
Indian Prime Minister Narendra Modi (L) and Israeli Prime Minister Benjamin Netanyahu
భారత ప్రధాని నరేంద్ర మోడి జులై 4, 5, 6 తేదీల్లో ఇజ్రాయెల్ సందర్శించాడు. మోడీ ఇజ్రాయెల్ సందర్శన లోని ప్రధానమైన అంశం ఆయన యూదు రాజ్యం తప్ప మరే ఇతర దేశానికీ వెళ్లకపోవడం. ముఖ్యంగా పాలస్తీనాకు వెళ్లకపోవడం. ప్రపంచంలో ఏ దేశ పాలకుడైనా ఇజ్రాయెల్ వెళితే పాలస్తీనా కూడా వెళ్ళడం ఆనవాయితీ. లేదా పాలస్తీనా సందర్శిస్తే ఇజ్రాయెల్ కూడా వెళ్ళి అక్కడి పాలకులను కూడా కలిసి వెళతారు. భారత దేశం నుండి రాష్ట్రపతి గానీ ప్రధాని గానీ లేదా ఇతర మంత్రులు గానీ ఇజ్రాయెల్, పాలస్తీనాలకు ఎప్పుడు వెళ్ళినా ఇంతవరకూ ఇరు దేశాలకు వెళ్ళి వచ్చారు తప్ప కేవలం ఒక దేశానికే తమ సందర్శనను పరిమితం చేసుకోలేదు. మోడీ ఈ సంప్రదాయానికి ముగింపు పలికాడు. ఇది ప్రధానంగా గుర్తించవలసిన విషయం.
మోడి ఇజ్రాయెల్ సందర్శనను ఇరు దేశాల సంబంధాలలో చారిత్రక మలుపుగా పత్రికలు, పరిశీలకులు అందరూ అభివర్ణిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ లో, ఇటు ఇండియాలో ఇదే తరహా విశ్లేషణలు వెలువడ్డాయి. అంతర్జాతీయ స్ధాయిలో పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కూడా ఈ విశ్లేషణ చేసాయి. దీనికి ప్రధాన కారణం పైన చెప్పినట్లు ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాల పాలకులను కలిసి వెళ్ళే సంప్రదాయాన్ని మొట్ట మొదటిసారిగా భారత ప్రధాని ముగింపు పలకడం. అయితే భారత్, ఇజ్రాయెల్, అంతర్జాతీయ పత్రికలు విశ్లేషించిన స్ధాయిలో మోడి సందర్శన ఒక మూల మలుపుగా చెప్పగలమా? మోడి సందర్శనతో ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉచ్చ స్థాయికి చేరనున్నాయా? ఇజ్రాయెల్-ఇండియాల మధ్య పూర్తి స్థాయి స్నేహ సంబంధాలు నెలకొంటాయా? ఈ ప్రశ్నలను లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలను కేవలం సందర్శనల వెలుగులోనే పైపైన పరిశీలించి ఒక ముగింపుకు వచ్చేయడం వాస్తవ పరిశీలన కాబోదు. మోడి సందర్శనను చారిత్రక మలుపుగా చెప్పే ముందు ఇజ్రాయెల్-పాలస్తీనా సంబంధాల చరిత్రను, ఇజ్రాయెల్-ఇండియా సంబంధాల చరిత్రను కాస్త పరిశీలించవలసి ఉంటుంది.
కన్నీటి చరిత్ర
పాలస్తీనా ప్రస్తుతం ఒక స్వతంత్ర దేశంగా లేదు. అది ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్నది. ముస్లిం సంస్థ ‘హమాస్’ పాలనలోని గాజా తప్ప పాలస్తీనా భూభాగం అంతా ఇజ్రాయెల్ దురాక్రమణలో యూదు వలస పాలన కింద మగ్గుతోంది. నిజానికి 1948 వరకూ ఇజ్రాయెల్ అన్న దేశమే లేదు. బ్రిటిష్, ఫ్రెంచి వలస పాలకులు అమెరికాతో కలిసి కుట్ర చేసి పాలస్తీనాలో ఇజ్రాయెల్ ను సృష్టించారు. ఐక్య రాజ్య సమితి కూడా ఈ కుట్రలో భాగస్వామి. అప్పటికి బ్రిటిష్ వలస పాలనలో ‘పాలస్తీనా మ్యాండేట్’ గా ఉన్న పాలస్తీనాను రెండు భాగాలుగా విడగొట్టి స్వతంత్ర ఇజ్రాయెల్ స్వతంత్ర పాలస్తీనాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేస్తూ ఐరాస 1947లో (నవంబరు 30) ఒక తీర్మానం చేసింది. అయితే ఆచరణలో బ్రిటిష్, ఫ్రెంచి, అమెరికన్ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగం మొత్తాన్ని దురాక్రమించి తన అదుపులో పెట్టుకుంది. దేశ దేశాలలో ముఖ్యంగా ఐరోపా దేశాలలో స్థిరపడిన యూదులను అక్కడికి రప్పించారు. స్థానికంగా చరిత్ర పూర్వం నుండి అక్కడ నివసిస్తున్న పాలస్తీనా అరబ్బులను వారి ఇండ్ల నుండి, పొలాల నుండి వ్యాపారాల నుండి బలవంతంగా వెళ్లగొట్టారు.
ఐరాస తీర్మానం ప్రకారం బ్రిటిష్ వలస పాలన ముగియడం తోటే ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలు ఏర్పడాల్సి ఉండగా ఇజ్రాయెల్ ఒక్కటే అవతరించింది. ఐరాస తీర్మానాన్ని వ్యతిరేకించిన అరబ్బు దేశాలు (జోర్డాన్, ఇరాక్, సిరియా, ఈజిప్టు) ఇజ్రాయెల్ తో యుద్ధానికి దిగాయి. ఇది మొదటి ఇజ్రాయెల్-అరబ్ యుద్ధంగా చరిత్రలో రికార్డ్ అయింది. యుద్ధంలో ఇజ్రాయెల్ విజేతగా నిలిచింది. జోర్డాన్ రాజు ఆడిన డబుల్ గేమ్, సిరియా, ఈజిప్టు, ఇరాక్ లు యుద్ధం రేగే నాటికి సిద్ధంగా లేకపోవడంతో అరబ్బులు ఓటమి చెందారు. ఐరాస తీర్మానానికి ముందు నుండే పాలస్తీనాలో యూదు ధనిక వర్గాలు ఐరోపా, అమెరికా దేశాల నుండి ఆయుధాలు సేకరిస్తూ యుద్ధానికి సిద్ధపడుతూ రావడం బట్టి ఇజ్రాయెల్ సృష్టిలో అమెరికా, ఐరోపాల భాగస్వామ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. యుద్ధం ముగిశాక పాలస్తీనాలో మెజారిటీ భూభాగం ఇజ్రాయెల్ కిందికి వెళ్లిపోయింది. పాలస్తీనాకు కేటాయించిన భూభాగంలో 60 శాతం ఇజ్రాయెల్ దురాక్రమించింది. (1949లో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన తాత్కాలిక సంధి నాటికి ఇది 73% కి పెరిగింది.) వెస్ట్ బ్యాంక్ జోర్డాన్ కిందికి, గాజా ఈజిప్టు కిందికి వెళ్ళాయి. పాలస్తీనా రాజ్యం మాత్రం ఏర్పడ లేదు. ఐరాస తీర్మానం ఆమోదించబడిన నవంబరు 30, 1947 నుండి మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన 1949 జులై వరకూ పాలస్తీనా అరబ్బులపై తీవ్రమైన హింస, అణచివేత, గెంటివేతలు అమలయ్యాయి. పాలస్తీనా ప్రజలు చుట్టూ ఉన్న అరబ్బు దేశాలకు పారిపోయి తలదాచుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు శరణార్థి శిబిరాలలోనే బ్రతుకుతున్నారు. ఎప్పటికైనా తమ భూములు, ఇళ్ళు, దేశం తమకు దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. వివిధ సంస్థల కింద చేరి వివిధ రూపాల్లో, వివిధ సిద్ధాంతాల నీడన పోరాడుతున్నారు.
1956లో రెండవ అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ నాజర్ సూయెజ్ కాలవపై ఐరోపా పెత్తనాన్ని తిరస్కరించిన నేపధ్యంలో బ్రిటిష్, ఫ్రెంచి, ఇజ్రాయెల్ లు ఉమ్మడిగా ఈజిప్టుపై దండెత్తాయి. అరబ్బు రాజ్యాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈజిప్టుకు సహకరించాయి. బ్రిటిష్, ఫ్రెంచి సేనలు సూయజ్ కాలవపై దాడి చేసి తమ వశంలోకి తెచ్చుకున్నారు. అయితే ఈ దాడిని అమెరికా, సోవియట్ రష్యాలు తప్పు పట్టాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లు తమ సేనలను వెనక్కి రప్పించాలని గట్టిగా హెచ్చరించాయి. లేనట్లయితే బ్రిటిష్ పౌండ్లలోని సావరిన్ ఋణ బాండ్లను అర్జెంటుగా అమ్మకానికి పెట్టి బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్థను గట్టి దెబ్బ తీస్తామని అమెరికా హెచ్చరించింది. బ్రిటన్ తాను ఇంకా ప్రపంచ శక్తినే అని చాటేందుకు రెండవ యూదు-అరబ్ యుద్ధం ద్వారా ప్రయత్నించింది. కాగా ‘ఇక పెత్తనం నాదే’ అని అమెరికా నొక్కి చెప్పడానికి ఈ యుద్ధాన్ని ఉపయోగించుకుంది. అమెరికా, సోవియట్ రష్యాల హెచ్చరికలతో మూడు దేశాలు తమ సైన్యాలను, యుద్ధ పరికరాలను ఉపసంహరించుకున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం తన ప్రభావం పూర్తిగా కోల్పోయిందని ప్రపంచం ఒక నిర్ణయానికి రావడానికి రెండవ అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం ఒక సంకేతంగా నిలిచింది. ఇజ్రాయెల్ మాత్రం తిరన్ ద్వీపాల గుండా తమ రావాణా నౌకలను ఈజిప్టు అడ్డగించరాదన్న తన యుద్ధ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. రెండవ అరబ్-యూదు యుద్ధంలో పాలస్తీనా ప్రసక్తి లేనప్పటికీ మూడో అరబ్-యూదు యుద్ధానికి భూమిక ఏర్పరిచింది.
1967లో జరిగిన మూడవ అరబ్-యూదు యుద్ధంతో పాలస్తీనా ప్రజలకు పూర్తిగా నిలవ నీడ లేకుండా పోయింది. పాలస్తీనా భూభాగంతో పాటు సిరియా, ఈజిప్టు, జోర్డాన్ ల భూభాగాలను కూడా ఇజ్రాయెల్ దురాక్రమించింది. మూడో యుద్ధానికి అబ్దుల్ నాజర్ తొందరపాటు కారణంగా పశ్చిమ దేశాలు చెబుతాయి. కానీ అబ్దుల్ నాజర్ కేవలం ఒక ఉత్ప్రేరకం మాత్రమే. ఈ యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ ను అరబ్బు దేశాల మధ్య అజాత శత్రువుగా అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాదులు నిలబెట్టాయి. చమురు సీమలో ఒక నమ్మకమైన, శక్తివంతమైన, మొండి, మూర్ఖ రాజ్యాన్ని తమ బంటుగా అవి స్థిరపరచుకున్నాయి.
ఇజ్రాయెల్ దక్షిణ కొసన ఉన్న సన్నని ఎర్ర సముద్రం చీలిక (అఖాతం) గుండా ఆ దేశానికి చమురు రవాణా అవుతుంది. చీలికకు పశ్చిమ తీరంగా ఉన్న సినాయ్ ద్వీపకల్పం ఈజిప్టు భూభాగం లోనిది. చీలిక దక్షిణ కొసలో ఉన్న తెరాన్ ద్వీప కల్పం కూడా ఈజిప్టు భూభాగమే. ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలను నియంత్రించే సాధనంగా తెరాన్ ద్వీపకల్పాన్ని వినియోగించాలని ఈజిప్టు భావించేది. తమ నౌకల రాకపోకలుకు ఆటంకం కలిగిస్తే అది యుద్ధ ప్రకటనే అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూ ఉండేది. ఈ నేపధ్యంలో ‘అవసరం అయితే తిరన్ వద్ద ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశాన్ని నిరాకరిస్తామ’ని 1967 మే నెలలో నాజర్ ప్రకటించాడు. దరిమిలా ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దులో సేనల మోహరింపు ప్రారంభించింది. జూన్ 5 తేదీన ‘ముందస్తు నివారణ దాడి’ (preemptive strike) పేరుతో ఇజ్రాయెల్ విమానాలు అకస్మాత్తుగా ఈజిప్టుపై దాడి చేశాయి. ఈజిప్టు విమాన స్ధావరాలన్నింటి పైనా దాడి చేసి ప్రత్యర్థి వాయు శక్తిని నిర్వీర్యం చేశాయి. ఆనక సినాయ్ ద్వీపం పైకి బలగాల్ని నడిపించింది. ఇజ్రాయెల్ చేసిన ‘సర్ప్రైజ్ అటాక్’ కు నాజర్ వద్ద సమాధానం లేకపోయింది. నష్ట నివారణకు సినాయ్ నుండి సైన్యాన్ని ఖాళీ చేయించాడు. సినాయ్ లో తలదాచుకున్న పాలస్తీనీయులు మళ్ళీ తలొక దిక్కు వెళ్లవలసి వచ్చింది. ఈ లోపు సిరియా, జోర్డాన్ లు ఈజిప్టుకు జత కలిశాయి. అయితే యుద్ధంలో ఇజ్రాయెల్ దే పై చేయి అయింది. జోర్డాన్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈజిప్టు ఆధీనంలోని గాజా స్ట్రిప్ ను ఆక్రమించింది. వెస్ట్ బ్యాంక్, గాజా లు రెండూ పాలస్తీనా ప్రజలకు అప్పటి వరకు చివరి నీడగా ఉండేవి. మూడో యుద్ధంతో అవి కూడా యూదు స్వాధీనం లోకి వెళ్లిపోయాయి. అదనంగా సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ను కూడా ఇజ్రాయెల్ దురాక్రమించింది. జూన్ 5 నుండి 10 వరకు జరిగిన మూడవ యుద్ధాన్ని ‘6 రోజుల యుద్ధం’ అనీ, ‘జూన్ యుద్ధం’ అనీ కూడా పిలుస్తారు. ఈ యుద్ధం దరిమిలా పాలస్తీనా ప్రజలు సర్వం కోల్పోయారు. వెస్ట్ బ్యాంక్, గాజా లలో స్వంత నేలపై పరాయి పాలన కింద జీవనం ప్రారంభించారు. పాలస్తీనీయులు మరోమారు లక్షలాదిగా పొరుగు దేశాలకు వెళ్లగొట్టబడ్డారు. ఈ యుద్ధంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్‌ఓ) కూడా పాల్గొని ఆక్రమణదారులను ప్రతిఘటించింది. కానీ దాని శక్తి చాలా పరిమితం. క్రమంగా పిఎల్‌ఓ పాలస్తీనీయులకు ప్రధాన ప్రతినిధిగా అవతరించింది.
ఈ చరిత్ర నేపధ్యంలో పాలస్తీనా ప్రజల స్వతంత్ర పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా నిలబడుతూ వచ్చాయి. కానీ అమెరికా, పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ తన దురాక్రమణను, వలస పాలనను దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. పాలస్తీనా స్వతంత్ర రాజ్యం ఏర్పాటుకు అమెరికా, ఐరోపాలు కూడా పైకి మద్దతు ఇస్తాయి. కానీ ఆచరణలో ఇజ్రాయెల్ సాగించే దమనకాండకు, వలస అణచివేతకు అంతర్జాతీయ వేదికలపై విమర్శలు, ఖండనలు రాకుండా అన్ని విధాలా అడ్డు కుంటాయి. 1967 యుద్ధం పూర్వం నాటి సరిహద్దులతో పాలస్తీనా ఏర్పాటుకు సూత్ర రీత్యా, ఐరాస తీర్మానాల రూపంలో అంగీకరిస్తాయి. కానీ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో వరసపెట్టి సెటిల్మెంట్లు నిర్మిస్తున్నప్పటికీ నిరోధించవు. సెటిల్మెంట్ల నిర్మాణం ద్వారా ఓ పక్క పాలస్తీనీయులను నిరంతరం వెళ్లగొడుతూ మరో పక్క వెస్ట్ బ్యాంక్ నిండా యూదులను నింపేయడం ద్వారా మొత్తం భూభాగంలో యూదులే ఉన్నారన్న కొత్త వాస్తవాన్ని సృష్టించడానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుని కృషి చేస్తున్నది. ఇది తెలిసినప్పటికీ అమెరికా, ఐరోపా, ఐరాస, ఐరాస మానవ హక్కుల సంస్థ అన్నీ నోరు కట్టేసుకుని కూర్చొన్నాయి.
అరాఫత్ నేతృత్వం లోని పిఎల్‌ఓ సెక్యులర్ భావాలు కలిగినట్టిది. ప్రాచీన పాలస్తీనా చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఆ సంస్థ సిద్ధాంతంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇటువంటి సెక్యులర్ ప్రతిఘటనా పోరాట సంస్థలను ఎదుర్కోవడం సామ్రాజ్యవాదులకు, దురాక్రమణదారులకు సహజంగానే కష్టం అవుతుంది. దానితో పాలస్తీనా ఉద్యమాన్ని చీల్చే ఎత్తుగడకు ఇజ్రాయెల్, పశ్చిమ సామ్రాజ్యవాదులు కుట్ర పన్నాయి. ఫలితంగా పాలస్తీనాలో ఇస్లామిక్ ఉద్యమం (హమాస్) పురుడు పోసుకుంది. హమాస్ బలపడటానికి ఆదిలో ఇజ్రాయెల్ రాజ్యమే పరోక్ష సంబంధాల ద్వారా నిధులు సమకూర్చింది. పిఎల్‌ఓ ఇజ్రాయెల్-పాలస్తీనా రెండు రాజ్యాల పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి హమాస్ నిరాకరించింది. ఇజ్రాయెల్ ను గుర్తించడానికి నిరాకరించింది. యూదులను తరిమికొట్టి 1947 ముందు నాటి పాలస్తీనాను పునరుద్ధరించడమే తమ లక్ష్యంగా ప్రకటించింది. దానితో హమాస్ ను టెర్రరిస్టు సంస్థగా ప్రకటించడం అమెరికా, పశ్చిమ దేశాలకు తేలిక అయింది. ఆ విధంగా పాలస్తీనా ప్రజల న్యాయమైన స్వతంత్ర ఉద్యమానికి టెర్రరిస్టు ముద్ర వేయడం మొదలయింది. హమాస్ ఆదిలో పాల్పడిన దాడులకు, పేలుళ్లకు, యూదు హత్యలకు పాలస్తీనీయులు ఆకర్షితులై క్రమంగా అటు మళ్లారు. హమాస్ బలపడే కొద్దీ పిఎల్‌ఓ బలం తగ్గిపోయింది. దానితో పిఎల్‌ఓ నేత యాసర్ అరాఫత్ స్వతంత్ర రాజ్యం కోసం రాజీలతో బిల్ క్లింటన్ హయాంలో ఓస్లో ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఆ ఒప్పందంలోని మెజారిటీ అంశాలు కాగితాలకే పరిమితం అయింది. ఒప్పందం దరిమిలా మొదటిసారిగా 1996లో జరిగిన ఎన్నికల్లో గాజా, వెస్ట్ బ్యాంక్ లలో పిఎల్‌ఓ గెలిచింది. అయితే 2006లో జరిగిన ఎన్నికల్లో గాజాలో పిఎల్‌ఓ పైన హమాస్ విజయం సాధించింది. ‘టెర్రరిస్టు’ హమాస్ ప్రభుత్వం ఆధీనం లోని గాజాను అష్ట దిగ్బంధనం కావించి జైలు కిందికి మార్చడానికి ఇజ్రాయెల్ కు తేలిక అయింది. ప్రజా ఉద్యమాన్ని టెర్రరిస్టు ఉద్యమంగా ముద్ర వేశాక ఆ ఉద్యమాన్ని ఏమి చేసినా ప్రపంచ దేశాలు ప్రశ్నించవు. ఆనాటి నుండి గాజా ‘అతి పెద్ద బహిరంగ జైలు (open jail) గా పేరు పొందింది. గాజాలో టెర్రరిస్టు హమాస్ ను నిర్మూలించే పేరుతో ఇజ్రాయెల్ పలుమార్లు దాడులు చేసింది. తాను అభివృద్ధి చేసిన కొత్త ఆయుధాలను పరీక్షించడానికి హమాస్ ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించడం ఇజ్రాయెల్ కు పరిపాటి అయింది.
- Israel after 1949 armistice agreement
- Israel occupied territories in 1967 war
- Partition plan proposed by U.N.
- Strait of Tiran
ఈ లోపు అరాఫత్ పై విష ప్రయోగం జరగడంతో 2004 నవంబర్ లో ఆయన చనిపోయాడు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఎన్నడూ రోగం అనేది ఎరగని అరాఫత్ అకస్మాత్తుగా జబ్బు పడి, నెల రోజులలోనే చనిపోవడం ఎలా జరిగిందన్న ప్రశ్నలు ఉదయించాయి. రేడియో ధార్మిక పదార్ధం పోలోనియం 210 ను అరాఫత్ పై ప్రయోగించి చంపేశారని కతార్ కు చెందిన ఆల్-జజీరా చానెల్ 2012 లో ఓ కధనం ప్రసారం చేసింది. దీనికి స్పందించి మహమ్మద్ అబ్బాస్ నాయకత్వం లోని పాలస్తీనా ఆధారిటీ అరాఫత్ మృత దేహాన్ని వెలికి తీసి అటాప్సీ నిర్వహించారు. అటాప్సీ శాంపిళ్ళు పరీక్షించిన స్విస్ ఫోరెన్సిక్ బృందం పోలోనియం విష ప్రయోగం జరిగిందని నిర్ధారించింది. అరాఫత్ ను చంపడానికి నిర్ణయించామని అంతకు ముందు ఇజ్రాయెల్ ఆర్మీ, ప్రధాని ఏరియల్ షరాన్, ఇతర మంత్రులు పలుమార్లు ప్రకటించి ఉండడంతో విష ప్రయోగం వల్లే అరఫాత్ మరణించాడని చెప్పేందుకు ఇప్పుడు ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు.
ఈ విధంగా పాలస్తీనా స్వతంత్ర దేశంగా అవతరించకుండా అడుగడుగునా ఇజ్రాయెల్ అడ్డుపడింది. పిఎల్‌ఓ, హమాస్ ల రాజకీయ నాయకులను, మిలట్రీ కమాండర్లను హత్య చేసింది. ఒక్క పాలస్తీనాలోనే కాకుండా పాలస్తీనా నాయకులు ఎక్కడికి వెళితే అక్కడికి వెంటాడి చంపింది. పాలస్తీనీయుల నీటి వనరుల నుండి వారిని దూరం చేసింది. కొద్ది మొత్తంలో ఉన్న సారవంతమైన భూములను పాలస్తీనా అరబ్బుల నుండి లాగేసుకుంది. వారి ఇళ్ల నుండి ఇప్పటికీ వెళ్లగొడుతూ యూదు సెటిల్మెంట్లు నిర్మిస్తున్నారు. మానవ నాగరికత చరిత్రలో పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయం, అణచివేత, హక్కుల హరణ మరే ఇతర జాతి ప్రజలు ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదేమో!
ఈ పరిస్ధితుల్లో 1990ల ఆరంభం వరకూ ఇజ్రాయెల్ అంటే సర్వత్రా నిరసన వ్యక్తం అయ్యేది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఏ దేశానికి (ప్రభుత్వానికి) అయినా పాలస్తీనా స్వతంత్ర పోరాటాన్ని గుర్తించడం, వారి స్వతంత్ర రాజ్య కాంక్షకు మద్దతు ఇవ్వడం ఒక తప్పనిసరి నియమంగా ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడిపోయింది. దీని అర్ధం ప్రపంచం లోని అన్ని దేశాల పాలక వర్గాలు నిజంగానే పాలస్తీనా పోరాటం పట్ల సానుభూతి కలిగి ఉన్నారని కాదు. క్యూబా, నార్త్ కొరియా, సిరియా లాంటి కొన్ని దేశాలు తప్ప ఆనాటి ప్రపంచ పరిస్ధితులే ఇతర దేశాలను పాలస్తీనా వైపు మొగ్గు చూపేందుకు పురిగొల్పాయన్నది తప్పనిసరిగా గుర్తించాలి. అమెరికా, సోవియట్ రష్యా రెండు అగ్ర రాజ్యాలుగా ఉన్న ద్వి ధృవ ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలకు, పౌర-జాతి-దేశాల హక్కులకు సాపేక్షికంగా ఎక్కువ గౌరవం ఉండేది. ప్రత్యర్థి శిబిరం కంటే తామే ఆయా దేశాల ఆర్ధిక-రాజకీయ-సార్వభౌక హక్కులకు రక్షణ, గౌరవం కలిస్తామని చెప్పుకోవలసిన పరిస్ధితిలో అణచివేతలో ఉన్న ప్రజల, జాతుల, దేశాలకు కొద్దో గొప్పో మద్దతు లభించేవి.
1990లో సోవియట్ రష్యా కుప్పకూలి పోవడంతో ఈ పరిస్ధితి తారుమారు అయింది. సోవియట్ రష్యా విచ్ఛిన్నమై ఒక్కో జాతి ఒక్కో రాజ్యం ఏర్పరచుకోగా యెల్టిసిన్ ఏలుబడిలోని రష్యా అమెరికా, పశ్చిమ దేశాలకు దాసోహం అయింది. రష్యాలో శక్తివంతమైన మాఫియాను పశ్చిమ రాజ్యాలు పెంచి పోషించాయి. లెక్కకు మిక్కిలిగా స్త్రీలను వ్యభిచారులుగా దేశ దేశాలకు రవాణా చేశారు. పుతిన్ అధ్యక్షుడు అయ్యే వరకూ మాఫియా గ్రూపుల ద్వారా పశ్చిమ కంపెనీలు రష్యా సంపదలను పంచుకు తిన్నాయి.
అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించడంతో అణచివేతలో ఉన్న ప్రజలు, జాతులు, దేశాల పోరాటాలను గుర్తించి మద్దతు ఇచ్చే నటన ఇక ఎంత మాత్రం అవసరం లేకుండా పోయింది. మూడో ప్రపంచ దేశాలలోని దళారీ పాలకవర్గాలు అనివార్యంగా అమెరికా వెంట నడిచాయి. అమెరికా అడుగులకు మడుగులొత్తడం ప్రారంభించాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ రష్యా ఉపగ్రహ రాజ్యాలుగా ఉనికిని కొనసాగించిన దేశాలన్నీ క్రమంగా అమెరికాకు అనుచరులుగా మారిపోయాయి. పాలస్తీనా ప్రజల పోరాటానికి ఆకర్షణ తగ్గిపోయింది. ప్రపంచ దేశాల దృష్టిలో పాలస్తీనా పోరాటం సందర్భం కోల్పోయింది. ప్రజాస్వామ్య విలువలకు, జాతుల హక్కులకు ఎలాంటి గౌరవం ప్రకటించకుండానే పేద, వర్ధమాన దేశాల్లోని దళారీ పాలకుల అవసరాలు తీరాయి. సోవియట్ రష్యా అండతో సాపేక్షికంగా స్వతంత్ర పంథాను అనుసరించిన ఒక్కొక్క దేశాన్ని అమెరికా బెదిరించి లొంగదీసుకున్నది. లొంగుబాటుకు నిరాకరించి తన దారికి రాని రాజ్యాలను వివిధ రంగు విప్లవాల పేరుతో కుట్రలు చేసి కూల్చివేయడం మొదలు పెట్టింది. సోవియట్ రష్యా నుండి విడివడిన మధ్య ఆసియా దేశాలు, ఉత్తర ఆఫ్రికా-లాటిన్ అమెరికా-మధ్య ప్రాచ్యంలో తన మాట వినని దేశాలను అదుపు లోకి తెచ్చుకుంది.
మరోవైపు మధ్యప్రాచ్యం (పశ్చిమాసియా) లో ఇజ్రాయెల్ దాష్టీకం పెరిగింది. పాలస్తీనా ప్రజలపై అణచివేత తీవ్రం చేసింది. పాలస్తీనా ప్రజలు పని కోసం ఇజ్రాయెల్ భూభాగం లోకి వెళ్ళక తప్పదు. వారి ప్రవేశంపై సవా లక్షా ఆంక్షలు విధించింది. యూదులకు అందమైన రహదారులు నిర్మించి పాలస్తీనా ప్రజలకు -జాత్యహంకార దక్షిణాఫ్రికా తరహాలో- వాటిపై ప్రవేశం నిరోధించింది. ఎక్కడికక్కడ ఎత్తైన గోడలు నిర్మించి పాలస్తీనీయుల రాకపోకలను కట్టడి చేసింది. సెటిల్మెంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దళారీ వర్గం నేత అయిన మహమ్మద్ అబ్బాస్ నేతృత్వం లోని పాలస్తీనా ఆధారిటీ (ప్రభుత్వం), పిఎల్‌ఓ (పార్టీ) ఇజ్రాయెల్, అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. స్వతంత్ర పోరాటం వెనక్కి వెళ్లిపోయింది. ‘అయిదూళ్ళు ఇచ్చిన చాలు’ అన్న స్థాయికి పిఎల్‌ఓ దిగజారింది. ఒకప్పుడు పాలస్తీనా పోరాటానికి మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్ పై యుద్ధం కూడా చేసిన సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్టు లాంటి దేశాలు అమెరికాకు మిత్ర దేశాలుగా మారాయి. ఇజ్రాయెల్ ను సాయుధంగా ప్రతిఘటిస్తున్న హమాస్ కు అంతర్జాతీయ ప్రతిష్ఠ పెరిగింది. కానీ హమాస్ పోరాటంపై టెర్రరిస్టు ముద్ర కొనసాగుతోంది. వెరసి పాలస్తీనా ప్రజల చారిత్రక పోరాటం ఒంటరిది అయింది. స్వతంత్రం కోసం చేస్తున్న వారి ఆక్రందన అరణ్య రోదనగా మిగిలిపోయింది.
ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర, పరిణామం
ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ రాజకీయాలకు అతీతంగా ఎన్నడూ లేవు. ప్రపంచ భౌగోళిక ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు దేశాల సంబంధాల గమనాన్ని అంచనా వేయడానికి పూనుకుంటే అది పాక్షిక పరిశీలనే కాదు; అవాస్తవ పరిశీలన కూడా. భారత పాలకులు స్వతంత్ర పాలకులు కాదు. వారు దళారీ పాలకులు. దళారీ వర్గం చేతుల్లో ఉన్న ఇండియా విదేశీ విధానం అనివార్యంగా అగ్రరాజ్యాల ప్రయోజనాలకు లొంగి ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఉండలేదు. కనుక ప్రపంచ స్ధాయిలో జరుగుతూ వచ్చిన భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే భారత పాలకుల ఇజ్రాయెల్ విధానం మారుతూ వచ్చింది తప్ప స్వతంత్రంగా ఎన్నడూ లేదు. ఈ వాస్తవాన్ని ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి.
…………………………….. సశేషం