ఇజ్రాయెల్ సందర్శన: మోడి హయాంలో డీ-హైఫనేషన్ -2


Tel Aviv :Prime Minister Narendra Modi and Israeli Prime Minister Benjamin Netanyahu during welcome ceremony upon arrival in Ben Gurion airport near Tel Aviv, Israel, Tuesday. PTI

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర, పరిణామం

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ రాజకీయాలకు అతీతంగా ఎన్నడూ లేవు. ప్రపంచ భౌగోళిక ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు దేశాల సంబంధాల గమనాన్ని అంచనా వేయడానికి పూనుకుంటే అది పాక్షిక పరిశీలనే కాదు; అవాస్తవ పరిశీలన కూడా. భారత పాలకులు స్వతంత్ర పాలకులు కాదు. వారు దళారీ పాలకులు. దళారీ వర్గం చేతుల్లో ఉన్న ఇండియా విదేశీ విధానం అనివార్యంగా అగ్రరాజ్యాల ప్రయోజనాలకు లొంగి ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఉండలేదు. కనుక ప్రపంచ స్ధాయిలో జరుగుతూ వచ్చిన భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే భారత పాలకుల ఇజ్రాయెల్ విధానం మారుతూ వచ్చింది తప్ప స్వతంత్రంగా ఎన్నడూ లేదు. ఈ వాస్తవాన్ని ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో నెహ్రూ-ఇందిర హయాం లోని ఇండియా సాపేక్షికంగా ప్రగతిశీలంగా కనిపించింది. అందుకు కారణం అమెరికా-సోవియట్ రష్యాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం. దేశీయంగా వామపక్ష విప్లవ తిరుగుబాటు ధోరణులను సంతృప్తిపరిచి బలహీనం చేసేందుకు నెహ్రూ తనకు తాను సోషలిజం మద్దతుదారుగా ప్రకటించుకున్నాడు. సోషలిస్టు తరహా వ్యవస్థను నెలకొల్పే పేరుతో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థను ప్రవేశపెట్టి సోవియట్ రష్యా సహాయంతో ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించాడు. వాస్తవంలో దళారీ వర్గాలు-సామ్రాజ్యవాదుల పెట్టుబడి మరియు లేబర్ అవసరాలను తీర్చే స్టేట్ కేపిటలిస్టు విధానాలను నెహ్రూ-ఇందిర ప్రభుత్వాలు అమలు చేశాయి తప్ప ‘సోషలిజం’ లేదా ‘సోషలిస్టు తరహా వ్యవస్ధ’ వారికి ఎప్పుడూ లక్ష్యం కాదు. అనగా అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చే విధానాలనే దళారీ పాలకులు అవలంబించారు. పాలస్తీనాతో నెహ్రూ-ఇందిర ప్రభుత్వాలు నిర్వహించిన స్నేహ సంబంధాలను, ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలను ఈ నేపధ్యం నుండే చూడాలి. ఆనాడూ, ఈనాడూ భారత దళారీ పాలకుల విధానం సామ్రాజ్యవాదులకు సేవ చేయడమే. ఆ సేవ చేసే పద్ధతిలో -ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ (Geopolitical) పరిస్ధితులకు అనుగుణంగా- మార్పులు చేసుకుంటూ రావడం మాత్రమే జరిగింది.

అయితే ఒక తేడాను గుర్తించాలి. నెహ్రూ-ఇందిర అనుసరించిన స్టేట్ కేపిటలిస్టు విధానాలను కూడా వ్యతిరేకించే దళారీ వర్గం ఇండియాలో క్రమంగా తలెత్తింది. వారి దృష్టిలో అలంకారప్రాయంగా అనుసరించిన సెక్యులరిస్టు విధానాలు కూడా అవసరం లేదు. కార్మికవర్గానికి ప్రయోజనం చేకూర్చిన వివిధ కార్మికవర్గ చట్టాల వల్ల శ్రామిక వర్గాలకు గొంతు పెరగడం వారికి నచ్చలేదు. ముఖ్యంగా అణగారిన కులాలు, మైనారిటీలు, గిరిజనులకు హక్కులు, సౌకర్యాలు కల్పించిన వివిధ చట్టాలు వారికి కంటగింపు అయ్యాయి. ఇలాంటి అసంతృప్త సెక్షన్ లో మొదటి స్ధానంలో ఆర్‌ఎస్‌ఎస్ ఉండగా మితవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇచ్చే వర్గాలు వివిధ పార్టీల కింద సమీకృతం అయ్యారు. వారు కాంగ్రెస్ పార్టీకి అడపా దడపా సవాలు (జస్టిస్ పార్టీ, జనతా పార్టీ మొ.వి) విసురుతూ వచ్చారు. కానీ త్వరలోనే సమసిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కటే స్ధిరంగా తన ఉనికిని కొనసాగించింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రబలిన అసంతృప్తిని హిందూ సెంటిమెంట్ల కింద ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. కార్మికవర్గంలో కూడా నెలకొని ఉన్న వెనుకబాటు కుల, మత, సాంస్కృతిక భావజాలం ఆర్‌ఎస్‌ఎస్ కు సాధనం అయింది. ఈ సెక్షన్ కాంగ్రెస్ కు బహుశా మొదటి పెద్ద సవాలు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం రూపంలో విసిరింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో పోగుపడిన తీవ్ర అసంతృప్తిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కొద్ది మేరకు సఫలం అయింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం వెల్లడి, బాబ్రీమసీదు వ్యతిరేక ఉద్యమం, అన్నా హజారే ఉద్యమం ఇవన్నీ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ బి‌జే‌పి అధికారానికి ఎగబాకటానికి దోహదం చేశాయి.

ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే కార్మికవర్గ రాజకీయాల దృష్టిలో చూసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్-బి‌జే‌పి నీడన చేరిన దళారీ పాలకవర్గాల స్వభావం కాంగ్రెస్ పాలకవర్గాల కంటే భిన్నమైనది కాదు. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ముఠా సాంస్కృతికంగా, భావజాల పరంగా కాంగ్రెస్ తో విభేదిస్తుంది. సెక్యులరిజం నటన, ప్రగతి ముసుగు కాంగ్రెస్ ను బి‌జే‌పి నుండి వేరు చేస్తుంది. పశ్చిమ రాజకీయాల పరిభాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లిబరల్ రాజకీయాలకు (లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్) ప్రతినిధి కాగా బి‌జే‌పి మితవాద రాజకీయాలకు ప్రతినిధి. ఈ రెండింటి మధ్య గ్రూపు ప్రయోజనాల వైరుధ్యాలే తప్ప ఆర్ధిక ప్రయోజనాల వైరుధ్యం లేదు. నెహ్రూ హయాంలో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాలు జరిగినప్పుడు ఆయుధాలు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ను నెహ్రూ కోరిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. మొదట ఇజ్రాయెల్ జెండా లేకుండా ఆయుధాలతో నౌకలు పంపాలని కోరిన నెహ్రూ అందుకు ఇజ్రాయెల్ అంగీకరించకపోవడంతో జెండాతో దిగుమతి చేసుకోవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత పాక్ తో యుద్ధంలో కూడా ఇజ్రాయెలీ ఆయుధాలను నెహ్రూ దిగుమతి చేసుకున్నాడు. అనగా ఇజ్రాయెల్ తో సంబంధాలకు నెహ్రూ వ్యతిరేకి కాడు. అలీన ప్రతిష్ట కోసం జెండా లేకుండా ఆయుధాలు అమ్మాలని కోరిన గొప్ప సోషలిస్టు సిద్ధాంత నిబద్ధుడు జవహర్ లాల్ నెహ్రూ. అందువల్ల ప్రజా వ్యతిరేక విధానాలలో, వ్యాపార ప్రయోజనాలలో, సామ్రాజ్యవాదులకు సేవ చేయడంలో ఇవి సహకరించుకుంటాయి. రాజకీయ అధికారం కోసం కుమ్ములాడతాయి.

ముఖ్యంగా విదేశీ విధానంలో ఈ రెండు పార్టీల మధ్య తేడా ఉండదు. జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్, బి‌జే‌పి లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విదేశీ విధానంలో కొనసాగింపు (continuity) జరిగిందే తప్ప మార్పు అన్నది సంభవించలేదు. తమలో తేడాలు ఉన్నట్లు పైకి చెప్పుకుంటాయే గానీ వాస్తవంలో ఒకదాని విధానాన్ని మరొకటి కొనసాగించాయి. మార్పు చేర్పులు చేసినట్లు ఎప్పుడైనా జరిగితే అది ప్రపంచ రాజకీయాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా జరిగినవే తప్ప స్వంత ప్రయోజనాల కోసం తమ సొంత గ్రూపు ప్రయోజనాల కోసం జరగలేదు. ఒకటి రెండు తేడాలు ఉంటే అవి ప్రాసెస్ కు సంబంధించినవే తప్ప లక్ష్యానికి సంబంధించినవి కావు.

ఇజ్రాయెల్ తో స్నేహం అవలంబించినా, ఎడమ పాటించినా అది మొత్తం భారత విదేశీ విధానంలో భాగమే. పైన చెప్పినట్లు నెహ్రూ-ఇందిర హయాంలో ప్రపంచంలో ‘దేశాలు స్వతంత్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని’ కోరుతున్న పరిస్ధితి ఉన్నది. కనుక సోషలిస్టు-కమ్యూనిస్టు పార్టీలతో పాటు ‘ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, అణగారిన ప్రజల హక్కులు’ లాంటి పదజాలం వల్లించిన లిబరల్ రాజకీయ పార్టీలు కూడా జాతులు, ప్రజలు, దేశాల పోరాటాలకు మద్దతు ఇచ్చాయి. పాలస్తీనా ప్రజల పోరాటానికి ఇండియా ఇచ్చిన మద్దతు సైతం ఈ కోవలోనిదే. (సోవియట్ రష్యా, కమ్యూనిస్టు చైనాల ఉనికి వల్ల అమెరికా, ఐరోపా దేశాలు కూడా తమను తాము ‘సంక్షేమ రాజ్యాలు’గా ప్రకటించుకోక తప్పలేదు.) ఆర్ధిక రంగంలో మూడో ప్రపంచ దేశాలలోని దళారీ వర్గాలు తమ ప్రగతి ముసుగుకు అనుగుణంగా (సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే) దేశీయ మార్కెట్ ను శక్తివంతం చేసేందుకు ‘స్టేట్ కేపిటలిస్టు’ విధానాలను అవలంబించాయి. నెహ్రూ-ఇందిర ప్రభుత్వాలు లేదా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటికి ప్రపంచంలో నెలకొన్న రాజకీయ-ఆర్ధిక వ్యవస్ధకు, భౌగోళిక రాజకీయాలకు అనుగుణంగానే ఇజ్రాయెల్ వలస ఆక్రమణను వ్యతిరేకించాయి; పాలస్తీనా స్వతంత్ర పోరాటానికి మద్దతు ఇచ్చాయి.

పి.వి హయాంలో పునాది

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పట్ల భారత ప్రభుత్వ విధానంలో మొదటి సారిగా పి.వి నరసింహారావు ప్రధాన మంత్రిత్వంలో మార్పు చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణ స్ధాయికి తెచ్చుకోవాలని మొదటిసారి పి.వి ప్రభుత్వం 1992లో నిర్ణయించింది. ‘ఇజ్రాయెల్ ను గుర్తిస్తూనే ఆ దేశంతో సంబంధాలు నిరాకరించే’ నెహ్రూ విధానానికి ముగింపు పలకాలని పి.వి నిర్ణయించాడు. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అప్పటి నుండి ఇజ్రాయెల్, పాలస్తీనాలతో సంబంధాల మధ్య సమతూకం పాటించే విధానాన్ని ఇండియా చేపట్టింది. ఇజ్రాయెల్ జాత్యహంకార అణచివేతను, యూదు వలస పాలనను, పాలస్తీనా ప్రజల స్వతంత్ర కాంక్షలను పి.వి ప్రభుత్వం తన నిర్ణయంతో పక్కన పెట్టేశాడు. అవి ఇక ఎంత మాత్రం తమకు సందర్భ సహితం కాదని ఆ నిర్ణయం ద్వారా తేల్చి చెప్పాడు. అనగా ఇజ్రాయెల్ తో సంబంధాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభం అయింది గానీ బి‌జే‌పి హయాంలో కాదు.

కొందరు విమర్శకులు పి.వి నిర్ణయానికి ఒక వివరణ ఇవ్వబోతారు. భావజాల పరంగా చూసినప్పుడు పి.వి నరసింహారావు హిందూత్వకు దగ్గరివాడుగా చూడడం కద్దు. ఆయన హయాంలోనే బాబ్రీ మసీదును హిందుత్వ శక్తులు కూల్చివేశాయి. ఓ పక్క మసీదు కూలిపోతుంటే ప్రధాని పి.వి పూజ గదిలో కూర్చుని బైటికి రాలేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కనుక హిందూత్వకు మద్దతుగానే పి.వి ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలకు నిర్ణయించాడని వారి వాదన. కానీ పదేళ్ళ యూ‌పి‌ఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ పి.వి ప్రభుత్వం, ఎన్‌డి‌ఏ-1 ప్రభుత్వాలు అమలు చేసిన ఇజ్రాయెల్ స్నేహ విధానాలను కొనసాగించిందే తప్ప తెంచుకోలేదు. పైగా మరింత ఉన్నత స్ధాయికి ఇజ్రాయెల్ స్నేహ సంబంధాలు చేరాయి. మరిన్ని ఒప్పందాలను యూ‌పి‌ఏ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో చేసుకుంది. అనేక సందర్భాల్లో పాలస్తీనాకు నష్టం చేకూర్చే నిర్ణయాలకు అనుకూలంగా ఐరాసలో ఇండియా ఓటు వేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని అర్ధం ఇరు దేశాల సంబంధాలలో సమతూకం పాటించే విధానాన్ని యూ‌పి‌ఏ కొనసాగించింది అని. ఈ ‘సమతూకం’ అన్నది ఒక ‘మాయ.’ ఆచరణలో అది ఇజ్రాయెల్ అనుకూల విధానంగానే పని చేస్తుంది. పాలస్తీనాకు మద్దతు అలంకారప్రాయంగా మిగిలిపోతుంది. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలకు తెర తీయడం ద్వారా పి.వి ప్రభుత్వం గతంతో సంబంధాలు తెంచుకోవడానికి ఇండియా సిద్ధమని ప్రపంచానికి సంకేతం ఇచ్చాడు.

పి.వి నరసింహారావు ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఏమిటి? హిందూత్వకు మద్దతుగా కాక ఎందుకోసం ఆయన పశ్చిమాసియా విధానంలో మార్పులు చేసినట్లు? దీనికి సమాధానం: ప్రపంచ స్ధాయిలో వివిధ శిబిరాల బలా బలాలలో వచ్చిన తేడాలకు, భౌగోళిక పరిణామాలకు ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ / పాలస్తీనా విధానంలో మార్పులు చేశాడు. సోవియట్ శిబిరం ఇక లేదు. అమెరికాయే ఏకైక అగ్రరాజ్యం. ఇజ్రాయెల్ ను దూరంగా పెట్టడం వల్ల ఇండియాకు అదనంగా వచ్చే ప్రతిష్ట ఏమీ లేదు. అలీన శిబిరం ఎలాగూ ప్రాసంగికతను కోల్పోయింది. సోవియట్ రష్యా స్ధానాన్ని చేపట్టిన రష్యా ఏకపక్షంగా పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం లేదు. సిరియా, ఇరాక్, ఇరాన్ (హమాస్ కు మద్దతు) తప్ప మధ్య ప్రాచ్యంలో దేశాలన్నీ అమెరికాకు దాసోహం అయ్యాయి. సౌదీ తదితర గల్ఫ్ దేశాలు, జోర్డాన్, ఈజిప్టు తదితర పశ్చిమ దేశాలు అమెరికాకు, కొనసాగింపుగా ఇజ్రాయెల్ కు మిత్ర దేశాలుగా మారాయి. మరో పక్క భారత దళారీ వర్గాలకు ఇక అమెరికా, పశ్చిమ రాజ్యాలు కాకుండా మరో పోషకులు లేరు. కనుక ఇజ్రాయెల్ తో సంబంధాలు ఏర్పరచుకోవడం అప్పటికి దళారీ వర్గాల ప్రయోజనాలకు, అమెరికా సామ్రాజ్యవాద సేవకు అనివార్య పరిణామం. దానికి పి.వి ప్రభుత్వం ఉపకరణం. ఇండియా విదేశీ విధానంలో ఇజ్రాయెల్ కు స్ధానం ఉండాలని పి.వి ప్రభుత్వం పై అమెరికా ఒత్తిడి తెచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

పి.వి ప్రభుత్వం నుండి యూ‌పి‌ఏ హయాం వరకూ ఇండియా అంతకంతకూ అమెరికాకు దగ్గరవుతూ వచ్చింది. అదే సమయంలో ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అమెరికా ఆదేశిస్తే ఇరాన్ నుండి నాణ్యమైన చమురు దిగుమతులలో కూడా భారత పాలకులు కోత పెట్టుకున్నారు. (సౌదీ చమురు దిగుమతులు పెంచుకుని అదనపు భారం మోశారు.) మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యానికి లొంగని ఇరాన్ తో ఇజ్రాయెల్ బద్ధ వైరం అవలంబిస్తుంది. మధ్య ప్రాచ్యంలో తన ఆధిపత్యానికి ఏకైక సవాలుగా ఉన్న ఇరాన్ పై పశ్చిమ దేశాలు దశాబ్దాల పాటు వాణిజ్య, ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించడంలో ఇజ్రాయెల్ శకుని పాత్ర పోషించింది. ఇరాన్ చమురు కొనుగోలు తగ్గించుకుని ఇండియా ఇజ్రాయెల్ ను ఎంతగానో సంతృప్తిపరిచింది. ఇది యూ‌పి‌ఏ హయాంలోనే జరగడం గమనార్హం. వాజ్ పేయి నేతృత్వం లోని ఎన్‌డి‌ఏ-1 ప్రభుత్వం ఇజ్రాయెల్ తో వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకుంది. అప్పుడే ఇజ్రాయెల్ పాలకులు ఇండియాను సందర్శించడం ద్వారా మారుతున్న ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల గురించి ప్రపంచానికి చాటారు.

మోడి పాలనతో స్పష్టత

నెహ్రూ హయాంలోనే ఇండియా-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు నెలకొనగా అవి పి.వి నాటికి దౌత్య సంబంధాల స్ధాయికి చేరాయి. ఎన్‌డి‌ఏ-1, యూ‌పి‌ఏ లు వాటిని వాణిజ్యం, విద్య, వ్యవసాయ, సాంకేతిక పరిజ్ఞానం మున్నగు అనేక రంగాలలో విస్తరించాయి. ఇజ్రాయెల్ తో అరమరికలు లేని సంబంధాలను అభివృద్ధి చేశాయి. నరేంద్ర మోడి ఈ సంబంధాలను మరొక మెట్టు పైకి చేర్చాడు. కానీ ముఖ్యమైన మూల మలుపుగా, మైలు రాయిగా మోడి సందర్శనను పేర్కొనడం అతి అంచనా కాగలదు.

వ్యాసం మొదట్లో చెప్పినట్లు మోడి సందర్శనలో జరిగిన ప్రధాన మార్పు ఇజ్రాయెల్, పాలస్తీనాలతో వేరు వేరుగా, ఒక దానితో ఒకటి సంబంధం పెట్టకుండా సంబంధాలను ఇండియా పెట్టుకుంటుందని సంకేతం ఇవ్వడం. ఇజ్రాయెల్ సందర్శనకు ముందు గత మే నెలలో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఇండియా సందర్శించాడు. పాలస్తీనాతో తమ సంబంధాలు కొనసాగుతాయని అప్పుడు మోడి ప్రకటించాడు. ఇప్పుడు పాలస్తీనా ప్రసక్తి లేకుండా పాలస్తీనాకు వెళ్లకుండా కేవలం ఇజ్రాయెల్ మాత్రమే సందర్శించడం ద్వారా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఉన్న చారిత్రక వైరాన్ని మోడి వెనక్కి నెట్టేశాడు. వారి వైరంతో తమకు సంబంధం లేదని చాటాడు. ఇరు దేశాలతో వేరు వేరుగా విడి విడిగా నిర్వహించగలమని స్పష్టం చేశాడు. దీనిని ఆంగ్లంలో డీహైఫనేషన్ గా చెబుతున్నారు. ఇజ్రాయెల్ ను ప్రస్తావిస్తే, పాలస్తీనా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్నది కనుక, పాలస్తీనీయుల పోరాటం కొనసాగుతున్నది కనుక అనివార్యంగా పాలస్తీనా అందులో ముడిపడి ఉంటుంది. అలాగే పాలస్తీనా ప్రస్తావన చేస్తే దానిని ఆక్రమించిన ఇజ్రాయెల్ ప్రస్తావన వచ్చేస్తుంది. ఈ సంబంధాన్ని సంకేతాత్మకంగా తెంచడమే మోడి చేశాడు. ఇది మోడి ప్రత్యేకంగా చేసింది కాదు. ఒక మలుపుగా చేపట్టిన ప్రకటన కాదు. పి.వి హయాంలో నిర్ణయాత్మకంగా ఆరంభమైన స్నేహ సంబంధాలను మరొక మెట్టు పైకి చేర్చడమే మోడి చేశాడు.

ఇలా సంబంధాలను ఒక మెట్టు పైకి చేర్చడం (విడి విడిగా ఇజ్రాయెల్, పాలస్తీనాలతో సంబంధాలు నిర్వహించడానికి సిద్ధపడటం) నేపధ్యంలో కూడా మారిన ప్రపంచ పరిస్ధితులు ఉండటం విస్మరించరాదు. పాలస్తీనా పోరాటానికి మద్దతుగా, అండగా నిలబడుతూ వచ్చిన సిరియా ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్ధితిలో పడిపోయింది. ఇరాన్ సైతం అందులో తలమునకలై ఉన్నది. లిబియా అమెరికా అనుకూల ఆల్-ఖైదా శక్తుల ఆధీనంలో ఉన్నది. హమాస్ కు మద్దతు ఇచ్చిన ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఈజిప్టు సైనిక పాలకులు తిరిగి అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రపంచం బహుళ ధ్రువత వైపుగా ప్రయాణిస్తున్న రంధిలో పాలస్తీనా పోరాటాన్ని పక్కకు నెట్టివేసింది. ఇప్పుడు పాలస్తీనాను తలచుకుంటున్నవారు లేరు. ఇజ్రాయెల్ తో రష్యా, చైనా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా… ఇలా అన్నీ దేశాలు సంబంధాలు నెరుపుతున్నాయి. ఈ దశలో మోడి ఇజ్రాయెల్ ను ప్రత్యేకంగా మూడు రోజుల పాటు సందర్శిస్తే అదేమంత ఆశ్చర్యకరం కాదు. నిజానికి ప్రపంచంలో మరోసారి మారిన పరిస్ధితులకు మోడి స్పందిస్తున్నాడు. రామల్లా (పాలస్తీనా ఆధారిటీ కేంద్ర కార్యాలయం ఉన్న పట్టణం) లో కొద్ది గంటలు గడిపినంత మాత్రాన మోడీకి అదనంగా వచ్చే లాభం లేదు.

అయితే యూ‌పి‌ఏ హయాంలో ఇజ్రాయెల్ తో సంబంధాల అభివృద్ధి పట్ల ఇండియా సమాధానం చెప్పుకుంటున్నట్లుగా (అపాలజిటిక్ గా) వ్యవహరించింది. ఉమ్మడి ప్రకటనల్లో గానీ, ఒప్పందాలు చేసుకున్నప్పుడు గానీ ఉపయోగించిన పదజాలం ప్రత్యేక తరహాలో ‘తప్పు చేస్తున్నామని అనుకోవద్దు. కరెక్టే చేస్తున్నాం’ అని చెబుతున్నట్లుగా ఉండేది. మోడీ ఆ పరిస్ధితిని బద్దలు కొట్టాడు. ఇజ్రాయెల్ తో సంబంధాల పట్ల ఇండియా ఇక ఎంత మాత్రం సమాధానం చెప్పుకునే పరిస్ధితిలో లేదని చాటాడు. మోడిని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ ఆహ్వానించిన తీరు, మోడి స్పందించిన తీరు, ఇద్దరూ కలిసి బీచ్ లో సందర్శించడం, ఒకరి భుజాల పైన మరొకరు చేతులు వేయడం, కౌగలించుకోవడం, ‘ఓ ఫ్రెండ్, ఓ మై హీరో’ అని సంబోధించుకోవడం…. ఇవన్నీ మోడీ – బీబీ (నేతన్యాహూలు) ప్రపంచానికి ఇచ్చిన సంకేతాలే. ఇక తమ మధ్య అరమరికలు లేవని తమ చర్యల ద్వారా వారు చెప్పారు. చరిత్ర భారం తమపై లేదని, దాన్ని కింద పడేశామని, కాళ్ళ కింద తొక్కి పారేయడానికి కూడా అభ్యంతరం లేదనీ మోడి చాటి చెప్పాడు.

సాధారణంగా ప్రభుత్వాధినేతల పర్యటనల్లో వివిధ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలే ప్రధాన అంశంగా ఉంటాయి. మోడి ఇజ్రాయెల్ సందర్శనలో మాత్రం ఇరు దేశాల నేతలు ఒకరికొకరు దగ్గరగా, కలుపుగోలుగా, పాత స్నేహితుల్లా మసలుకోవటమే ప్రధాన అంశం అయింది. అలాగని ఒప్పందాలకు విలువ లేదని కాదు. ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన రంగాలలో 7 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య కొత్త విమాన రూట్లు, టెక్నాలజీ బదిలీ, నీటి పరిరక్షణ, 3 యేళ్ళ వ్యవసాయ సహకారం, చిన్న ఉపగ్రహాల అభివృద్ధి సహకారం ఇవన్నీ ప్రాధాన్యత కలిగినవే. ప్రత్యేకంగా మూడు రోజుల పాటు ఒక్క ఇజ్రాయెల్ సందర్శనకు మాత్రమే కేటాయించడం ద్వారా, దానికి కలుపుగోలు ప్రవర్తనను జత చేయడం ద్వారా ఇజ్రాయెల్-పాలస్తీనాలను డీహైఫనేట్ చేస్తున్న సంకేతాన్ని మోడి ఇవ్వడమే ఈ సందర్శనలోని ముఖ్యమైన భాగం. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ సందర్శించడం కూడా ఇదే మొదటిసారి.

పాలస్తీనా ప్రసక్తి లేకుండా ఇజ్రాయెల్ కోసం 3 రోజులు కేటాయించడం వల్ల పాలస్తీనా నేతలను మోడి దూరం చేసుకున్నాడా? అదేమీ లేదు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ నుండి మాట్లాడుతూ పాలస్తీనా నేత డా. ఎల్ ఖల్ది ఏమన్నారో చూడండి. “మా ఆసక్తి అంతా ఇండియాతో సంబంధాలు ఉన్నత స్ధాయికి తీసుకెళ్లాడమే. ఇజ్రాయెల్ తో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకున్నంత మాత్రాన అవి మాతో సంబంధాలకు ఆటంకం కాబోవని మేము ఆశిస్తున్నాము. మధ్య ప్రాచ్యంలో ఇండియా తన ప్రయోజనాల కోసం సమతూకం పాటించుకోవాల్సిన అవసరాన్ని మేము అర్ధం చేసుకోగలం. మేము కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను విడి విడిగా చూసేందుకు సానుకూలంగానే ఉన్నాం.”

మోడి సందర్శనకు ముందు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని భారత రాయబారి కపూర్ ఏమన్నాడో చూడండి. “ఇజ్రాయెల్, పాలస్తీనాలతో విడి విడిగా సంబంధాలు నిర్వహించగలమన్న ఆత్మ విశ్వాసం మాకు వచ్చింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ తో ఇక మేము వేరు వేరుగా సంబంధాలు నిర్వహిస్తాము. భారత ప్రధాని సందర్శన అందుకు నిదర్శనం.

ఈ రెండు ప్రకటనలు అసలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. విడి విడి సంబంధాల వల్ల మోడి / ఇండియా ప్రపంచ దేశాల నుండి కొత్తగా ఎదుర్కొంటున్న సమస్య ఏమీ లేదు. అప్పటికే ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యను సమస్యగా చూడటాన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు (పాలకవర్గాలు) మానేశాయి. ఆ సంగతిని పాలస్తీనా కూడా గుర్తించింది. ఇజ్రాయెల్ తో ఏ దేశం దౌత్య, వాణిజ్య, రాజకీయ సంబంధాలు నెలకొల్పుకున్నా పాలస్తీనా పాలకులు వ్యతిరేకించి అభ్యంతరం చెప్పగల పరిస్ధితిలో లేరు. ఇటువంటి పరిస్ధితుల నేపధ్యంలో మోడి ఇజ్రాయెల్ సందర్శనను భారత దళారీ పాలకవర్గాల విదేశీ విధానానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్తదిగా, మలుపుగా చూడడం, అతి ప్రాముఖ్యతను ఆపాదించడం తగదు.

దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులకు మోడీ ఇజ్రాయెల్ సందర్శనకు సంబంధం చూడవచ్చా? ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు ఇలాంటి పరిశీలనకు ప్రేరేపించడం లేదు. అందుకు కొనసాగింపుగా అంతర్జాతీయ స్ధాయిలో మోడి ప్రభుత్వం ఏదైనా చర్యకు పాల్పడితే తప్ప ఇలాంటి పరిశీలన చేయలేము. అమెరికా టెర్రరిస్టులపై చేస్తున్న బూటకపు యుద్ధంలో ప్రత్యక్ష భాగస్వామి అయ్యే వైపుగా మోడి ఇండియా ప్రయాణిస్తున్న దాఖలాలు లేవు. కనుక ఈ పరిశీలనలో స్పష్టత కోసం మరిన్ని పరిణామాలు జరగవలసి ఉన్నది.

8 thoughts on “ఇజ్రాయెల్ సందర్శన: మోడి హయాంలో డీ-హైఫనేషన్ -2

  1. “దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులకు మోడీ ఇజ్రాయెల్ సందర్శనకు సంబంధం చూడవచ్చా? ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు ఇలాంటి పరిశీలనకు ప్రేరేపించడం లేదు. అందుకు కొనసాగింపుగా అంతర్జాతీయ స్ధాయిలో మోడి ప్రభుత్వం ఏదైనా చర్యకు పాల్పడితే తప్ప ఇలాంటి పరిశీలన చేయలేము.”…..

    దీని అర్ధం భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం అనుకోవచ్చునా??/?

  2. I mean: If India joins with coalition forces bombing Syria, Somalia (al-shabab)etc.. Then also it will be a strategic act but not conscious anti Muslim. Modi’s anti-muslim agenda is mainly driven by national electoral politics. But if he sees any benefit internationally he would definitely extend anti-muslim rhetoric at global level.

  3. నాకెంతో ఇష్టమయిన దేశాన్ని మొట్ట మొదట ఒక భారత ప్రథాని సందర్శించడం ఎంతో ఆనందాన్ని ఇచిన్ది

    ఇజ్రాయిల్ దేశంను గూర్చిన వార్త నాకైతే ఎంతో ఇష్టం

  4. దేవా భారత దేశాన్ని ఇజ్రాయెల్ ద్వారా రక్షించు ఇరు దేశాలు మంచిగా సోదరుల వలే వుండాలి పాకిస్తాన్,చైనా గుండెల్లో దడ పుట్టించాలి వాళ్ళ గుండెలు జారిపోవాలి

  5. ఇజ్రాయేల్ వుగ్రవాదాన్ని, మతతత్వాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశం. రక్షణ,వ్యవసాయ రంగాలలో సాంకెతికంగా ఎంతో పురోగతి సాధించింది. చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాలు ఏకం అవుతున్న ఈ తరునంలొ ఇజ్రాయెల్ వంటి దేశం సహకారం మనకు ఎంతొ అవసరం. మోదీ చాలా మంచి పని చెసారు.

  6. “ఇజ్రాయేల్ వుగ్రవాదాన్ని, మతతత్వాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశం.”

    ఇజ్రాయెల్ ఏ ఉగ్రవాదాన్ని ఎక్కడ ఎదుర్కొన్నది? ‘హమాస్’ ని ఉగ్రవాద సంస్ధ అని ఇజ్రాయెల్ తిట్టిపోస్తుంది. కానీ పి‌ఎల్‌ఓ ప్రభావాన్ని బలహీనం చేయడానికి హమాస్ ని ఇజ్రాయెలే మొదట ప్రోత్సహించింది. ఈ సంగతి ఆర్టికల్ లో రాశాను. మీరు గమనించినట్లు లేదు.

    సిరియాలో గాయపడిన ఇసిస్ ఉగ్రవాదులకు అత్యాధునిక వైద్యం అందించడానికి ఇజ్రాయెల్ ‘గోలన్ హైట్స్’ లో ఆసుపత్రి నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసా? ఇసిస్ పురోగమనానికి వీలుగా ఇజ్రాయెల్ సిరియా ప్రభుత్వ సైన్యాలపై వైమానిక దాడులు చేస్తున్న సంగతి మీ దృష్టిలో ఉన్నదా?

    అంతెందుకు! సిరియా నైరుతి ప్రాంతంలో ఇసిస్ – సిరియా సైన్యం మధ్య జరుగుతున్న యుద్ధం నుండి పౌరులను కాపాడ్డానికి ట్రంప్-పుతిన్ లు ఆ ప్రాంతం వరకు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మేరకు అమెరికా ఆదేశాలు ఇవ్వగానే వివిధ టెర్రరిస్టు గ్రూపులు కాల్పులు నిలిపివేశాయి. అనగా టెర్రరిస్టులు అమెరికా కనుసన్నల్లోనే నడుస్తున్నారని రుజువైయింది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించిన సంగతి మీకు తెలుసా? ఉగ్రవాదుల మతిలేని దాడుల నుండి పౌరుల్ని రక్షించేందుకు అమెరికా-రష్యాలు ఒప్పందం చేసుకుంటే దాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది?

    ఒకరిని లేదా ఒక సంస్ధను లేదా ఒక దేశాన్ని అభిమానించండి లేదా వ్యతిరేకించండి. కానీ ఆ అభిమానం / వ్యతిరేకత వాస్తవాలపై ఆధారపడి ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు.

    “చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాలు ఏకం అవుతున్న ఈ తరునంలొ…..”

    పాకిస్తాన్ కు నిన్నటి వరకూ సకల విధాలా సాయం చేసింది అమెరికాయే. కానీ వాజ్ పేయి, మోడి ప్రభుత్వాలు ఆ అమెరికాకే ఎందుకు విధేయంగా ఉన్నట్లు?

    శత్రు పాలకులు ఉంటారు గానీ శాశ్వత ప్రాతిపదికన శత్రు దేశాలు అంటూ ఏమీ ఉండవు. అది తప్పనిసరిగా గమనంలో ఉండాలి.

  7. శేఖర్ గారు..
    ఇటీవల సోషల్ మాధ్యమాల్లో చైనా వస్తువులు కొనకూడదు, చైనాని ఆర్ధికంగా బలహీన పరచాలంటే భారతీయులెవరూ ఆ దేశ దిగుమతులు వాడొద్దు అని ప్రచారం చేస్తున్నారు. దీనిలో హేతుబద్ధత ఎంటనేది మీ విశ్లేషణ ద్వారా తెలుపగలరు..

    ధన్యవాదాలు

  8. సురేష్ గారు,
    స్వదేశీ కంపెనీలను, మార్కెట్ ను, ఉద్యోగాలను కాపాడుకోవటానికి విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు ఇస్తే దాన్ని గురించి ఆలోచన చేయవచ్చు. కానీ భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ పూర్తిగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో పెనవేసుకుపోయిన ఈ రోజుల్లో ఆ పిలుపు పని చేయదు. మనమే నష్టపోవాల్సి వస్తుంది. పైగా చైనా మార్కెట్ లో ఇండియా మార్కెట్ చాలా కొద్ది భాగమే. (చైనాకి అమెరికా, ఐరోపాలు పెద్ద మార్కెట్.) మనం కొనకపోతే చైనా ఆర్ధిక వ్యవస్ధ బలహీనం కావడం జరగనే జరగదు. అయితే గియితే మన ఎగుమతులు తగ్గిపోయి మనకే నష్టం వస్తుంది.

    విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు పని చేయాలంటే దేశ ప్రభుత్వరంగాన్ని విదేశీ కంపెనీలకు అమ్మేయడాన్ని మొదట నిలిపివేయాలి. మరిన్ని ప్రభుత్వ కంపెనీలు స్ధాపించాలి. దేశీయ (జాతీయ) ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహాలు ఇవ్వాలి. అంతర్గత మార్కెట్ ను అభివృద్ధి చేసుకోవాలి. అనగా ఉపాధి సౌకర్యాలు పెంచాలి. ప్రభుత్వ కంపెనీలు, జాతీయ ప్రైవేటు కంపెనీల స్ధాపన జరిగితే ఉపాధీ పెరుగుతుంది; మార్కెట్టూ అభివృద్ధి అవుతుంది.

    కానీ మోడి / బి‌జే‌పి / ఎన్‌డి‌ఏ దీనికి సరిగ్గా విరుద్ధంగా చేస్తున్నారు. బ్యాంకులు, భీమా, మాన్యుఫాక్చరింగ్, నీళ్ళు, సేవలు… ఇలా అన్నింటిని విదేశీ బహుళజాతి కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. అందుకోసం వరస చట్టాలు చేస్తున్నారు. రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తున్నారు; వీలు కాకపోతే బలహీనం చేస్తున్నారు. అంటే దేశీయ ఉత్పత్తులను నాశనం చేస్తున్నారు. బియ్యం, గోధుమలు తదితర వ్యవసాయ సరుకుల్ని దిగుమతి చేస్తున్నారు. తద్వారా రైతుల మార్కెట్ ని దెబ్బ తీస్తున్నారు. ఇన్ని చేస్తూ విదేశీ వస్తు బహిష్కరణ అంటే సాధ్యపడుతుందా?

    చైనా వస్తు బహిష్కరణ అసలే సాధ్యం కాదు. అమెరికా, ఐరోపా కంపెనీల సరుకులు అత్యధికం చైనాలోనే తయారవుతున్నాయి. హై ఎండ్ ఎలక్ట్రానిక్ సరుకుల నుండి పిన్నుల వరకూ చైనాలోనే తయారీ. ఒకవేళ ఇక్కడ తయారైతే అందులో షేర్ల రూపంలో చైనా పెట్టుబడులు ఉంటాయి. కనుక చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదు. అది పాటిస్తే మనకి మొబైళ్ళు, కంప్యూటర్లు వాడటం మానేయాలి.

    స్వదేశీ కంపెనీల ప్రయోజనాల కోసం, ప్రజల ఉపాధి పెంచడం కోసం, దేశీయ సరుకులు సేవల మార్కెట్ కాపాడుకోవడం కోసం ఒక ఉద్యమంలా ‘విదేశీ వస్తు బహిష్కరణ’ అమలు చేస్తే మంచిదే. అది కూడా పైన చెప్పిన చర్యలు ముందు చేపట్టాలి. కేవలం ఒక దేశం పైన గుడ్డి ద్వేషంతో బహిష్కరణకు పిలుపు ఇవ్వడంలో హేతుబద్ధత లేనేలేదు. ఇది హిందూత్వ గుంపులు చేస్తున్న హడావుడి తప్ప అందులో దేశభక్తి ఏ కోశానా లేదు.

    క్రికెట్ గెలుపుకి పొంగిపోవడం, ఓడిపోతే తిట్టిపోయడం, మాస్ హిస్టీరియా తరహాలో అకారణంగా చైనా, పాక్ లను ద్వేషించడం. అదే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం చేస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలను ఆరాధించడం… ఇవేవీ దేశభక్తి కాదు. ఇవి కేవలం తమ గుడ్డి భావోద్వేగాలను సంతృప్తిపరుచుకునేందుకు చేసే ప్రేలాపనలు. గుడ్డి ద్వేషానికి హేతుబద్ధత ఉంటుందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s