రక్షణ, ఇంటలిజెన్స్, మైనింగ్, షిప్పింగ్, రైల్వే పరిశ్రమలు రంగాలపై ఈ చట్టం ఆంక్షలు విధించింది. రష్యా బ్యాంకులు మరియు ఇంధన కంపెనీలపై సంబంధాలు (వాణిజ్యం) పెట్టుకోకుండా ఇది నిరోధిస్తుంది.
2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం, క్రిమియా (రష్యాలో) విలీనం, సిరియాలో రష్యా మిలట్రీ కార్యకలాపాలు… ఈ మూడు రష్యాపై ఆంక్షలకు కారణాలుగా బిల్లు పేర్కొంది.
రష్యాతో సంబంధాలు మెరుగుపరుస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఈ బిల్లు అడ్డు గోడ అయింది. చట్టంలోని అంశాలను అధ్యక్షుడు నీరుగార్చకుండా ముందే బంధనాలు విధించింది. ఇన్ని విధాలుగా తన రాజ్యాంగబద్ధ అధికారాలకు ఆటంకం అయినప్పటికీ బిల్లుపైన సంతకం చేయక తప్పని పరిస్ధితిని ట్రంప్ ఎదుర్కొన్నాడు. ఫలితంగా తాను సంతకం చేసిన చట్టాన్ని తానే పరుష పదజాలంతో విమర్శించాడు.
“ఈ చట్టంలో తీవ్ర తప్పిదాలు, దోషాలు ఉన్నాయి. బేరసారాలు ఆడేందుకు అధ్యక్షునికి ఉన్న అధికారాలలోకి ఇది చొరబడిపోయింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తుంది. ఐరోపాలోని అమెరికా మిత్ర దేశాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. రష్యాతో సంబంధాలను చరిత్రలో ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజార్చింది” అని డొనాల్డ్ ట్రంప్ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశాడు.
“రష్యాతో సంబంధాలు అత్యంత అధమ స్ధాయికి దిగజారడానికి అమెరికా చట్ట సభలు హౌస్, సెనేట్ లే కారణంగా నిలిచాయి” అని ట్రంప్ ఆగ్రహం వెళ్ళగక్కాడు.
ఈ చట్టం రష్యాకు వ్యతిరేకం అయినప్పటికీ దీనివల్ల రష్యాకు కొత్తగా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పటికే అనేక ఆంక్షలు రష్యాపై అమలులో ఉన్నాయి. అయితే ఈసారి ఐరోపా దేశాల ఇంధనం అవసరాలపై ఈ చట్టం పరోక్ష ఆంక్షలు విధించింది. ప్రతి చర్యలు తీసుకోవాలని ఐరోపా నేతలు డిమాండ్ చేసే స్ధాయిలో అమెరికా-ఐరోపా వైరుధ్యాలకు ఈ చట్టం ఆజ్యం పోసింది.
చట్టాన్ని అధ్యక్షుడు తీవ్రంగా తప్పు పట్టడం బట్టి అందులోని కొన్ని అంశాలను ట్రంప్ అమలు చేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. చట్టం లోని అంశాలు అమలులోకి వచ్చినపుడు తాము ఒక్కొక్క అంశం ప్రాతిపదికన స్పందిస్తామని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి మీనా ఆండ్రీవా ప్రకటించడం బట్టి ఈ సంగతి అర్ధం అవుతున్నది.
“అమెరికా చట్టాన్ని ఎలా అమలు చేస్తారో మేము చూడాల్సి ఉన్నది. మిత్ర దేశాలను సంప్రదించాలన్న అవకాశాలు కొన్ని చట్టంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కో ఆంక్షను అమలు చేసినప్పుడు మా ప్రయోజనాలపై పడే ప్రభావాన్ని బట్టి మా అభ్యంతరాలను మా స్పందన ద్వారా తెలియజేస్తాం” అని మీనా ఆండ్రీవా తెలిపింది.
అమెరికా చట్టం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని కొద్ది రోజుల క్రితం జర్మనీ, ఆస్ట్రియాలు ఇప్పటికే ఉమ్మడి ప్రకటన ద్వారా విమర్శించాయి. అయితే ఈయూ నాయకులు మారే వరకూ అమెరికా చట్టంపై ఐరోపా నుండి నిర్ణయాత్మక చర్యలు రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.