
Crisis ridden Italian Bank
యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెగ్జిట్ అన్నారు. అలాగే యూరో జోన్ నుండి ఇటలీ బైటికి వెళ్లడాన్ని ఇటలెగ్జిట్ అంటున్నారు. ఇటలీ ఋణ భారం పెరగడమే తప్ప తగ్గే జాడ కనిపించడం లేదు. దానితో ఉమ్మడి కరెన్సీ యూరోను త్యజించి తన జాతీయ కరెన్సీని మళ్ళీ అమలు చేయాలన్న వాదనకు ఇటలీలో మద్దతు పెరుగుతోంది.
బ్రిటన్ యూరో జోన్ లో సభ్యురాలు కాదు. అంటే బ్రిటన్ ఉమ్మడి కరెన్సీ యూరో ను తమ కరెన్సీగా స్వీకరించలేదు. కానీ ఇటలీ ఉమ్మడి కరెన్సీ పరిధిలో చేరింది కనుక అది యూరో జోన్ సభ్య దేశం. ఇటలెగ్జిట్ అంటే -ప్రస్తుతానికి- యూరో జోన్ నుండి ఇటలీ బైటికి రావడమే గానీ యూరోపియన్ యూనియన్ నుండి బైటపడడం కాదు. మునుముందు ఈయూ నుండి కూడా ఇటలీ బైటికి రాదలిస్తే అది వేరే సంగతి!
అలవి మాలిన ఋణ సంక్షోభం వల్ల ఈయూ, ఈసిబి, ఈసి, ఐఎంఎఫ్ ల ఒత్తిడికి తల ఒగ్గి వినాశకర పొదుపు విధానాలు అమలు చేస్తున్న గ్రీకు దేశం యూరో జోన్ నుండి బైటపడటం (గ్రెగ్జిట్) తధ్యం అని రెండేళ్ల క్రితం వరకు అంచనా ఉండేది. అయితే అనూహ్యంగా గ్రెగ్జిట్ కంటే ముందు బ్రెగ్జిట్ జరిగిపోయింది. ఇప్పుడు ఇటలెగ్జిట్ రంగం మీదికి వచ్చింది.
2016 చివరి నాటికి ఇటలీ అప్పు ఆ దేశ జిడిపిలో 132.6 శాతానికి చేరింది. అనగా ఇటలీ ఒక సంవత్సరానికి 100 యూరోల విలువ గల ఉత్పత్తి సాధిస్తే 132.6 యూరోలు అప్పు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పు పెరిగిపోయింది. ఆదాయానికి మించి అప్పు పెరిగితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ భ్యవిష్యత్తు పైన ఋణ దాతలకు అనుమానాలు పెరుగుతాయి. మళ్ళీ అప్పు ఇస్తే ఇటలీ తీర్చగలదో లేదో అని సంశయిస్తారు. ఆ అనుమానంతో అధిక వడ్డీ డిమాండ్ చేస్తారు. అసలే ఋణ భారం మోస్తూ మళ్ళీ అధిక వడ్డీకి అప్పులు చేయడం దేశానికి కష్టం అవుతుంది. చివరికి అప్పులు పుట్టని పరిస్ధితి వస్తుంది. ఇదే ఋణ సంక్షోభం.
యూరో జోన్ షరతుల ప్రకారం -యూరో ఉమ్మడి కరెన్సీ మండలంలో చేరాలంటే ఒక దేశ అప్పు దాని జిడిపిలో 60 శాతం కంటే మించకూడదు. ప్రధాన యూరో దేశాలు జర్మనీ, ఫ్రాన్స్ ల అప్పు కూడా 60 శాతం దాటినా ఆ దేశాల ఆర్ధిక బలిమి వల్ల ఋణ షరతు ఉల్లంఘన అయినా ఎవరూ, ముఖ్యంగా మార్కెట్లు, పట్టించుకోవడం లేదు.
2009-10 నుండి ఐరోపా ఖండాన్ని ఋణ సంక్షోభం పట్టి పీడిస్తోంది. ఋణ సంక్షోభం హఠాత్తుగా పుట్టినది కాదు. 2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభానికి కొనసాగింపుగానే ఇది ఐరోపాను చుట్టుముట్టింది. గ్రీసుతో మొదలై ఐర్లాండ్, పోర్చుగల్, సైప్రస్, స్పెయిన్ లను దాటి ఇటలీ వరకు ఋణ సంక్షోభం పాకిపోయింది. ఓ దశలో ఫ్రాన్స్ కూడా ఋణ సంక్షోభంలో పడిపోయిందన్న వార్తలు వచ్చాయి.
ఇటలీ ఋణ భారం జిడిపి లో 132 శాతం. అంటే యూరో జోన్ పరిమితి అయిన 60 శాతానికి రెట్టింపు కంటే ఎక్కువ. దానితో ఇటలీ సార్వభౌమ ఋణ పత్రాలకు గిరాకీ పడిపోతున్నది. సాధారణ స్ధాయి కంటే కాస్త అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఇటలీ బ్యాంకులు 200 బిలియన్ యూరోల మొండి బాకీలను మోస్తున్నాయి. ఈ పరిస్ధితి కొనసాగితే మార్కెట్ నుండి రుణాలు సేకరించలేని పరిస్ధితి ఎదురు కావచ్చని ఇటలీ ఆర్ధిక నిపుణులు, ప్రభుత్వ వర్గాలు భయపడుతున్నారు. గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్ లకు ఈసి, ఐఎంఎఫ్ లు ఉమ్మడిగా అప్పులు ఇచ్చి రుణాల దారి మూసిపోకుండా చూశాయి. కానీ ఇటలీ లాంటి పెద్ద ఆర్ధిక వ్యవస్ధకు అదే తరహా సాయం చేయాలంటే కష్టం అవుతుంది. దానితో అనివార్యంగా ఇటలెగ్జిట్ వైపు అనేకమంది ఆలోచనలు మళ్లుతున్నాయి.
జులై ఆరంభంలో సాక్ష్యాత్తూ ఇటలీ పార్లమెంటు సభ్యులే ఇటలెగ్జిట్ వల్ల లాభ నష్టాలపై చర్చించడానికి సెమినార్ నిర్వహించారు. సెమినార్ కూడా పార్లమెంటులోని ‘ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్’ హాలులోనే జరిగింది. ఫైవ్ స్టార్ మూవ్మెంట్ పేరుతో వెలిసిన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ సెమినార్ ను ఆర్గనైజ్ చేశారు. యూరో జోన్ ఋణ చెల్లింపుల వ్యవస్ధ లోతుపాతులు, సార్వభౌమ రుణాల పునర్వ్యవస్దీకరణ వ్యూహాలు, సమానాంతర చెల్లింపుల వ్యవస్ధలు మొదలైన అంశాలతో పాటు యూరో జోన్ నుండి ఇటలీ బైటపడే అవకాశాలను కూడా సెమినార్ లో చర్చించారు.
ఇంతవరకు ఇటలెగ్జిట్ పండిత చర్చలకు, ఆర్ధిక వేత్తల విశ్లేషణలకు, ఋణదాతల అనుమానాలకు, పత్రికల కధనాలకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడది పార్లమెంటు సభలో పార్టీల చర్చల వరకు వెళ్లింది. ఇప్పటి వరకు ఇటలెగ్జిట్ గురించి మాట్లాడడమే పరిహాసంగా ఉంటే ఇప్పుడది ఇటలీ పార్లమెంటు చర్చించే స్ధాయికి రావడం పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తున్నదని ఇటలీ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Euro in crisis -Cartoon
కొందరు ఇటలీ ఆర్ధిక విశ్లేషకులైతే తన సొంత కరెన్సీ ‘లీరా’ ను తిరిగి స్వీకరిస్తే ఇటలీ ఆర్ధిక పరిస్ధితి ఖచ్చితంగా మెరుగుపడుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. “దక్షిణ ఐరోపా దేశాలు యూరో కు బదులు తమ సొంత సార్వభౌమ కరెన్సీకి మళ్ళితే చాలా మెరుగైన ఆర్ధిక స్ధితికి చేరుకోగలవు” అని జర్మనీ ఆర్ధిక నిపుణుడు మార్క్ ఫ్రెడరిక్ చెప్పడం విశేషం. సంక్షోభంలో కూరుకుపోయిన అతి పెద్ద ఇటలీ బ్యాంకు మాంటే డి పాషి అని ఆడుకోవడానికి ఈసిబి (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్) గత డిసెంబర్ లో నిరాకరించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
“ఈ దేశాలు (దక్షిణ ఐరోపా దేశాలు) యూరో జోన్ లో ఉన్నంతవరకూ సంక్షోభం నుండి బైటపడడం అసాధ్యం. ఈసిబి నిర్ణయించిన వడ్డీ రేటు పరిమితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. 2012 లో రాసిన పుస్తకం (ద గ్రేటేస్ట్ రాబరీ ఇన్ హిస్టరీ) లోనే మేం ఈ సంగతి వివరించి చెప్పాము. ఉమ్మడి కరెన్సీ పని చేయదు. కనుక పెస్కారా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆల్బర్టో బజ్ఞై చెప్పిన అంశాన్ని మరింత నొక్కి చెప్పటం తప్ప ఇకేమీ చెప్పలేను” అని మార్క్ ఫ్రెడరిక్ స్పుత్నిక్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పాడు.
గత మార్చి నెలలో ఒక విశ్లేషణ చేస్తూ “యూరో కు నియంత్రిత ముగింపు పలకడం తప్ప మరొక దారి లేదు” అని ఆల్బర్టో ప్రకటించాడు. “ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్ధ కుప్పకూలడమే ఇటలీ ఆర్ధిక వ్యవస్ధ పతనానికి ప్రధాన కారణం అవుతుంది. ఇటలీతో పాటు జర్మనీ కూడా దిగజారక తప్పదు. కనుక యూరో రద్దు అందరికీ -రాజకీయ నాయకులకు, పతనమవుతున్న ఐరోపా నేతలకు, బహుశా అమెరికాకు కూడా- క్షేమకరం” అని ఆల్బర్టో ప్రకటించాడు.
దాదాపు దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ గ్లోబలీకరించబడిన నేటి రోజుల్లో సంక్షోభం వస్తే ఏ ఒక్క దేశమూ తనకు తానుగా నిలదొక్కుకోగల పరిస్ధితి లేదు. అన్నీ దేశాల, ముఖ్యంగా అమెరికా, ఐరోపాల, ద్రవ్య ఆర్ధిక నిర్మాణాలు ఒకదానినొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఉదాహరణకి ఇటలీ రుణాల్లో జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ పెట్టుబడులు ఉంటాయి. అదే జర్మనీ అమెరికా రుణాల్లో ఇటలీ ద్రవ్య కంపెనీల పెట్టుబడులు ఉంటాయి. మళ్ళీ ఈ నాలుగింటి రుణాల్లో జపాన్, కెనడాల పెట్టుబడులు ఉండవచ్చు. జపాన్ రుణాల్లో తిరిగి ఇటలీ, జర్మనీలు పెట్టుబడి పెట్టి ఉండవచ్చు. ఈ పరిస్ధిటిల్లో ఇటలీ సంక్షోభం అనివార్యంగా ఇతర పశ్చిమ, ధనిక దేశాలకు పాకుతుంది. ఇక పశ్చిమ దేశాలపై పూర్తిగా ఆధారపడి ఉన్న ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలు కుప్ప కూలడం నిమిషాల్లో పనే.
ఇటువంటి క్లిష్ట పరిస్ధితుల్లో ఐరోపా దేశాలు కూడబలుక్కుని విధి విధానాలు రూపొందించుకుని ఒక పద్ధతి ప్రకారం యూరో కరెన్సీని రద్దు చేసుకోవాలని ఆల్బర్టో పరిష్కారంగా చెబుతున్నాడు. దానిని ‘controlled end’ అనీ ‘managed end’ అనీ ఆల్బర్టో చెప్పాడు.
ఉమ్మడి కరెన్సీ అత్యధికంగా శక్తివంతమైన వారికే జర్మనీకే లాభిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ప్రధాన యూరో దేశాల్లోని బహుళజాతి ద్రవ్య కంపెనీలే యూరో ద్వారా అధికంగా లబ్ది పొందుతున్నాయి. ఉమ్మడి కరెన్సీ పేరుతో విధించిన షరతులు జర్మనీ, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, హాలండ్ తదితర దేశాల్లోని గుత్త బహుళజాతి కంపెనీలు అత్యధిక దోపిడీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆ లాభాలు ఋణ పీడిత దేశాల ప్రజలు చెల్లిస్తున్నవే. కనుక యూరో సభ్య దేశాలు ముఖ్యంగా ఋణ పీడిత దేశాలు ఎంత త్వరగా యూరో నుండి బైటపడితే ఆ దేశాల జాతీయ ఆర్ధిక వ్యవస్ధలకు, ప్రజలకు అంత క్షేమకరం.