రష్యా-ట్రంప్ కుమ్మక్కు ఆర్టికల్స్ తొలగించిన న్యూస్ వీక్


Margarita Simonyan –Sputnik Editor-in-Chief

హిల్లరీ క్లింటన్ ని ఓడించడానికి ట్రంప్ – రష్యా కుమ్మక్కయ్యారని నెలల తరబడి బూటకపు వార్తలు (fake news) గుమ్మరిస్తూ వచ్చిన అమెరికా పత్రికా సంస్ధలు ఒక్కొక్కటీ వరుసగా చెంపలు వేసుకుంటున్నాయి.

హిల్లరీ క్లింటన్ కి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ కి అనుకూలంగా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా హ్యాకింగ్ కు పాల్పడినట్లు రాసిన కధనాలలో పొరబాట్లు చేశామని కొద్ది రోజుల క్రితం అసోసియేటెడ్ ప్రెస్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్ధలు ఒప్పుకున్న సంగతి విదితమే.

ఇప్పుడా జాబితాలో తాజాగా న్యూస్ వీక్ చేరింది. న్యూస్ వీక్ గతంలో ప్రింట్ మీడియాగా వెలువడేది. ఇప్పుడు అది ఆన్ లైన్ పత్రికగా మాత్రమే వెలువడుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రభుత్వం, రష్యా పత్రిక స్పుత్నిక్ న్యూస్ ల మధ్య సంబంధాలు ఉన్నాయని, అమెరికాకు వ్యతిరేకంగా ముఖ్యంగా హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా వీళ్ళు ఉమ్మడి కుట్రలో పాల్గొన్నారని ఆరోపిస్తూ అమెరికా మీడియా అదే పనిగా విషం విరజిమ్మింది. కానీ అందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీడియా ఎన్నడూ చూపలేదు.

స్పుత్నిక్ న్యూస్ పత్రికకు అమెరికాలో ఎడిటర్ గా పని చేసిన బిల్ మోరన్ అనే యువ జర్నలిస్టు మరియు లాయర్ న్యూస్ వీక్ పై చట్టబద్ధ చర్యలకు ఉపక్రమించడంతో న్యూస్ వీక్ తోక ముడిచింది. కేసు విచారణకు రాక మునుపే బిల్ మోరన్ తో కోర్టు బయట ఒప్పందం చేసుకుంది.

అంతే కాకుండా స్పుత్నిక్ న్యూస్ కూ ట్రంప్ కూ మధ్య కుమ్మక్కును అంటగడుతూ రాసిన రెండు ఆర్టికల్స్ ను తన వెబ్ సైట్ నుండి తొలగించింది. అనగా స్పుత్నిక్ న్యూస్ & రష్యా (పుతిన్) మరియు డొనాల్డ్ ట్రంప్ లు హిల్లరీకి వ్యతిరేకంగా కుమ్మక్కు అయ్యారన్న వార్తా చెత్తను ‘చెత్త’ అని స్వయంగా న్యూస్ వీక్ ఒప్పుకుంది.

సంఘటనల క్రమం

హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ కి చెందిన కంప్యూటర్లు హ్యాకింగ్ దరిమిలా ఆ పార్టీ / హిల్లరీ ప్రచార రహస్యాలను వికీలీక్స్ (జులియన్ అసాంజే) ప్రచురించింది. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీల్లో హిల్లరీని గెలిపించడానికి ఆ పార్టీ నాయకత్వమే రిగ్గింగ్ కి పాల్పడినట్లు వికీ లీక్స్ అక్టోబర్ 2016లో వెల్లడి చేసింది.

(ఈ హ్యాకింగ్ చేసింది రష్యాయే అని అమెరికా మీడియా గగ్గోలు మొదలు పెట్టి ఎన్నికలు ముగిశాక కూడా అలుపూ సొలుపూ లేకుండా కొనసాగించాయి. లీక్స్ కూ రష్యాకూ సంబంధం లేదని వికీ లీక్స్ ప్రకటించినా వీరి దుష్ప్రచారం ఆగలేదు. అదొక సంగతి.)

William Bill Moron

ఆ సందర్భంగా వికీ లీక్స్ చేసిన ఒక ట్వీట్ ఆధారంగా స్పుత్నిక్ న్యూస్ వాషింగ్టన్ ఎడిటర్ బిల్ మోరన్ ఒక ఆర్టికల్ రాశాడు. లిబియా నగరం బెంఘాజీలోని అమెరికా ఎంబసీ మరియు సేఫ్ హౌస్ లపై 2012లో జరిగిన దాడిలో అమెరికా పౌరులు, రాయబారి మరణానికి హిల్లరీ బాధ్యత ఉన్నదని ఆమె ఎన్నికల సహాయకుడు బ్లూమెంధాల్ పరోక్షంగా ఒప్పుకున్నట్లుగా బిల్ మోరన్ తన ఆర్టికల్ లో రాశాడు.

అయితే తన అనుకోలు తప్పని బిల్ మోరన్ కొద్ది నిమిషాల్లోనే గ్రహించాడు. లీక్ అయిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘న్యూస్ వీక్ లో కర్ట్ అయిషన్ వైల్డ్ రాసిన ఆర్టికల్ గురించి మాత్రమే బ్లూ మెంధాల్ చర్చించాడు తప్ప ఒప్పుకోలు ఏమీ లేదని గ్రహించాడు. వెంటనే స్పుత్నిక్ న్యూస్ నుండి తన ఆర్టికల్ ను తొలగించాడు. ఆర్టికల్ ని ప్రచురించడానికీ, తొలగించడానికి మధ్య 20 ని.ల తేడా చోటు చేసుకుంది.

అదే రోజు ట్రంప్ కూడా ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ వికీ లీక్స్ ట్వీట్ ని కోట్ చేస్తూ లిబియాలో హిల్లరీ వైఫల్యాన్ని (అప్పుడు ఆమె అమెరికా విదేశీ మంత్రి) ఎత్తి చూపాడు.

న్యూస్ వీక్ లో కర్ట్ అయిషన్ వైల్డ్ సీనియర్ జర్నలిస్టు. అత్యంత వివాదాస్పద ఆర్టికల్స్ కు ఈయన కర్త. గాలి వార్తలు పోగు చేయడంలో దిట్ట. అమెరికాలోని సూపర్ ధనిక వర్గాలకు, వాల్ స్ట్రీట్ దిగ్గజ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా బూటకపు వార్తా కధనాలు సృష్టించడంలో ఆరితేరిన వ్యక్తి. అనేక మార్లు ఆయన బూటకత్వం వెల్లడి అయినా బుద్ధి మార్చుకోని శుంఠ.

స్పుత్నిక్ న్యూస్ పత్రిక హిల్లరీ తప్పు ఎత్తి చూపిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించడం, దాన్ని వెంటనే తొలగించడం ఆయన దృష్టిని ఆకర్షించింది. అంతే, తన కలానికి పని పెట్టాడు. బిల్ ఆర్టికల్, స్పుత్నిక్ (రష్యా) – ట్రంప్ ల కుమ్మక్కుకు సాక్ష్యం అని చెబుతూ న్యూస్ వీక్ లో ఆర్టికల్స్ గుప్పించాడు. స్పుత్నిక్ న్యూస్ తొలగించిన వార్తనే ట్రంప్ కోట్ చేశాడని చెప్పాడు. ఆ విధంగా స్పుత్నిక్, ట్రంప్ లు ఉమ్మడిగా హిల్లరీ ఓటమికి కృషి చేశారని రాశాడు.

హిల్లరీకి వ్యతిరేకంగా వార్తలు స్పుత్నిక్ న్యూస్ వార్తలు సృష్టించిందనీ, వారి లక్ష్యం హిల్లరీని భ్రష్టుపట్టించి డొనాల్డ్ గెలుపుకు అనుకూలంగా ఎన్నికలను మేనిపులేట్ చేయడమే అనీ ఈ ఆర్టికల్స్ సారాంశం. ట్రంప్ వాస్తవానికి రష్యా గూఢచారి అనీ, రష్యా హోటల్స్ లో ఆయన బస కూడా చేశాడనీ (ఎంతమంది అమెరికన్ అధికారులు చేయలేదని?! ఆ మాటకొస్తే హిల్లరీ క్లింటన్ కూడా రష్యన్ హోటల్స్ లో బస చేసింది మరి) ఈ బూటకపు వార్తల సూత్రధారి రాశాడు.

బిల్ మోరన్ కర్ట్ కధనాల్ని చూసి వాస్తవంగా ఏం జరిగిందో ఆయనకు చెప్పే ప్రయత్నం చేశాడు. తన పొరపాటు గుర్తించి తన ఆర్టికల్ ని తొలగించానని చెప్పాడు. బిల్ వివరణని స్వీకరించి తన తప్పు సవరించుకోవడానికి బదులు కర్ట్ అయిషన్ వైల్డ్ బిల్ ను బెదిరించాడు. అక్కడితో నోరు మూసుకోవాలని హెచ్చరించాడు. నోరు మూసుకుంటే న్యూస్ వీక్ లో ఉన్నత స్ధాయి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపాడు.

Sputnik News

కానీ బిల్ మోరన్ ఆశకు లొంగలేదు. వెంటనే స్పుత్నిక్ న్యూస్ నుండి తప్పుకున్నాడు. (పత్రికే అతనిని తప్పించింది. ఆ తర్వాత అదే ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది) లాయర్ విద్యకు పని పెట్టాడు. తనను తప్పుగా కోట్ చేస్తూ ఫేక్ న్యూస్ సృష్టించినందుకు న్యూస్ వీక్, కర్ట్ ల పైన దావా వేస్తూ నోటీసులు ఇచ్చాడు. న్యూస్ వీక్ సంస్ధ అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన న్యాయ సలహా సంస్ధను నియమించుకున్నప్పటికీ బిల్ మోరన్ తో నెగ్గలేమని గ్రహించింది. అందుకు కారణం తన ఆర్టికల్స్ కు కల్పితాలు తప్ప ఎలాంటి సాక్ష్యాలూ న్యూస్ వీక్ వద్ద లేకపోవడమే.

దానితో బిల్ మోరన్ తో సెటిల్మెంట్ కు సిద్ధపడింది. ఎంత మొత్తానికి సెటిల్ చేసుకున్నదీ వెల్లడి కాలేదు గానీ న్యూస్ వీక్ వెబ్ సైట్ నుండి కర్ట్ రాసిన ఆర్టికల్స్ ని తొలగించేందుకు అంగీకరించింది. తొలగించింది కూడా. ఆ ఆర్టికల్స్ టైటిల్స్ ఇవి:

“Dear Donald Trump and Vladimir Putin: I Am Not Sidney Blumenthal.”

“How I Got Slimed by Russian Propaganda Site Sputnik”

సెటిల్మెంట్ అనంతరం మాట్లాడుతూ స్పుత్నిక్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ మార్గరిటా సిమోన్యాన్  ఇలా చెప్పింది. “కోర్టు ప్రొసీడింగ్స్ కు భయపడి న్యూస్ వీక్స్ తన వెబ్ సైట్ నుండి మా పైన రాసిన కధనాలను తొలగించింది. మరిన్ని ‘న్యూస్ వీక్’ లకు స్పందనగా ‘అబద్ధాలు చెప్పడం అంత మంచిది కాదు’ అని చెప్పదలిచాం.”

అత్యంత ముఖ్యమైన సంగతి, ఈ ఆర్టికల్ కి కొసమెరుపు ఏమిటంటే… తాను నిజానికి స్పుత్నిక్ న్యూస్ వార్తా కధనం (మోరన్ ఆర్టికల్) పై ఆధారపడి తన ఆర్టికల్స్ రాయలేదని, ట్రంప్ – రష్యాల కుమ్మక్కు గురించిన తప్పుడు సమాచారాన్ని తనకు అమెరికా గూఢచార సంస్ధలే (ఎఫ్‌బి‌ఐ, సి‌ఐ‌ఏ) ఇచ్చారని కర్ట్ అయిషన్ వైల్డ్ చెప్పడం. ఫాక్స్ న్యూస్ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ ఒప్పుకోలు ప్రకటన చేశాడు.

ఏమిటి దీనర్ధం? అమెరికా అధ్యక్ష ఎన్నికలను  డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా రష్యా హ్యాక్ చేసిందన్న బూటకపు వార్తలకు అసలు సృష్టికర్త అమెరికా ఇంటలిజెన్స్ సంస్ధలే అని అర్ధం. సి‌ఐ‌ఏ, ఎఫ్‌బి‌ఐ ల ఊహల్లో ట్రంప్-రష్యాలు కుమ్మక్కు అయ్యారు తప్ప వాస్తవంగా కాదు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం దేశాలపైనా, దేశాధినేతలపైనా, చివరికి తమ దేశాధ్యక్షుడి పైనా కూడా ఏ స్ధాయి దుష్ప్రచారానికి అమెరికన్ మీడియా దిగుతుందో ఈ ఉదంతం ఒక తార్కాణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s