రష్యాపై అమెరికా విధించిన తాజా ఆంక్షలకు రష్యా ప్రతీకార చర్య ప్రకటించింది. అమెరికాకు చెందిన 755 మంది దౌత్య వేత్తలు, అధికారులు, సిబ్బందిని దేశం నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బహిష్కృతులైన అధికారులు, సిబ్బంది సెప్టెంబర్ 1 లోపు రష్యా నుండి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా లపై ఆంక్షలు విధిస్తూ తయారు చేసిన బిల్లుకు అమెరికన్ సెనేట్ ఆమోద ముద్ర వేసిన దరిమిలా రష్యా ఈ బహిష్కరణ నిర్ణయం ప్రకటించింది.
755 మంది దౌత్య సిబ్బంది బహిష్కృతులు అయ్యాక రష్యాలో ఇక 455 మంది అమెరికన్ దౌత్య సిబ్బంది మాత్రమే మిగులుతారు. ఇది అమెరికాలో ఉన్న రష్యన్ దౌత్య సిబ్బంది సంఖ్యతో సమానం. ఒబామా పాలన చివరి రోజుల్లో (డిసెంబర్ 30, 2016 తేదీన) రష్యాకు చెందిన 35 మంది దౌత్య సిబ్బందిని బహిష్కరించాడు. మూడు రోజుల్లో వారు ఖాళీ చేయాలని ఆదేశించాడు. అంతేకాక రష్యా దౌత్య కార్యాలాయాలు రెండింటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ రోజు రష్యా ఎలాంటి ప్రతీకార చర్యలకూ రష్యా పాల్పడలేదు. తాజా బహిష్కరణతో రష్యా ప్రతి చర్య తీసుకున్నట్లయింది.
అమెరికా ఆంక్షల బిల్లును దిగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), ఎగువ సభ (సెనేట్) లు ఆమోదించాయి. బిల్లు పైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా అమలులోకి వస్తుంది. బిల్లులో అధ్యక్షుడి చేతులను కట్టేస్తూ లేదా ముందరి కాళ్ళకు బంధనాలు వేస్తూ నిబంధనలు ఇమిడి ఉన్నందున బిల్లు పైన ట్రంప్ సంతకం చేస్తాడా అన్న అనుమానాలను పలు పత్రికలు, విశ్లేషకులు వ్యక్తం చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేస్తూ అధ్యక్షుడు బిల్లుపై సంతకం పెట్టాలని భావిస్తున్నట్లుగా ఆయన ప్రతినిధులు పత్రికలకు సమాచారం ఇచ్చారు. కనుక రష్యా-ఇరాన్-ఉత్తర కొరియా ఆంక్షల బిల్లు దాదాపు చట్టం అయినట్లే, ఏదో అద్భుతం జరిగి ట్రంప్ మనసు మార్చుకుంటే తప్ప.
ట్రంప్ ముందరి కాళ్ళకు బంధనాలు వేసే నిబంధన ఏమిటి? రష్యాతో సంబంధాలు మెరుగుపరుస్తానని ఎన్నికల్లో ట్రంప్ వాగ్దానం చేశాడు. రష్యాతో వ్యాపార సంబంధాలు పెంచుకుంటే అమెరికాకే లాభం అనీ చెబుతూ ఆ వైపుగా కృషి చేస్తానని చెప్పాడు. కానీ అమెరికాలో పాలకవర్గాల్లో బలీయంగా ఉన్న నియో-కాన్ (నియో కన్సర్వేటివ్స్) సెక్షన్ రష్యాతో సంబంధాలకు బద్ధ వ్యతిరేకంగా ఉన్నది. ఈ సెక్షన్ కు అటు డెమోక్రటిక్ పార్టీతో పాటు, ఇటు డెమోక్రటిక్ పార్టీలో కూడా గట్టి మద్దతుదారులు ఉన్నారు. వాల్ స్ట్రీట్ (అమెరికా ఆర్ధిక బలగం), పెంటగాన్ (అమెరికా మిలట్రీ) లలో వారిదే హవా.
రష్యాతో స్నేహం కంటే శతృత్వం వల్లనే వారికి లాభం ఎక్కువ. శత్రువు-రష్యా పేరు చెప్పి మిలట్రీ కాంట్రాక్టులకు భారీ బడ్జెట్ పొందడం, రష్యా-చైనాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో అమెరికా ద్రవ్య-వాణిజ్య కంపెనీల ఆధిపత్యాన్ని పెంచుకోవడం అనే లక్ష్యాలు రష్యా స్నేహం వల్ల వారికి లభించవు. అందువల్ల వాళ్ళు మొదటి నుండీ ట్రంప్ ను వ్యతిరేకిస్తూ వచ్చారు. మొదట ట్రంప్ గెలవకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ట్రంప్ యుద్ధ వ్యతిరేక వాగ్దానాల్ని జనం నమ్మడంతో ఆయన గెలిచేశాడు.
ఆ తర్వాత ట్రంప్ తన పధకం మేరకు నిర్ణయాలు తీసుకోకుండా ఆయన చేతుల్ని (అధికారాల్ని) కట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆయన నియమించుకున్న మంత్రులపై ఒక పద్ధతి ప్రకారం ఆరోపణలు లేవనెత్తి, సాక్షాలు సృష్టించి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చారు. పత్రికల్లో విస్తృతంగా ట్రంప్ వ్యతిరేక ప్రచారం గుప్పించారు. తమ దారికి రాకపోతే అభిశంసన తీర్మానం పెట్టి ట్రంప్ ని పదవీచ్యుతుడిని చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.
ఇందులో భాగంగానే రష్యా-ఇరాన్-ఉత్తర కొరియా వ్యతిరేక ఆంక్షల బిల్లుకు వ్యతిరేకంగా మునుముందు ట్రంప్ చర్యలు తీసుకోకుండా బిల్లులోనే నిబంధనలు ప్రవేశపెట్టారు. అమెరికా పార్లమెంటు (హౌస్, సెనేట్) అనుమతి లేకుండా అధ్యక్షుడు చట్టంలో ఎలాంటి సవరణలు చేయరాదని ఒక క్లాజుగా బిల్లులో చేర్చారు. రష్యాతో వాణిజ్యానికి అనుకూలంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన వీటో అధికారంతో బిల్లులోని అంశాలను బలహీనం చేస్తాడని, తద్వారా రష్యా వాణిజ్యానికి నష్టం కలగకుండా చూస్తాడని నియో-కాన్ సెక్షన్ అనుమానించింది. అందుకే అధ్యక్షుడికి ఆ అధికారం లేకుండా బిల్లులోనే అవకాశాలు సృష్టించింది. ఈ బిల్లుపైన ట్రంప్ సంతకం చేస్తే ఆయన తన అధికారాలకు -ఈ చట్టం అమలుకు సంబంధించినంతవరకు- తానే కత్తెర వేసుకున్నట్లే. అయినా బిల్లుపై సంతకం చేసే యోచనలోనే ట్రంప్ ఉన్నాడు. దానిని బట్టి ట్రంప్ ఏ స్ధాయిలో అష్ట దిగ్బంధనంలో చిక్కుకుపోయాడో ఊహించుకోవచ్చు.
(దీని అర్ధం ట్రంప్ ప్రపంచానికి ఏదో మంచి చేసే ఆలోచనలో ఉన్నాడని కాదు. ప్రపంచ ఆధిపత్యం కొనసాగించడానికి ట్రంప్ కి ఒక పంధా ఉంటే నియో-కాన్ సెక్షన్ కు మరొక పంధా ఉన్నది. అంత వరకే తేడా.)
అమెరికా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించినప్పుడు రష్యా ప్రతి చర్య తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణం: ట్రంప్ వచ్చాక అయినా పరిస్ధితిలో ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలని అనుకోవడమే. ఇటీవల జి20 సమావేశాల సందర్భంగా ట్రంప్-పుతిన్ ల మధ్య చర్చలు జరిగాయి. అరగంట అనుకున్న సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగింది. సమావేశంలో సిరియాకు సంబంధించి ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒప్పందం ప్రకారం సిరియా నైరుతి భాగంలో కాల్పుల విరమణ జరగాలి. తద్వారా పౌరులు మరణించకుండా రక్షణ కల్పించాలి. ఫలితంగా సిరియా నైరుతి భాగంలో ఘర్షణలు ఆగిపోయాయి. సిరియా ప్రభుత్వ బలగాలు ఆ భాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. ఆల్-ఖైదా బలగాలు మరోచోటికి తరలి పోయారు. (దీనిని బట్టి ఆల్-ఖైదా / ఆల్-నూస్రా అమెరికా చెప్పు చేతల్లోనే ఉన్నదని స్పష్టం అయింది.) సిరియాతో పాటు ట్రంప్ అనుసరించబోతున్న రష్యా ఆంక్షల విధానం గురించి కూడా పుతిన్ కు ఒక స్పష్టత వచ్చిందని రష్యన్ పత్రికలు తెలిపాయి.
ఏమిటా స్పష్టత? రష్యా విషయంలో స్నేహ పూరిత వాణిజ్య సంబంధాలను మొదలు పెట్టే పరిస్ధితి ట్రంప్ కు సమీప భవిష్యత్తులో లేదని. ఆ స్పష్టత వచ్చాక ఇక అమెరికన్ దౌత్య సిబ్బందిని బహిష్కరించే విషయమై పుతిన్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. రష్యా-ఇరాన్-ఉత్తర కొరియా లపై ఆంక్షలు విధిస్తూ అమెరికా హౌస్, సెనేట్ లు బిల్లు ఆమోదించడం పుతిన్ నిర్ణయానికి తక్షణ కారణంగా ఉపయోగపడింది.
ఇంతకీ ఈ ఆంక్షలకు ఐరోపా దేశాలు మద్దతు ఇస్తున్నాయా? లేదు. మద్దతు ఇవ్వకపోగా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎంత గట్టిగా అంటే ఈయూ నాయక దేశం అయిన జర్మనీ మంత్రులు ఈ ఆంక్షలను తీవ్రంగా ఖండించెంతవరకూ. ఇంకా చెప్పాలంటే అమెరికా ఆంక్షల పైన జర్మనీ ప్రతీకార చర్యలు తీసుకోవాలని జర్మనీ ఆర్ధిక మంత్రి పిలుపు కూడా ఇచ్చేశాడు. “అమెరికా విధించిన కొత్త రష్యా-వ్యతిరేక ఆంక్షలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని ఆస్ట్రియా ఛాన్సలర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తం ఈయూ దేశాలన్నీ ఇదే వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇంతవరకూ రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా అమెరికా, ఈయూ ను కూడా తోడు తెచ్చుకునేది. అమెరికా ఒత్తిడితో ఈయూ దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు ప్రకటిస్తూ వచ్చాయి. ఇరు పక్షాలు చర్చించుకుని రష్యాపై ఆంక్షలు ప్రకటించేవి. ఈసారి -మొదటిసారిగా- ఈయూ తో సంప్రదింపులు జరపకుండా అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు ప్రకటించింది.
ఆంక్షల పైన ఈయూ తో చర్చించకపోవటానికీ, ఆ ఆంక్షలను ఈయూ ముఖ్యంగా జర్మనీ గట్టిగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? గట్టి కారణమే ఉన్నది. అమెరికా ప్రకటించిన ఆంక్షలు ఈయూ దేశాల వాణిజ్యానికి తీవ్ర నష్టకరంగా పరిణమిస్తాయి. ముఖ్యంగా జర్మనీ ఎనర్జీ (గ్యాస్) వాణిజ్య ప్రయోజనాలకు ఆంక్షలు తీవ్రంగా చేటు తెస్తాయి. జర్మనీకి నేరుగా గ్యాస్ సరఫరా చేసేందుకు ‘నార్డ్ స్ట్రీమ్’ పేరుతో ఇరు దేశాలు సముద్రం గుండా పైపు మార్గాన్ని నిర్మించాయి. ఇప్పటి వరకు రెండు సమానాంతర పైపు మార్గాలను నిర్మించాయి. యేడాదికి 55 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసే సామర్ధ్యం ఈ పైపు లైన్ కి ఉన్నది. దీని సామర్ధ్యాన్ని 2019 నాటికి రెట్టింపు చేసేందుకు మరో రెండు పైపు లైన్ల నిర్మాణాన్ని తలపెట్టారు.
- Nordstream or North Europe Gaz Pipeline
- Nortstream – 2nd stage
- Nord Stream operates pipeline facilities at the landfalls in Russia and Germany where the offshore pipeline ties in to the onshore connecting pipelines. The landfall facilities are connected via dedicated telecommunication lines and satellite uplink to the Control Centre located in Zug, Switzerland. From this location the pipelines are controlled and monitored around the clock.
- Nordstream and EU states
అమెరికా ఆంక్షల వల్ల ఈ గ్యాస్ సరఫరా, వాణిజ్యానికి భారీ నష్టం వస్తుంది. ఎంతో డబ్బు పోసి నిర్మించిన పైపు లైన్ వృధా అవుతుంది. దీని వెనుక అమెరికా వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి. గత నాలుగైదు యేళ్లుగా అమెరికా పెద్ద ఎత్తున షేల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నది. ఈ గ్యాస్ ను ఐరోపా దేశాలకు అమ్ముకోవాలని అమెరికా పధకం. కానీ రష్యన్ గ్యాస్ సరఫరా అవుతుంటే ఐరోపా దేశాలు అమెరికా గ్యాస్ ఎందుకు కొంటారు? అమెరికా గ్యాస్ కీ, రష్యా గ్యాస్ కీ అనేక విధాలుగా తేడా ఉంటుంది. రష్యన్ గ్యాస్ తక్కువ ధరకు లభిస్తుంది. ఆ గ్యాస్ వెంబడి కేవలం వాణిజ్యం తప్ప మరేమీ ఉండదు. అనగా రాజకీయంగా కట్టడి చేసే నిబంధనలు ఏమీ ఉండవు. కానీ అమెరికన్ గ్యాస్ అలాంటిది కాదు. అమెరికా కంపెనీలు కేవలం వాణిజ్యంతోనే సరిపెట్టుకోవు. నిరంతరం తమ గ్యాస్ నే నమ్ముకునేలా ఈయూ ని కట్టడి చేస్తాయి. అనేక వాణిజ్య నిబంధనలు విధిస్తాయి. రాజకీయంగా కూడా అనేక కట్టుబాట్లు విధిస్తాయి. సార్వభౌమ అధికారం కలిగిన ఏ దేశమూ ఇలాంటి వాణిజ్యాన్ని ఇష్టపడవు.
తమ షేల్ గ్యాస్ కంటే రష్యా గ్యాస్ నే ఈయూ దేశాలు ఇష్టపడతాయని అమెరికాకి బాగానే తెలుసు. అందుకే ఆంక్షల మార్గాన్ని ఎంచుకుని రష్యాపై ఆంక్షల ద్వారా ఈయూ గ్యాస్ వాణిజ్య ప్రయోజనాలకు ఆటంకం కలిగించడానికి అమెరికా పధకం వేసింది. ఈ పధకం ఆచరణలోకి వస్తే ఈయూ ఎనర్జీ ప్రయోజనాలు తీవ్ర నష్టకరం. అటు ఎలాంటి షరతులు లేని రష్యా గ్యాస్ ను కోల్పోవడమే కాక, అమెరికా ఇష్టారీతిన ధరలు నిర్ణయించే అమెరికన్ గ్యాస్ కు ఎల్లకాలం కట్టుబడి ఉండవలసి వస్తుంది. అంతే కాకుండా నార్డ్ స్ట్రీమ్ వల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా చేసే ఎనర్జీ హబ్ గా జర్మనీ అభివృద్ధి అవుతుంది. జర్మనీకి, ఈయూ దేశాలకు ఎనర్జీ బద్రత చేకూరుతుంది. అందుకే జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా తదితర ఈయూ దేశాలు అమెరికా ఆంక్షలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అమెరికా హౌస్ & సెనేట్ లు విధించిన ఆంక్షలు ట్రంప్ ప్రకటించిన ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి (ఎన్నికల వాగ్దానం) అనుకూలంగా ఉండటం. ఆంక్షలు ఐరోపా వాణిజ్య ప్రయోజాలను పక్కకు నెట్టేసి అమెరికా కంపెనీల వాణిజ్య ప్రయోజనాలకు అగ్రపీఠం వేస్తుంది. మామూలుగా అయితే అమెరికా-ఈయూ-రష్యాలు చర్చించుకుని ముగ్గురికీ ప్రయోజనకరంగా ఉండేలా గ్యాస్ వాణిజ్య విధానం రూపొందించుకోవచ్చు. కానీ అది చేస్తే అమెరికా ఆధిపత్యం వెనక్కి పోతుంది. ఈయూ, రష్యాలను సమాన వాణిజ్య భాగస్వాములుగా అమెరికా అంగీకరించాలి. అమెరికా బహుళజాతి కంపెనీల ఆధిపత్య, అహంభావ విధానానికి నీళ్ళు వదులుకోవాలి. అది అమెరికా కంపెనీలకు సుతారాము ఇష్టం ఉండదు. బలప్రయోగంతో అదిరించి బెదిరించి లొంగదీసుకుని తన వాణిజ్య ప్రయోజనాలే ప్రధానంగా చేసుకోవడమే అమెరికాకు తెలిసిన విధానం. ఇప్పటి వరకూ అది చెల్లింది. కానీ అమెరికా ఆర్ధిక బలిమి క్షీణించిన నేపధ్యంలో, రష్యా-చైనాలు గట్టి సవాలు విసురుతున్న నేపధ్యంలో, ఈయూ కూడా అమెరికా ఆదేశాలకు మునుపటిలా తల ఒగ్గెందుకు నిరాకరిస్తున్నది. తన ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు అంగీకరించడం లేదు. దాని ఫలితంగానే అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు ప్రకటించింది.
అమెరికా తాను ప్రకటించిన తాజా ఆంక్షలకు చెప్పిన అధికారిక కారణాలు: ఇరాన్ యేమో టెర్రరిజానికి మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఉత్తర కొరియా యేమో ఖండాంతర క్షిపణులను ప్రయోగించడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. రష్యా యేమో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చి హ్యాకింగ్ చేసి ఫలితాలను ప్రభావితం చేసే నేరానికి పాల్పడింది. చిత్రం ఏమిటంటే రష్యా ఎన్నికలను ప్రభావితం చేసింది ట్రంప్ ను గెలిపించే లక్ష్యంతో నైతే అదే కారణాన్ని చూపిస్తూ విధించిన ఆంక్షల బిల్లుపై ట్రంప్ గారే స్వయంగా సంతకం చేయనుండడం. తన గెలుపుకు సహకరించినందుకు ట్రంపే స్వయంగా రష్యాను ఆంక్షలతో శిక్షిస్తున్నాడు. ఆంక్షలకు అమెరికా చెప్పిన అధికారిక కారణాలను తరచి చూస్తే ఇలాగే అపహాస్యపూరితంగా ఉంటాయి; అవి వాస్తవ కారణాలు కాదు కనుక.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష అసలు అమెరికాకు ఒక లెక్కే కాదు. ఇలాంటివి ఎన్ని పరీక్షలు చేసినా అమెరికాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఐసిబిఎం ను పరీక్షించానని ఉత్తర కొరియా చెప్పుకున్నప్పటికీ అది పరీక్షించింది మధ్యంతర క్షిపణి మాత్రమే. ఐసిబిఎం లు 10,000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. మధ్యంతర క్షిపణులు (IRBM – Intermediate-Range Ballistic Missile) 5,000 కి.మీ లోపు దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తాయి. మొన్న ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి కేవలం 1000 కి.మీ మాత్రమే ప్రయాణించి జపాన్ సముద్రంలో పడిపోయింది. ఇందులో కేవలం వైర్లు, కొన్ని పేలుడు పదార్ధాలు మాత్రమే ఉన్నాయి తప్ప అణు బాంబును మోసే సామర్ధ్యం ఏ మాత్రం లేదని రష్యా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ లెక్కన ఐసిబిఎం ను తయారు చేయాలంటే ఉత్తర కొరియాకు అనేక యేళ్ళు పడుతుందనీ, దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదనీ రష్యా తెలిపింది.
కానీ ఉత్తర కొరియాపై ఆంక్షలు న్యాయబద్ధం చేసుకోవాలంటే ఆ దేశం ఐసిబిఎం లు పరీక్షించిందనే చెప్పాలి. ఉత్తర కొరియాకు ఆ శక్తి లేదని ప్రపంచం మొత్తానికి తెలిసినా అందుకే అమెరికా అది నిస్సందేహంగా ఐసిబిఎం అని అదే పనిగా ఊదరగొడుతోంది. ఇక ఇరాన్ టెర్రరిజానికి ఎక్కడ ప్రోత్సాహం ఇస్తున్నదో తెలియదు గానీ సిరియాలో ఇసిస్ తో పోరాటంలో ఇరాన్ తలమునకలై ఉన్నమాట మాత్రం నిజం. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని ఎదుర్కొని తన సార్వభౌమ, వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకోవడమే ఇరాన్ లక్ష్యం తప్ప టెర్రరిస్టులను పోషించి పొరుగు దేశాలను అనిశ్చితి పాలు చేయడంలో ఆ దేశానికి ఏ ప్రయోజనమూ లేదు.
కనుక మూడు దేశాలపై విధించిన ఆంక్షలకు అమెరికా చెప్పిన మూడు కారణాలు ఒట్టి అబద్ధం. అసలు లక్ష్యం అమెరికా గ్యాస్ వాణిజ్య ప్రయోజనం, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగించడం, పరోక్షంగా చైనా వాణిజ్యం మరియు ఆర్ధిక ప్రయోజనాలపై దెబ్బ కొట్టడం.