డీమానిటైజేషన్ వల్లే జి‌డి‌పి తగ్గింది -పాల్ కృగ్మన్


పాల్ రాబిన్ కృగ్మన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త. 2008లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సత్కారం పొందిన ప్రముఖుడు. ‘న్యూ ట్రేడ్ ధియరీ’ మరియు ‘న్యూ ఎకనమిక్ జాగ్రఫీ’ సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు ఆయనకు ఆ సత్కారం ఆ దక్కింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కాలమిస్టు కూడా. ఆయన మాటలకు పెట్టుబడిదారీ ప్రపంచం విలువ ఇస్తుంది.

అలాంటి పాల్ కృగ్మన్ భారత జి‌డి‌పి వృద్ధి రేటు తగ్గిపోతుండడానికి డీమానిటైజేషన్ కారణమని బల్ల గుద్ది చెప్పాడు. ఎక్కడో అమెరికాలో కూర్చొని చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. డీమానిటైజేషన్, ఆర్‌బి‌ఐ విధానాల వల్లనే భారత జి‌డి‌పి పడిపోయిందని ఆయన సదస్సులో స్పష్టం చేశాడు.

గత ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో ఇండియా జి‌డి‌పి కేవలం 6.1% వృద్ధి రేటు మాత్రమే నమోదు చేసింది. దీనిని ప్రస్తావిస్తూ పాల్ కృగ్మన్ డీమానిటైజేషన్ వల్లనే ఇండియా జి‌డి‌పి తగ్గిందని చెప్పాడు. ఇదే కాలంలో చైనా జి‌డి‌పి 6.9 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆర్ధికవేత్తలు Q4 లో 7.1% వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేయగా వారి అంచనాలు తప్పాయి.

“మీ 6% ఆర్ధిక వృద్ధి రేటు చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. వాస్తవంగా అయితే బహుశా మీరు 8% నుండి 9% వరకు వృద్ధి నమోదు చేసి ఉండాల్సింది. అప్పటి పరిస్ధితి అందుకు వీలుగా ఉన్నది కూడా” అని కృగ్మన్ చెప్పాడు. డీమానిటైజేషన్ చర్యకు పూనుకోకపోయినట్లయితే భారత జి‌డి‌పి నాల్గవ క్వార్టర్ లో 8% నుండి 9% వరకు రికార్డు అయ్యేదని కృగ్మన్ చెబుతున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ… కృగ్మన్ మాటలు విన్నారా?

“నోట్ల రద్దు సరైన సలహాలు లేకుండా చేపట్టిన షాక్ ధెరపీ. నోట్ల రద్దు వల్ల దేశంలో అవినీతి వ్యవస్ధకు శాశ్వతమైన నష్టం ఏమీ కలగబోవడం లేదు. అదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధకు మాత్రం గణనీయ మొత్తంలో నష్టం కలగజేస్తుంది” అని కృగ్మన్ స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఆయన ఎకనమిక్ టైమ్స్ తో మాట్లాడుతూ “అయితే దాని ప్రభావం కొందరు భయపడినంత తీవ్రంగా అయితే ఉండకపోవచ్చు” అంటూ కృగ్మన్ డీమానిటైజేషన్ పైన గాలి మేడలు కట్టిన మేధావులకు ఉపశమనం కలిగించాడు.

డీమానిటైజేషన్ వల్ల అవినీతి అంతం అవుతుందనీ, అంతం అయిపోయింది కూడా అనీ, టెర్రరిస్టులకు నిధుల లభ్యత బాగా తగ్గిపోయిందనీ, నక్సలైట్లు నిధులు లేక అల్లాడుతున్నారనీ, నల్ల డబ్బు సంపాదనకు దారులు మూసుకు పోయాయనీ మన ప్రధాని, ఆర్ధిక మంత్రి, వారి భజనపరులు ఒకటే ఊదరగొట్టిన నేపధ్యంలో పాల్ కృగ్మన్ మాటలను పరిగణనలోకి తీసుకోవాలి.

“డీమానిటైజేషన్ ప్రభావం అప్పుడే ముగిసిపోలేదు. మరికొన్ని త్రైమాసికాల మాటు దాని ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ పైన ఉంటుంది” అని ఎస్‌బి‌ఐ అధిపతి అరుంధతి భట్టాచార్య చెప్పలేక చెప్పిన మాటలను కూడా ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి. డీమానిటైజేషన్ వల్ల అంత లాభం, ఇంత లాభం అంటూ భజన చేసినవారిలో అరుంధతి మొదటి వరుసలో ఉంటూ వచ్చారు. ‘అబ్బే ఎంత సేపు! ఇదిగో డిసెంబర్ దాటితే దాని ప్రభావం ఏమీ కనపడదు’ అంటూ చిటికెల పందిరి నిర్మించినవారిలో కూడా ఆమె ఒకరు. తీరా ఫలితాలు, ప్రభావాలను రుచి చూశాక ఆమె కూడా వెనక్కి తగ్గవలసి వచ్చింది.

జూన్ 12 తేదీన ఎఫ్‌ఐ‌ఐల సమావేశంలో మాట్లాడుతూ అరుంధతి ఇలా చెప్పారు: “నవంబర్ 2016 లో ప్రకటించిన డీమానిటైజేషన్ ప్రభావం ఆర్ధిక వృద్ధి రేటుపై కొనసాగుతుంది. ఈ ప్రతికూల ప్రభావం ఎస్‌బి‌ఐ వ్యాపారంపైనా పడుతుంది. భారత ఆర్ధిక వ్యవస్ధ పైనా, బ్యాంకింగ్ రంగం పైనా ఈ చర్య వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావం ఫలానా విధంగా ఉంటుందని ఇదమిద్ధంగా చెప్పలేని పరిస్ధితి” అని ఆమె ఎఫ్‌ఐ‌ఐ లకు చెప్పారు. అదే అరుంధతి జనానికి మాత్రం డీమానిటైజేషన్ గురించి ఒకటే గొప్పగా ఊదరగొట్టారు. జనానికి ఒక మాట, పెట్టుబడిదారులకు ఒక మాట. ఇంకా చెప్పాలంటే జనానికి అబద్ధాలు, పెట్టుబడిదారులకు నిజాలు!?

ఆమె చెప్పిన మరో చిత్రమైన మాట కూడా చూడండి: “నోట్ల రద్దు చర్య ఫలితంగా అమలు ఖర్చులు (డీమానిటైజేషన్ కు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలు, చేయవలసిన ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు) పెరిగిపోవడమే కాకుండా అవినీతి ఘటనలు (higher insidents of fraud) పెరుగుతాయి.”

‘డీమానిటైజేషన్ ద్వారా అవినీతి పీచమణిచాం; దొంగ నోట్లు కట్టడి చేశాం; టెర్రరిస్టులను పస్తు పెట్టాం’ అని మోడి, జైట్లీ, వెంకయ్య ఆదిగాగల కాషాయ రాజకీయులు దండోరా వేస్తుంటే అరుంధతి మాత్రం పెట్టుబడిదారుల సమావేశంలో అసలు సంగతి చల్లగా చెప్పారు. ఏమని? “నోట్ల రద్దు వల్ల అవినీతి ఘటనలు పెరుగుతాయి” అని.

ఎఫ్‌ఐ‌ఐ లు అంటే కేవలం లాభాల కోసం పెట్టుబడులు పెట్టేవారు. వారి వల్ల ఉత్పత్తి ఏమీ జరగదు. ఎక్కడ లాభం ఎక్కువ కనిపిస్తే అక్కడికి పరుగెత్తేవాళ్ళే ఎఫ్‌ఐ‌ఐ లు (Foreign Institutional Investors). అధిక లాభం వచ్చే చోటికి ఎంత వేగంగా అయితే వెళ్తారో, మరో చోట మరింత లాభం వచ్చే పనైతే అంతేవేగంగా అక్కడి నుండి జండా పీకెస్తారు. ఎల్‌పి‌జి విధానాల పుణ్యమా అని వారి పైన నిబంధలన్నీ చాలా వరకు ఎత్తివేశారు. ఇలా లాభాలు వచ్చే చోట్లకు అదే పనిగా పరుగెడతారు గనుకనే ఎఫ్‌ఐ‌ఐ లని ‘హాట్ మనీ’ అని కూడా అంటారు. ఎఫ్‌ఐ‌ఐ ల వల్ల అనేక దేశాలు అకస్మాత్తుగా సంక్షోభాల్లో కూరుకుపోయిన ఘటనలు కోకొల్లలు. ఈ ఎఫ్‌ఐ‌ఐ లను ఆకర్షించడానికి మోడి ప్రభుత్వం వేయని ఆసనం అంటూ లేదు. ఆ ఎఫ్‌ఐ‌ఐ ల సమావేశంలో అరుంధతి నిజాలు చెబుతారు గానీ దేశ ప్రజలకి మాత్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు.

డీమానిటైజేషన్ అన్నది నూతన ఆర్ధిక విధానాలలో భాగమే తప్ప మరొకటి కాదు. రూపాయి పూర్తి కన్వర్టిబిలిటీ, జి‌ఎస్‌టి, బ్యాంకులు-భీమా ప్రయివేటీకరణ, ప్రభుత్వ కంపెనీల అమ్మకం, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సేవకూ ధర వసూలు చేయడం… ఇవన్నీ అనాదిగా విదేశీ (ముఖ్యంగా పశ్చిమ) బహుళజాతి కంపెనీలు చేస్తున్న డిమాండ్లు. వాటిల్లో భాగంగా బ్యాంకులను బేసెల్ 3 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలని 2008 ఆర్ధిక సంక్షోభం నుండి డిమాండ్ చేస్తున్నారు.

బేసెల్ 3 ప్రమాణాలలో భాగంగా బ్యాంకుల వద్ద ఎల్లప్పుడూ పెట్టుబడి తగినంతగా అందుబాటులో ఉండాలి. అంటే బ్యాంకుల్లో డబ్బు దాచేవారు ఎప్పుడంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకునే వెసులుబాటులో కోతలు పెట్టాలి. జనం దగ్గర ఉన్న విలువలో అత్యధిక భాగం, వీలయితే అంతా బ్యాంకుల్లో నిలవ ఉండాలి. అలా ఉంటేనే 2008 లాంటి సంక్షోభాలు వచ్చి నప్పుడు జనం ఎగబడి తమ డబ్బు విత్ డ్రా చేయకుండా నిరోధించవచ్చు. బ్యాంకులు సంక్షోభాల వల్ల కూలిపోకుండా ఉండవచ్చు. జనం మాత్రం ఏమైపోయినా ఫర్వాలేదు. సంక్షోభాలు వచ్చేదే బహుళజాతి ద్రవ్య కంపెనీల పేరాశ వల్ల. కానీ ఆ సంక్షోభాల దెబ్బ మాత్రం బ్యాంకులు, ద్రవ్య కంపెనీలు కాకుండా జనం మాత్రమే అనుభవించాలి. ఈ దారుణమైన కుట్రలో భాగమే డీమానిటైజేషన్.

పాల్ కృగ్మన్ అభిప్రాయంలో డిమానిటైజేషన్ అసలే వద్దని కాదు. దానికి ఒక పద్ధతి అనుసరించి అమలు చేసి ఉండాల్సింది అని ఆయన భావం. ఒక్కసారిగా షాక్ ధెరపీ వలె అమలు చేయడం వల్ల మొదలుకే మోసం వచ్చిందనీ, ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడడానికి బదులు కుంటుబడిందనీ ఆయన బాధ. పనిలో పనిగా డీమానిటైజేషన్ వల్ల అవినీతి తగ్గేదేమీ లేదన్న నిజాన్ని ఆయన కక్కేశారు. అరుంధతి అయితే అవినీతి పెరుగుతుందని కూడా సెలవిచ్చారు.

హతవిధీ!!

2 thoughts on “డీమానిటైజేషన్ వల్లే జి‌డి‌పి తగ్గింది -పాల్ కృగ్మన్

  1. ఆర్ధిక… సామాజిక… ఏ రంగం చూసుకున్నా ఈ ప్రభుత్వం పని తలతిరుగుడుగా… అతితెలివిగా ఉంది… ఎవరేమి అన్నా చెవిటివాడిముందు శంఖం ఊదినట్టుగా ఉంది వాళ్ళకి… మన ఖర్మ కొద్దీ వచ్చిందీ ఈ ప్రభుత్వం.


  2. https://polldaddy.com/js/rating/rating.jsమొదట యోగ… పోన్లే పోయేదేముంది…
    జనధన్ యోజన… అందరికి బాంక్ ఖాతాలు… పేదవాళ్ళకు ఓడి. బాంక్ ఖాత మంచిదేకదా…
    పెద్దనోట్ల రద్దు… ఉగ్రవాదం దొంగనోట్లు నల్లధనం… బొక్క బోశానం.. ఇంకేం చేస్తాం కానిద్దాం. పాన్ ఆధార్ లింక్… ఎందుకో ఏమిటో తెలీదు మూసుకున్నాం… GST రేట్లు పెరుగుతున్నాయి, చిన్న వ్యాపారస్తులు సంకనాకిపోతే… ఒక దేశం ఒక టాక్స్… పెద్దనోట్ల రద్దుకు ముందు అమెరికా యాత్ర… GST కి ముందు అమెరికా యాత్ర… ఇప్పుడు ఇజ్రాయెల్ యాత్ర… (పాలస్తీనా కి వెళ్లడం లేదు)… అంతరార్థం బోధపడుతున్నదా మనకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s