
Iranian Defense Minister Hossein Dehghan
పశ్చిమాసియాలో మరో ముఖ్య సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మసలిన ఇరాన్, ఇరాక్ లు కీలకమైన మిలట్రీ ఒప్పందం చేసుకున్నాయి. ‘ఉగ్రవాదం మరియు తీవ్రవాదం’ లకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా తాము ఈ ఒప్పందం చేసుకున్నామని ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు ఇరాన్ రక్షణ మంత్రి హోస్సేన్ దేఘన్, ఇరాక్ రక్షణ మంత్రి ఇర్ఫాన్ ఆల్-హియాలి లు అవగాహన పత్రంపై సంతకాలు చేశారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం… ఈ పదాలు దేశాల ప్రభుత్వాలకు ఇప్పుడు ఊత పదాలు. ఎలాంటి పరిణామాన్నైనా కప్పి పుచ్చుకోవటానికీ, అందరికీ అంగీకార యోగ్యంగా చాటడానికీ పనికొచ్చే పదాలు. కనుక ఉగ్రవాదం, తీవ్రవాదం పై పోరాటం కోసమే ఒప్పందం అని చెప్పడాన్ని తీసి పక్కన పెట్టవచ్చు.
ఇరాన్, ఇరాక్ ల ఒప్పందం ప్రధానంగా ఇరాన్ ప్రభావ విస్తరణకు సూచిక. ఈ రెండు దేశాల లోనూ షియాలే మెజారిటీ. అయితే సద్దాం హుస్సేన్ కాలంలో మైనారిటీలో ఉన్న సున్నీల చేతుల్లో అధికార పగ్గాలు ఉండేవి. చమురు, గ్యాస్ వనరులపై ఆధిపత్యం కోసం, ప్రాంతీయ సుప్రిమసీ కోసం ఇరాక్, ఇరాన్ ల మధ్య 1980 నుండి 1988 వరకూ 8 సం.ల పాటు తీవ్రమైన యుద్ధం సాగింది. ఐరాస (సోవియట్ రష్యా, అమెరికా) జోక్యం, మధ్యవర్తిత్వంతోనే ఆ యుద్ధం ముగిసింది.
సద్దాం ఇరాక్ సెక్యులర్ రాజ్యం కాగా, ఇరాన్ షియా ఇస్లామిక్ రాజ్యం. సద్దాం నేతృత్వం లోని సెక్యులర్ బాత్ పార్టీని ఇరాక్ లోని షియాలకు ప్రమాదకారిగా ఇరాన్ సుప్రీం నేత అయితుల్లా ఖోమైనీ పరిగణించాడు. కానీ ఇది వాస్తవ విరుద్ధం. సద్దాం ని కూలదొసేందుకు అమెరికా సరిగ్గా ఇదే షియా-సున్నీ వైరుధ్యాలను రెచ్చగొట్టి లబ్ది పొందింది.
సద్దాం అనంతరం ఇరాక్ లో జరిగిన ఎన్నికల్లో సహజంగానే షియా పాలకవర్గాలు పై చేయి సాధించారు. దరిమిలా ఇరాన్, ఇరాక్ ల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఇరాక్ షియా పాలకులు ఓ పక్క అమెరికా మిలట్రీ నియంత్రణలో కొనసాగుతూనే ఇరాన్ తో సత్సంబంధాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇరాన్ మద్దతుతోనే ఇరాక్ పాలకులు కాస్తంతయినా ప్రతిఘటన ఇస్తున్నారు.
కొద్ది వారాల క్రితం వరకూ ఇసిస్ మూకల ఆక్రమణలో ఉన్న ఇరాకీ ప్రధాన పట్టణం మోసుల్ విముక్తి అయిన తర్వాత అది తమ ఘనతే అని అమెరికా చాటుకుంది. కానీ అమెరికా ప్రకటనను ఇరాక్ ఉప ప్రధాని ఆల్-మాలికి నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.
“అమెరికా ఇందులో చేసిందేమీ లేదు. అమెరికా మాకు వైమానిక మద్దతు ఇవ్వడం నిజమే గానీ వాస్తవ యుద్ధంలో పాల్గొని త్యాగాలు చేసింది మా సైనికులే. వేలాది మంది ఇరాకీ సైనికుల ప్రాణ త్యాగం లేకుండా మోసుల్ విముక్తి సాధ్యం అయ్యేది కాదు” అని ఆల్-మాలికి అమెరికా ప్రకటనను తిరస్కరించాడు.
“అసలు ఇసిస్ మూకలు ఇరాక్ లోకి ఎలా వచ్చేరు? అమెరికా మద్దతుతోనే గదా వాళ్ళు ఇరాక్ లో ప్రవేశించింది. వాళ్ళు తెచ్చి పెట్టిన ఇసిస్ ని వాళ్ళే తరిమేశారని చెప్పుకోవడం హాస్యాస్పదం” అని కూడా ఆల్-మాలికి అమెరికా గొప్పలను హాస్యమాడాడు.
ఇలాంటి వాతావరణంలో, అమెరికా పట్ల ఇరాక్ పాలకుల్లో విముఖత పెరుగుతున్న నేపధ్యంలో జరిగిన ఇరాక్-ఇరాన్ మిలట్రీ ఒప్పందం నిస్సందేహంగా ఒక ముఖ్యమైన పరిణామం. ప్రాంతీయంగా (మధ్య ప్రాచ్యం) సూపర్ పవర్ గా తనకు తాను భావించే ఇజ్రాయెల్ దాష్టీకానికి ఈ ఒప్పందం సవాలు విసరడం ఖాయం. ఇజ్రాయెల్ ఆధిపత్యానికి మద్దతు వచ్చే అమెరికాకు కూడా ఈ ఒప్పందం సవాలుగా మారనుంది.
ఇరాన్, ఇరాక్ లు కుదుర్చుకున్న ఒప్పందంలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. సరిహద్దు బధ్రత, విద్యా రంగం, రవాణా రంగం, సాంకేతిక రంగం మరియు మిలట్రీ సహకారం… ఇవన్నీ ఒప్పందంలో భాగమే అని ఇరాన్ అధికారిక వార్తా సంస్ధ IRNA తెలియజేసింది. కనుకనే ఇది కీలక ఒప్పందం. ఒప్పందం గురించిన వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తెలిసిన అంశాలను బట్టి ఇరు దేశాలు దృఢతర సంబంధాల కోసం కట్టుబడి ఉన్నాయని స్పష్టం అవుతున్నది.
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టడం తోనే ఇరాన్ పట్ల శత్రు వైఖరి అవలంబించాడు. బారక్ ఒబామా చివరి దశలో ఇరాన్ తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సైతం ట్రంప్ వ్యతిరేకించాడు. ట్రంప్ అవలంబిస్తున్న ఇరాన్ వ్యతిరేక పంధా ఇజ్రాయెల్ కోసమే. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరింత బలిసి వీరంగం వేయాలని ట్రంప్ తలంపుగా కనిపిస్తోంది. అటువంటి తలంపుకు ఇరాన్-ఇరాక్ ఒప్పందం గట్టి ఎదురు దెబ్బ.