
350th birth anniversary of Guru Govind Singh in Patna
జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరవ సారి పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. రాజకీయ నీతికి అసలు సిసలు చిరునామాగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి తాను “ఛీ, ఫో” అని తిట్టిపోసిన మోడి నేతృత్వ బిజేపితోనే మళ్ళీ జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాడు. పక్కా పదవీ వ్యామోహాన్ని బాధ్యత నిర్వహణగా చెప్పుకుంటూ, పచ్చి రాజకీయ అవినీతికి నీతి రంగు పులుముతూ రాజకీయ భ్రష్టత్వంలో తాను ఎంత మాత్రం వెనకబడలేదని హడావుడిగా చాటాడు అవకాశవాద నితీష్ కుమార్!
లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పైనున్న అవినీతి కేసులను ఒక పధకం ప్రకారం స్వప్రయోజనానికి వినియోగించుకోవడంలో నితీష్ కుమార్ సఫలం అయ్యాడు. మోడిపై వ్యతిరేకతతో అప్పటి వరకు బద్ధ వైరి అయిన లాలూతో జత కలిసి ‘మహా ఘట బంధన్’ కూటమికి ప్రాణం పోసిన నితీష్ కుమార్, బిజేపి కి సవాలుగా ముందుకు వస్తున్న ప్రతిపక్షాన్ని తానే చేజేతులా గొంతు నులిమి చంపేశాడు. “చావనైనా చస్తాను గానీ బిజేపి తో ఇక జట్టు కట్టేది లేదు” అని శపధం చేసిన నితీశ్ తన శపధాన్ని తానే వేయి అడుగుల గోతిలో పాతిపెట్టాడు. మోడిని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా బిజేపి ప్రకటించిన వెంటనే ఆ పార్టీతో బంధం తెంచుకున్న నితీష్ అదే మోడితో
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే పాలక పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీ రావడం కాదు. పాలక పార్టీకి సరిజోడుగా ప్రతిపక్ష పార్టీని నిలబెట్టి పని చేయించగలిగితేనే బూర్జువా ప్రజాస్వామ్యంలో కాసింతయినా ప్రజాస్వామ్య జాడలు పాదుకుంటాయి. పాలక పార్టీకి మందబలం అప్పజెప్పి బలహీన ప్రతిపక్షాన్ని చట్ట సభలకు పంపితే మోడి తరహాలో ఏక పక్షంగా డీ-మానిటైజేషన్, జిఎస్‌టి చట్టం, భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్, రక్షణ శాఖ 100 శాతం ప్రైవేటీకరణ…. ఇలాంటి ప్రజావ్యతిరేక చట్టాలను ప్రజల మెడలకు గుడిబండగా పాలక పక్షం వేలాడతీయగలదు.
హిందూత్వ మూకలకు విచ్చలవిడి స్వేచ్ఛనిస్తూ భారత సామాజిక వాతావరణాన్ని దళితులకు, మైనారిటీలకు, పౌరహక్కులకు, ప్రజా సంఘాలకు, మతతత్వ వ్యతిరేకులకు సెక్యులర్ భావజాలానికి వ్యతిరేకంగా భయోత్పాతంగా మార్చివేస్తున్న మోడి నియంతృత్వ పాలనకు చెక్ పెట్టాలంటే బలమైన ప్రతిపక్షం కనీస అవసరం. అటువంటి ప్రతిపక్షాన్ని నిర్మించడానికి బీహార్ లో ఏర్పడిన మహా ఘట బంధన్ ఒక ఆశారేఖగా కనిపిస్తున్న తరుణంలో నితీష్ కుమార్ ప్రతిపక్ష నిర్మాణానికి పెను విద్రోహం తలపెడుతూ మోడి సరసన చేరాడు. తాను నాటిన మొక్కకు తానే పాతరేశాడు. ప్రజల్లో తాను రేపిన ఆశలను తానే కూల్చివేశాడు. హిందూత్వ చీకటితో మరోసారి చేయికలిపాడు. గతంలో వెళ్లగక్కిన మోడి-హిందూత్వ విద్వేషం ఒట్టి ప్రేలాపనలేననీ, అవినీతి వ్యతిరేక పోరాట వాగాడంబరం పదవిని కాపాడుకునేందుకు మాత్రమే అని చాటుకున్నాడు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, నితీష్ కుమార్ కి బిజేపి కూటమి మద్దతు ప్రకటించడం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీష్ కి గవర్నర్ కబురు పంపడం, నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం… అన్నీ శరవేగంగా ఎలాంటి తడబాటు లేకుండా జరిగిపోయాయి. దీన్ని బట్టే నితీష్ – మోడి కూడబలుక్కుని ప్రజలిచ్చిన ఎన్నికల తీర్పుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని స్పష్టం అవుతున్నది. రాష్ట్రపతి ఎన్నిక నుండి (మాజీ) ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ ఇళ్లపై సిబిఐ దాడులు చేయడం నుండి నితీష్ ప్రమాణ స్వీకారం వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈ పరిణామాలన్నింటిలో నితీష్, బిజేపి లు కూడబలుక్కుని (coordination) ఒకే మాటపై నడిచారని అర్ధం అవుతోంది.
ఈ మాత్రం దానికి తాను అవినీతి వ్యతిరేక ఛాంపియన్ ని అనీ రాజకీయ నీతికి కట్టుబడిన నిష్కళంక రాజకీయవేత్తననీ, బీహార్ అభివృద్ధి కాముకుడిననీ నితీష్ చెప్పుకోవడం దేశ ప్రజలను మోసం చేయడమే. కాంగ్రెస్, బిజేపి, టిడిపి, టిఆర్‌ఎస్, బిఎస్‌పి, ఎస్‌పి, ఆర్‌జేడి… ఇత్యాదిగా గల పార్టీల నేతలకూ నితీష్ కుమార్ కూ ఇసుమంత తేడా కూడా లేదు. ఆ పార్టీల తానులో ముక్కే నితీష్ కుమార్ కూడా. బూర్జువా నీతికి సైతం కట్టుబడని పచ్చి అవకాశవాద, అవినీతి, ప్రజావ్యతిరేక రాజకీయ నాయకుల్లో నితీష్ కుమార్ విడదీయరాని భాగమే.
శుక్రవారం జరిగిన బల పరీక్షలో జేడి(యూ) – ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం 131-108 ఓట్ల తేడాతో నెగ్గిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. కూటమి చెప్పుకున్నట్లుగానే 131 ఓట్లూ ఎన్‌డిఏ కూటమికి రాగా జేడియూ పోగా మిగిలిన మహాఘట బంధన్ కూటమికి (కాంగ్రెస్, ఆర్‌జేడి ల కూటమి) 108 ఓట్లు వచ్చాయి. “అవినీతిని సమర్ధించుకోవటానికి సెక్యులరిజంని వాడుకోరాదు” అని బల పరీక్ష చర్చలో నితీష్ కుమార్ బోధించాడు. పదవిని కాపాడుకోవడానికి ప్రజల తీర్పుకు విరుద్ధంగా బిజేపితో జట్టు కట్టి రాజకీయ అవినీతికి పాల్పడవచ్చో లేదో కూడా నితీష్ చెప్పి ఉండవలసింది. నెల క్రితం వరకూ తానే తిట్టి పోసిన మోడి, బిజేపి లు అకస్మాత్తుగా మద్దతు అందుకోగల మిత్రులు ఎలా అయ్యారో ఆయన చెప్పి ఉండాల్సింది. రాజీనామా చేసిన 14 గంటల లోపే మతతత్వ బిజేపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎలాంటి రాజకీయ నీతియో ఆయన చెప్పి ఉండాల్సింది. అవకాశవాద రాజకీయాలకు పాల్పడి రెండేళ్ల పరిధిలో రెండు సార్లు పరస్పర విరుద్ధంగా “యూ టర్న్ లు తీసుకోవడం ఏ విధంగా సమర్ధనీయమో చెప్పి ప్రజల కళ్ళు తెరిపించి ఉండాల్సింది.
మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పై ఎన్నడో దాఖలయిన కేసు విషయమై ఆయన ఇంటిపై సిబిఐ దాడి జరిగినప్పటి నుండి తేజస్వీ రాజీనామా చేయాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తూ వచ్చాడు. ప్రభుత్వం పని చేయాలంటే తేజస్వీ రాజీనామా చేయక తప్పదని ఆయన పట్టుబట్టాడు. అవినీతి కేసులున్న ఉప ముఖ్యమంత్రితో కలిసి తాను పని చేయలేనని ప్రకటనలు గుప్పిస్తూ తన ‘అవినీతి వ్యతిరేక పోరాట’ ముద్రకు కొత్త సొబగులు అద్దుకున్నాడు. నిజంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే ఆ క్రమంలో పదవి వదులుకుంటే అంతకంటే అభినందనీయం మరొకటి ఉండబోదు. కానీ జరిగింది ఆదేనా?
వాస్తవం ఏమిటంటే నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసినప్పుడే తేజస్వీ యాదవ్ పైన అవినీతి కేసులు నమోదై ఉన్నాయి. నితీష్ కుమార్ పైన కూడా ఓ హత్య కేసు నమోదై ఉన్నది. ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన పత్రాల్లో ఆ విషయం ఆయనే వెల్లడి చేశాడు.
ఇక్కడి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి: ప్రమాణ స్వీకారం నాడు తేజస్వీ యాదవ్ పైనున్న కేసుల పట్ల లేని అభ్యంతరం ఈ రోజు హఠాత్తుగా ఎందుకు పుట్టింది? రెండు: నితీష్ కుమార్ పై నమోదైన హత్య కేసుకు కదలిక తెచ్చి ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడతామని హిందూత్వ-బిజేపి నితీష్ ను బెదిరించడం నిజమేనా? ఈ రెండవ అంశం పైకి రాకుండా ఉండేందుకే హఠాత్తుగా తేజస్వీ యాదవ్ అవినీతి కేసు విషయమై తాజాగా సిబిఐ దాడి చేయడం, ఆర్‌జేడి తో తెగతెంపులు చేసుకోవడం జరిగిందని లోపలి విషయంగా పత్రికల్లో వినవస్తున్నది.

Mahaghathbandhan
హిందూస్ధాన్ టైమ్స్ (హెచ్‌టి) ప్రకారం జేడియూ, బిజేపి రీ యూనియన్ హడావుడిగా జరిగినది కాదు. గత 7 నెలలుగా ఈ రెండు పార్టీలు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నాయి. గత యేడు నవంబర్ లో మోడి ప్రకటించిన డీ-మానిటైజేషన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా నితీష్ కుమార్ బిజేపి కి తగిన సంకేతాలు ఇచ్చాడు. జనవరి నెలలో గురు గోవింద్ సింగ్ ఉత్సవం రోజున ఇరువురు (నితీష్, మోడి) ఒకే వేదిక పంచుకుని, వేదికపై చేతులు కలుపుకుని, చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ద్వారా ఇరువురూ, ఇరు పార్టీలు దగ్గర అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. అయితే ప్రధాని, ముఖ్య మంత్రి వేదికపైన ఉన్నపుడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మామూలే అనీ, అది వేదిక వరకే పరిమితమేనని పలువురు భావించారు.
అప్పటి నుండి ఒక కేంద్ర మంత్రి నిరంతరం నితీష్ కుమార్ తో టచ్ లో ఉన్నట్లు హెచ్‌టి తెలిపింది. ప్రకాష్ ఉత్సవ్ బాగా జరిపావని మోడి నితీష్ కు ప్రశంసలు అందజేయడం, నితీష్ కుమార్ ధన్యవాదాలు చెప్పడం విశ్లేషకుల దృష్టిని దాటిపోలేదు. ఆ తర్వాత నితీష్ ప్రవేశపెట్టిన ‘మద్యపాన నిషేధ చట్టం’ పై కూడా మోడి ప్రశంసలు కురిపించగా, గుజరాత్ సిఎం గా ఉండగా “మీరు మద్యపాన నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేశారు” అని నితీష్ పొగడ్తలు కురిపించాడు. నిజానికి గుజరాత్ లో మద్యపాన నిషేధం మోడి ప్రవేశపెట్టినది కాదు. 1960ల నుండే అక్కడ ఆ చట్టం ఉన్నది. సదరు చట్టం ఉన్నా కూడా గుజరాత్ లో మద్యం ప్రవాహం ఆగలేదు. పైగా మద్యం మాఫియా వీర విహారం చేసింది. మోడి హయాంలో ఈ మాఫియాకు మరిన్ని కోరలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ నితీష్ కుమార్ కు మాత్రం నిషేధం అమలులో మోడి సమర్ధత మాత్రమే కనిపించింది. (మోడి ప్రధాని అయ్యాక బిజేపి పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని నితీష్ కోరలేదు; మోడీకీ ఆ ఆలోచన రాలేదు.)
సరిహద్దు వెంబడి పాక్ స్ధావరాలపై ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేశామని మోడి ప్రభుత్వం ప్రకటించుకున్నప్పుడు అభినందనలు, ప్రశంసలు కురిపించిన వారిలో నితీష్ ముందు వరసలో నిలబడ్డాడు. మోడి చెప్పిన సో-కాల్డ్ సర్జికల్ స్ట్రైక్స్ కొత్త కాదనీ, గతంలో ఎన్నోసార్లు జరిగాయనీ కాకపోతే అప్పుడు ప్రకటించలేదు, ఇప్పుడు అదేదో తాము మాత్రమే చేసిన ఘనకార్యంలా ప్రకటిస్తున్నారని మాజీ రక్షణ మంత్రులు, మాజీ సైనికాధికారులూ చెప్పారు. అవేవీ నితీష్ కుమార్ అంతరాత్మను కదిలించలేదు.
జనవరి చివరి వారంలో నితీష్ కుమార్ టాప్ బిజేపి నాయకునితో పాట్నాలో సమావేశమై మంతనాలు జరిపాడని, దానికి కొనసాగింపుగా ఢిల్లీలో ఫిబ్రవరిలో మరోసారి కలుసుకున్నారనీ అప్పుడే ఒక ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి వచ్చారని హెచ్‌టి తెలిపింది. తిరిగి కలిసిపోవడానికి అవసరమైన నియమాలు, నిబంధనల గురించి, ఎప్పుడు కలుసుకోవాలన్న అంశం గురించి ఆ తర్వాత చర్చలు నడిచాయని హెచ్‌టి తెలిపింది.
వాస్తవానికి పార్లమెంటు ఋతుపవన సమావేశాలు ముగిసిన అనంతరం లాలూ, కాంగ్రెస్ లతో తెగతెంపులు చేసుకుని బిజేపి-జేడియూ లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పధక రచన జరిగింది. అయితే ఈ లోపు లాలూ యాదవ్ జాగ్రత్త పడి జేడియూ ఎంఎల్‌ఏ లను డబ్బు తో కొనివేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దానితో నితీష్, మోడీలు వేగంగా అడుగులు వేశారు. బీహార్ బిజేపి నేత సుశీల్ కుమార్ మోడి చేసిన సరికొత్త అవినీతి ఆరోపణలు అనుసరించి తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్ ఇళ్లపై సిబిఐ దాడి జరిగింది. తేజస్వి యాదవ్ పై అదనపు ఎఫ్‌ఐఆర్ నమోదయింది. నితీష్ కుమార్ ‘అవినీతి వ్యతిరేక హుంకరింపులు’ వేగం పుంజుకున్నాయి. దరిమిలా నితీష్ తన ప్రభుత్వాన్ని తానే కూలదోశాడు. భాగస్వామిని మార్చుకుని తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు.
నితీష్ కుమార్ ఆడిన బీహార్ నాటకంలో ప్రధాన లబ్దిదారు హిందూత్వ బిజేపి. వ్యక్తిగతంగా చూస్తే మోడి రాజకీయంగా బాగా లబ్ది పొందాడు. 2019 ఎన్నికల్లో నితీష్ కుమార్ ను ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఎదుర్కొనే అవసరం మోడీకి తప్పింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు బలమైన కూటమిగా ఏర్పడకుండా గట్టి దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో రెండు సంవత్సరాలకు ముందే 2019 ఎన్నికలు బిజేపి వశమైనట్లేనని భావించవచ్చు. మరోవైపు నితీష్ కుమార్ తన ‘అవినీతి వ్యతిరేక ముద్ర’ పదిలపరుచుకున్నానన్న భ్రమలో ఉండవచ్చు గానీ ఆయన పెట్టుకున్న ప్రధాన మంత్రి ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్, ఎస్‌పి, బిఎస్‌పి లు ఇప్పట్లో కోలుకునే పరిస్ధితి కనిపించడం లేదు. బిజేపి కి ఇక నల్లేరుపై నడకే.
NIce article about Politicians
keep it up
For more
Breaking News and World wide news click there