ఓ పిరికి హృదయి, ఓ ప్రేమ హృదయాన్ని చంపేసింది -పునర్ముద్రణ


Ilavarasan with his mother on Jun 6

Ilavarasan with his mother on Jun 6

(2013లో సరిగ్గే ఇదే తేదీన ప్రచురించిన ఈ టపాను విషయ ప్రాధాన్యత రిలవెన్స్ రీత్యా పునర్ముదృస్తున్నాను. -విశేఖర్)

**********

దివ్య, ఇలవరసన్! కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట భవిష్యత్ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సి ఉండగా కుల రాజకీయాల కోరల్లో చిక్కుకుని అత్యంత ఘోరమైన, క్రూరమైన, దయారహితమైన విషాదాంతం వైపుకి పయనించింది. కుల పార్టీల వలలో చిక్కి, ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్త దగ్గరకు వెళ్ళేది లేదని దివ్య నిర్దయగా ప్రకటించడంతో ఇలవరసన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దివ్య రాసిన ప్రేమ లేఖలను దగ్గర ఉంచుకుని ఆత్మహత్య లేఖ రాయలేక మౌనంగా, హింసాత్మకంగా తనను తాను అంతం చేసుకున్నాడు. అతన్ని చంపేశారని ఇలవరసన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నప్పటికీ పరిసరాలు ఆత్మహత్య వైపే వేలెత్తి చూపుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇలవరసన్ విగత దేహం ధర్మపురి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వెనుక రైలు పట్టాలపై పడి ఉండగా గురువారం సాయంత్రం కనుగొన్నారని ది హిందు తెలిపింది. అతని తల పగిలిపోగా ఒక చేయి విరిగిపోయి  ఉందని పత్రిక తెలిపింది. పట్టాల పక్కనే అతను ప్రయాణం చేసిన టూ వీలర్ ఉందని, దివ్య రాసిన ప్రేమ లేఖలు మూడు అక్కడ పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. జాతీయ ఎస్.సి కమిషన్ ఛైర్మన్ పి.ఎల్.పూనియా కూడా ఆత్మహత్య కాకపోవచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి, యు.పి నుండి లోక్ సభకు కాంగ్రెస్ తరపున ఎన్నికయిన పూనియా ధర్మపురి కుల హింస, దహనాల అనంతరం స్వయంగా బాధిత కాలనీలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

దాదాపు మధ్యాహ్నం గం. 12:30 ని.లకు ఇళవరసన్ మోటార్ సైకిల్ పై ఆ ప్రదేశానికి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ వెనుక భాగంలో ఉన్న దుర్ఘటనా స్ధలిలో కొద్ది సేపు గడిపి గం. 1 – గం. 1:30 ని.ల ప్రాంతంలో ముంబై వెళ్తున్న కుర్లా ఎక్స్ ప్రెస్ ముందు దూకి ఉండవచ్చని వారు చెప్పారు. అయితే అక్కడ ఆత్మహత్య అని సూచిస్తున్నట్లుగా లేఖ ఏదీ దొరకలేదు. 2011లో దివ్య రాసిన మూడు ప్రేమ లేఖలు మాత్రం దొరికాయి. ప్రేమ లేఖల్లో దివ్య వ్యక్తం చేసిన ప్రేమకూ, మద్రాస్ హై కోర్టు ముందు నిర్లక్ష్యంగా తమ పెళ్ళికి వ్యతిరేకంగా చెప్పిన ఆమె మాటలకూ మధ్య తేడాను ఇళవరసన్ చివరిసారిగా గుర్తు చేసుకుని ఉండవచ్చు.

తానిక తన భర్త దగ్గరికి వెళ్లనని, కొన్ని పత్రికలు చెబుతున్నట్లుగా ‘ఎప్పటికైనా తాను భర్త దగ్గరికి వెళ్లడానికి ఎదురు చూస్తున్నానని’ చెప్పడంలో నిజం లేదనీ ఆమె బుధవారం మద్రాస్ హై కోర్టు ఆవరణలో విలేఖరులకు చెప్పడంతో ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. తన తల్లి అనుమతి ఇచ్చాకనే తాను భర్త వద్దకు వెళ్తానని చెప్పినట్లు పత్రికల్లో రావడంతో తనను అంతా వెలివేశారని, కాబట్టి తాను భర్త దగ్గరికి వెళ్లనని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని ఆమె విలేఖరులకు చెప్పడం గమనార్హం. కుల సమాజం నుండి ఆమె ఎదుర్కొన్న ఒత్తిడి ఏ స్ధాయిలో ఉన్నదో ఈ మాటలు సూచిస్తున్నాయి.

దివ్య వయసు 21 సంవత్సరాలు. నర్సింగ్ చదువుతోంది. అత్యంత వెనుకబడిన కులంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన వన్నియార్ కులస్ధురాలు. దళిత యువకుడు ఇలవరసన్ వయసు 19 సంవత్సరాలు. పోలీసు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లిని దివ్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి కులస్ధులు ససేమిరా అన్నారు. కుల పంచాయితీ పెట్టి తాళి తీసేసి వెనక్కి రమ్మన్నారు. దివ్య అంగీకరించలేదు. పదిమందిలో అవమానానికి గురయ్యానని భావించిన దివ్య తండ్రి నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగరాజు మరణం కుల దురహంకార శక్తులకు ఆయుధంగా మారింది. వన్నియార్ కుల పార్టీ అయిన పి.ఎం.కె ఆధ్వర్యంలో వన్నియార్లు వేలాదిగా తరలివచ్చి ఇలవరసన్ నివసించే నాధం కాలనీతో పాటు మరో రెండు దళిత కాలనీలపై దాడి చేశారు. మొదట దొరికిందల్లా దోచుకున్నారు. ఆ తర్వాత కనిపించిందల్లా తగలబెట్టారు. రేషన్ కార్డులు, మార్కుల సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు… మొదలైన పత్రాలను వెతికి కుప్పపోసి తగలబెట్టారు. టి.వి, ఫ్రిజ్, మిక్సీ, టూ వీలర్, ఫోర్ వీలర్… ఇలా దళితుల ఆర్ధిక ఉన్నతికి దర్పణంగా నిలిచిన గృహోపకరణాలను టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేశారు. ప్రతి ఇల్లూ తగలబెట్టారు. తమ దాడి, దహనాలను అడ్డుకోకుండా ఉండడానికి ఫైర్ ఇంజన్, పోలీసు వాహనాలు రాకుండా హై వే పై ముందే చెట్లు నరికి పడేసి ఒక పధకం ప్రకారం విధ్వంసం సృష్టించారు.

గత అక్టోబర్ లో పెళ్లి చేసుకున్న దివ్య, ఇలవరసన్ లు డి.ఐ.జి రక్షణ కోరినప్పటికీ పోలీసులు, ప్రభుత్వం వారికి రక్షణ ఇవ్వలేకపోయారు. దళిత కాలనీలపై దాడి జరుగుతున్నపుడు పోలీసులు అక్కడే ఉన్నా సంఖ్య తక్కువ కావడంతో అడ్డుకోలేకపోయారు. వన్నియార్ కులం ఆధారంగా అత్యంత నీచమైన కులరాజకీయాలు నడుపుతున్న పి.ఎం.కె పార్టీ నాయకుడు రామదాస్ అనేక సంవత్సరాలుగా దళితులకు వ్యతిరేకంగా తమ కులస్ధూలను రెచ్చగొట్టి పెట్టాడు. దళిత యువకులు ‘జీన్స్, టీ షర్ట్ ధరించి, చౌక కళ్ళద్దాలు తగిలించుకుని అగ్ర కుల యువతులను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారని, కాబట్టి యువతులు మోసపోవద్దని’ పిలుపు ఇచ్చేవరకూ ఆయన నేలబారు రాజకీయాలు నెరిపాడు. ఫలితంగా వన్నియార్, దళితుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగి ఎన్నికల్లో ఓట్ల పంటకు ఎరువుగా మారాయి.

ఈ అధికార, ధన, కుల యజ్ఞంలో దివ్య అశక్తురాలుగా మారిపోయింది. రానున్న ఎన్నికలకు ఓట్లు సమకూర్చుకోవడానికి స్వార్ధ శక్తులకు దివ్య, ఇళవరసన్ ల పెళ్లి ఒక ఆయుధంగా దొరికింది. ఫలితంగా దివ్య తల్లి రంగంలోకి దిగి కూతురిని భర్త నుండి విడదీసింది. స్వయంగా కూతురు కాపురంలో నిప్పులు పోసింది. తండ్రి ఆత్మహత్య సెంటిమెంటు దివ్య ఆలోచనలను సక్రమంగా సాగనివ్వకపోవడంతో ఆమె భర్తకు చెప్పకుండా తల్లి వెంట వెళ్ళిపోయింది. విషయం కోర్టు వరకూ రావడంతో దివ్య తాను తల్లి దగ్గరే ఉంటానని కోర్టుకు చెప్పింది. తనను భర్త, అత్తామామలు బాగా చూసుకున్నారనీ, తనకు భర్త పైన ప్రేమ లేక కాదనీ, కానీ కొంత కాలం తల్లి దగ్గర ఉంటానని ఆమె కోర్టుకు తెలిపింది.

పత్రికలు ఆ వార్తనే ప్రచురించాయి. కొన్ని పత్రికలు మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నించాయి. తల్లి దండ్రుల ఒత్తిడిని తిరస్కరించి, కుల పంచాయితీ ఒత్తిడిని ఎదిరించి ఇళవరసన్ వెంట వచ్చిన దివ్య అకస్మాత్తుగా తల్లి వద్ద ఉంటానని చెప్పడానికి కారణాలు వెతకడానికి అవి ప్రయత్నించాయి. ఇది పత్రికలు చేయవలసిన పనే. సామాజిక సంఘర్షణల్లో ప్రగతిని ప్రోత్సహించి, సంప్రదాయం ముసుగు కప్పుకున్న ప్రగతి వ్యతిరేకతను తిరస్కరించడం పత్రికల కర్తవ్యం. ఆ కర్తవ్యంతోనే అవి దివ్య నిర్ణయం వెనుక పి.ఎం.కె ఒత్తిడి ఉన్న విషయాన్ని వెల్లడి చేశాయి.

జూన్ మొదటివారంలో తల్లి వద్ద ఉంటానని కోర్టుకు చెప్పిన దివ్య జులై 1 న జరిగిన హియరింగ్ లో తన ప్రేమ వివాహానికి తల్లి అనుమతి దొరికేవరకూ భర్త దగ్గరికి వెళ్లనని కోర్టుకు తెలియజేసింది. ఏనాటికైనా భర్తను చేరడానికి ఎదురు చూస్తున్నానని అనంతరం పత్రికలకు తెలిపింది. పత్రికలు ఆమె మాటలనే ప్రచురించాయి. అయితే దివ్య భర్తను వదిలిరావడం తాము చేస్తున్న దళిత వ్యతిరేక ప్రచారానికి సరిపోయిందని సంబరపడిన పి.ఎం.కె, దివ్య తన భర్తకు అనుకూలంగా చెప్పిన మాటలకు ఇరకాటంలో పడింది. ఫలితంగా దివ్య తల్లిపై ఒత్తిడి పెంచి తమ పధక రచనకు అనుకూలంగా ప్రకటనను రాబట్టే ప్రయత్నం చేశాయి.

దానితో దివ్య మళ్ళీ జులై 3 తేదీన మద్రాస్ హై కోర్టు ఆవరణకు వచ్చింది. తన మాటలను తానే ఖండించుకుంది. భర్త దగ్గరకు తిరిగి వెళ్లనని చెప్పింది. పత్రికలు రాసిన వార్తల వలన తనను సమాజంలో వెలివేశారని వాపోయింది. నెపాన్ని పత్రికల మీదికి నెట్టినప్పటికీ వాస్తవంలో దివ్య తన హృదయంలోని వాస్తవానికీ, సమాజంలోని వాస్తవానికి రగిలిన సంఘర్షణలో నలిగి ఓడిపోయింది.

తండ్రి ఆత్మహత్య మనసును పట్టి వేధిస్తున్న పరిస్ధితుల్లో ఒక రాజకీయ పార్టీ ఒత్తిడికి లోనై దివ్య ప్రేమ బంధాన్నీ, వివాహ బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడి ఉండవచ్చు. సామాజిక ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని చెప్పి ఆమె పట్ల సానుభూతి చూపవచ్చు.

కానీ ఇలవరసన్? అతనేం తప్పు చేశాడు? అతని తప్పు దివ్యని ప్రేమించడం కాదు. ఎందుకంటే దివ్య కూడా అతన్ని ప్రేమించింది. అతని తప్పు దివ్యని పెళ్లి చేసుకోవడం కాదు. ఎందుకంటే దివ్య కూడా అతన్ని పెళ్లి చేసుకుంది. అతని తప్పు తమ (దళిత) ఇంట్లో కాపురం పెట్టడం కాదు. ఎందుకంటే దివ్య స్వయంగా తాను పుట్టింటికి తిరిగి రానని కుల పంచాయితీలోనే బహిరంగంగా అందరి ముందూ చెప్పింది.

కానీ ఇలవరసన్ ఒకే ఒక తప్పు చేశాడు. అది ఒక దళిత కులంలో పుట్టడం! ఇళవరసన్ చేసినది, దివ్య చేయనిది ఈ తప్పు ఒక్కటే. మిగిలిన తప్పులన్నీ ఇద్దరూ కలిసే చేశారు. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కాపురం చేయడం… అన్నీ ఇద్దరూ కలిసే చేశారు.

దళితుడుగా పుట్టినందుకు ఇళవరసన్ రైలు పట్టాలపై హృదయవిదారక పరిస్ధితిలో శవమై తేలితే అతని కంటే ఒక మెట్టు మాత్రమే పైన ఉన్న కులంలో పుట్టినందుకు దివ్య ‘నేనిక జన్మలో (దళిత) భర్త దగ్గరికి వెళ్ళను’ అని ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని గ్యారంటీ చేసిన హై కోర్టు మెట్లపై నిలబడి ధైర్యంగా చెప్పగలిగింది.

దివ్య! ఓ పిరికి హృదయి!! ఒక ప్రేమ ద్రోహి కూడా కావచ్చునేమో! స్వార్ధాన్ని జయించలేక తల్లిని, తండ్రి ఆత్మహత్యనూ అడ్డు పెట్టుకుంటే ఆమె ప్రేమ ద్రోహి. సంప్రదాయంలోని మకిలిని జయించలేక కుల కట్టుబాట్లకు లొంగిపోతే ఆమె నిస్సహాయురాలు.

ఈ దేశంలో సహజ, స్వాభావిక లక్షణం అయిన హృదయంతో ప్రేమించగలిగి కూడా పిరికితనంతో సామాజిక అణచివేతలకు లోంగిపోయే యువతీ యువకులకి ఆమె ప్రతీక! భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ఇప్పటికీ పట్టుగొమ్మగా ఉంటూ హిందూ మత సారంగా కొనసాగుతున్న అమానవీయ కుల వ్యవస్ధలో భాగమై, దాన్నుండి బైటికి రావడానికి తమకు తెలియకుండానే ప్రయత్నిస్తున్న అనేకమంది అయోమయ యువతీ, యువకులకు కూడా ఆమె ప్రతీకే.

వ్యక్తులుగా తమ స్వాభావిక స్పందనలను వీరు వదులుకోలేరు, కానీ సామాజిక జీవిగా కులం నిర్మించిన గోడలను దాటి ఇవతలికి రాలేని నిస్సహాయులు వాళ్ళు! వర్ధమాన భవిష్యత్తు వారిని గోడ దాటమని ప్రోత్సహిస్తుంటే, పాచిపోయిన భూత, వర్తమానాల జారుడుబండలు వారిని కిందికి నెట్టివేస్తున్నాయి.

అయినా సరే, ఒక వ్యక్తిగా దివ్య నిందార్హురాలు. ప్రేమను తానే చేరదీసి, ప్రాణంపోసి కూడా, దానిని నిలబెట్టుకోలేని పిరికిది. తల్లిదండ్రుల ప్రేమ, ప్రేమికుడి ప్రేమ ఒకటి కాదని, అవి రెండూ ఒకదానికొకటి పోటీ కూడా కాదని తెలియని భావ దారిద్ర్యంతో నిర్దాక్షిణ్యంగా ఒక నిండు ప్రేమ హృదయం పీక నులిమిన హంతకి (ప్రాణ హంతకి కాదు)!

ఇళవరసన్! ప్రేమకు హృదయాన్నే కాదు ప్రాణం కూడా అర్పించవచ్చని నిరూపించిన సాహసికుడు. ‘జీన్స్, టీ షర్ట్, చలువ కళ్ళద్దాలు’ ధరించిన దళిత యువకులు హృదయం నిండా నింపుకునేది ప్రేమ మాత్రమేనని చాటిన ప్రేమికుడు.  వయసునూ, సౌందర్య ప్రియత్వాన్నీ, యౌవన ప్రాయపు భావోద్వేగాల అనిర్దిష్టతనూ కూడా వారు గెలవగలరని చూపిన విజయుడు. కుల రక్కసిని ఆవహించిన ఓట్ల దాహాన్ని ప్రాణత్యాగంతో గేలి చేసిన అభిమన్యుడు. కులం-రాజకీయం జమిలిగా నెలకొల్పిన వధ్యశిలపై ప్రేమ హృదిని బలవంతంగా చిదిమేసుకున్న దుఃఖోద్వేగి. తల్లి దండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చిన స్వార్ధ ప్రేమికుడు.

ఇళవరసన్ ది హత్య కాకపోతే ప్రేమ పోరాటంలో అమరుడు. హత్య అయితే ప్రేమ పోరాటం లోనేకాక, తెలిసినా తెలియకపోయినా, కుల వ్యతిరేక పోరాటంలోనూ అమరుడు!

20 thoughts on “ఓ పిరికి హృదయి, ఓ ప్రేమ హృదయాన్ని చంపేసింది -పునర్ముద్రణ

  1. వాక్యానించడానికి మరేమి వదిలిపెట్టలేదు మీరు. ఏమైనా సామాజిక ప్రగతి కోణం మరొక సారి ఓడి పోయింది. ఈ దేశంలో పక్తు ఫండమెంటలిస్టిలు గెలవడం హ్రుధయం ద్రవించుక పోయే విషయం. ఉధయం ది హిందు లో ఇళవరసన్‌ చని పోయిన వార్త చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. పాపం ఇళవరసన్‌ కుల్లిపోయిన కులం విషం తాగి ప్రాణాలొదిలాడు! మనువు పాఠాన్ని రక్తంలో ఇమిడించుకున్న పాటాలి మక్కల్‌ కచ్చి చివరకు తాను అను కున్నది సాదించుకున్నది. కాడువెట్టి గురు, అన్‌ బుమణి రామదాస్‌ కల్లు చల్లపడ్డాయి. అన్‌ బుమణి రామ దాస్‌ జూలై 3 తేది నా విలేకర్లతొ మాట్లాడు తూ ‘ మేము ఏవిధంగా ఆ జంట విషయం లో జోక్యం చేసు కోలేదు అంటూనే అయి నా ఆ పిల్లాడు చాల చిన్న వాడు అని ముగించాడు. ఇది ఇళవరసన్‌ తల్లి దండ్రులు వెలి బుచ్చుతున్న అనుమానం నిజమేమో నని పిస్తుంది.అన్‌ బు అంటే ప్రేమ ఈ ప్రేమ మణి విషం కక్కడం దుర్మార్గం.

  2. తిరుపాలు గారు, అవును ఇళవరసన్ చనిపోయాడని తెలిసిన వెంటనే నాకు నోట మాట రాలేదు. మనను నిండా మబ్బులు కమ్మినట్లు ఐపోయింది. ఆఫీసుకి వెళ్లినా ఇదే ఆలోచనలో ఉండిపోయాను.

    చంపేశారామో అని నాకు మొదట అనుమానం వచ్చింది. కాని అతన్ని చంపితే పి.ఎమ్.కె కి ప్రయోజనం ఉండదు. పైగా నష్టం అనిపించింది. డాక్టర్లు, పోలీసులు తేల్చేవరకూ ఇది అనుమానాస్పదంగానే ఉండిపోతుంది.

    కానీ, ఎంత ఘోరం అండీ? నాకు ఇంకా ఇంకా రాయలనిపించింది. మొత్తం నా మనసునంతా కుప్పపోసి భారం దించుకోవాలనిపించింది. కాని రాసేకొద్దీ భారం పెరిగిందే గాని తగ్గలేదు.

  3. arey jaffa gaa antha baagane vundu kani….inthaki nuvvu cheppedi yemitante,,,pischakuntla lover kosam,, kanna parents chachipoyina parvaledaa,,, mogudu vaadu kaakapote desham lo kotla mandi unnaru,,, but parents ni ela ra replce cheyadam….nee jaffa naa daffa gaa….

  4. tandri ki ichina maata kosam pelli chesukokunda undipoyina bheeshmudi ni chusi nerchukondi raa,, mana sampradayam yentha goppado….ninna kaaka monna parichayam ayina vyaktula mabdya ne antha prema unte,,,kani penchi sarvasvam mee kosam dhaaraposina parents meeda inka yentha prema vundali raa,,, vaallu cheppinattu naduchukune badyata leda pillalaki,,,pelli chesukokunte jarige nashtam emi ledu sex tappa,,,,neeku ade kaavalnukunte yekkadaina dorukutundi,,,,asalu nee parents ee lekapothe nuvvu levvu nee love ledu kada,,,,first love your parents…….

  5. మీకు తెలిసిన వివరాలతో సంఘటనలకు చక్కటి విశ్లేషణ చేసారు. వారిద్దరిమధ్య ప్రేమ కలగటానికి ఆకర్షణ ఐతే ఇలానో మరోలానో విఫలమవుతయ్.అదే ఒకరిఫై ఒకరికి విస్వాశం, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే పరిణితి వుంటే ఇలాంటి ముగింపు వుండేది కాదు. ప్రేమలు ,ప్రేమ వివాహాలు,విఫలంకావటానికి సఫలం కావటానికి ప్రధాన కారణం ఇదే. కులమైన,మతమైన,ధ నమయిన, ,పేదరికం ఐనా వాళ్ళ బలహీనతల ఆధారంగా పనిచేస్తాయి.-

  6. @ విశేఖర్ గారు. హృదయానికి హత్తుకునేలా చాలా బాగా రాశారు. కొందరు తమ స్వార్థం కోసం… దోపిడీ కోసం, అణచివేత కోసం సృష్టించిన కుల వ్యవస్థ…ఎంతో మంది ప్రేమికుల్ని బలిగొన్నది.

    ఈ కుల రక్కసిని ఎదురించేందుకు….కొందరు సిద్దమైనా, కులం పేరుతో వారికి ఎదురయ్యే అవమానాలు పర్యవసానాలు వారిని విడదీయడమో… ప్రాణాలు బలిగొనడమో జరగుతోంది.

    ఐతే ఇవన్నీ పేదలు, ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లోనే. ధనికుల దగ్గరకు వచ్చే సరికి….కులం పెద్ద విషయం కాకపోవడమే గమనార్హం.

    అంబేద్కర్ సైతం కులం సమస్యకు కులాంతర వివాహాలే పరిష్కారంగా చెప్పారు.

    @ అయ్యా ఆకాశరామన్నా….

    మీరు ఇళవరసన్-దివ్య ఉదంతం కేవలం ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన విషయం అయితే…..ఇంతగా చర్చ జరిగేది కాదు.

    తమిళనాడులో….( ఆ మాటకొస్తే దేశమంతటా ) పాతుకుపోయిన కుల వ్యవస్థ….దాని ఆధారంగా బతుకుతున్న రాజకీయ పార్టీలు, ఆధునిక యువతరం మనోభావాలు, స్వచ్ఛమైన ప్రేమ, కులాంతర వివాహాల పర్యవసానాలు….ఇలా ఈ విషాద ప్రేమ వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయి.

    ఇక మీరు వాదిస్తున్నదేమిటో….స్పష్టంగా అర్ధం కాలేదు.

    దివ్య తండ్రి చనిపోవడం ఎవరికైనా బాధ కలిగించే అంశమే. ఐతే ఆయన చావుకు పైకి వీళ్ల ప్రేమ కారణంగా కనిపిస్తున్నా..అసలు కారణం కుల వ్యవస్థ. కులం పేరుతో జరిగే అవమానాలు తట్టుకోలేక కదా ఆయన చనిపోయింది.

    ఇక తల్లిదండ్రులను ప్రేమించండని మీరు చెబుతున్నారు. కాదని ఎవరన్నారు….?

    తల్లి దండ్రుల ప్రేమ… భార్యాభర్తల మధ్య ప్రేమ ఒకటేనా…? అసలు ఆ రెండు ఒకదానికొకటి పోటీ కానే కాదు. దేనికుండే విలువ దానికుంటుంది. అసలు ఆ చర్చే ఇక్కడ అసలు విషయాన్ని పక్క దోవ పట్టిస్తుంది.

    ఇక్కడ చర్చల్లా… “భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ఇప్పటికీ పట్టుగొమ్మగా ఉంటూ హిందూ మత సారంగా కొనసాగుతున్న అమానవీయ కుల వ్యవస్ధలో భాగమై, దాన్నుండి బైటికి రావడానికి తమకు తెలియకుండానే ప్రయత్నిస్తున్న అనేకమంది అయోమయ యువతీ, యువకుల గురించి.”

    దాని గురించి చర్చ జరగాలి ఇప్పుడు.

    అన్నట్లు ఆ చర్చ ఆరోగ్యకరంగా జరగాలి అన్న సంగతి మరచిపోకండి.

  7. ఆకాసరామన్న గారు : ఇక్కడ అలోచించ వలసిన విషయం ఎంటి అంటె కూతురికి తండ్రి కంటె ప్రేమ ఎక్కువ కాకూడదు , నిజమే అనుకుందాం … ఆ ప్రకారమే చుసుకుంటె తండ్రికి కులం కంటె కుతురే ఎక్కువ కావలి కదా…. ఆయన ఆ చిన్న అహంకారం వదులుకో గలిగితె ఇన్ని బాధలు ఇంతమంది బాధ పడడం ఉండెవి కాదు కద….

  8. వాక్యానించడానికి మరేమి వదిలిపెట్టలేదు మీరు.నిజమే మీ టపా లో అన్ని కోణాలూ స్పృశించారు.ఈ వార్త చూసాక నిజంగా చాలా బాధ కలిగింది.మానవత్వం ఉన్నవారు తల దించుకునెలా చేసింది.

    ఆవ్యక్తి తన చావు నెపం ఎవ్వరి మీదా లెఖ రూపం లో కూడా వేయలెదు. కేవలం పుట్టుక వల్ల అతను ఇంత భారం మోయల్సి వచ్చింది. అతని ఫ్రేమ స్వచ్చం. అతన్ని చంపిన ఈ సమాజంలో భాగమైనందుకు బాధపడుతున్నాను.

    రామన్న గారు, మన సంప్రదాయం లో ఉన్నంత మాత్రాన అన్ని కర్రెక్టేనా? అందర్నీ సతీ సహగమనం చేయమంటారా ఏమిటి? ఏడేల్ల అమ్మాయిని అరవై ఏళ్ళ ముదుసలి కిచ్చే సంప్రదాయం కూడా ఉండేది.

    అరుంధతి ది ఏ కులం? రుక్మిణి ఎలా కృష్ణుణ్ణి పెళ్ళాడింది?తండ్రి ని వ్యతిరేకించిన ఫ్రహ్లాదుడు కూడా ఈ సాంప్రదాయంలోనే పుట్టాడు. పార్వతి, సీత, రుక్మిని, ఉష, ద్రౌపతి, సుభద్ర తనకి నచ్చిన వాడినే పెళ్ళాడారు. కాలగమనం లో స్వార్థపరుల వల్ల అనేక జాడ్యాలు ప్రబలాయి. మనిషి స్రెయస్సు కోసం ఏర్పరచిన నియమాలు కొన్ని మానవ సమానత్వాన్ని మంట కలిపాయి. కాలానుగుణం గా వెళ్ళాలి. అతి కొద్ది శాతం వస్తున్న మంచి మార్పుని ఆహ్వానించాలి.

    ఆమె జీవితం ఆమె ఇస్టం. పెద్దలు వారికి మంచి చెడు చెప్పాలి.అది పిల్లలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతె.భావొద్వేగాలు ఆపుకోలేక లేక సమాజం లోని మీ లాంటివారివాల్ల ఆమె తండ్రి చనిఫొయాడు కాని ఆమె వల్ల కాదు.

    ఈ సంప్రదాయం లో పుట్టిన మీరు ఎదుటి వారిని సంభొదించే విధానం నేర్చుకుంటే బాగుండేది. తనని భిక్ష అడిగినందుకు తిట్టిన ఇంటి యజమానితో బుద్ధుడు ఎమన్నాడొ గుర్తు తెచ్చుకోండి.

  9. వ్యాఖ్యాతలు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలూ అద్భుతంగా ఉన్నాయి.

    చుండూరి రాజేంద్ర ప్రసాద్ గారు “వారిద్దరిమధ్య ప్రేమ కలగటానికి ఆకర్షణ ఐతే ఇలానో మరోలానో విఫలమవుతయ్. అదే ఒకరిఫై ఒకరికి విస్వాశం, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే పరిణితి వుంటే ఇలాంటి ముగింపు వుండేది కాదు” అనీ,

    చందుతులసి గారు “తల్లి దండ్రుల ప్రేమ…….భార్యాభర్తల మధ్య ప్రేమ ఒకటేనా…? అసలు ఆ రెండు ఒకదానికొకటి పోటీ కానే కాదు. దేనికుండే విలువ దానికుంటుంది.” అనీ,

    నాగ శ్రీనివాస గారు “కూతురికి తండ్రి కంటె ప్రేమ ఎక్కువ కాకూడదు , నిజమే అనుకుందాం … ఆ ప్రకారమే చుసుకుంటె తండ్రికి కులం కంటె కుతురే ఎక్కువ కావలి కదా….” అనీ,

    aaa గారు “మనిషి స్రెయస్సు కోసం ఏర్పరచిన నియమాలు కొన్ని మానవ సమానత్వాన్ని మంట కలిపాయి. కాలానుగుణం గా వెళ్ళాలి. అతి కొద్ది శాతం వస్తున్న మంచి మార్పుని ఆహ్వానించాలి.

    “ఆమె జీవితం ఆమె ఇస్టం. పెద్దలు వారికి మంచి చెడు చెప్పాలి.అది పిల్లలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతె. భావొద్వేగాలు ఆపుకోలేక, లేక సమాజం లోని మీ లాంటివారివాల్ల ఆమె తండ్రి చనిఫొయాడు కాని ఆమె వల్ల కాదు.

    ఈ సంప్రదాయం లో పుట్టిన మీరు ఎదుటి వారిని సంభొదించే విధానం నేర్చుకుంటే బాగుండేది.తనని భిక్ష అడిగినందుకు తిట్టిన ఇంటి యజమాని తో బుద్ధుడు ఎమన్నాడొ గుర్తు తెచ్చుకోండి.” అనీ.

    నిజానికి ఆకాశ రామన్న మొదటి వ్యాఖ్యను నేను ట్రాష్ లోకి నెట్టేశాను. ఇంతలోనే తల్లి దండ్రుల ప్రేమ గురించి ఆయన రాసిన మరో వ్యాఖ్య చూసి ఆశ్చర్యం వేసింది. సంప్రదాయం గురించీ, తల్లి దండ్రుల ప్రేమ గొప్పతనం గురించీ ఇంతగా వాపోగలిగిన ఈ వ్యక్తి తనకు పరిచయం లేని వ్యక్తిని అమర్యాదగా ఇంతలా ఎలా దూషించగలరా, అని.

    ఇలాంటి విదూషకుల ద్వంద్వ వైఖరి ఇతర పాఠకులు కూడా గ్రహిస్తారని ఆయన రాసిన రెండు వ్యాఖ్యలు ప్రచురించాను.

    ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తిని ‘ఏరా, పోరా’ అనొచ్చని, చిత్ర విచిత్ర పైన తిట్లతో దూషించవచ్చని మన సంప్రదాయాలు నేర్పాయా? aaa గారు సరిగ్గా అడిగారు.

    అందరికీ ధన్యవాదాలు.

  10. you are too romanticizing the large schema of chaos effect. its all related to one another, cast, politics, power, love, honor(offcourse pseudo). they are just 2 pawns in the play. There is no abolute in this world even it comes to love(parents or spouse), it should run on theory of relativity.

  11. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

  12. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

  13. “కూతురికి తండ్రి కంటె ప్రేమ ఎక్కువ కాకూడదు , నిజమే అనుకుందాం … ఆ ప్రకారమే చుసుకుంటె తండ్రికి కులం కంటె కుతురే ఎక్కువ కావలి కదా….”
    ఈ వ్యాక్యం అన్నింటికంటే అత్యుత్తమం.
    ప్రేమ వివాహం చేసుకొని అన్యోన్యంగా లేకపోతేనో లేక ఒకరినొకరు మోసగించుకొంటేనో ఆకాశరామన్న గారి మాటలు కొంతవరకు సరిపోతాయి కానీ ఇక్కడ జరిగింది వేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s