
US bombs Syrian soldiers in Dier-Ez-Zor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు మంగళం పాడాడు. మధ్య ప్రాచ్యం (ముఖ్యంగా సిరియా), ఇరాన్, చైనా, లాటిన్ అమెరికా, రష్యా, లిబియా, యెమెన్, ఆర్ధిక రంగం… ఇలా అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ ఆయన తన ఎన్నికల హామీలకు విరుద్ధంగా చర్యలు చేపడుతున్నాడు. ఆయన వాగ్దానాలను నమ్మి యుద్ధ వాతావరణం ఎంతో కొంత ఉపశమిస్తుందని ఆశించిన విశ్లేషకులు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నారు.
అమెరికా పాలకవర్గాలలోని గ్రూపుల మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణలో ట్రంప్ వ్యతిరేక ముఠా పూర్తిగా పట్టు సాధించిందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమైన పదవుల్లో ట్రంప్ నియమించుకున్న అధికారులను పదవీచ్యుతులను చేయడంలో నయా-కన్సర్వేటివ్ (నియో-కాన్) ముఠా విజయం సాధించింది. ప్రస్తుతం ట్రంప్ నియో-కాన్ (Neo-Conservative) ముఠా ముట్టడిలో ఉన్నాడు. దానితో ఆర్ధికంగానూ వాణిజ్యపరంగానూ రష్యా-స్నేహ విధానాలను అనుసరించాలని భావించిన డొనాల్డ్ ట్రంప్ ఆచరణలో విఫలం అవుతున్నాడు. నాఫ్తా (నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్), టిపిపి (ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్) లను రద్దు చేయడం మినహా ట్రంప్ మరేమీ సాధించలేకపోయాడు. ఉత్తర కొరియాపై దుష్ప్రచారాన్ని ముమ్మరం చేయడం ద్వారా చైనాను దారిలో తెచ్చుకునేందుకు ట్రంప్ రేపుతున్న ఉన్మాదం బట్టి దక్షిణ చైనా సముద్రంలో ఒబామా అనుసరించిన తగవులమారి విధానాలనే ఆయన అనుసరిస్తున్నాడని అర్ధం అవుతోంది.
నిజానికి దురాక్రమణ యుద్ధ విధానాలకు, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ట్రంప్ వ్యతిరేకి ఏమీ కాడు. కానీ రష్యాతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటానని ఆయన ప్రకటించినందున మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తాయని అనేకమంది ఆశించగా వాస్తవంలో అందుకు విరుద్ధమైన పరిస్ధితి నెలకొంది. ఒబామా చేపట్టిన దూకుడు విధానాలు, యుద్ధోన్మాదం ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రతతో అమలవుతున్నాయి.
మధ్య ప్రాచ్యం
“టెర్రరిస్టు సంస్ధ ఇస్లామిక్ స్టేట్ సిఐఏ సృష్టి. అధ్యక్షుడు ఒబామా దానికి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాడు” అని ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో ఒబామా విధానాలనే పొల్లు పోకుండా కొనసాగిస్తున్నాడు. ఆల్-ఖైదా / ఇస్లామిక్ స్టేట్ లను తన సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఉపకరణాలుగా ప్రయోగించడాన్ని మరింత తీవ్రం చేశాడే తప్ప తగ్గించలేదు.
ఇరాన్ కు అనుకూలంగా ఒక మాట మాట్లాడినందుకు సౌదీ అరేబియా నాయకత్వంలో గల్ఫ్ దేశాలు (సౌదీ, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఈజిప్టు, యెమెన్) కతార్ తో అన్ని సంబంధాలు తెంచుకున్నాయి. విమానాల రాకపోకలు రద్దయ్యాయి. దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నాయి. తాను చెప్పినందు వల్లనే కతార్ ఒంటరి అయిందని ట్రంప్ ఘనంగా ప్రకటించడం విశేషం. విచిత్రం ఏమిటంటే టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నందునే కతార్ తో సంబంధాలు తెంచుకుంటున్నామని గల్ఫ్ దేశాలు ప్రకటించడం. కానీ జూన్ 23 తేదీన అవి కతార్ ముందుంచిన డిమాండ్లలో ప్రధానమైనవి: ఇరాన్ తో దౌత్య సంబంధాలు తెంచుకోవడం, ఆల్-జజీరా చానెల్ మూసివేత, కతార్ లోని టర్కీ మిలట్రీ స్ధావరం మూసివేయడం. సౌదీ, కతార్ లు రెండూ ఇసిస్ కు ధన, ఆయుధ, శిక్షణ మద్దతు ఇస్తున్నవే. అలాంటిది సంబంధాలు తెంచుకోవటానికి టెర్రరిస్టులకు మద్దతు ఇవ్వడమే అని చెప్పడం ఒట్టి మాట.
ట్రంప్ పదవి చేపట్టగానే ఇజ్రాయెల్ కు బేషరతు మద్దతు ప్రకటించాడు. తన యూదు అల్లుడిని ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి ప్రతినిధిగా నియమించాడు. అమెరికా ఇన్నాళ్లూ తొడిగిన ‘పాలస్తీనా సానుభూతి’ అనే మేకతోలును చించేశాడు. పాలస్తీనాకు భవిష్యత్తు రాజధానిగా పాలస్తీనా ప్రజలు ఆశిస్తున్న జెరూసలేంకు ఇజ్రాయెల్ రాజధానిని తరలించడానికి మద్దతు ప్రకటించాడు. తద్వారా పాలస్తీనా – ఇజ్రాయెల్ అనే రెండు దేశాల పరిష్కారాన్ని (Two-State Solution) అనుమానంలో పడేశాడు. ఇజ్రాయెల్ ను సంతృప్తిపరిచేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు ట్రంప్ సంసిద్ధత ప్రకటిస్తున్నాడు.
సిరియా అనుమతి లేకుండా ఆ దేశంలో ప్రవేశించిన అమెరికా ప్రత్యేక బలగాలు ఇసిస్ మూకల పురోగమనానికి వీలుగా సిరియా సైన్యంపై వైమానిక దాడులు చేస్తున్నాయి. సిరియా ప్రజల వీరోచిత ప్రతిఘటన అమెరికా-నాటో-ఇజ్రాయెల్-గల్ఫ్ దేశాలకు కొరుకుడు పడటం లేదు. 2016లో ఇసిస్-సిఐఏ బలగాలను మట్టి కరిపించి విజేతగా అవతరించిన అలెప్పో నగరం (ఉత్తర సిరియా నగరం) వలెనే 2017లో డేర్-ఎజ్జోర్ (తూర్పు సిరియా నగరం) వీరోచిత ప్రతిఘటనకు కేంద్రంగా అవతరించింది. డేర్-ఎజ్జోర్ ని వశం చేసుకుంటే సిరియా-ఇరాక్ భూభాగాలను కలిపి సున్నీ రాజ్యాన్ని ఏర్పరచాలన్న అమెరికా వ్యూహానికి మార్గం సుగమం అవుతుంది. గత మూడేళ్లుగా టెర్రరిస్టు మూకలు, అమెరికా ప్రత్యేక బలగాలు ఈ నగరాన్ని ముట్టడించినప్పటికీ సిరియా సైన్యం సహాయంతో నగర ప్రజలు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్నారు.
మరో తూర్పు నగరం ఆల్-తనఫ్ ను దురాక్రమించిన అమెరికా అక్కడ నుండి తన సైనిక కార్యకలాపాలను తీవ్రం చేసింది. ఇసిస్ మూకలు పురోగమించేందుకు సరఫరాలు అందిస్తున్నది. ఆల్-తనఫ్ నుండి తన ఆక్రమణలోని భూభాగాన్ని విస్తరించేందుకు అమెరికా సకల ప్రయత్నాలు చేస్తోంది. దానితో ఆల్-తనఫ్ ను తిరిగి వశం చేసుకునేందుకు సిరియా సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఇసిస్ మూకలను మట్టికరిపిస్తూ ఆల్-తనఫ్ వైపు పురోగమిస్తున్న సిరియా బలగాలపైకి అమెరికా విమానాలు ప్రత్యక్ష దాడి చేసి అనేకమందిని బలిగొన్నాయి. తన రక్షణ ఏలుబడిలో ఉన్న కుర్దులపై బాంబులు వేసినందుకే సిరియా సైన్యంపై వైమానిక దాడి చేశామని బొంకింది. ఈ నేపధ్యంలో సిరియా గగనతలం అంతటిని తన రక్షణలోకి తెచ్చుకుంటానని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే అమెరికా-రష్యాలు ప్రత్యక్ష ఘర్షణలోకి ప్రవేశించినట్లే.
సిరియా సైన్యం ఉపయోగించే యుద్ధ విమానాలు, ట్యాంకర్లు రష్యా సరఫరా చేసినవే. పైగా సిరియా-రష్యాల మధ్య రక్షణ ఒప్పందం ఉన్నది. దానితో అమెరికా రష్యాలు ప్రత్యక్షంగా తలపడే అవకాశాలు పెరిగాయి. సిరియాలో సాధ్యమైనంత అధిక భూభాగాన్ని తమ తమ ప్రభావంలోకి తెచ్చుకునేందుకు అమెరికా, రష్యా, టర్కీ శిబిరాలు పావులు కదుపుతున్నాయి. కుర్దులకు సిరియాలో ఉత్తర భాగం దక్కితే అది తమకు ప్రమాదకరం అని టర్కీ భావిస్తున్నది. ఎందుకంటే టర్కీలోనూ కుర్దులు సొంత రాజ్యం డిమాండ్ చేస్తున్నారు. సిరియాలోని కుర్దు రాజ్యం టర్కీ విభజన కోసం ఒత్తిడిని తీవ్రం చేస్తుంది. ఈ కారణంతో సిరియాలో కుర్దుల రాజ్యం నెలకొనకుండా టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కుర్దులకు మద్దతు ఇచ్చి కుర్దిస్తాన్ ఏర్పాటు చేయడం ద్వారా టర్కీని నియంత్రణలో ఉంచుకోవాలని అమెరికా వ్యూహం. సిరియా ముక్క చెక్కలు అయితే మధ్య ప్రాచ్యంలో ఇరాన్-సిరియా-హమాస్ ప్రతిఘటన బలహీనపడుతుందని ఇజ్రాయెల్ పధకం. సిరియాను విభజిస్తే ఐరోపాకు చమురు పైపులు నిర్మించుకోవచ్చన్నది సౌదీ-గల్ఫ్ దేశాల కుట్ర. ఈ విధంగా సామ్రాజ్యవాదులు, గల్ఫ్ రాజులు తమ తమ ప్రయోజనాల కోసం సిరియాలో ఆరని మంట రగిల్చారు. అంతిమంగా సిరియా ప్రజల దైనందిన జీవనం ఛిద్రం అవుతున్నది. వారి నేల, నీరు, గాలి, ఆకాశం ఏవీ వారికి కాకుండా పోయాయి. ప్రజల ఇళ్ళు-ఊళ్ళు, ఆట-పాట, చదువు-సంద్య… సమస్తాన్ని యుద్ధ ట్యాంకర్లు, వైమానిక దాడులు, రసాయన దాడులు దురాక్రమించాయి. శక్తివంతమైన మదపుటేనుగుల వ్యూహ ప్రతివ్యూహాలను సాయుధులై ప్రతిఘటిస్తున్న సిరియన్లు ప్రస్తుతం ఈ భూ మండలపైన అత్యంత శౌర్యశాలురు.
యెమెన్ లో ఇరాన్ అనుకూల షియా తెగలు (హౌతీలు) ప్రజల మద్దతుతో తిరుగుబాటు చేసి విస్తారమైన ప్రాంతాలను తమ అదుపులో ఉంచుకున్న నేపధ్యంలో సౌదీ నేతృత్వంలో గల్ఫ్ రాజ్యాలు హౌతీల పైన యుద్ధం ప్రకటించాయి. రాజధాని సనా వరకే పరిమితమైన అమెరికా-సౌదీ-ఇజ్రాయెల్ అనుకూల ప్రభుత్వాన్ని కాపాడేందుకు అక్కడ నరమేధం సాగిస్తున్నాయి. వైమానిక దాడులతో, డ్రోన్ బాంబులతో యెమెన్ ప్రజలను ఊచకోత కోస్తున్న సౌదీ అరేబియాతో 110 బిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకం ఒప్పందాన్ని ట్రంప్ ప్రభుత్వం గత మే నెలలో కుదుర్చుకుంది. సౌదీకి ఒబామా సైతం అమ్మడానికి నిరాకరించిన మిసైల్ రక్షణ వ్యవస్థలను ట్రంప్ అమ్ముతున్నాడు. ఇతర ఒప్పందాలను కూడా కలిపితే అమెరికా-సౌదీల ఒప్పందాల మొత్తం విలువ 380 బిలియన్ డాలర్లని ఆల్-జజీరా (కతార్) ఛానెల్ తెలిపింది. ఇసిస్ తీవ్రవాదులకు ఆయుధ, ధన సాయం చేస్తున్న సౌదీ అరేబియాకు అధునాతన ప్రమాదకర ఆయుధాలను అమ్మడానికి వ్యతిరేకంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విమర్శలను ట్రంప్ లెక్క చేయటం లేదు. దేశంలో నియో-కాన్ గ్రూపు దాడులతో బలహీనపడిన ట్రంప్ కు సొంత ప్రతిష్ఠ పెంచుకోవటానికి సౌదీ ఆయుధ ఒప్పందం తురుపు ముక్క అయింది.
సౌదీ అరేబియాకు కొత్త పాలకుడుగా మహమ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టనున్నాడు. సల్మాన్ కు ట్రంప్ పూర్తి మద్దతు అందిస్తున్నాడు. ‘బచర్ ఆఫ్ యెమెన్’ గా దుష్కీర్తి పొందిన వ్యక్తి మహమ్మద్ బిన్ సల్మాన్. ఫైటర్ జెట్లతో, డ్రోన్ విమానాలతో దాడులు చేస్తూ యెమెన్ ప్రజలను, ప్రజా నిర్మాణాలను విచక్షణా రహితంగా కూల్చివేయడం వెనుక ప్రధాన హస్తం సల్మాన్ దే. ట్రంప్ సలహాతో గల్ఫ్ రాజ్యాలను రెచ్చగొట్టి కతార్ ను ఒంటరిని చేయడంలోనూ సల్మాన్ దే ప్రధాన పాత్ర.
ట్రంప్ ఏలుబడిలో ఇసిస్ కార్యకలాపాలు సరికొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా ఫిలిప్పైన్స్ లో ఇసిస్ తీవ్రవాదులు బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. కొత్త అధ్యక్షుడు డ్యూటెర్టే అమెరికాను విమర్శిస్తూ చైనాకు దగ్గర అవుతుండటం అమెరికా ఆధిపత్యానికి ససేమిరా నచ్చని విషయం. ఫలితమే ఫిలిపైన్స్ లో ఇసిస్ దాడులు. అమెరికా గూఢచార సంస్ధలు అక్కడ ఇసిస్ మూకలను ప్రవేశపెట్టడం వెనుక ఫిలిప్పైన్స్ కమ్యూనిస్టు గెరిల్లా పోరాటానికి ఉగ్రవాద ముద్ర తగిలించే లక్ష్యం కూడా ఉన్నది. ఇసిస్ సాకు చూపి ఫిలిప్పైన్స్ ప్రజలు సాగిస్తున్న గెరిల్లా పోరాటాన్ని ప్రత్యక్షంగా అణచివేసేందుకు అమెరికా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఫిలిప్పైన్స్ లో దాడులతో ఇసిస్ కార్యకలాపాలు ఫార్-ఈస్ట్ ఆసియా ప్రాంతానికి సైతం విస్తరించినట్లయింది.
ఒబామా పాలన చివరి దశలో ఇరాన్ తో సంబంధాలు మెరుగుపడటానికి కొన్ని అడుగులు పడ్డాయి. దశాబ్దాలుగా ఇరాన్ పై విధించిన ఆంక్షలలో కొన్నింటిని ఒబామా ఎత్తివేశాడు. ఫలితంగా ఇరాన్ కు చమురు వాణిజ్య అవకాశాలు పెరిగాయి. ఇండియా లాంటి దేశాలు నాణ్యమైన ఇరాన్ చమురు దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. డొనాల్డ్ ట్రంప్ ఈ సానుకూల వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రకటనలు తీవ్రం చేశాడు. ఇసిస్, ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్థల మద్దతు ఇచ్చి ప్రోత్సహించే సౌదీ అరేబియాను వదిలిపెట్టి ఇరాన్ పైన తీవ్రవాద ముద్ర వేసేందుకు ట్రంప్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలతో సంబంధాలు పెంచుకుని ఆర్ధిక, వాణిజ్య లబ్ది పొందడంతో పాటు మధ్య ప్రాచ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్యం కొనసాగించుకునేందుకు ఇరాన్ కంటే సౌదీ, ఇజ్రాయెల్ దేశాలే మెరుగని ట్రంప్ భావిస్తున్నాడు. ఇరాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా సౌదీ, ఇజ్రాయెల్ లను దూరం చేసుకోవడం ట్రంప్ కు ఇష్టం కాదు. అమెరికాలో అత్యంత శక్తివంతమైన యూదు లాబీ (ఏఐపిఏసి – అమెరికన్ ఇజ్రాయెలీ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ) ని దూరం చేసుకుంటే తనకు మరిన్ని కష్టాలు తప్పవని ట్రంప్ కు తెలుసు.
………(రెండో భాగంలో లాటిన్ అమెరికా, చైనా…)
GST పైన ఒక పూర్తి వ్యాసం వ్రాయగలరా..
మన ప్రభుత్వం ఆఘమేఘాలమీద పాన్ కు ఆధార్ అనుసంధానం. జిఎస్టి జులై 1 నుండి ఆతృతగా దేశానికి కీడైనా పెట్టడం. వీటి వెనక ఏమిజరుగుతుందో సవివరంగా తెలియజేయగలరు