డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జి‌డి‌పి


2016-17 సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి గణనీయంగా పడిపోయింది. 8 శాతం పైగా నమోదు చేస్తుందని ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం, ఆర్‌బి‌ఐ, ఆర్ధిక సలహాదారులు అంచనా వేయగా 7 శాతం మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు తెలిపాయి. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్ధిక వృద్ధి రేటు పడిపోతుందన్న పలువురు నిపుణుల అంచనాలు నిజం కాగా ప్రభావం పెద్దగా ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తప్పింది.

గడచిన ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో (జనవరి – మార్చి 2017) ఆర్ధిక వృద్ధి రేటు మరీ ఘోరంగా 6.1 శాతం మాత్రమే నమోదు అయింది. మూడవ త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి నమోదయినపుడు ‘చూసారా డీమానిటైజేషన్ ప్రభావం లేదు’ అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు జారీ చేశారు. అయితే సకాలంలో వచ్చిన ఋతుపవనాల వల్ల వ్యవసాయ దిగుబడి అనూహ్యంగా పెరిగిన ఫలితంగా మూడవ త్రైమాసికంలో ఆర్ధిక వృద్ధి ఒక మాదిరిగా నమోదు అయిందన్న సంగతిని ప్రభుత్వం విస్మరించింది.

వ్యవసాయ దిగుబడి పెరిగినప్పటికీ 2015-16 నాటి Q3 వృద్ధి రేటు (7.4%) కంటే 2016-17 Q3 వృద్ధి రేటు పడిపోయిన సంగతిని విస్మరించలేము. 

2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్రం బడ్జెట్ ప్రకటించడానికి ముందు రోజు విడుదల చేసిన ఆర్ధిక సర్వేలో “డీమానిటైజేషన్ వల్ల ఆర్ధిక వృద్ధి రేటు 0.25% నుండి 0.50% వరకు మాత్రమే తగ్గుతుంది” అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తాజాగా విడుదల చేసిన వార్షిక జి‌డి‌పి వృద్ధి రేటు గణాంకాలను చూస్తే వాస్తవ తగ్గుదల (1.0%) కేంద్ర ప్రభుత్వ అంచనా కంటే రెట్టింపు మేర వృద్ధి రేటు పడిపోయిందని గమనించవచ్చు.

భారత దేశంలో వ్యాపారాలు ప్రధానంగా డబ్బు చలామణి పైన ఆధారపడి ఉన్న నేపధ్యంలో డీమానిటైజేషన్ ప్రభావం అనివార్యంగా జి‌డి‌పి పై పడింది. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ప్రభుత్వమే నిరాకరించింది. ఆర్ధిక వ్యవస్ధ పెర్ఫార్మెన్స్ (జి‌డి‌పి గణాంకాలను) సైతం మోడి ప్రభుత్వం రాజకీయం చేయడంతో ఈ అంకెలను కృత్రిమంగా పెంచి చూపే అవసరం కూడా ప్రభుత్వానికి పెరిగింది. జి‌డి‌పి వృద్ధి రేటును గణించే బేస్ సంవత్సరాన్ని 2010 నుండి 2015 కు ముందుకు జరపడం ద్వారా జి‌డి‌పి అంకెలను పెంచి చూపడం మొదలు పెట్టిన మోడి ప్రభుత్వం అదే పద్ధతిలో 3వ 4వ త్రైమాసికాల్లో జి‌డి‌పి అంకెలను ప్రభావితం చేసిందన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాయి.

జి‌డి‌పి గణాంకాలు వెలువడిన అనంతరం ఇది ఊహించ్చిందే అని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పరువుకు పోయి డీమానిటైజేషన్ ప్రభావాన్ని మొండిగా నిరాకరించిందని, ఆర్ధిక నడతకు ప్రభుత్వ పరువు ప్రతిష్టాలతో సంబంధం లేదని వారు గుర్తు చేశారు.

“వృద్ధి గణాంకాలపై డీ మానిటైజేషన్ ప్రభావం తప్పనిసరి” అని రేటింగ్ సంస్ధ క్రిసిల్ (Cisil) ప్రధాన ఆర్ధికవేత్త డి.కే.జోషి వ్యాఖ్యానించారని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది. “2017-18లో వార్షిక వృద్ధి రేటు మహా అయితే 7.4 శాతం నమోదు కావచ్చు” అని జోషి స్పష్టం చేశారు.

డిమానిటైజేషన్ వల్ల జి‌వి‌ఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్ – కలిసిన విలువ మొత్తం) బాగా పడిపోయిందని గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 2015-16 లో మూడు మరియు నాలుగవ త్రైమాసికాల్లో జి‌వి‌ఏ వరుసగా 7.3% మరియు 8.7% నమోదు కాగా 2016-17 లో ఇది వరుసగా 6.7% మరియు 5.6% కు పడిపోయింది. దానితో జి‌డి‌పి బాగా తగ్గిపోయింది. [ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి కార్యకలాపాల వలన దేశ సంపదకు వచ్చే కలిసే మొత్తం ఉత్పత్తి విలువను జి‌వి‌ఏ (Gross Value Added) అంటారు.]

డీమానిటైజేషన్ ఫలితంగా ఒక్క వ్యవసాయరంగం తప్ప తతిమా రంగాలన్నీ జి‌డి‌పి వృద్ధి రేటు తగ్గుదలకు గురయ్యాయి. ప్రధాన ఉత్పత్తి రంగమైన మాన్యుఫాక్చరింగ్ రంగం వృద్ధి రేటు మరీ దారుణంగా 12.7% నుండి 5.3% కు తగ్గిపోయింది. వ్యవసాయ రంగం మాత్రం 2015-16లో 0.7% వృద్ధి చెందగా 2016-17లో 4.9% వృద్ధి చెందింది.

వృద్ధి రేటు పై డీమానిటైజేషన్ ప్రభావం గురించి ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చేసిన విశ్లేషణ ప్రత్యేకంగా గమనీచదగ్గది. “ఈ సంవత్సరం వృద్ధి రేటు గణాంకాలు గత సంవత్సరపు పెద్ద గణాంకాలు పునాదిగా గణించినవి. కనుక ఈ గణాంకాల్లో డీమానిటైజేషన్ వాస్తవ ప్రభావం గుర్తించదగినట్లుగా వ్యక్తం కాబోదు” అని ఆయన చెప్పారు (ఇండియన్ ఎక్స్ ప్రెస్). అనగా డీమానిటైజేషన్ ప్రభావం వల్ల జి‌డి‌పి వృద్ధి రేటు దాదాపు 1% నష్టపోయామని జి‌డి‌పి గణాంకాలు చెబుతున్నప్పటికీ వాస్తవ ప్రభావం అంతకు మించి ఉంటుందని ఆయన మాటల అర్ధం.

 

One thought on “డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జి‌డి‌పి

  1. శేఖర్ గారు
    Gst గురించి దాన్ని వెనుకవుండి అమలుచేపించిన వారిగురించి… డీమానిటైజేషన్ వెనుక catalyst రిపోర్ట్ లా దీనికీ ఏమైనా ఉన్నదా…? పూర్తి పూర్వపరాలు తెలియజేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s