ఇంటర్నెట్ లో దళితులపై కువ్యాఖ్యలు నేరం -ఢిల్లీ కోర్టు


ఢిల్లీ కోర్టు ఒక సంచలన తీర్పు ప్రకటించింది. సోషల్ మీడియాలో దళితులపై పెచ్చు మీరుతున్న వివక్షాపూరిత వ్యాఖ్యలు, దూషణలకు చెక్ పెడుతూ ప్రగతిశీల తీర్పు ప్రకటించింది.

తీర్పు ప్రకారం ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కూడా వస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ మొదలైన సోషల్ నెట్వర్క్ వెబ్ సైట్ లలో ఎస్‌సి, ఎస్‌టి కులాలపై వివక్షాపూరిత వ్యాఖలు చేసినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా అది చట్టరీత్యా నేరం అవుతుందని, అలాంటి వారు శిక్షార్హులు అనీ కోర్టు రూలింగ్ ఇచ్చింది.

వ్యాఖ్య చేసిన వారు, బాధితులు ఒకే కుటుంబానికి చెందినవారో లేదా బంధువులో అయితే తప్ప అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని కోర్టు విచారించి శిక్షిస్తుందని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు ద్వారా ఇంటర్నెట్ ప్రపంచంలో అంబేడ్కర్ పేరుతో, రిజర్వేషన్ల వ్యతిరేకత పేరుతో దళితులపై వివక్ష ప్రకటించే అగ్ర కులాల బుద్ధి జీవులకు, మే(తా)ధావులకు కోర్టు చెక్ పెట్టింది. వ్యక్తి స్వేచ్చ పేరుతో, అంతర్జాలంలో అందుబాటులో ఉండే సమీపరాహిత్యాన్ని అడ్డం పెట్టుకుని దళితులపై విద్వేషం, రిజర్వేషన్లపై అక్కసు వెళ్లగక్కే అహంకారులను శిక్షించే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఇద్దరు ఎస్‌సి కులానికి చెందిన ఒక మహిళను స్వయానా ఆమె తోడి కోడలే కులం పేరుతో దూషిస్తూ సోషల్ మీడియాలో (ఫేస్ బుక్) అప్రతిష్టపాలు చేస్తున్న ఉదంతంలో తీర్పు ప్రకటిస్తూ ఢిల్లీ హై కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. బాధితురాలైన ఎస్‌సి మహిళను దూషిస్తున్నది ఆమె తోడికోడలే అయినప్పటికీ ఆమె రాజ్ పుట్ అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడంతో కుల వివక్షకు అవకాశం ఏర్పడింది.

ఇక్కడ బాధితురాలు, నిందితురాలు ఇద్దరూ అన్న దమ్ముల భార్యలు. అనగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులు. కుల వివక్షకు ఎంత దగ్గరి బంధుత్వం కూడా అడ్డు కాదని ఈ ఉదంతం తెలియజేస్తున్నది. దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్న కూతురిని, తోడ బుట్టిన చెల్లెలిని సైతం కత్తులతో నరికి చంపేస్తున్న ఈ రోజుల్లో వివాహం ద్వారా ఏర్పడిన బంధుత్వం కుల వివక్షకు ఏ మాత్రం అడ్డు కాకపోవచ్చు.

షెడ్యూల్డ్ కులాలు & తెగల అత్యాచారాల నిరోధక చట్టం – 1989 ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి లపై సోషల్ వెబ్ సైట్ లలో కుల వివక్షతో కూడిన వ్యంగ్యాలకు పాల్పడడం నేరం అవుతుందనీ, వారు శిక్షార్హులు అవుతారని కోర్టు ప్రకటించింది. చట్టం ఈ తరహా వివక్షా ప్రకటనలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.

ఇరోనీ ఏమిటంటే ఏ వ్యక్తి కేసు వల్ల అయితే ఢిల్లీ కోర్టు ఈ తీర్పు ప్రకటించిందో ఆ తీర్పు ఆ వ్యక్తికి వర్తించకపోవడం. వ్యంగ్య, దూషణ వ్యాఖ్యలు చేసిన వారు బాధితులకు బంధువులు అయినట్లయితే ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఇవ్వవచ్చని తీర్పు పేర్కొన్నది. బాధితురాలు, నిందితురాలు ఇరువురూ తోడికోడళ్ళు కనుక ఈ కేసులో బాధితురాలికి ఉపశమనం లభించబోదన్నది స్పష్టమే.

సోషల్ మీడియా వెబ్ సైట్లలో వ్యంగ్య దూషణలు, వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసినవారు తమ ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా తమ ఖాతాలను దగ్గరి స్నేహితుల వరకే పరిమితం చేసినప్పటికీ వారు శిక్షార్హులే అనీ తీర్పు చెప్పడం గమనార్హం.

కొద్ది సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ వేదికగా ఒక గ్రూపు ఏర్పరిచిన కొందరు వ్యక్తులు మహిళలపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం, వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం, వారు బహిరంగంగా క్షమాపణ కోరడం… మున్నగు పరిణామాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

అప్పుడు కూడా నిందితులు వినిపించిన ఒక డిఫెన్స్ వాదన ఈ తరహాలోనే ఉన్నది. తమ గ్రూపు కొంతమంది వరకే పరిమితమనీ, తమ గ్రూపులో ఎవరికీ ప్రవేశం లేదనీ, కాబట్టి తమ వ్యాఖ్యలు బహిరంగంగా చేసినట్లు కాదనీ వారు వాదించారు. ‘మాలో మేము మాట్లాడుకుంటే అది తప్పెలా అవుతుంది? మా గ్రూపులోకి జొరబడి మా వ్యాఖ్యలను బహిరంగం చేసినవారిదే అసలు తప్పు’ అని వారు వాదించారు.

అలాంటి ట్విస్టెడ్ లాజిక్ లకు ఒప్పుకునేది లేదని ఢిల్లీ హై కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ప్రైవేటు గ్రూపులో చేసినా, చేసింది బహిరంగ వేదికపైనే కాబట్టి చట్టం రీత్యా వారు శిక్షార్హులే అని వక్కాణించింది.

“ఫేస్ బుక్ సభ్యుడు తన ప్రైవసీ సెటింగ్స్ లో ‘ప్రైవేట్’ గా పేర్కొన్నప్పటికీ తన పోస్టు నేరపూరితమైనది అయినట్లయితే వారు శిక్షకు అర్హులే” అని జస్టిస్ విపిన్ సంఘీ తీర్పులో చెప్పారు.

తీర్పులో బంధువులను మినహాయించడం ఒకింత అయోమయాన్ని కల్పిస్తున్నది. ఎందుకంటే ఇద్దరు అన్న దమ్ముల భార్యలు బంధువులు అయినంత మాత్రాన వారిలోని కుల వివక్షతకు మినహాయింపు ఇవ్వడం తర్కబద్ధం కాబోదు. వివాహం జరిగే వరకూ వారు ఒకరికి మరొకరు తెలియని వాళ్ళే. కులాల పరంగా చూస్తే ఒకరు దళితురాలు, మరొకరు అగ్రవర్ణ కులస్ధురాలు. బంధుత్వాన్ని పక్కనపెట్టి బహిరంగంగా కుల దూషణకు పాల్పడటం బట్టే దళిత కులాల పట్ల ఆమెకు ఎంత చిన్న చూపు, విద్వేషం ఉన్నదో స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు కేవలం బాహ్య బంధురికం వలన మినహాయింపు ఇవ్వడం బాధితులకు న్యాయం ఇవ్వకపోవడమే అవుతుంది.

One thought on “ఇంటర్నెట్ లో దళితులపై కువ్యాఖ్యలు నేరం -ఢిల్లీ కోర్టు

  1. వివక్ష ఏ రూపంలోనున్నా,ఎవరివలనైనా అది వివక్షే! గనుక వివక్షకి దగ్గరివాళ్ళు,దూరంవాళ్ళూ అంటూ ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s