ఊచకోతలపై నిరసన: ‘నాట్ ఇన్ మై నేమ్’ -ఫోటోలు


దేశంలో దళితులపైనా, ముస్లింల పైనా పెరిగిపోయిన హిందూత్వ మూకల దాడుల నేపధ్యంలో ప్రగతి కాముకులైన దేశ ప్రజలు గళం విప్పారు. గొంతు విప్పి ముందుకు వచ్చారు. తామూ హిందూ మతానికి చెందినవారమే అయినప్పటికీ తమ పేరుతో దళితులు, మైనారిటీలపైన దాడులు చేసి ఊచకోతలకు దిగడానికి మేము అనుమతించబోమని చాటి చెప్పారు. జూన్ 28 తేదీన దేశ వ్యాపితంగా అనేక నగరాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనల్లో పాల్గొని హింసాత్మక హిందూత్వ భావజాల వ్యాప్తికి తమ అనుమతి లేదని స్పష్టం చేశారు. హిందువులు అందరూ హిందూత్వ బోధిస్తున్న విచ్చలవిడి హింసావాదం తమకు సమ్మతం కాదని చాటారు.

జూన్ 23 తేదీన ఢిల్లీ శివార్లలో ఒక రైలు పెట్టెలో ప్రయాణిస్తున్న ముస్లిం యువ సోదరులపై విచక్షణ తప్పిన మూకలు దాడి చేసి కత్తులతో పొడవడంతో 15 యేళ్ళ బాలుడు హఫీజ్ జునాయిద్ అక్కడికక్కడే చనిపోయాడు. సీటు దగ్గర జరిగిన చిన్న వివాదాన్ని హిందూత్వ తలకెక్కించుకున్న మూకలు పెద్దది చేసి హత్యల వరకు తీసుకెళ్లడంతో జునాయిద్ గ్రామ ప్రజలు ఇప్పుడు ముస్లింగా కనిపించేందుకు కూడా భయపడతున్నారు.

జునాయిద్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు కావడం పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలన్న బూర్జువా పార్టీల సూత్రాన్ని సైతం విస్మరించేలా హిందుత్వ ప్రభుత్వాలు మత పిచ్చిని ప్రజల్లో చొప్పించిన ఫలితంగా రాజ్యం-మత రాజకీయాలు విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఫలితంగా జునాయిద్ కత్తి పోట్లతో ప్రాణాలు కోల్పోగా అతని సోదరులు కూడా కత్తి పోట్లకు గురై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ముస్లిం బాల సోదరుల తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ “వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఎందుకు ద్వేషిస్తున్నారు?” అని ప్రశ్నిస్తున్నది. ఈ ప్రశ్నకు ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్ధలు సమాధానం చెప్పవలసి ఉన్నది. ముఖ్యంగా “గోధ్రా హత్యాకాండకు హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నారు” అంటూ గుజరాత్ మారణకాండకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోడి ప్రధానంగా జునాయిద్ తల్లి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. కానీ భారత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన పత్రికలతో మాట్లాడేందుకు కూడా నిరాకరించిన మొట్టమొదటి ప్రధానిగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడి జునాయిద్ తల్లికి ఇంకా అనేక మంది అలాంటి తల్లులకు సమాధానం ఇస్తాడని భావించడం వెర్రితనమే.

జునాయిద్, అతని సోదరులపై క్రూరంగా దాడి జరుగుతున్నప్పటికీ, వారిని కత్తులతో పొడుస్తున్నప్పటికీ, రక్తం ధారలుగా కారుతున్నప్పటికీ, కత్తిపోట్లకు గురై స్పృహ తప్పిన సోదరులను రైలు పెట్టెలో ఈడ్చుకుని వెలుతున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రయాణీకులు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని తెలిసినప్పుడు దిగులు పడకుండా ఉండలేము. గాయాలతో ‘కాపాడండి’ అంటూ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నప్పటికీ ప్రయాణీకుల్లో అత్యధికులు హిందూత్వ మూకలకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించారే తప్ప అడ్డుకోలేదని పత్రికల ద్వారా తెలుస్తున్నది.

దేశానికి ఇంతకు మించిన చీకటి రోజులు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇందిరా ‘ఎమర్జెన్సీ’ ని చీకటి రోజులుగా చెప్పడానికి హిందూత్వకు ఎంతో ఇష్టం. కానీ రాజ్యంతో పాటు సాధారణ పౌరులు కూడా కక్ష గట్టి కనీస విచక్షణ మరిచి దళితులపైనా, మైనారిటీల పైనా స్వయంగా హత్యాకాండలకు పాల్పడటం మరింత భయానకమైనది. ఈ పరిస్ధితిని నిలువరించడానికి సెక్యులరిస్టులు గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ తదితర పార్టీలు కేవలం ఖండన మందనలకే పరిమితం అవుతున్నాయే తప్ప క్రియాశీలక చర్యలకు దిగడం లేదు. బహిరంగంగా ముందుకు వస్తే ఎక్కడ హిందువుల ఓట్లు కోల్పోతామో అన్న భయం వారిని వెంటాడడమే ఇందుకు కారణం. వారికి సెక్యులరిజం అంటే ప్రజల జీవన విధానం కాదు. కేవలం ఓట్లు పోగు చేసే నినాదం మాత్రమే.

గురుగ్రామ్ కు చెందిన సినిమా నిర్మాత సబా దేవన్ జునాయిద్ హత్యా దురాగతాన్ని పత్రికల్లో, టి.వి ఛానెళ్లలో చూసి చలించారు. తన నిరసనను చాటాలని భావించారు. తనతో పాటు నలుగురిని చేర్చుకోవాలన్న ఆశతో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. తన ఆలోచన అమలు చేసేందుకు కదిలి రావాలని మిత్రులను కోరారు. జూన్ 28 తేదీన జునాయిద్ హత్యకు నిరసనగానూ, గోహత్య నిషేధం పేరుతో దళితుల ఆహారపు అలవాట్లపైనా, ముస్లింల జీవనం పైనా హిందూత్వ మూకల దాడులకు నిరసనగానూ నిర్శన తెలియజేయాలని కోరారు. నిరసనకు “నాట్ ఇన్ మై నేమ్” (నేను హిందువునే. కానీ నా పేరుతో ఈ హత్యలు చేయొద్దు) పేరు పెట్టారు.

ఈ ఫేస్ బుక్ టపా కొద్ది సమయంలోనే ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పిలుపుకు సబా మిత్రులతో పాటు అనేక మంది అపరిచితులు కూడా మద్దతు తెలిపారు. పోస్ట్ ను షేర్ చేస్తూ తమ తమ నగరాల్లో నిరసన తెలపాలని ఫేస్ బుక్ ఖాతాదారులు అనేక మంది కోరారు. ఇది ఉమ్మడి పిలుపుగా మారిపోయింది.  దానితో దేశం లోని అనేక ప్రధాన నగరాల్లో జూన్ 28 తేదీన ‘నాట్ ఇన్ మై నేమ్’ నిరసనలు జరిగాయి. హిందువుల ప్రతినిధులమ్ తామే అని విర్రవీగుతున్న హిందుత్వ మూకల హత్యాకాండలకు తమ మద్దతు లేదని చాటి చెప్పారు. “ప్రగతి కాముకులు ఎక్కడ?” అని ప్రశ్నిస్తున్న మేధావులకు సమాధానం అన్నట్లుగా ఈ మొదటి అడుగు పడటం ఆహ్వానించదగినది. మోడి ప్రభుత్వం అండతో హిందూత్వ సంస్ధలు దేశంపై రుద్దుతున్న విద్వేష పూరిత వాతావరణంలో అత్యంత అవసరం అయినది.

ఆల్-జజీరా చానెల్ ప్రకారం మోడి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి గోవధ నిషేధం పేరుతో పుటగొడుగులుగా వెలిసిన హిందూత్వ మూకల చేతుల్లో 28 మంది చనిపోగా, 124 మంది గాయపడ్డారు. అయితే భారత పత్రికల సమాచారం ప్రకారం హత్యలకు గురైన వారి సంఖ్య 100కు పైగానే ఉన్నది.

సబా దేవన్ మదిలో పుట్టిన ఆలోచనకు స్వచ్ఛందంగా స్పందించి దేశంలోని వివిధ నగరాల్లో ‘నాట్ ఇన్ మై నేమ్’ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఫోటోలు ఇవి:

3 thoughts on “ఊచకోతలపై నిరసన: ‘నాట్ ఇన్ మై నేమ్’ -ఫోటోలు

  1. రాధా కృష్ణ గారు, ప్రగతిశీల మహిళా సంఘం (POW) వాళ్ళు ఇటీవల వారి రాష్ట్ర మహా సభల సందర్భంగా ‘శ్రామిక’ అనే పుస్తకం ప్రచురించారు. (వారు తెచ్చిన 5 పుస్తకాల్లో అది ఒకటి) శ్రామికకు ముందు మాట రాయాలని కోరితే రాశాను. అందులో జి‌ఎస్‌టి గురించి చర్చించాను. సదరు వ్యాసాన్ని మీ కోసం ప్రచురిస్తున్నాను. చూడగలరు. ఆ తర్వాత కూడా కొన్ని డౌట్స్ మిగలొచ్చు. జి‌ఎస్‌టి ప్రభావాన్ని అధ్యయనం చేశాక మాత్రమే సవివరంగా టపా రాయగలను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s