వెనిజులా సంక్షోభం: సుప్రీం కోర్టుపై హెలికాప్టర్ దాడి


సంక్షుభిత లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో మరో సారి రాజకీయ సంక్షోభం తీవ్రం అయింది. నిరసన పేరుతో జాతీయ పోలీసుల్లోని ఒక సెక్షన్ అధికారి జూన్ 27 తేదీన ప్రభుత్వ హెలికాప్టర్ ను స్వాధీనం చేసుకుని దాని ద్వారా నేరుగా సుప్రీం కోర్టు పైనే కాల్పులు సాగించాడు. దాడి చేసిన వారిని టెర్రరిస్టులుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించాడు. ప్రతిపక్షాలు అధ్యక్షుడు మదురోపై పెడుతున్న తప్పుడు కేసులను సాక్ష్యాలు లేని కారణాన డిస్మిస్ చేస్తున్న నేపధ్యంలో ప్రతిపక్ష పారామిలట్రీ కిరాయి మూకలకు జాతీయ సుప్రీం కోర్టు కూడా లక్ష్యం అయింది.

అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నందుకు వెనిజులాపై కక్ష కట్టిన అమెరికా (సి‌ఐ‌ఏ) ఆ దేశంలో వరుసగా కుట్రలకు పాల్పడుతున్న సంగతి విదితమే. ఒబామా ఆధిపత్య విధానాలను తాను అనుసరించబోనని హామీ ఇచ్చిన ట్రంప్ తన ఒట్టు తీసి గట్టున పెట్టడమే కాకుండా తానే స్వయంగా కుట్రలకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు.

సిరియా ప్రభుత్వం త్వరలోనే తన ప్రజలపై తానే రసాయన ఆయుధాలతో దాడి చేసి పిల్లలు, స్త్రీలను చంపనున్నదని ప్రకటించడం ద్వారా సిరియాపై మరో విడత బాంబు దాడికి తెగబడి ఇసిస్ మూకల పురోగమనానికి సహకరించడానికి ఓ వైపు పధకం వేసిన ట్రంప్ మరోవైపు వెనిజులా సుప్రీం కోర్టుపై కాల్పులు జరపడం ద్వారా ఆదేశంలో కిరాయి మూకల విధ్వంస పూరిత ఎత్తుగడలకు సంపూర్ణ మద్దతు తెలిపాడు.

సుప్రీం కోర్టులో జడ్జిలు అందరూ సమావేశం అయి ఉండగా వారిని మట్టుబెట్టే ఉద్దేశంతోనే ధనిక వర్గాల నియంత్రణలోని ప్రతిపక్ష పార్టీలు హెలికాప్టర్ దాడి జరిపించారని వెనిజులా పత్రికలు తెలిపాయి. సుప్రీం కోర్టుతో పాటు దేశ హోమ్ మంత్రిత్వ శాఖ భవనాలపై కూడా హెలికాప్టర్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది గతంలో ప్రభుత్వంలో పని చేసిన పోలీసు అధికారే అని వెనిజులా ప్రభుత్వం తెలిపింది.

“త్వరలోనే మేము హెలికాప్టర్ ని పట్టుకుంటాము. దేశ వ్యవస్ధలకు వ్యతిరేకంగా సాయుధ టెర్రరిస్టు దాడి వెనుక ఉన్నది ఎవరో కనిపెడతాము. హెలికాప్టర్ దాడిలో డజన్ల మంది మరణించారని ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తున్నది” అని దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించాడు.

54 యేళ్ళ మదురో తన పదవీ కాలంలో అత్యంత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. క్యాన్సర్ కారణంగా తాను త్వరలో మరణించడం ఖాయమని తెలిసిన అనంతరం నికోలస్ మదురోను తన వారసుడుగా హ్యూగో ఛావెజ్ ప్రకటించాడు. ఛావెజ్ నమ్మకాన్ని మదురో వమ్ము చేయలేదు. ఛావెజ్ ప్రవేశపెట్టిన కార్మికవర్గ అనుకూల సంస్కరణలను కొనసాగించాడు. ఇళ్ళు, పెన్షన్ లాంటి అనేక సౌకర్యాలను కార్మికులకు, ఉద్యోగులకు పెద్ద ఎత్తున కల్పించాడు.

అయితే దేశ ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన నాడులు ధనికవర్గాల చేతుల్లోనే ఉండడంతో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడంలో సఫలం అవుతోంది. సరుకులు, ఆహార పదార్ధాల కృత్రిమ కొరత సృష్టించగలుగుతున్నారు. తమ చేతుల్లోని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తేలికగా ప్రభుత్వ వ్యతిరేక పుకార్లు వ్యాపింపజేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వానికి సహకరించకపోగా, ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రం అయ్యేటట్లుగా మేనిపులేట్ చేస్తున్నారు. పైగా విదేశీ బ్యాంకులు, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్ధలు, ఇంటర్నెట్… ఇలా సమస్త వ్యవస్ధలు అమెరికా సామ్రాజ్యవాదం నియంత్రణలో ఉన్నందున మదురో ప్రభుత్వానికి సర్వత్రా ప్రతికూల పరిస్ధితులే నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత రెచ్చగొట్టడం ప్రతిపక్షం చేతుల్లోని మీడియాకు తేలిక అయింది.

ఛావెజ్ బ్రతికి ఉన్నట్లయితే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఆయన స్వయంగా ప్రతిపక్ష, సామ్రాజ్యవాద కుట్రలను ప్రజల అండదండలతోనే విజయంవంతంగా ఎదుర్కొన్నాడు. ఛావెజ్ ను కుట్రతో పదవినుండి కూలద్రోసినపుడు ప్రజలే తిరుగుబాటు చేసి ఆయన్ని తిరిగి పదవిలో కూర్చోబెట్టారు. ఈ పోరాట చరిత్ర నేపధ్యంలో దేశంలో ఛావెజ్ కు విపరీతమైన ప్రజాభిమానం ఉన్నది.

మదురో, ఛావెజ్ కు అనుచరుడు. ఛావెజ్ ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే ఆయన సొంతం తప్ప స్వయంగా ప్రజల తరపున పోరాడిన ఆయన చరిత్ర ప్రజలకు పెద్దగా తెలియదు. ఛావెజ్ ఆరేటరీ నైపుణ్యం, విషయాన్ని విడమరిచి చెప్పగల చాకచక్యం మదురోకు పెద్దగా లేవు. అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాల బహుళజాతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా కురిపిస్తున్న నిధుల ద్వారా అటు ఆర్ధికంగా, సామాజికంగా, పాలనా పరంగా ప్రతిపక్షాలు కల్పిస్తున్న అనేక రకాల ఇక్కట్లను అధిగమించడానికి మదురో వద్ద తగిన శక్తులు కొరవడ్డాయి.  దానితో గత మూడు నెలలుగా మితవాద ప్రతిపక్ష మూకలు సాగిస్తున్న విధ్వంస పూరిత ఆందోళనలను అదుపు చేయడం ఆయనకు కష్టంగా మారింది. భద్రతా బలగాలు, పోలీసులలోని ఒక సెక్షన్ ను కొనివేయడంలో ప్రతిపక్షాలు సఫలం అవడంతో మదురో అదనంగా సివిల్ మిలీషియాపై ఆధారపడుతున్నాడు.

తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2018 ఆఖరులో జరగవలసి ఉన్నది. ఈ ఎన్నికలను ముందుకు జరిపి వచ్చే జులై లోనే జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హింస, విధ్వంసాలలో పాల్గొని శిక్షలు పది జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని, ప్రతిపక్షం ఆధీనంలో ఉన్న నేషనల్ అసెంబ్లీకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

కార్మికవర్గ సంస్కరణలు కాపాడుకునేందుకు రాజ్యాంగ సభ (constituent assembly) ఎన్నికలు నిర్వహిస్తామని మదురో ప్రకటించాడు. జులై 30, 2017 తేదీన జరపాలని నిర్ణయించిన ఈ ఎన్నికలను నిలిపివేయాలని ప్రతిపక్షం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. రాజ్యాంగ సభ ఏర్పాటు అయితే అది నేషనల్ అసెంబ్లీకి పోటీగా అధ్యక్షుడు మదురో నిలబెడతాడని, నేషనల్ అసెంబ్లీ అధికారాలను కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీకి తరలిస్తాడని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. రాజ్యాంగ సభ నేతృత్వంలో నేషనల్ ఛార్టర్ ను పునర్లిఖించాలని మదురో తలపెట్టడంతో ప్రతిపక్షం అనుమానాలు ఆధార రహితం కాదు.

కనుక రాజ్యాంగ సభ ఎన్నికలు కుట్ర అనీ, రాజ్యాంగ విరుద్ధం అనీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే నేషనల్ అసెంబ్లీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు దేశాన్ని సంక్షోభం లోకి తీసుకెళ్తూన్నందున రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం అనైతికం కాబోదు. ప్రతిపక్షాల లక్ష్యం అంతా అమెరికా ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేయడం. అపారమైన చమురు నిల్వలను అమెరికా బహుళజాతి కంపెనీల విచ్చలవిడి దోపిడీకి అప్పజెప్పడం. బహుళజాతి కార్పొరేషన్ల దోపిడీలో జూనియర్ వాటా పొంది లబ్ది పొందడం. అనగా వెనిజులా ప్రతిపక్షం కింద ఉన్న ప్రైవేటు మీడియా తదితర కంపెనీల యజమానులు, ఇతర ధనికవర్గాలు అచ్చమైన దళారీ వర్గాలు. వారికి జాతీయ భావనలు లేనే లేవు. అమెరికా మోచేతి నీళ్ళు తాగడమే వారి పరమావధి. సి‌ఐ‌ఏ రూల్ బుక్ లోని కుట్ర పద్ధతులు, ఎత్తుగడలే వారికి రాజ్యాంగం. ఇటువంటి జాతి మరియు జాతీయ వ్యతిరేక దుర్మార్గుల నుండి అధికారాన్ని లాక్కుని ప్రజల చేతికి పాక్షికంగానైనా అప్పజెప్పే నిర్మాణాలు చేస్తే అది దేశభక్తి అవుతుందే తప్ప మరొకటి కాజాలదు.

రాజ్యాంగ సభ ఏర్పాటు ఒక్కటే వెనిజులాకు శాంతి చేకూర్చుతుందని నికోలస్ మదురో ఆశిస్తున్నాడు. మదురో ఎత్తుగడ తిప్పి కొట్టడానికి  జులై 30 ఎన్నికలను తాము బాయ్ కాట్ చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. జులై 30 ఎన్నికల రద్దు డిమాండ్ తో ప్రతిరోజూ ఆందోళన చేస్తున్నాయి. ఆందోళనల పేరుతో హింసను రచిస్తున్నాయి. విధ్వంసం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్మాణాలను తగలబెడుతున్నాయి. ఈ కార్యకలాపాల కోసం ప్రతిపక్షాలు సమీకరించిన ముఠాలకు సి‌ఐ‌ఏ సాయుధ పారామిలటరీ శిక్షణ ఇవ్వడం గమనార్హం.

దేశంలో జరుగుతున్న హింస, విధ్వంసాలకు అమెరికా ప్రభుత్వమే కారణమని వెనిజులా అధ్యక్షుడు మదురో బహిరంగంగానే ప్రకటించాడు. జూన్ 27 తేదీన హెలికాప్టర్ దాడి అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన “ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్! విను. వెనిజులాను అడ్డుకునేందుకు నువ్వు సముద్రంలో 20 గోడలు నిర్మించాల్సి ఉంటుంది. మిస్సిస్సిపి నుండి ఫ్లోరిడా వరకు ఒక గోడ, ఫ్లోరిడా నుండి న్యూయార్క్ వరకు ఒక గోడ… ఇలా. అదో పిచ్చి వ్యవహారం… ఈ హింస, విధ్వంసాలకు నీకు బాధ్యత ఉన్నది. హింసాత్మక వెనిజులా మితవాదులను కట్టాడి చెయ్యి” అని ప్రకటించాడు. మెక్సికో నుండి సరుకుల తరలింపు అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయడాన్ని, పాలస్తీనీయులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ నిర్మించిన గోడకు ట్రంప్ మద్దతు ఇవ్వడాన్ని మదురో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 

హెలికాప్టర్ దాడి వెనుక మాజీ ఇంటలిజెన్స్ సర్వీస్ అధికారి మిగుయెల్ రోడ్రిగేజ్ హస్తం ఉన్నదని అధ్యక్షుడు ఛావెజ్ తెలిపాడు. రోడ్రిగేజ్ కు గతంలో పైలట్ గా పని చేసిన వ్యక్తి దాడి సమయంలో హెలికాప్టర్ నడుపుతున్నట్లు పరిశోధనలో తేలిందని ఆయన వెల్లడించాడు. గతంలో ప్రభుత్వ చీఫ్ ప్రాసిక్యూటర్ గా పని చేసిన లూయీసా ఒర్టేగా ను కూడా ప్రతిపక్షాలు కొనేశారని ప్రభుత్వ మీడియా సమాచారం. ఇలా ప్రతిపక్ష శిబిరంలోకి దూకిన విద్రోహుల ద్వారా సేకరించిన సమాచారం సాయంతో ప్రతిపక్ష విధ్వంసక ముఠాలు తమ దాడులకు టార్గెట్ లను ఎంపిక చేస్తున్నాయని ప్రభుత్వ మీడియా చెబుతోంది.

అమెరికన్ సామ్రాజ్యవాదం ఒక బహుళ అవయవాల రాకాసి. ప్రపంచం అంతటా విస్తరించేందుకు తగినన్ని చేతులు దానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. భూగోళం మొత్తాన్ని ఐదు సైనిక మండలాలుగా విభజించుకుని ఒక్కో మండలానికి కమాండ్ సెంటర్లను నిర్వహిస్తున్న యుద్ధోన్మాద అమెరికా ఆధిపత్య దాహానికి అంతూ పొంతూ ఉండదు. విసుగూ విరామం ఉండదు. ఓ వైపు సిరియాపై తోమహాక్ క్షిపణులతో దాడి చేస్తూనే మరో వైపు వెనిజులాలో రాజకీయ, సైనిక కుట్రలు నిర్వహించగలదు. ఓ వైపు మధ్య ప్రాచ్యంలో ఎడతెగని యుద్ధాలకు ధన, ఆయుధ, శిక్షణ సాయం అందిస్తూనే మరోవైపు ఆఫ్రికాలో చైనా ఆర్ధిక విస్తరణకు ఆటంకాలు సృష్టించగలదు. ఓ వైపు భారత ఉపఖండంలో స్నేహం నటిస్తూనే మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములతో ఉద్రిక్తతలు సృష్టించగలదు.

ఈ బహుళ అవయవాల రాకాసిని ఎదుర్కోగల ఏకైక శక్తి ప్రజలు మాత్రమే. అందునా శ్రామిక ప్రజలు మాత్రమే. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఈ సత్యాన్ని తెలుసుకుని వర్గ ప్రాతిపదికన కార్మికవర్గ సమీకరణకు పూనుకోవాలి. సంస్కరణల ద్వారా తీపి పూత పూస్తూ ప్రజలంతా తన వెంట నడవాలంటే నడవరు. పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్ధపై నమ్మకం ఉంచినంతవరకూ వెనిజులా ప్రజలకు శాంతి ఎన్నడూ అందని ఎండమావియే అవుతుంది. పార్లమెంటరీ పద్ధతులపై నమ్మకం ఉంచడమే మితవాద విద్రోహ దళారీ పాలకవర్గాలకు, అమెరికా సామ్రాజ్యవాదానికి అతి పెద్ద ఆయుధం. ఎన్నికల పరిధిని దాటి కార్మికవర్గ సిద్ధాంతాన్ని ఆయుధంగా చేబూని డైరెక్ట్ యాక్షన్ లోకి దిగకుండా అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాలన్న తపనను నెరవేర్చుకోవడం సాధ్యం కాజాలదు.

One thought on “వెనిజులా సంక్షోభం: సుప్రీం కోర్టుపై హెలికాప్టర్ దాడి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s