సిక్కిం: ఇండియా-చైనా సరిహద్దులో ఉద్రిక్తత, సైన్యం మోహరింపు


Map supplied by China

సిక్కింలో తాజాగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇండియా, చైనా ఇరు దేశాలూ సిక్కింలో సరిహద్దు వద్ద సైన్యాలు మోహరించాయి. ఇండియా  3000 మంది సైనికులను తరలించగా చైనా కూడా అంతే సంఖ్యలో సైనికులను సరిహద్దుకు ఆవల మోహరించింది. భూటాన్, భారత భూభాగంలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నదని ఇండియా ఆరోపించగా అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించి తమ కార్యకలాపాలను అడ్డుకుంటోందని చైనా ఆరోపించింది. ఇండియా ధోరణి ఇరు దేశాల సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఏకాభిప్రాయ స్ఫూర్తికి విఘాతం అని చైనా పత్రిక జిన్ హువా తప్పు పట్టింది.

ట్రై జంక్షన్ వద్ద చైనా ఏక పక్షంగా రోడ్డు నిర్మిస్తున్నదని చైనా, భూటాన్ ల  మధ్య ఒప్పందాలను చైనా ఉల్లంఘించ్చిందని భూటాన్ ప్రభుత్వం ఆరోపిస్తూ ప్రకటన చేసింది. ఇంతకీ భారత సైన్యం భూటాన్ భూభాగం రక్షణగా వెళ్లిందా లేక భారత్  సరిహద్దు రక్షణకు వెళ్లిందా అన్నది స్పష్టం కావటం లేదు.

సిక్కిం రాష్ట్రం మొదటి నుండి భారత దేశంలో భాగంగా లేదు. 1970లలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ, అమెరికా అనుమతి తీసుకుని, సిక్కింపై సైనిక దాడి చేసి భారత భూభాగంలో కలిపేసుకుంది.

సిక్కిం మొదటి నుండి స్వతంత్ర రాజ్యం. రాజు పాలనలో ఉండేది. బ్రిటిష్ పాలకులు కూడా సిక్కింను ఇండియాలో కలపకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యంగా గుర్తిస్తూ ఒప్పందం చేసుకుంది. 1947 అధికార మార్పిడి అనంతరం ఈ ఒప్పందాన్ని గౌరవించే బాధ్యత ఇండియాకు తరలించబడింది. ఇండియాలో విలీనం కోసం 1947లో జరిగిన ఫ్లెబిసైట్ లో సిక్కిం ప్రజలు స్వతంత్రంగా ఉండడానికే ఓటు చేశారు. నెహ్రూ ప్రధాన మంత్రిత్వంలో సిక్కిం ప్రజల నిర్ణయాన్ని నామమాత్రం చేస్తూ రక్షణ, సమాచార, విదేశీ శాఖలను తన నియంత్రణలో ఉంచుకున్నారు. 1975లో జరిగిన మరో ఫ్లెబిసైట్ లో ఇండియాలో కలిసేందుకు ప్రజలు ఓటు వేశారని ప్రకటించి సిక్కిం ను 23వ రాష్ట్రంగా ఇందిర ప్రభుత్వం దేశంలో కలిపేసుకుంది.

సిక్కిం విలీనం వెనుక ప్రపంచాధిపత్య రాజకీయాలు పని చేశాయి. సిక్కిం టిబెట్ లో భాగం అనీ కనుక సిక్కిం చైనాలో భాగం అనీ చైనా వాదనగా ఉండేది. సిక్కింలో ప్రజలు ప్రధానంగా టిబెట్ నుండి వలస వచ్చినవారు. నేపాల్, డార్జిలింగ్ ప్రాంతాల నుండి కూడా వలస వెళ్లారు. అనంతర కాలంలో బౌద్ధ మతం ఆధ్వర్యంలో రాచరికాలు నడిచాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో సిక్కింను స్వతంత్ర రాజ్యంగా కొనసాగించటానికి అమెరికా గట్టి మద్దతు ఇచ్చింది. సిక్కిం ఇండియా నియంత్రణలో ఉంటే అమెరికా అక్కడ వేలు పెట్టకుండా ఉంటుందని రష్యా భావించేది. అమెరికా-రష్యాల మధ్య నడిచిన ప్రచ్ఛన్న యుద్ధం ఆ విధంగా సిక్కిం ప్రజల స్వతంత్రాన్ని హరించివేసింది. 

ఈ చరిత్ర నేపధ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దు నిర్ణయంలో ఘర్షణ, ఉద్రిక్తతలు నెలకొన్నట్లే, సిక్కింలో కూడా ఇండియా చైనాల మధ్య ఘర్షణ నెలకొని ఉన్నది. అయితే సిక్కింకి ఆనుకుని భూటాన్ ఉండడంతో ఈ ఘర్షణలో కొంతవరకు భూటాన్ కూడా ఒక పాత్ర వహిస్తోంది. భూటాన్ వైఖరి, ప్రకటనలు అన్నీ ఇండియాకు అనుకూలంగా ఉంటాయి. భూటాన్-ఇండియాల మధ్య నెలకొన్న ఆర్ధిక సంబంధాల కారణంగా భూటాన్, ఇండియాల మధ్య సానుకూల సంబంధం నెలకొంది. 

తాజా సంక్షోభానికి కారణం సిక్కిం సరిహద్దులో చైనా చేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని భారత సైనికులు నిలిపివేయటం. (కింది మేప్ లను బట్టి భూటాన్, చైనాలు రెండూ తమదిగా చెబుతున్న డాంగ్-లాంగ్ (చైనా) / డోక్లాం (భూటాన్) లోకి భారత సైనికులు మోహరించినట్లు గమనించవచ్చు.) సిక్కిం-భూటాన్-టిబెట్ లు కలుసుకునే జంక్షన్ వద్ద భారత సైనికులు మోహరించడం తోటే చైనా కూడా తన సైనికులను తరలించింది. ఇరు పక్షాలూ క్రమ క్రమంగా సైనికుల సంఖ్య పెంచుతూ పోయాయి. చివరికి ఇరు పక్షాలూ 3,000 మంది చొప్పున సైన్యాన్ని మోహరించాయి. జంక్షన్ వద్ద ఇరు సైన్యాలూ కన్నూ కన్నూ కలిసే దూరంలో మోహరించి ఉన్నాయనీ గత 60 యేళ్లలో ఇంతటి ఉద్రిక్త పరిస్ధితి ఎన్నడూ ఏర్పడలేదని పత్రికలు, ఛానెళ్లు చెబుతున్నాయి.

భారత సైన్యం మొదట ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ లోపు ఇరు సైన్యాలు ఉద్రిక్తతల తగ్గింపు కోసం ఫ్లాగ్ మీటింగులు, చర్చలు జరిపాయి. కానీ ఉద్రిక్తతను ఉపశమింపజేయడంలో విఫలం అయ్యాయి. భారత సైనిక నేత బిపిన్ రావత్ జూన్ 30 తేదీన స్వయంగా ట్రై జంక్షన్ సందర్శించి పరిస్ధితిని సమీక్షించాడు. రావత్ సందర్శనతో ఉద్రిక్తత ఉచ్ఛ స్ధాయిలో ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సిక్కిం-భూటాన్-టిబెట్ లు కలిసే ట్రై జంక్షన్ ప్రాంతాన్ని డోకా లా అంటారు. ఇక్కడ చైనా దృఢమైన రోడ్డు నిర్మించ తలపెట్టడంతో కొంత కాలంగా చైనా, ఇండియా సైన్యాల మధ్య అడపా దడపా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. రోడ్డు దృఢత్వాన్ని బట్టి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా) భవిష్యత్తులో ఇక్కడ రాకపోకలు పెంచనున్నట్లు స్పష్టం అయింది. దానితో భారత సైన్యం అప్రమత్తమై రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. చైనా అధికార పత్రిక జిన్ హువా ప్రకటనతో ఈ సంగతి మరింత స్పష్టం అయింది.

వాస్తవాధీన రేఖను (ఎల్‌ఏ‌సి – లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) చైనా ఉల్లంఘించ్చిందని ఇండియా ఆరోపిస్తున్నది. ఎల్‌ఏ‌సి యే ప్రస్తుతం తూర్పు సెక్టార్ లో తాత్కాలిక సరిహద్దు రేఖగా చలామణి అవుతున్నది. చైనా సైన్యం ఈ రేఖను దాటి ఇండియా నిర్మించిన తాత్కాలిక బంకర్లను ధ్వంసం చేసిందని ఇండియా చెబుతున్నది.

సిక్కిం సరిహద్దు వద్ద మోటారు వాహనాలు ప్రయాణం చేయగల రోడ్డును నిర్మించడానికి తాము అనుమతించేది లేదని భారత సైన్యం ప్రకటించింది. రోడ్డు నిర్మిస్తే అది చైనా సైనికుల కోసమే అని భారత్ అంచనా. అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా లోపలి ప్రాంతం జన సమ్మర్దం అతి తక్కువ. ఇలాంటి చోట 40 టన్నుల బరువు తూగే వాహనాలు తిరిగే విధంగా దృఢమైన రోడ్డు నిర్మించడం సమ్మతం కాదని భారత సైనికాధికారులు చెప్పారు. ఈ రోడ్డు పైన తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఫిరంగి వాహనాలు మొ.వి తిరిగేంత సామర్ధ్యం ఉన్నదని వారు చెప్పారు.

ఇది కేవలం ఇండియా – చైనాల మధ్య చెలరేగిన రగడ మాత్రమే అయితే ఇంత ఉద్రిక్తత నెలకొనదు. అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న ఆధిపత్య వైఖరి వల్లనే ఇండియా – చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెచ్చు మీరు తున్నాయి. చైనా ఆర్ధిక వనరులను కట్టడి చేసి దాని వ్యాపార విస్తరణను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుండగా  బెల్ట్ & రోడ్ (వన్ బెల్ట్ వన్ రోడ్) వెంబడి రోడ్డు, రేవు పట్టణాలను అభివృద్ధి చేయడం ద్వారా తన అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తున్నది.

దక్షిణ చైనా సముద్రం, చైనా-ఇండియా సరిహద్దు, చైనా – పాకిస్తాన్ సరిహద్దు, కాశ్మీర్ సమస్య, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సి‌పి‌ఈ‌సి), హిందూ మహా సముద్రం, బలూచిస్తాన్, అరేబియా సముద్రం ఉత్తర తీరం…. ఇలా పలు చోట్ల అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. చైనా సహితం తన వాణిజ్యాన్ని కాపాడుకునే క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. అయితే చైనా దూకుడు ఇప్పటివరకూ ఏ దేశం పైనా ఆధిపత్య ధోరణిగా పరిణమించలేదు. అలాగని భవిష్యత్తులో చైనా నుండి ఇదే సంయమన ధోరణి కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. కానీ రోజు రోజు కీ ప్రభావం కోల్పోతున్న అమెరికా రెట్టింపు దూకుడు, ఆధిపత్యాలను అమలు చేస్తూ ఇండియా లాంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి చైనాతో ఘర్షణ పడేలా రెచ్చగొడుతోంది. ఇది అంతిమంగా ఇండియా లాంటి దేశాల ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నది.

కనుక భారత ప్రజలు అటు అమెరికా అహంకార, ఆధిపత్య ధోరణిని ప్రధానంగా టార్గెట్ చేయాలి. అలాగే చైనా విస్తరణవాద ధోరణిని తిరస్కరించాలి. అమెరికా, చైనా పోటేళ్ళ మధ్య ఘర్షణను ఇండియా పైకి కూడా మరలిస్తున్న భారత దళారీ పాలకుల లొంగుబాటు విధానాలను దుయ్యబట్టాలి. మరీ ముఖ్యంగా ఇండియా-చైనా, ఇండియా-పాకిస్తాన్ ల మధ్య శాశ్వత సరిహద్దు ఏర్పాటు చేయడానికి తక్షణమే చర్చలు ప్రారంభించాలని భారత పాలకులపై ఒత్తిడి తేవాలి. అలా కాకుండా భారత పాలకులు ఎలా రెచ్చగొడితే అటు వైపు ఆలోచన లేకుండా కొట్టుకుపోయినట్లయితే అది అంతిమంగా భారత పాలకవర్గాలకు, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు మాత్రమే లాభం కలుగుతుంది. ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

4 thoughts on “సిక్కిం: ఇండియా-చైనా సరిహద్దులో ఉద్రిక్తత, సైన్యం మోహరింపు

  1. ఈ సమయంలో/ఎప్పటికీ కూడా మనమంతా/మన దేశస్తులంతా కూడా చైనా వస్తువుల వాడకం తగ్గించడం చాలా మంచి పని

  2. “సిక్కింని కలుపుకున్నాక మాత్రమే ఈశాన్య భారతానికి భారత దేశం ప్రధాన భూభాగానికి భూమార్గం ద్వారా సంబంధం ఏర్పడింది. అప్పటి వరకూ ఇరు భూ భాగాలు నేల ద్వారా కలిసి ఉండేవి కావు.” Please verify this statement as north east india is connected through siliguri corrodor in west bengal.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s