నిజం క్రమంగా బైటికి వస్తోంది. రష్యా హ్యాకింగ్ విషయమై తాము చెప్పినదానికి ఆధారాలు లేవని ఒక్కో అమెరికా మీడియా కంపెనీ లెంపలు వెసుకుంటూ ముందుకు వస్తున్నాయి.
అమెరికా ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందనీ, హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా అమెరికా ఎన్నికలను హ్యాక్ చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందేందుకు రష్యా హ్యాకింగ్ తోడ్పడిందనీ ఇన్నాళ్లూ తాము చేసిన ప్రచారం అంతా ఒట్టిదేనని అమెరికా మీడియా సంస్ధలు ఒప్పేసుకుంటున్నాయి.
“రష్యా హ్యాకింగా? అబ్బే అదంతా ఒట్టి చెత్త, టిఆర్‌పి రేటింగ్ కోసమే మేము అదంతా చేశాం” అని వారం రోజుల క్రితం ఒప్పేసుకుంటూ రహస్య కెమెరాకు దొరికిపోయాడు సిఎన్‌ఎన్ వార్తా సంస్ధ ప్రొడ్యూసర్ జాన్ బొనిఫీల్డ్!
“అమెరికా ఎన్నికలను పూర్తిగా హ్యాక్ చేయడంలో రష్యాదే బాధ్యత అని జూన్ 25 న్యూస్ లో మేము రాసిందంతా నిజం కాదు. అమెరికా ఎన్నికలను రష్యా హ్యాక్ చేసిందన్న విషయంలో అమెరికా గూఢచార సంస్ధలు మొత్తం పదిహేడూ ఏకాభిప్రాయంతో ఉన్నాయని మేము రాశాము. కానీ వాస్తవంలో కేవలం 4 సంస్ధలు (సిఐఏ, ఎఫ్‌బిఐ, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌ఏ) మాత్రమే హ్యాకింగ్ జరిగిందని చెప్పాయి. మిగిలిన 13 సంస్ధలూ ఈ అభిప్రాయాన్ని కలిగి లేవు” అని న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్ధ జూన్ 29 తేదీన ప్రకటించింది.
“ఏప్రిల్ 6, జూన్ 2, జూన్ 26, జూన్ 29 తేదీలలో మొత్తం 17 అమెరికా గూఢచార సంస్ధలూ ‘అమెరికా 2016 ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కృషి చేసింద’ని చెప్పడంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నాయని మేము రాసాము. ఆ అంచనా మూడు అమెరికా గూఢచార సంస్ధలు ఎఫ్‌బిఐ, సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ లు సేకరించిన సమాచారంపై ఆధారపడి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్ (డిఎన్‌ఐ) ప్రచురించింది. మొత్తం 17 సంస్ధలూ ఈ నిర్ణయానికి రావడంలో కలిసి లేవు” అని అసోసియేటెడ్ ప్రెస్ సంస్ధ ప్రకటించింది. “వివరణ” పేరుతో ఏపి రష్యా టుడే వార్తా సంస్ధకు ఈ సంగతి తెలిపింది.
రష్యా-గేట్ గా ప్రాచుర్యం పొందిన ‘అమెరికా ఎన్నికల రష్యా హ్యాకింగ్’ స్టోరీ అంతా ఒట్టి కాకమ్మ కధే అని అమెరికా మీడియా ఈ విధంగా స్పష్టం చేసేసింది. రష్యా గెట్ లో ప్రధాన అంశం డిఎన్‌ఐ అధిపతి డేవిడ్ క్లాపర్ ప్రచురించి పత్రికలకు విడుదల చేసిన పత్రమే.
అమెరికా లోని 17 గూఢచార సంస్ధలను డిఎన్‌ఐ సమన్వయం చేస్తుంది. కాబట్టి డిఎన్‌ఐ చేసిన రష్యా గేట్ ప్రకటనను మొత్తం 17 గూఢచార సంస్ధలకు ఆపాదిస్తూ అమెరికా మీడియా ఒట్టి బూటకపు వార్తలను, కధలను ప్రచారంలో పెట్టాయి. ఈ కధల్ని నమ్మడానికి అమెరికా ప్రజలు ఇప్పటికీ సిద్ధపడకపోవడంతో ఒక్కో మీడియా కంపెనీ తాము చేసిన దుష్ప్రచారాన్ని వెనక్కి తీసుకుంటున్నాయి.
అసలేం జరిగింది? హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా 4 యేళ్ళు పని చేసిన కాలంలో ప్రైవేటు కంప్యూటర్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించింది. ప్రభుత్వ రహస్యాలన్నీ ప్రైవేటు ఈ మెయిల్ సర్వీస్ ద్వారా నిర్వహించింది. తీరా ఆమె కంప్యూటర్ కాస్తా హ్యాకింగ్ కి గురి కావడంతో అమెరికా ప్రతిష్ట మంట గలిసింది.
అలాగే ఎన్నికల సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన కంప్యూటర్ గూడా హ్యాకింగ్ కి గురయింది. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలలో హిల్లరీపై పోటీ చేసిన బెర్నీ శాండర్స్ ఓడిపోయే విధంగా ప్రైమరీ ఎన్నికలను మేనిపులేట్ చేసిన సంగతి వెల్లడి అయింది. ఇది ప్రైమరీ ఎన్నికలు ముగిశాక వెల్లడి అయినప్పటికీ తప్పు సరిదిద్దడానికి ప్రయత్నాలు జరగలేదు. అప్పటికే హిల్లరీ అభ్యర్దిత్వానికి బెర్నీ శాండర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన మద్దతుదారుల పరువు గంగలో కలిపేశాడు. అయితే హిల్లరీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణకు పూనుకోవడం వల్లనే తాను ఓడిపోయానని హిల్లరీ ఎన్నికల అనంతరం వాపోయింది.
డిఎన్‌సి (డెమోక్రటిక్ నేషనల్ కమిటీ) కంప్యూటర్ హ్యాకింగ్ వెనుక రష్యా ఉందని అప్పటి నుండీ అమెరికన్ మీడియా ఊకదంపుడు ప్రచారం మొదలు పెట్టింది. ట్రంప్ ఎన్నిక సక్రమం కాదని ప్రచారం చేసే లక్ష్యంతో ఈ ప్రచారానికి అమెరికా మీడియా దిగిందనీ ఇందులో అసలు వాస్తవం లేదని డిసెంబర్ 2016 లోనే బ్రిటిష్ గూఢచార సంస్ధ మాజీ అధికారి ఒకరు స్పష్టం చేశాడు. ఆయన చెప్పిన అంశాన్నే ధృవీకరిస్తూ అమెరికా మీడియా బహిరంగంగా ముందుకు వచ్చింది.
సద్దాం హుస్సేన్ దగ్గర సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాక్ పై యుద్ధానికి వెళ్లారు. యుద్ధం తర్వాత కూడా ఒక్క బాంబూ అమెరికా చూపెట్టలేదు. ఆనక ‘ఇరాక్ పై దాడి పొరపాటు’ అని మీడియా, గూఢచార సంస్ధలు ఒప్పుకున్నట్లు నటించాయి. వారికి కావలసిన పని ముగిశాక ఎన్ని ఒప్పుకోళ్ళు జరిగినా ఇరాక్ ప్రజల వర్తమానం, భవిష్యత్తు అప్పటికే సర్వ నాశనం అయింది.
లిబియా నేత గడాఫీ తన ప్రజలను తానే బాంబులతో చంపేయడానికి సైన్యంతో తూర్పు లిబియా తరలి వస్తున్నాడని అమెరికా పెద్ద పెట్టున ప్రచారం చేసింది. గడాఫీని నిలువరించాలంటే లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అవసరం అని ఐరాస అనుమతి సంపాదించాయి. అప్పటి నుండి యుద్ధ విమానాలతో, భారీ బాంబులతో, విధ్వంసక క్షిపణులతో లిబియా ప్రజా నిర్మాణాలన్నింటినీ ధ్వంసం చేశారు. లిబియాను టెర్రరిస్టు ముఠాలకు అప్పజెప్పారు. దేశం కుక్కలు చింపిన విస్తరి అయింది.
ఈజిప్టులో ‘వసంత విప్లవం’ అన్నారు. అసంతృప్త ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటులో పాల్గొన్నారు. నియంత ప్రభుత్వం కూలిపోయింది అన్నారు. హోస్నీ ముబారక్ ను జైలులో పెట్టామన్నారు. ముస్లిం బ్రదర్ హుడ్ ఎన్నికల్లో గెలిచిందన్నారు. ఇంతలోనే సైనిక తిరుగుబాటు జరగడం, దేశం తిరిగి సైన్యం చేతుల్లోకి వెళ్ళడం జరిగిపోయింది. నియంత ముబారక్ జైలు నుండి ఎంచక్కా విడుదలయ్యాడు. వసంత విప్లవం వల్లకాటికి పోయింది. అమెరికా ఆధిపత్యం మాత్రం కొనసాగుతూనే ఉంది.
అదే రీతిలో సిరియాలో తిరుగుబాటు అన్నారు. టెర్రరిస్టులని దించారు. ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆల్-నూస్రా బ్రాండ్ తొడిగారు. కిరాయి మూకలని కూడగట్టి ‘ఇసిస్’ అన్నారు. సిరియా అధ్యక్షుడు తన ప్రజల్ని తానే చంపుతున్నాడు అన్నారు. వాస్తవంలో అమెరికా, గల్ఫ్ రాజ్యాల మద్దతుతో టెర్రరిస్టు ఆల్-నూస్రా, ఇసిస్ లే సిరియాలో నరమేధం సృష్టిస్తున్న సంగతిని రష్యన్ మీడియా, స్వతంత్ర మీడియా ససాక్ష్యాలతో వెల్లడి చేసింది.
అమెరికన్ కార్పొరేట్ మీడియా ఒట్టి అబద్ధాల పుట్ట. అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చే పని ముట్టు. అమెరికా కంపెనీల ప్రయోజనాలే దానికి పరమావధి, నిజాలు చెప్పడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, ప్రజల తరపున ప్రభుత్వాలని నిలదీయడం… ఈ కర్తవ్యాలు అమెరికా మీడియాకు లేనే లేవు. అమెరికా ఆధిపత్య అవసరాలు తీర్చే విధంగా బూటకపు వార్తలు సృష్టించడమే దాని పని.
కనుక, పశ్చిమ మీడియాను ముఖ్యంగా అమెరికన్ మీడియాను దాని వార్తలు, విశ్లేషణలను నమ్మనేవద్దు. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతాం. అమెరికన్ మీడియా వార్తల్లో నిజాల కోసం దుర్భిణీ పెట్టి వెతకాలి.
పింగ్‌బ్యాక్: రష్యా-ట్రంప్ కుమ్మక్కు ఆర్టికల్స్ తొలగించిన న్యూస్ వీక్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ