రోజుకు 2000 కేజీల బీఫ్ ఇస్తున్నాం -గోవా సి‌ఎం


గోవా రాష్ట్రంలో ఉన్నది బి‌జే‌పి ప్రభుత్వం. నిన్నటి వరకు కేంద్ర రక్షణ మంత్రిగా పని చేసిన మనోహర్ పరికర్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తమ రాష్ట్రంలో ప్రజలకు రోజుకు 2 వేల కిలోల బీఫ్ (ఆవు మాంసం) సరఫరా చేస్తున్నామని ఈ బి‌జే‌పి ముఖ్య మంత్రి సాక్ష్యాత్తూ రాష్ట్ర అసెంబ్లీ లోనే ప్రకటించాడు.

కానీ గోవధ సంరక్షణా సంస్ధలు ఏవీ పరికర్ పైన దాడి చేయలేదు. హిందువులకు పవిత్రమైన ఆవులను చంపుతున్నందుకు గో భక్తులు గోవా అసెంబ్లీపై దండెత్తలేదు. ఒక్క హిందూ సంస్కృతీ పరిరక్షకుడు కూడా పరికర్ ప్రకటనను కనీసం ఖండించలేదు.

పరికర్ ని ఎందుకు ఖండించాలి? ముస్లింల పైనా, దళితుల పైనా దాడులు చేసి చంపేస్తున్న హిందూ మూకలు ఆయనపైన కూడా ఎందుకు విరుచుకుపడాలి? ఎందుకంటే గోవాలో జంతు వధ శాలను నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వమే గనక. గోవాలో ఏకైక జంతు వధ శాల ‘గోవా మీట్ కాంప్లెక్స్ నుండే గో మాంసం సరఫరా అవుతుంది గనక.

గోవా జనానికి రోజుకి 2 వేల కేజీల బీఫ్ సరిపోతుంది. ఊహూ, సరిపోదు. “మిగిలిన మాంసాన్ని కర్ణాటక నుండి దిగుమతి చేసుకుంటున్నాం” అని పరికర్ చక్కగా ప్రకటించాడు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ బీఫ్ పై నిషేధం లేదు. ఆయనకు ముందు బి‌జే‌పి ప్రభుత్వం చేసిన బీఫ్ నిషేధ చట్టాన్ని రద్దు చేశాడు. బీఫ్ మార్కెట్ పై దాడులు లేకుండా చేశాడు. 10 లక్షల కుటుంబాలు అక్కడ బీఫ్ మార్కెట్ లో ఉపాధి పొందుతున్నారు.

నిజానికి ప్రతి రాష్ట్రంలోనూ లక్షలాది కుటుంబాలు బీఫ్ మార్కెట్ లో ఉపాధి పొందడమే కాకుండా మోడీ హయాంలోనూ బీఫ్ ఎగుమతులు కొనసాగుతున్నాయి కూడా. హైద్రాబాద్ లో అతి పెద్ద జంతు వధ శాల ‘ఆల్ కబీర్’ నుండి కూడా బీఫ్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఆల్-కబీర్ స్ధాపకుల్లో ఒకరు హిందువు ఒకరు ముస్లిం. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అధికారుల్లో హిందువులే అధికం. 

బి‌జే‌పి / మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గోవధ ను నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వివిధ రూపాల్లో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. బి‌జే‌పి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, మంత్రులు, నాయకులు చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనలను అనుసరించే హిందూత్వ మూకలు దళితులు, మైనారిటీలపై వీరంగం వేస్తున్నారు.

Cows slaughtered at Al-Kabeer

ఆవులను రవాణా చేస్తున్నా దాడి చేసి కొడుతున్నారు. గొర్రె, మేక, దున్న… ఇలా ఏ జంతువు మాంసం తీసుకెళ్తున్నా ఆవు మాంసం అని ఆరోపించి దాడి చేసి కొట్టి చంపేస్తున్నారు. చచ్చిన ఆవుల్ని తీసుకెళ్తున్నా దాడి చేసి కొడుతున్నారు. తాము చేస్తున్న అమానుష కృత్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. ఈ దాడుల వల్ల  దేశంలో వాతావరణం విద్వేషపూరితంగా మారిపోయి చివరికి రైళ్లలో సీట్ల వద్ద తగాదాలు కూడా మతం రంగు పులుముకుని హత్యల వరకు వెళుతున్నాయి.

దేశంలో ఇంత జరుగుతున్నా ప్రధాన మంత్రి ఒక్క ముక్కా మాట్లాడడు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి దేశాలు పట్టుకు తిరగడమే గానీ సామాన్య ప్రజల ఈతి బాధలు ఆయనకు పట్టవు. మైనారిటీలపై దాడులకు, హత్యలకు, ఊచకోతలకు కారకులైన మూల పురుషులలో ప్రముఖుడైన ఈ దేశ ప్రధాని దేశంలో సామాజిక వాతావరణాన్ని విద్వేషంతో నింపి, జనాల మధ్య కొట్లాటలు రేపి తాను మాత్రం ఎంచక్కా దేశ వనరులను విదేశీ బహుళజాతి కార్పొరేట్లకు పందేరం పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు.

జనానికి మత విద్వేషాలు, అల్లర్లు, హత్యలు, ఊచకోతలు అప్పజెప్పి అదే అవకాశంగా దేశ వనరులని బహుళజాతి కంపెనీలకు అప్పజెపుతున్నాడు.

ఇలాంటి మోడీ వ్యవహారాన్ని నేపధ్యంగా చూస్తే బి‌జే‌పి హయాంలోని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఎలాంటి బెరుకు లేకుండా “రోజుకి 2 వేల కే‌జిల ఆవు మాంసాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం” అని ఎలా ప్రకటించగలడో అర్ధం అవుతుంది.

ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ పరివారానికి, మోడీకి, బి‌జే‌పి ప్రభుత్వానికి వాణిజ్య లాభాల దృష్ట్యా బీఫ్ తో అభ్యంతరం ఉండదు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి, వాతావరణాన్ని కలుషితం చేసి, రాజకీయ లబ్ది పొందడం కోసం మాత్రం బీఫ్ నిషేధం కావాలి. అనగా వారి గోవులపై వారి ప్రేమ ఒట్టి బూటకం. వారి గో భక్తి మహా నాటకం. కనుకనే పరికర్ తన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి బెరుకు లేకుండా గో మాంసాన్ని సరఫరా చేస్తాడు. లేదంటే అక్కడ బి‌జే‌పి కి ఓట్లు పడవు.

ఆవు సెంటిమెంట్లతో ఓట్లు రాల్చుకోగల అవకాశం ఉన్న చోట గోవధ నిషేధం చట్టాలు చేస్తారు. ఆ చట్టాల అమలు చట్టబద్ధ అంగాలు కాకుండా హిందూత్వ మూకలకు అప్పగిస్తారు. హిందూత్వ మూకలే పోలీసింగ్ చేస్తారు; దాడులు చేస్తారు; కొడతారు; చంపుతారు. రాత్రి అయ్యాక ఆ హిందూత్వ మూకలే లంచాలు వసూలు చేసి బీఫ్ రవాణాకు అనుమతి ఇస్తారు. అందుకు సాక్షాలుగా కొన్ని చానెళ్లు, స్వతంత్ర సంస్ధలు అనేక మార్లు ఆడియోలు, వీడియోలు బహిరంగం చేశారు కూడా.

గోవధ నిషేధం వల్ల అంతిమంగా లబ్ది పొందుతున్నది కార్పొరేట్ మాంసం వ్యాపారులు. (హిందూత్వ మాఫియాలు ఫీజులు/లంచాలు/బలవంతపు వసూళ్లు వసూలు చేస్తూ కూడబెడుతున్నారు.) నిషేధం ద్వారా చిన్న చిన్న మాంసం వ్యాపారులు తమ దూకాణాలు మూసేసుకోగా వారి వ్యాపారం అంతా కార్పొరేట్ కంపెనీల (ఆల్-కబీర్, ఆల్ మనార్, ఎం‌కే‌ఆర్, అరేబియన్ ఇండస్ట్రీస్ మొ.వి) వశం అవుతోంది.

అనగా కాకులను కొట్టి గద్దలకు వేయడం, రాజకీయ లబ్ది పొందడం అనే రెండు లక్ష్యాలను బి‌జే‌పి / ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాలు నెరవేర్చుతున్నాయి.

కనుక మనోహర్ పరికర్ అసెంబ్లీ ప్రకటన ఆశ్చర్యకరం కాదు. ప్రజలే, ముఖ్యంగా బి‌జే‌పి హిందూ కబుర్లు నమ్ముతున్న వారు, బి‌జే‌పి మోసాన్ని గుర్తించవలసి ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s