దేశంలో నరేంద్ర మోడి హయాంలో, ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ హయాంలో పెరిగిపోయిన ఊచకోత హత్యలకు వ్యతిరేకంగా నిరసన పెల్లుబుకుతోంది. ఈ నిరసనకు ఉద్యమ రూపం ఇచ్చేందుకు కొన్ని ప్రాధమిక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా పక్షం వహించే రాజకీయ శక్తులు బలీయంగా లేని నేపధ్యంలో ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులు వ్యక్తిగత స్ధాయిలో ఉమ్మడి ఉద్యమాలకై తమ పరిమిత పరిధిలో నడుం బిగిస్తున్నారు.
ఈ కృషిలో భాగంగా Protection from Lynching Act (మానవ్ సురక్షా కానూన్ – Human Security Bill) పేరుతో పలువురు ప్రముఖులు, ప్రగతి కాముక మేధావులు ఒక బిల్లు ముసాయిదాను తయారు చేస్తున్నారు. ముసాయిదా బిల్లు వచ్చే శుక్రవారం (జులై 7 తేదీన) విడుదల చేయనున్నారు. “ముసాయిదా బిల్లు కోసం సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నాం” అని జేఎన్‌యూ విద్యార్ధి, జేఎన్‌యూ ఉద్యమ నేత షెహలా రషీద్ చెప్పారు.
‘నేషనల్ కాంపెయిన్ అగైనెస్ట్ మాబ్ లించింగ్’ ఉద్యమ నేతల్లో షెహలా రషీద్ ఒకరు. జేఎన్‌యూ విద్యార్ధి యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జీఘ్నెష్ మేవాని, సామాజిక కార్యకర్త తహసీన్ పూనావల్లా మొదలైన వారు ఈ ప్రచార ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఓ వైపు ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేస్తూనే మరోవైపు బిల్లుకు మద్దతు కోసం, వారి మద్దతుతో పార్లమెంటులో ప్రవేశ పెట్టడం కోసం చట్ట సభల సభ్యుల (ఎంపిలు) వద్దకు వెళ్ళి కోరతామని ఈ నేతలు చెప్పారు. జూన్ నెలలో ప్రారంభించబడిన ప్రచార ఉద్యమం ఇప్పటికే పలువురిని ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
జార్ఖండ్, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మొ.న రాష్ట్రాల్లో దళితులు, ముస్లింలపైన గొరక్షణ పేరుతో హిందూత్వ గూండా మూకలు దాడి చేస్తూ హత్యలకు తెగబడుతున్నప్పటికీ హిందూత్వ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే కాకుండా తిరిగి బాధితుల పైనే కేసులు పెడుతున్న పరిస్ధితి దేశంలో నెలకొన్నది. హిందూత్వ మూకల విచ్చలవిడి వీరంగాన్ని నివేదించకుండా, పత్రికలను సైతం భయోత్పాతానికి గురి చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో హ్యూమన్ సెక్యూరిటీ బిల్ కోసం ప్రారంభమయిన ప్రచారోద్యమం “ఏ మొక్కా లేని చోట ఆముదం చేట్టే మహా వృక్షం” లాంటిది. ఇది ఆముద వృక్షంగానే మిగలకుండా, అనగా బిల్లు చట్టంగా రూపొందడం వరకే పరిమితం కాకుండా భారత సమాజం నుండి హిందూత్వ మూకలను ప్రజలే వెంటాడి వేటాడేంత స్ధాయిలో ప్రజా చైతన్యాన్ని రగుల్కొలిపే దిశగా సాగితే భారత ప్రజలకు మరింత ఉపయోగపడుతుంది. అయితే అందుకు రాజకీయ లక్ష్యం కలిగిన సంస్ధల అండదండలు కావాలి. అలాంటి సంస్ధలు అండదండలతో ఆగకుండా ఉద్యమానికి తామే నాయకత్వం వహించే స్ధాయికి తీసుకెళ్లడానికి ముందుకు రావాలి.
నేరస్ధులను, రెచ్చగొట్టేవారిని, నిష్క్రియాపర అధికారులను శిక్షించే బిల్లు
ముసాయిదా బిల్లు హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మూకలతో పాటు వారికి వెనుక ఉండి ప్రోత్సహించినవారిని, నేరం జరిగుతున్నప్పుడు, జరిగిన తర్వాత నిష్క్రియాపరులై చూస్తూ ఊరుకొన్న పోలీసు తదితర అధికారులను కూడా దోషులుగా చేస్తుంది. ముసాయిదా బిల్లు “లించింగ్” (Lynching – నేరగానిగా ముద్ర వేసి విచారణకు అతీతంగా చంపివేయడం) కు నిర్వచనం ఇచ్చింది. “ఒక పధకం ప్రకారం గానీ, అప్పటికప్పుడు తమంతట తాముగా గానీ న్యాయ విచారణకు అతీతంగా హత్యకు / హత్యలకు పాల్పడే చర్య లేదా చర్యలు లించింగ్ కిందకు వస్తాయి. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ అతనిపై హత్యకు పాల్పడినా లించింగ్ అవుతుంది. దోషిత్వం రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు శిక్షగా విధించబడుతుంది.
పోలీసు అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లు “తాము నిర్వర్తించవలసిన విధిని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించి” ఇలాంటి హత్యల పట్ల చర్య తీసుకోనట్లయితే లేదా హత్యలను నిరోధించడంలో విఫలం అయితే వాళ్ళు గరిష్టంగా ఒక సంవత్సర కాలం జైలు శిక్షకు అర్హులు అవుతారు. అపరాధ రుసుము గానీ జైలు శిక్ష గానీ లేదా రెండూ గానీ అలాంటి అధికారులకు శిక్షగా విధించవచ్చు. బాధితులకు లేదా బాధిత కుటుంబాలకు రు 25 లక్షలకు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించే అవకాశం బిల్లు ముసాయిదాలో కల్పించారు.
“లించింగ్ కు ప్రోత్సాహం ఇచ్చినా, కుట్ర చేసినా” నేరంగా పరిగణించే అవకాశం ముసాయిదాలో ఉన్నది. “మరొక వ్యక్తిని నేరవిచారణ లేకుండా తామే హత్య చేసే చర్యకు జరిగే కుట్ర లేదా కుట్రలలో పాల్గొన్నావారందరూ లేదా హత్యకు ప్రోత్సాహం ఇచ్చినవారందరూ, వాళ్ళు స్వయంగా లించింగ్ లో పాల్గొన్నట్లుగానే పరిగణిస్తూ నేర విచారణ, శిక్ష ఎదుర్కొనాల”ని ముసాయిదా పేర్కొంటున్నది. లించింగ్ నేరంలో పాల్గొన్న వారికి సహాయం చేసినవారిని కూడా శిక్షార్హులే. అలాగే “లించింగ్ ద్వారా వ్యక్తులను శిక్షించేందుకు ఆర్ధిక సహాయం అందించినవారూ” దోషులే. లించింగ్ కోసం అని తెలిసి కూడా డబ్బు సరఫరా చేసి నేరం జరిగేందుకు సహాయపడే అటువంటి వారు గరిష్టంగా మూడు సం.ల జైలు శిక్ష విధించడానికి ముసాయిదా ప్రతిపాదించింది.
సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. “ఇప్పుడు ఉనికిలో ఉన్న చట్టాలలో హత్యను, చట్ట వ్యతిరేకంగా గుమి కూడటాన్ని నేరంగా పరిగణించేందుకు అవకాశం ఉన్నది. కానీ లించింగ్ విషయంలో బాధితులకు నేరంలో పాల్గొనేవారు ఎవరో తెలియదు. బాధితుడి గుర్తింపును బట్టి అతను లించింగ్ కు బలవుతాడు” అని సంజయ్ హెగ్డే అన్నారు. “ఇప్పటి చట్టాలు లించింగ్ కు దారి తీసే (ప్రచారం, చెడ్డవారిగా ముద్రవేయడం లాంటి) పరిస్ధితులను పట్టించుకోవు. అధికార వ్యవస్ధలు, పోలీసులు చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోకపోతే వారిని దొషులుగా ఈ ముసాయిదా నిర్ధారిస్తుంది. లించింగ్ గుంపులో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆ గుంపును రెచ్చగొట్టినవారిని కూడా లించింగ్ కు బాధ్యులుగా గుర్తిస్తుంది” అని హెగ్డే చెప్పారు.
కఠిన చట్టాలు చేస్తే దుర్వినియోగం అవుతాయేమో అని ఏమీ చేయకుండా ఊరుకుని ఉండలేమని హెగ్డే అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్భయ అత్యాచారం అనంతరం మహిళలపై అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టం చేయాలని భావించినప్పుడు కూడా కొందరు ‘దుర్వినియోగం’ అవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారనీ అయినప్పటికీ చట్టం చేశారని అదే విధంగా లించింగ్ లను అరికట్టడానికి కఠిన చట్టం చేయాలని ఆయన చెప్పారు. “రాష్ట్రాలు, పార్లమెంటు ఈ ముసాయిదాను చర్చించి చట్టంగా చేసే బాధ్యతను కలిగి ఉన్నాయి. అంతిమంగా చట్టం చేయవలసింది వారే. వారు చట్టం ఆలోచనే చేయని నేపధ్యంలో మేము ముసాయిదా రూపకల్పనకు నడుం బిగించాం” అని ఆయన తెలిపారు.
“బిల్లును వచ్చే మాన్ సూన్ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టి చట్టంగా చేయాలని కోరుతూ మేము పార్లమెంటు సభ్యుల మధ్య ప్రచారోద్యమం చేపడతాం. పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు వద్దకు మార్చ్ నిర్వహించాలని భావిస్తున్నాం” అని ముసాయిదా బిల్లు కమిటీ నేత సంజయ్ హెగ్డే చెప్పారు.
బిల్లు అంతిమ ముసాయిదాను ప్రకటించే ముందు వివిధ చోట్ల సభలు జరపనున్నారు. ఈ సభలకు హిందూత్వ మూకల చేతుల్లో లించింగ్ లకు గురయిన బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొంటారు. తమ అనుభవాలను వివరిస్తారు. రాజస్ధాన్ లో జైపూర్ లో ఇలాంటి జరగనుంది. ప్రతాప్ ఘర్ లో మునిసిపల్ సిబ్బంది చేతుల్లో లించింగ్ కు గురయిన జాఫర్ ఖాన్ (సిపిఐఎంఎల్ లిబరేషన్ కార్యకర్త) కుటుంబ సభ్యులు జైపూర్ సభలో పాల్గొంటారు (రాజస్ధాన్ బిజేపి ప్రభుత్వ ఆదేశాల మేరకు మునిసిపల్ సిబ్బంది -కమిషనర్ తో సహా- ఉదయాన్ని బహిర్భూమికి వెళ్ళిన మహిళలను ఫోటోలు తీస్తుంటే జఫార్ ఖాన్ అడ్డుకుని ప్రశ్నించాడు. సిబ్బంది ఆయనను వెంటాడి తీవ్రంగా కొట్టి చంపేశారు. గత జూన్ నెలలో ఇది జరిగింది) సికార్ జిల్లాలోని మరో లించింగ్ బాధితుని కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ప్రసంగిస్తారని లించింగ్ వ్యతిరేక ప్రచార కార్యకర్త నదీం ఖాన్ చెప్పారని సబ్ రంగ్ ఇండియా సంస్ధ వెబ్ సైట్ తెలిపింది.
“సిద్ధాంతాలకు భావాలకు అతీతంగా అనేకమంది ఈ గుంపు హత్యాకాండలకు వ్యతిరేకంగా ఒకటవుతున్నారు. చట్టబద్ధంగా దీనిని ఎదుర్కొనడానికి పూనుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ వరకే పరిమితం కాకుండా ప్రతి రాష్ట్రంలో జరిగుతున్న ఈ హత్యలకు వ్యతిరేకంగా కార్యాచరణలోకి దిగడం. బాధితులకు చట్టపరమైన మద్దతు కల్పించడం” అని నదీం ఖాన్ చెప్పారు.
అయితే హిందూత్వ ముఠాలు పాల్పడుతున్న గుంపు హత్యలకు కేవలం చట్టం పరిధిలోనే కారణాలు వెతికితే సరైన పరిష్కారాలు లభించడం కష్టం. ఈ గుంపు హత్యలు జాతీయ స్ధాయిలో, భావజాల స్ధాయిలో, ఆధిపత్యవర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్నవే గానీ ఎవరో కొద్దిమంది ఆవేశానికి గురై చేస్తున్నవి కావు. ఆవేశంతో జరిగే హత్యలయితే గొరక్షణ పేరుతో హత్యలకు పాల్పడుతున్నవారే డబ్బు పుచ్చుకుని ఆవు మాంసం రవాణాకు, పశువుల రవాణాకు స్వయంగా రక్షణ కల్పించెందుకు పూనుకోరు. లోకల్ స్ధాయిలో గొరక్షణ పేరుతో సరికొత్త మాఫియా వృద్ధి చెందుతుండగా ఈ హత్యల ద్వారా దేశంలో ఒక భయానక వాతావరణాన్ని సృశించేందుకు ఆర్‌ఎస్‌ఎస్-బిజేపి సంస్ధలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశంలో అమెరికా, పశ్చిమ బహుళజాతి కంపెనీలకు విచ్చలవిడి ప్రవేశానికి నరేంద్ర మోడి ప్రభుత్వం గేట్లు బార్లా తెరుస్తున్నది. దానితో ప్రజలకు ఉపాధి అవకాశాలు బాగా పడిపోతున్నాయి. ఉన్న ఉపాధి హరించుకుపోతున్నది. కంపెనీలు మూతపడుతూ వాటి వ్యాపారాను బహుళజాతి కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. వీలయితే ప్రత్యక్షంగా వీలు కాకపోతే దొడ్డి దారిన విదేశీ కంపెనీలకు అనువుగా ఆర్ధిక వ్యవస్ధ నడకను మార్చివేస్తున్నారు. ఈ నేపధ్యంలో కార్మికవర్గంతో పాటు మధ్యతరగతి, బుద్ధి జీవులలో కూడా అసంతృప్తి పేరుకుపోతున్నది. వారు క్రమంగా ఆందోళనలకు నడుం బిగిస్తున్నారు. మరోవైపు దళిత ప్రజలు వివిధ రూపాల్లో తమ ప్రతిఘటనను తీవ్రం చేస్తున్నారు. ఈ పరిస్ధితులలో గో రక్షణ ముఠాల ద్వారా వాతావరణాన్ని భయానకంగా, ఉద్రిక్తంగా మార్చివేసి నిరసన గొంతులను అణచివేసేందుకు మోడి ప్రభుత్వం దారులు వెతుకుతోంది. అందులో భాగంగా అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఓ వైపు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని తూలనాడుతూనే వారికి తీసిపోకుండా నిరసన, ప్రతిఘటనలను అణచివేసేందుకు ఉపక్రమిస్తున్నారు. అలాంటి అణచివేతకు గొరక్షణ ముఠాలు ఒక సాధనం. ఈ ముఠాలు భౌతికంగా, మానసికంగా ప్రజలను భయకంపితులను చేస్తూ వారిని మతపరంగా విడగొడుతూ, హిందూత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మెజారిటీ మతస్ధులను నిష్క్రియా పరులుగా, స్పందనారహితులుగా మార్చే కుట్రకు పాల్పడుతున్నారు.
ఈ పరిస్ధితిని గమనించకపోతే నదీం ఖాన్ చెప్పిన ప్రత్యక్ష కార్యాచరణ చట్టం చేయడం వరకే ఆగిపోతుంది. ఇలాంటి ఎన్నో చట్టాలు మృత సమానంగా మిగిలి ఉన్నట్లే హ్యూమన్ సెక్యూరిటీ బిల్లు కూడా కోల్డ్ స్టోరేజిలో ఉండిపోతుంది. కనుక షెహలా రషీద్, నదీం ఖాన్, సమ్ఝయ్ హెగ్డే తదితర ప్రగతిశీల కార్యకర్తలు చట్టం పరిధిని దాటి ప్రజల భౌతిక ప్రతిఘటనను నిర్మించే వైపుగా తమ దృష్టి సారించాలి. అప్పుడే గొరక్షణ ముఠాల వెనుక ఉన్న జాతీయ-అంతర్జాతీయ కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టగలం.
(Report: sabrangindia.in)