చెమటకు జెండర్ లేదు –’శ్రామిక’ ముందు మాట


(ప్రగతిశీల మహిళా సంఘం -AP- రాష్ట్ర మహా సభల సందర్భంగా వారి మాస పత్రిక ‘మాతృక’ 5 పుస్తకాలు విడుదల చేసింది. వాటిల్లో ‘శ్రామిక’ ఒకటి. ‘శ్రామిక’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది. -విశేఖర్)

*********

మానవ సమాజం వినియోగిస్తున్న సమస్త సరుకులు శ్రమతో తయారైనవే అన్నది తెలిసిన విషయమే. ప్రకృతిలో భాగంగా అందుబాటులో ఉన్న భూమి, అడవులు, ఖనిజాలు, నీరు తదితర సహజ వనరులపైన మనిషి శ్రమ చేస్తే పుట్టినదే వస్తు సేవల ప్రపంచం. చివరికి పరిశ్రమల స్థాపనలో ఒక దినుసు అయిన డబ్బు (పెట్టుబడి) కూడా మానవ శ్రమ లేకుండా ఉనికిలోకి రాదు. కనుక సహజ వనరులు తప్ప ఈ భూ ప్రపంచం పైన కనిపించే ప్రతి ఒక్కటి మనిషి శ్రమ ఫలితం. ఖచ్చితంగా చెప్పాలంటే కష్ట జీవుల కష్ట ఫలితం. ఇందులో ఏ ఒక్కరి లేదా ఏ ఒక్క వర్గం యొక్క మాయ గానీ, ప్రతిభ గానీ లేనే లేవు. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం ఎంత సత్యమో వస్తు సేవల ప్రపంచం శ్రమ జీవుల శ్రమ ఫలితం అన్నది అంత సత్యం.

పశ్చిమ సామ్రాజ్యవాద రాజ్యాలు, బహుళజాతి కంపెనీలు వారికి మద్దతుగా ఉన్న ఐ‌ఎం‌ఎఫ్, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటిఓ మొ. న అంతర్జాతీయ సంస్థలు అనేక యేళ్లుగా తెచ్చిన ఒత్తిడి మేరకు భారత పాలకవర్గాలు పార్టీలకు అతీతంగా ఏకమై ఇటీవల వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – జి‌ఎస్‌టి) ను చట్టంగా ఆమోదించారు. కాంగ్రెస్ (యూ‌పి‌ఏ) హయాంలో ప్రారంభం అయిన జి‌ఎస్‌టి యజ్ఞం మోడి / ఎన్‌డి‌ఏ హయాంలో పరిపూర్తి అయింది. జి‌ఎస్‌టి చట్టాన్ని జులై 1, 2017 తేదీ నుండి అమలు చేయబోతున్నారు. ఈ వస్తు సేవల పన్ను ద్వారా భారత పాలకవర్గాలు, వారిని అడ్డం పెట్టుకుని దేశంపై పడి మేస్తున్న సామ్రాజ్యవాద కంపెనీలు తమ దోపిడీని మరింత తీవ్రం చేసేందుకు పధకం వేశారు.

అనేక రకాల రాష్ట్ర మరియు కేంద్ర పన్నులతో కూడిన భారత పన్నుల వ్యవస్థను సులభతరం (simplify) చేయడమే జి‌ఎస్‌టి లక్ష్యం అని పాలకులు చెబుతున్న మాట. వాస్తవం అందుకు విరుద్ధం. దేశంలో వివిధ దశలలో విధించిన అరకొర పన్నులు దేశీయ మార్కెట్ కు ఎంతో కొంత రక్షణగా ఉన్నాయి. ఈ రక్షణలను తొలగించి దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశించి మార్కెట్లను, వనరులను కొల్లగొట్టుకుని పోయే అవకాశాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు కల్పించడమే జి‌ఎస్‌టి అసలు లక్ష్యం. అనగా భారత ప్రజలకు చెందిన సహజ వనరులను, దేశంలోని కష్ట జీవుల కష్ట ఫలితం అయిన వస్తు సేవల ప్రపంచాన్ని ఇష్టారీతిన దోచుకునేందుకు జి‌ఎస్‌టి రాచబాట పరిచింది.

హిందూ ఛాందస సంస్కృతిని, కుల-లింగ అసమానతలను గొప్పగా చిత్రించి చూపే తెలుగు సినిమా దర్శకుడు కె విశ్వనాధ్ ను తెలుగు సినిమా రంగం ‘కళా తపస్వి’ అంటూ గౌరవిస్తుంది. ఆయన ఒక సినిమాలో “ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి” అని ఓ పాత్ర చేత చెప్పిస్తాడు. కూతురు వయసులో ఉన్న హీరోయిన్ ను కామంతో చూస్తూ అత్యాచారం చేయటానికి ప్రయత్నించే విలన్ చేత ఈ మాటలు చెప్పించడం గమనించ వలసిన విశేషం. ఈ పోలికను భావ వాద కవులు, హిందూ సంస్కృతికి కాపలాగా తమను తాము నియమించుకున్న కవులు, హిందూత్వ రాజకీయులు ఎంతో ఇష్ట పడతారు. సాధారణ అర్ధంలో కూడా ఈ పోలికకు అభిమానులు ఎక్కువే. మానవ వినియోగానికి ప్రకృతి దైవికంగా అందుబాటులో ఉన్నట్లే స్త్రీ కూడా పురుషాధిక్య సమాజ వినియోగానికి అందుబాటులో ఉన్నదని లేదా ఉండాలని ఈ పోలిక ఉద్దేశం. హిందూత్వ కుట్రల గురించి పట్టని అమాయక జనం ఈ పోలికకు ఏవో సమర్థనలు ఇచ్చుకున్నప్పటికీ ఈ పోలికలోని గూఢార్థం మాత్రం ఇదే.

ఈ పోలిక వ్యాపార ప్రపంచానికి కూడా ఎంతో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ‘పోలిక’ గానే వారికది ఇష్టం అని కాదు. ఆ పోలిక ఉనికిలోకి వచ్చేందుకు పునాదిగా పని చేసే పురుషాధిక్య శ్రమ మరియు వినియోగ వ్యవస్ధ ద్వారా వారికి లభించే ఆర్ధిక ప్రయోజనాలు వారికి ఇష్టం. బహుళజాతి కంపెనీల నుండి రోడ్డు పక్క రిటైల్ షాపుల వరకూ ఈ ‘ప్రకృతి-స్త్రీ’ భావజాలం ద్వారా లబ్ది పొందుతున్నారు. కార్మిక రాజకీయాల భాషలో చెప్పాలంటే ‘అసమాన వేతన వ్యవస్ధ’ కు పునాది ‘పురుషాధిక్య వ్యవస్ధ’ కాగా దానిని న్యాయబద్ధం (legitimise) చేసేది ‘ప్రకృతి-స్త్రీ’ భావజాలం. ఉత్పత్తి సాధనాలపైన పురుషులకు ఉన్న గుత్తాధిపత్యం పురుషాధిక్య వ్యవస్థకు పునాది.

ప్రకృతికి నోరు లేదు. ప్రకృతికి చెప్పకుండా ప్రకృతి అనుమతి లేకుండా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నీళ్ళు, చమురు, ఖనిజాలు, అడవులు… ఇలా సమస్త వనరులనూ కొల్లగొట్టవచ్చు. దానికి రక్షణ కల్పించే బాధ్యత నెత్తిమీద వేసుకోనవసరం లేదు. మేఘ మధనం, జియో ఇంజనీరింగ్ లాంటి కృత్రిమ ప్రయోగాలతో ప్రకృతిని చిత్రవధ చేయవచ్చు. పెట్టుబడి లాభార్జన కోసం విచ్చలవిడిగా ప్రకృతిని కొల్లగొట్టిన ఫలితంగా అకాల వర్షాలు-వరదలు, ఉష్టోగ్రతలు పెచ్చు మీరితే ‘ప్రకృతి ఆగ్రహం’ అంటూ నెపాన్ని తిరిగి ప్రకృతి పైకే నెట్టివేయవచ్చు.

ఈ పరిస్ధితిని ప్రకృతితో పోల్చబడుతున్న స్త్రీలకు అన్వయించండి! ఇంట్లో ఎంత పని ఉంటే అంత పనీ నోరెత్తకుండా చెయ్యాలి. బైటికి వెళ్ళి పని, ఉద్యోగం చేసేవారైనా ఇంటి పని చెయ్యాల్సిందే. భర్త, మామ, కొడుకు, బావ, మరిది.. ఇలా అందరూ స్త్రీ పైన పెత్తనం చెయ్యడానికి అవకాశం ఉన్నది. రోగం వచ్చినా, అలసిపోయినా పనిలో సేవలలో తేడా ఉండకూడదు. విశ్రాంతి కోరకూడదు. అందరూ పడుకున్నాక పడుకోవాలి. అందరూ తిన్నాక తినాలి. ఇంటి గౌరవంతో పాటు సమాజ గౌరవం కాపాడాలి. సంస్కృతి పక్కకు మళ్లకుండా, కొత్త పోకడలు పోకుండా పరిరక్షించాలి. ఇన్ని చేసినా ఆడది అబల కనుక, సున్నిత శరీరురాలు కనుక పురుషునితో సమానమైన శక్తి ఉండదు కనుక పురుషుడి కంటే తక్కువ వేతనానికి మాత్రమే ఆమెకు అర్హత ఉన్నది. ఇదీ ప్రకృతి-స్త్రీ భావజాలం లోని పరమార్థం. ఇది అర్ధం కావడానికి చారిత్రక పరిణామ క్రమంలో స్త్రీ-పురుష సంబంధాలలో -అటు ఉత్పత్తి సంబంధాల పరంగానూ, ఇటు సామాజిక సంబంధాల పరంగానూ- చోటు చేసుకున్న మార్పులను అధ్యయనం చేయాలని సూచించడం తప్ప ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి అర్ధం చేయించగల విషయం కాదది.

మానవ సమాజానికి నాగరికత నేర్పిన మొట్టమొదటి ఉత్పత్తి సాధనం భూమి. అస్ధిర వ్యవసాయంగా ప్రారంభమై స్థిర వ్యవసాయం స్థాయికి అభివృద్ధి చెందిన దరిమిలా మానవ నాగరికత పెద్ద పెద్ద అంగలతో పురోగమించింది. ఈ భారీ పురోగమనానికి పునాది వేసిన వ్యవసాయాన్ని ఆవిష్కరించినది స్త్రీలే అని డి డి కోశాంబి లాంటి చరిత్రకారులు అంచనా వేశారు. చరిత్ర రచన (historiography) మరింత అభివృద్ధి చెందిన నేపధ్యంలో ఈ అవగాహనలో స్వల్ప మార్పులు వచ్చినప్పటికీ వ్యవసాయాన్ని కనిపెట్టడంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషించారనడంలో చరిత్రకారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతిని అనుసరించి, అనుకరించి వ్యవసాయాన్ని ఆవిష్కరించిన స్త్రీ నేడు అదే ప్రకృతితో సమానంగా విచ్చలవిడి దోపిడీకి, అణచివేతకు గురి కావడం దేన్ని సూచిస్తున్నది? మానవ నాగరికత ముందుకు ప్రయాణిస్తున్నదా లేక వెనుకకా?

ఈ సంగతి మహిళా సంఘాలు కల్పించి చెబుతున్నదని భావిస్తే తప్పులో కాలు వేసినట్లే. అమెరికాకు చెందిన ప్రసిద్ధ బహుళజాతి మార్కెట్ విశ్లేషణా సంస్థ అయిన మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2016లో ఒక ముఖ్యమైన విశ్లేషణ ప్రచురించింది. ప్రపంచ మరియు వివిధ దేశాల జి‌డి‌పి (స్థూల దేశీయోత్పత్తి) లలో ప్రస్తుతం ఉన్న స్త్రీల వాటాను లెక్కిస్తూ, స్త్రీలకు వారి శక్తియుక్తులకు, సామర్ధ్యానికి తగినట్లుగా అవకాశాలు కల్పిస్తే ప్రపంచ జి‌డి‌పి, భారత జి‌డి‌పి ఎంత ఉన్నత స్ధాయిలో నమోదు అవుతుందో ఈ విశ్లేషణ నిగ్గు దేల్చింది. స్త్రీల-పురుష సమానతను జెండర్ ప్యారిటీ స్కోర్ ద్వారా అంచనా వేసిన నివేదిక ప్రపంచం లోని మరే ఇతర ప్రాంతంతో పోల్చినా భారత దేశంలో స్త్రీలకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపింది.

నివేదిక ప్రకారం: భారత ఆర్ధిక వృద్ధితో పోల్చితే లైంగిక సమానత్వం చాలా వెనుకబడి ఉన్నది. 1. పనిలో లైంగిక సమానత 2. న్యాయ రక్షణ మరియు రాజకీయాల్లో స్ధానం 3. భౌతిక భద్రత మరియు స్వయం ప్రతిపత్తి.. ఈ మూడింటిలో భారత దేశంలో లైంగిక అసమానత తీవ్ర (high) స్ధాయిలో మరియు అత్యంత తీవ్ర (extremely high) స్ధాయిలో ఉన్నది. నాల్గవ అంశం అయిన ‘అత్యవసర సౌకర్యాలు మరియు ఆర్ధిక అవకాశాలు’ అంశంలో లైంగిక అసమానత మధ్య స్థాయి నుండి తీవ్ర స్థాయి వరకు నెలకొని ఉన్నది. ఘోరం ఏమిటంటే స్త్రీలపైన అత్యంత అమానుషమైన దురాచారాలు వ్యాప్తిలో ఉన్న కొన్ని ఆఫ్రికా దేశాలలో కంటే భారత దేశంలో జి‌డి‌పిలో స్త్రీలకు తక్కువ వాటా (17%) ఉన్నది. ప్రపంచ సగటు 37% కాగా చైనాలో 41%, సబ్-సహారా ఆఫ్రికాలో 39%, లాటిన్ అమెరికాలో 33% వాటా స్త్రీలు కలిగి ఉన్నారు. ఇండియాలో మొత్తం శ్రామికుల్లో 24% మాత్రమే మహిళలు. ప్రపంచ సగటు 40% తో పోల్చితే ఇది చాలా తక్కువ. స్త్రీలపైన తీవ్రమైన పరిమితులు, సామాజిక నిబంధనలు అమలులో ఉన్న ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలతో సమానంగా ఇండియాలో స్త్రీల శ్రమకు గుర్తింపు, గౌరవం లభిస్తున్నది. స్త్రీలు చేస్తున్న శ్రమలన్నీ ఇక్కడ పరిగణలో లేవన్నది గమనించాలి.

నివేదికలోని ముఖ్యమైన అంశం: భారత మహిళలు మార్కెట్ ఎకానమీలోని పెయిడ్ వర్క్ లో (మార్కెట్ మారకంలోకి రాని గృహ శ్రమ, సేవల శ్రమలు కాకుండా మారకంలోకి వచ్చే శ్రమలలో) పురుషులతో సమానంగా పాల్గొంటే 2025 నాటికి భారత జి‌డి‌పి అదనంగా 2.9 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. (ప్రస్తుత జి‌డి‌పి 2 ట్రిలియన్లు.) ఇది 60 శాతం పెరుగుదలకు సమానం. ప్రపంచలోని మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పిస్తే ప్రపంచ జి‌డి‌పి 28 ట్రిలియన్ డాలర్లు అదనంగా (26%) నమోదవుతుంది. అనగా పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పిస్తే అత్యధికంగా లాభపడేది ఇండియాయే. మరే ఇతర దేశానికీ 60 శాతం అదనపు జి‌డి‌పి నమోదు కాబోదు. భారత దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానత అత్యంత తీవ్రంగా ఉన్నదనడానికి ఇంకా రుజువులు కావాలా?

మార్కెట్ లోకి మారకంలోకి రాని స్త్రీల శ్రమలను విశ్లేషిస్తూ మెక్ కిన్సే నివేదిక మరో ముఖ్యమైన విషయం చెప్పింది. వంట పని, శుభ్రం చేసే పని, పిల్లల పెంపకం, వృద్ధులకు ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేయడం మొ.న శ్రమలకు చెల్లింపులు ఉండవు. ప్రపంచ స్ధాయిలో ఇలాంటి చెల్లింపుకు నోచుకోని శ్రమలు స్త్రీలు పురుషుల కంటే 3 రెట్లు అధికంగా చేస్తున్నారు. భారత దేశంలోని స్త్రీలు మరింత తీవ్రంగా 9.8 రెట్లు చేస్తున్నారు. ఈ శ్రమను పరిగణిస్తే భారత జి‌డి‌పికి ఇప్పుడు 0.3 ట్రిలియన్ డాలర్లు అదనంగా కలుస్తుంది. చిత్త శుద్ధి ఉంటే చెల్లింపులు లేని శ్రమలను సామాజిక శ్రమలుగా మార్చి స్త్రీలను పూర్తిగా మారకం శ్రమలలోకి ప్రవేశపెట్టవచ్చు. లేదా స్త్రీలు చేస్తున్న శ్రమలను మార్కెటీకరించడం ద్వారా (కొన్ని పశ్చిమ దేశాల్లో ఇది జరుగుతోంది.) మారకం శ్రమలుగా చేయవచ్చు. కానీ అలా చేస్తే కంపెనీలు తమ లాభాల వాటా తగ్గించుకోవలసి వస్తుంది. కనుకనే పురుషాధిక్య వ్యవస్ధ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు ఎంతో ముద్దు.

‘బానిసకొక బానిసవోయ్ బానిసా!’ అంటూ మహాకవి శ్రీ శ్రీ స్త్రీల పరిస్ధితిని కళ్ళకు కట్టారు. రాజ్యం అండతో ప్రకృతిని విచ్చలవిడిగా కొల్లగొట్టి ఉత్పత్తి చేస్తున్న వస్తువులపైనా, అశేష శ్రామిక ప్రజలు సంఘటిత, అసంఘటిత రంగంలో అందజేస్తున్న సేవల పైనా వసూలు చేసే వస్తు సేవల పన్ను ద్వారా దేశాన్ని, శ్రామిక ప్రజానీకాన్ని మరింత కొల్లగొట్టేందుకు జి‌ఎస్‌టి ద్వారా మార్గం వేసుకున్న నేపధ్యంలో బానిసకొక బానిసయిన స్త్రీ రెట్టింపు తీవ్రతతో దేశీయ, సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతలకు గురి కానున్నది.

పెయిడ్ వర్క్ ద్వారా పురుషులు ప్రత్యక్ష దోపిడీకి గురవుతుంటే స్త్రీలు ఇంటా బయటా శ్రమ చేస్తూ రెండిందాల దోపిడీకి గురి అవుతున్నారు. స్త్రీలు చేస్తున్న ఇంటి పని మార్కెట్ లో మారకంలోకి రాకపోవచ్చు గానీ, ఆ ఇంటి పని ద్వారా సేద తీరి, సుఖపడి తదుపరి శ్రమకు కొత్త శక్తిని సంతరించుకునే పురుషుని ద్వారా పరోక్షంగా మార్కెట్ లోకి ప్రవేశిస్తూనే ఉన్నది. దానికి లెక్క కట్టకపోవడమే ఇప్పుడు జరుగుతున్న సామాజిక, ఆర్ధిక విద్రోహం. ప్రకృతి తనపై సాగుతున్న అకృత్యాలకు వరదలు, ఎల్-నినో, వర్షపాత లేమి, సునామీ మొదలైన రూపాల్లో బదులు తీర్చుకుంటూనే ఉన్నది. తమ పరిస్ధితిని మార్చుకునేందుకు ఎటొచ్చీ మహిళలే మరింత ఉధృతంగా కార్యరంగం లోకి దూకవలసి ఉన్నది.

ఈ నేపధ్యంలో గుర్తింపుకు, కనీస చెల్లింపుకు నోచుకోకుండా స్త్రీలు చేస్తున్న అనేకానేక చిన్న, పెద్ద శ్రమలను మాతృక అధ్యయనం చేస్తున్నది. శ్రామిక మహిళలను కలిసి వివరాలు సేకరించింది. ఇళ్ళల్లో, పని స్థలాల్లో చేస్తున్న శ్రమలలో స్త్రీలు అనేక రెట్లు దోపిడీకి, అణచివేతకు గురవుతున్న తీరును వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేయడం అభినందనీయం. స్త్రీల శ్రమల గాధలకు ‘శ్రామిక’ ద్వారా అక్షర రూపం ఇచ్చింది. వెట్టి చాకిరీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటుక బట్టీలలో మసి అవుతున్న స్త్రీల దగ్గరి నుండి, మైకా గనులు, ఉప్పు తయారీ, మత్స్యకారులు, అటవీ ఉత్పత్తుల సేకరణ, జీడి పప్పుల తయారీ, మార్చియార్డు అనుబంధ పరిశ్రమ, పాచి పని, రొయ్యల పరిశ్రమ, రవాణా రంగం, కాయకూరల అమ్మకం, గంగిరెద్దుల బ్రతుకులు… ఇలా అనేక చిన్న పెద్ద శ్రమలలోని మహిళలను కలిసి వివరాలు సేకరించి ప్రచురించింది. చిన్న శ్రమలుగా కనిపించే అనేక శ్రమలు అతి తక్కువ వేతనాలకు చెల్లింపులకు చేస్తూ భారీ దోపిడీకి, మోసాలకు గురి అవుతున్నారని ఈ కధనాలు తెలియజేస్తాయి. శ్రమకు దాని ఉత్పాదక శక్తిని బట్టి కాలంలో విలువ కట్టడం రివాజు. కానీ స్త్రీలు చేసే శ్రమలకు ఈ విలువ సూత్రం వర్తించడం లేదు. స్త్రీల శ్రమలు ఎంత తీవ్రతతో కూడుకున్నా, వారి శరీరాలను ఎంత చిత్రవధ చేసినా వివక్ష అనే ఏకైక కారణంతో తగిన విలువ దక్కడం లేదని ‘శ్రామిక’ కధనాలు రుజువు చేస్తాయి.

రంగనాయకమ్మ గారు తన లేఖ ద్వారా సూచించినట్లు అదనపు విలువను అంచనా కట్టడం ద్వారా స్త్రీలపై అమలవుతున్న అధిక శ్రమ దోపిడీని మరింత కట్టుదిట్టంగా రుజువు చేసేందుకు మాతృక మునుముందు ప్రయత్నిస్తే ఎంతో ఉపయోగం అవుతుంది.

6 thoughts on “చెమటకు జెండర్ లేదు –’శ్రామిక’ ముందు మాట

  1. ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు హక్కులు కల్పించిన దేశం యు.యస్.యస్.అర్
    అప్పటికే పెట్టుబడీదారీ దేశాలు అద్భుత ప్రగతిని సాధించాయని చెప్పుకొంటున్నా,స్త్రీలు,పిల్లల విషయంలో అణచివేతధోరణులను కొనసాగించాయి.శ్రామికుల నేత్రుత్వంలో ఉత్పత్తి కారకాలను స్వాధీనం చేసుకొన్న దేశమే తొలిసారిగా స్త్రీల హక్కులను గుర్తించడంలో ఆశ్చర్యమేమీలేదు.స్త్రీకి దోపిడీలేని(కనిష్ట స్థాయిలో) సమాజం ఏదో ముందుగా స్త్రీలు గురించిననాడు మరంత చైతన్యులౌతారు.


  2. https://polldaddy.com/js/rating/rating.js
    లైగిక సమానత అనే బదులు స్త్రీ, పురుషుల సమానత అని రాసివుంటే బాగుండేది. పొతే గ్రుహ శ్రమలకు కుడా విలువకట్టాలని అన్నారు కుటుంభం ఆర్దిక యూనిట్టుగా సొంత ఆస్తి ప్రతిపాదికగా అది సాద్యమయ్యే పనేనా? దేశ జిడిపీ పెరిగినంత మాత్రాన్నె స్త్రీ సమస్యలు రూపుమాసిపొవు.
    పురుషుడి అధికారానికి కారణం పురుషుడిపైన స్త్రీ ఆర్దికంగా ఆదారపడటం. అది తొలగిపొతే గానీ స్త్రీ స్వాతంత్రురాలు కాలేదు. వెనుకబడిన దేశాలలొ పారిశ్రామిక ఉత్పత్తి తక్కువ పెట్టుబడి పొగుపడిలేదు.విడి ఉత్పాద శక్తి ఎక్కువుగా వుంది. సహజంగానే ఉద్యొగ అవకాశాలు తక్కువుగా వుంటాయి. భుస్వామ్య, పెట్టుబడీదారీ విదానము పెనవేసుకపొయిన సంకరజాతి మనది. ఇందులొ ప్రతిదీ రెండు విధాలుగా వుంటుంది. ఒక పక్క పూరిగుడిశలూ,ఒక పక్క ఆకాశానంటే భవంతులు.ఒక పక్క నిరక్షరాష్యుడూ ,ఒక పక్క అక్షరాష్యుడూ.ఇలా ప్రతిదీ రెండు దొరణులుగా వుంటుంది. మరి అభివ్రుద్ది చెందిన దేశాలలొ ఇలాంటి పరిస్తితి లేదా అంటే ఆర్దిక అసమానత అనేది వర్గాలుగా సమాజం విడివడినప్పటినుంచి వుంది. కానీ సాంస్ర్కుతికంగా ఆ తేడా కొట్టుచ్చినట్టు కనిపించదు.వెనుకబడిన దేశాలలొ ఆ తేడా స్పస్టంగా కనిపిస్తుంది. ప్రతేకంగా కులాలు కలిగివున్న మనదేశంలొ.
    జిడిపి తొ స్త్రీ సమస్యను ముడిపెట్టినట్టుగా మీ వ్యాసం అపార్దం కలిగించేటటూగా వుంది.మీకు ఆ అభిప్రాయం వుండదని నేననుకుంటున్నాను. విప్లవం తర్వాత జరిగే పరిణామాన్ని మీరు ఇప్పుడే ప్రస్తావించారు.అది సాద్యం అవుతుందా? వ్యవసాయాన్ని యవరు ఆవిస్కరించింది స్త్రీయా లేక పురుషుడా అనేది వర్గాలుగా లేని అట్టడుగు సమాజానికి వెళ్ళాలి ఇందులొ ఒకరే ఆవిస్కరించారనటం తార్కికంగా వుండదు. స్త్రీ, పురుషుల శారీక శక్తిలొ తేడాలుండటం సహజం తద్వారా విలువ పంపినీలొ తేడాలుండంకుడా సహజమే అయితే నేటి ఆధునిక ఉత్పాదక శక్తిలొ శారీరక శక్తి పాత్ర తగ్గింది కాబట్టి వెనకటి సూత్రం ఇప్పుడు పనిచేయదు.

  3. రామ్మోహన్ గారు,
    జెండర్ పదానికి తెలుగులో మరో పదం లేకపోవడం వల్ల ఈ సమస్య తరచుగా ఎదురవుతుంది. బహుశా మనమే అలవాటు పడాలేమో.

    కుటుంబం ఆర్ధిక యూనిట్ గా ఉన్నప్పటికీ గృహ శ్రమలను మార్కెట్ శ్రమగా మార్చడం ద్వారా విలువ కట్టని కొన్ని స్త్రీ (లకు అంటగట్టిన) శ్రమలను జి‌డి‌పి లో కలిసేలా చేయవచ్చనీ, కొన్ని పశ్చిమ దేశాలలో ఇది జరుగుతోందని ఆర్టికల్ లో రాశాను.

    అయితే ఇలా గృహ శ్రమలకు విలువ కట్టే విషయాన్ని సోషలిస్టు సమాజంలో జరిగినట్లుగా జరుగుతుందని, అందుకు అవకాశం ఉన్నదని చెప్పడం నా ఉద్దేశం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో కూడా గృహ శ్రమలలోని కొన్నింటిని మార్కెట్ శ్రమలుగా మార్చే అవకాశం ఉన్నది. ఉదాహరణకి క్రష్ ల నిర్వహణ, నర్సరీ స్కూళ్ళు, ఇంటి పనికోసం పని పనుషులను పెట్టుకోవడం… ఇలాంటి వన్నీ కొంత మేరకు గృహ శ్రమలను మార్కెట్ లోకి తెస్తాయి. తద్వారా జి‌డి‌పి లో కలుస్తున్నాయి.

    ప్రభుత్వాలు ఇంటి పని (పాచి పని, వంట పని మొ.వి) చేసే మనుషులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తే గృహ శ్రమలు అసలు విలువకు మరింత చేరువగా వెళ్తాయి. ఇది ఒక సైకిల్ గా పని చేసి ఉద్యోగుల వేతనాల పెరుగుదలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. దీనికి ట్రేడ్ యూనియన్ ల క్రియా శీలత, ప్రభుత్వాల చిత్త శుద్ధి మొ.వి ముందస్తు షరతుగా ఉంటాయి.

    జి‌డి‌పి పెరిగితే స్త్రీలు స్వతంత్రురాలు అవుతుందని నేను రాయలేదు కదా. స్త్రీలు చేస్తున్న గృహ శ్రమలకు విలువ కట్టడం అంటూ జరిగితే అది ఎంత ఉంటుందో చెప్పడానికి లెక్కలు ఉదహరించాను. స్త్రీలు కోల్పోతున్న విలువ పరిణామాన్ని పోల్చడానికి జి‌డి‌పి ని రిఫరెన్స్ గా ఉదహరించాను. దాన్ని అంతవరకే చూడాలి.

    స్త్రీల శ్రమ ఎంతగా దోపిడీకి గురవుతున్నదో పరిమాణాత్మకంగా చెప్పడానికే జి‌డి‌పి లెక్కలు ఇచ్చాను. జి‌డి‌పి అంకెల్లో చెబితే ఇంకాస్త స్పష్టంగా పాఠకులకు అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

    స్త్రీలు ఒక్కరే వ్యవసాయాన్ని ఆవిష్కరించలేదు. కానీ వ్యవసాయ ఆవిష్కరణలే స్త్రీలది ప్రధాన పాత్ర అని చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే వేట నుండి వ్యవసాయానికి మళ్లే పరిణామంలో పురుషులు వేటకు వెళ్తే స్త్రీలు పిల్లల ఆలనా పాలనా చూసేందుకు కుదురుగా ఉండేవాళ్లు. ఆ పరిస్ధితి స్త్రీలను విత్తులు నాటి పంటలు తీసే కృషిలోకి వెళ్లడానికి దోహదం చేసింది. ఇది వేల యేళ్ళ మేరకు విస్తరించిన చారిత్రక దశ. స్త్రీలకు ఉన్న ప్రత్యేక పరిస్ధితి వారిని వ్యవసాయం ఆరంభంలో ప్రధాన పాత్ర పోషించడానికి అనువుగా ఉండేది. ఆ తర్వాత భూమి ఆస్తిగా మారడం, ఆస్తికి వారసుల అవసరం తలెత్తడం, వారసులు కని ఇచ్చే స్ధాయికి స్త్రీలను నెట్టివేయడం, భూమి నుండి స్త్రీలను వేరు చేయడం… ఇవి బహుశా మీకు తెలిసినవే.

  4. మనదేశంలో పెద్దపెద్ద ఇళ్ళున్నవాళ్ళూ,భార్యభర్త ఉద్యొగస్తులైనవాళ్ళు ఇలా ఎవరి వెసులబాటు ఉన్నవాళ్ళు ఇల్లల్లో పనివారిని(మహిళలను) పెట్టుకొంటున్నారు. తద్వార వారి(పనివారి) శ్రమలను దోచుకొంటున్నరు.కుటుంబ సభ్యులు ఇంటిపని చేసుకోలేనివారైతే అంత పెద్దపెద్ద ఇల్లను కట్టుకోవడం దేనికి?భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైనపుడు ఇంటిపనిలోకూడా ఇద్దరూ కలిసిచేసుకోరెందుకు? మనదేశంలో యు.పి.ఎ హయంలో పనివారికోసం,వారికి కనీస వేతనాలకోసం చత్తం చేయడాంకి ప్రయత్నం జరిగింది.కానీ,కార్యరూపం దాల్చలేదు.అది గాని కార్యరూపం దాల్చితే మహిలలు ఇంటిపని ద్వారా సంపాదించి కుటుంబపోసన చేసుకోవదం కూడా కష్టమౌతుంది(చట్టప్రకారం జరిగితే)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s