………….మొదటి భాగం తరువాత
లాటిన్ అమెరికా
ఒబామా పాలన చివరి సంవత్సరాల్లో అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్ అమెరికాలో పాల్పడిన కుట్రలు కొన్ని విజయవంతం అయ్యాయి. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావేజ్ ను పోలోనియం ఇంజక్షన్ ద్వారా చంపేశారు. చావేజ్ స్ధానంలో అధ్యక్ష పదవి చేపట్టిన మదురో ప్రభుత్వాన్ని కూలదొసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. మదురోపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. బడ్జెట్ లో ఒక ప్రొసీజర్ లో చేసిన తప్పును పెద్దది చేసి బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పై అభిశంసన తీర్మానం ఆమోదింపజేయించి ఆమెను పదవీచ్యుతురాలిని చేశారు. అమెరికా-క్యూబా సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అర్జెంటీనాలో అమెరికా వ్యతిరేక కిష్నర్ ప్రభుత్వాన్ని కూలదోశారు.
ఈ విధానాలను డొనాల్డ్ ట్రంప్ మరింత తీవ్రతతొ కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా వెనిజులాపై అప్రకటిత యుద్ధాన్ని విస్తరిస్తున్నాడు. ధనిక వర్గాలతో నిండిన ప్రతిపక్ష పార్టీని అడ్డం పెట్టుకుని అల్లర్లు రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షం సమీకరించిన కిరాయి మూకలకు పారా మిలటరీ శిక్షణ ఇప్పించి వారి చేత వెనిజులా నగరాలలో విధ్వంసం సృష్టింప జేస్తున్నారు. ఈ కిరాయి మూకలు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. చావెజ్ మద్దతుదారుడైన నల్ల జాతి వ్యక్తి ఒర్లాండో ఫిగుయెరాను కత్తులతో పొడిచి సజీవంగా చంపివేసిన కిరాతకం ఆ దేశంలో చావెజ్ మద్దతుదారులు, ప్రతిపక్ష కిరాయి మూకల మధ్య వీధి యుద్ధాలు చెలరేగటానికి కేంద్రం అయింది. లిబియాలో గడాఫీ హత్య అనంతరం ఆల్-ఖైదా మూకలు ఆఫ్రికా నల్లజాతి ప్రజలపై హత్యాకాండ సాగించినట్లే, అమెరికా తెల్ల పోలీసులు నల్ల జాతి యువకులను విచక్షణా రహితంగా కాల్చి చంపుతున్నట్లుగానే వెనిజులా ధనిక వర్గాల పోషణలోని కిరాయి మూకలు ఆ దేశం లోని నల్ల జాతి ప్రజలపై హత్యలు సాగిస్తున్నారు. వెనిజులాలో వర్గ వైరం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఒర్లాండో తల్లి తన కొడుకు హత్యపై ప్రభుత్వ టి.వి చానెల్ లో మాట్లాడినందుకు ఆమె పని చేస్తున్న కంపెనీ ఆమెను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేసింది. వెనిజులా ప్రైవేటు మీడియా మొత్తం ప్రతిపక్షానికి చెందిన ధనికవర్గాల చేతుల్లో ఉన్నది. ఈ ధనికవర్గాలు సిఐఏ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు. అందువల్ల ప్రజలు వాస్తవాల కోసం ప్రభుత్వ టి.వి పైనే ఆధారపడతారు. ఈ పరిస్ధితుల్లో కిరాయి మూకలు ప్రభుత్వ టి.వి (టెలిసుర్) విలేఖరులను తగులబెట్టి చంపివేస్తున్నారు.
విధ్వంసం, అల్లర్లు వెనిజులా ప్రతిపక్ష పార్టీకి ఇష్టమైన నిరసన రూపం. పేద, శ్రామిక వర్గాల కోసం చావెజ్ ప్రవేశపెట్టిన సంస్కరణల విధానాలను ప్రతిబింబించే నిర్మాణాలను తగలబెట్టడం, కూల్చివేయడం, పనికిరాకుండా చేయడం ఒక పనిగా కిరాయి మూకలు పెట్టుకున్నాయి. నెలల నిండకుండా పుట్టిన పసిపిల్లల సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక ప్రసూతి వార్డును సైతం, అక్కడ పదుల సంఖ్యలో పసి బిడ్డలు ఉండగానే, వారు తగలబెట్టారు. కుట్రలతో అబద్ధపు సాక్షాలతో ప్రతిపక్షం దాఖలు చేసే పిటిషన్ లను తిరస్కరిస్తున్నందుకు వెనిజులా సుప్రీం కోర్టును కూడా తగులబెట్టే ప్రయత్నం చేశారు. 15 లక్షల కుటుంబాలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చినందుకు గాను వెనిజులా ప్రభుత్వ హౌసింగ్ బోర్డు కార్యాలయాలను తగల బెట్టారు. ఇలా శ్రామిక ప్రజల కోసం చావెజ్-మదురో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలపై తీవ్రం విద్వేషాన్ని ధనికవర్గాల ప్రతిపక్ష పార్టీలు వెళ్లగక్కుతున్నాయి. చర్చలు, ఉమ్మడి అవగాహన వారికి వద్దు. వారి ఏకైక లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని కూలదోసి ఛావెజ్ సంస్కరణలను వెనక్కి తిప్పడం, అమెరికా పశ్చిమ బహుళజాతి కంపెనీల దోపిడీకి స్వేచ్ఛా ప్రవేశం కల్పించడం.
- Not protesters, trained arsonists
- Opposition leader shakes hand with arsonists
- Paramilitry trained protesters in Venezuela
- Protesters’ arson in Venezuela
- Protesters use malatov coktails
- Protesters wreck havoc in Caracas, Venezuela
వెనిజులా కిరాయి మూకలతో పాటు సిఐఏ ప్రాపకం లోని కొలంబియా డెత్ స్క్వాడ్ లు కూడా చావెజ్ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నాయి. చావెజ్ ఉన్నప్పుడే వెనిజులాలో ప్రవేశించిన ఈ దళాలు మదురో హయాంలో మరింత విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. వెనిజులాలో అమెరికా సాగిస్తున్న దుర్మార్గాలు ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి. దేశంలోని మీడియా, అంతర్జాతీయ మీడియా రెండూ సామ్రాజ్యవాదులే నియంత్రింస్తున్నందున ఈ పరిస్ధితి నెలకొంది. వాస్తవాలు చెప్పకపోగా మదురో ప్రభుత్వంపై అనేక కట్టుకథలను మీడియా ప్రచారంలో పెడుతోంది. వెనిజులా చమురు ఎగుమతి చేసి సమస్త సరుకులు దిగుమతి చేసుకుంటుంది. కానీ దిగుమతులు ప్రతిపక్ష మద్దతుదారులైన వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దానితో అటు ధరలు పెరుగుతున్నాయి; ఇటు సరుకులు అందక ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షల వలన వెనిజులా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు మదురో డీమానిటైజేషన్ చర్య ప్రకటించాడు. కానీ ఫలితం ఉండకపోగా ప్రజలు ఇబ్బంది పడతారని గ్రహించి వెంటనే ఉపసంహరించుకున్నాడు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దేశ ఆర్ధిక నాడులు ధనికవర్గాల చేతుల్లో ఉండడంతో పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో చావెజ్ పార్టీ ఓటమి ఎదుర్కోవడం తప్పదని పరిశీలకుల అంచనా. ప్రతిపక్ష కిరాయి మూకలను ఎదుర్కొనేందుకు చావెజ్ హయాంలోనే లక్షమందితో సివిల్ మిలీషియాను ఏర్పరిచారు. మదురో వారి సంఖ్యను 5 లక్షలకు పెంచుతామని ఇటీవల ప్రకటించాడు. ఎన్ని చేసినప్పటికీ ఎన్నికల్లో మదురో విజయం సాధిస్తే అదొక అద్భుతమే కాగలదు.
బ్రెజిల్ లో ప్రజాస్వామ్య ఎన్నికల్లో రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయిన దిల్మా రౌసెఫ్ ను అమెరికా ప్రాపకం లోని ప్రతిపక్షాలు పార్లమెంటరీ కుట్ర ద్వారా కూల్చివేశాయి. బడ్జెట్ నివేదికలో బిజినెస్ రూల్స్ ప్రకారం నివేదించవలసిన అంశాలు నివేదించకపోవడాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. స్థానిక మరియు అంతర్జాతీయ మీడియా సాయంతో దిల్మా అవినీతిపై చిలవలు పలవలుగా కధలు అల్లి ప్రచారం చేశాయి. పార్లమెంటు సభ్యులను కొనేసి ఆమెపై అభిశంశన తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ప్రజల వేలితో ప్రజల కన్నె పొడిచారు. ఇంతా చేసి దిల్మా స్ధానంలో అధ్యక్ష పదవి చేపట్టిన మిచెల్ టెమార్ దిల్మా అభిశంసనకు ముందే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దిల్మా అవినీతి ఆమె పదవీచ్యుతికి కారణం అయితే మిచెల్ అధ్యక్షుడు కాకుండా ఉండాలి. దిల్మా పదవీచ్యుతికి కారణం ఆమె నేతృత్వం లోని వర్కర్స్ పార్టీ అమలు చేస్తున్న సంస్కరణ విధానాలే. వాల్ స్ట్రీట్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లు డిమాండ్ చేస్తున్నట్లుగా పూర్తి స్థాయి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడానికి ఆమె దిల్మా రౌసెఫ్ వెనకడుగు వేసింది. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న మిచెల్ టెమర్ వాల్ స్ట్రీట్ కు సై అన్నాడు. ఫలితంగా దిల్మా స్ధానంలో మిచెల్ ను కూర్చోబెట్టేందుకు ఆరు నెలల పాటు బ్రెజిల్ లో గొప్ప రాజకీయ నాటకం నడిచింది.
దిల్మా రౌసెఫ్, వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు లూలా డిసిల్వా శిష్యురాలు. 1980లలో నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా సాగిన గెరిల్లా పోరాటంలో ఆమె పాల్గొన్నారు. లూలా నాయకత్వంలో వర్కర్స్ పార్టీ మొదటిసారి అధికారం చేపట్టాక వివిధ కార్మిక వర్గ అనుకూల చట్టాలను తెచ్చారు. ఈ చట్టాల వలన శ్రమ సంపదలో కొంత మెరుగైన వాటా కార్మిక వర్గానికి దక్కింది. అదీ స్వల్పంగా మాత్రమే. ఈ స్వల్ప వాటా కూడా కార్మికవర్గానికి చేరడం ధనిక, వాల్ స్ట్రీట్ వర్గాలకు కంటగింపు అయింది. సర్వత్రా సామ్రాజ్యవాద సంక్షోభం నెలకొన్న నేపధ్యంలో కార్మికవర్గం నుండి గరిష్ట మొత్తాన్ని లాక్కునేందుకు పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వర్గాలు నూతన ఆర్ధిక విధానాలను తీవ్రం చేశాయి. ఆ విధానాలకు దిల్మా ప్రభుత్వం నుండి స్వల్ప ప్రతిఘటన ఎదురయింది. కార్మిక చట్టాలను బలహీన పరిచేందుకు ఆమె అంగీకరించలేదు. పెన్షన్ సంస్కరణలను వాయిదా వేసింది. మిచెల్ టెమర్ పదవి చేపట్టిన వెంటనే అత్యంత వేగంగా వాల్ స్ట్రీట్ డిమాండ్లను నెరవేర్చే పనిలో పడిపోయాడు. దాన్ని బట్టే దిల్మా పదవీ చ్యుతికి కారణం ఏమిటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడి పైన కూడా అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. 2014 ఎన్నికల నిధుల కోసం దిల్మా, మిచెల్ ఇద్దరూ కార్పొరేట్ల నుండి ముడుపులు అందుకున్నారని, ప్రతిఫలంగా కార్పొరేట్లకు మేలు చేస్తామని హామీ ఇచ్చారనీ తాజా ఆరోపణ. ఈ ఆరోపణపైన ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. ఈ నేపధ్యంలో మిత్ర పక్షాలు మిచెల్ టెమర్ పై కత్తులు దూస్తున్నాయి. టెమర్ పైన కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. దానితో ‘బ్లాక్ బస్టర్ రిఫార్మ్స్’ గా ఫోర్బ్స్ లాంటి పత్రికలు ఆకాశానికి ఎత్తిన మిచెల్ సంస్కరణలు ఏమవుతాయోనని అమెరికా, పశ్చిమ బహుళజాతి కంపెనీలకు భయం పట్టుకుంది. కానీ మిచెల్ కొనసాగినట్లయితే తన పదవిని నిలుపుకోవటానికి వాల్ స్ట్రీట్ అనుకూల సంస్కరణలను ఆయన నీరు గార్చవచ్చని పశ్చిమ వాణిజ్య పత్రికలు కొన్ని అంచనా వేస్తున్నాయి. కాబట్టి మిచెల్ ను తప్పించి అనుకూలుడైన కొత్త ముఖాన్ని పదవిలో ఉంచడం భేషైన పని అని అమెరికా విశ్లేషణా సంస్థలు సలహా కూడా ఇస్తున్నాయి. కనుక అమెరికా వాల్ స్ట్రీట్ ప్రయోజనాల కోసం మరో పార్లమెంటరీ కుట్రకు ట్రంప్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్ధిక విధానాలు – చైనా
‘అమెరికా ఫస్ట్’ అన్నది ట్రంప్ నినాదం. ఈ నినాదం దానంతట అదే తప్పు కాదు. ఏ దేశమైనా తన ప్రయోజనాలను సంరక్షించుకోవడం సహజమైనదే. కానీ ట్రంప్ నినాదం లక్ష్యం వేరు అని ఆయన ప్రభుత్వం ప్రకటించిన ట్రేడ్ ఎజెండా స్పష్టం చేస్తున్నది. పదవి చేపట్టిన నాటి నుండి రక్షిత (ప్రొటెక్షనిస్టు) విధానాలకు ఆయన మద్దతు ప్రకటిస్తూ వచ్చాడు. చైనా, ఇండియా లాంటి దేశాలకు అమెరికా మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ తరలిపోయిందని వాపోయాడు. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమను వెనక్కి తెప్పిస్తానని శపధం చేశాడు. ఈ ప్రకటనలను ఐరోపాతో సహా ప్రధాన దేశాలన్నీ విమర్శించాయి. చివరికి ఈయూ నాయకుడు జర్మనీ అమెరికాను నమ్ముకుని లాభం లేదని ప్రకటించేవరకూ పరిస్ధితి వెళ్లింది.
అనేక దేశాలతో, ముఖ్యంగా చైనాతో, వాణిజ్య లోటు అమెరికాకు భారం అయిందని దాన్ని తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. సరిగ్గా ఈ వాణిజ్య లోటు ట్రంప్ వాణిజ్య విధానంలో తురుపు ముక్క కానున్నదని ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య ఎజెండా స్పష్టం చేస్తున్నది. ఒక దేశ వాణిజ్య లోటు అంటే ఆ దేశం ఎగుమతి చేసే సరుకుల కంటే అవతలి దేశం నుండి దిగుమతి అయ్యే సరుకుల విలువ అధికంగా ఉన్నదని అర్ధం. అమెరికా వాణిజ్య లోటు అంటే అవతలి దేశం అమెరికాకు చేసే ఎగుమతుల ద్వారా మిగులు పోగు చేసుకుంటోందని అర్ధం. ఈ వాణిజ్య లోటును ఆయుధంగా ట్రంప్ మలుచుకోనున్నాడు. అమెరికా కార్పొరేషన్లకు అనువుగా ఆయా దేశాలు తమ మార్కెట్లను మరింత బార్లా తెరవకపోతే గనక దిగుమతులపై సుంకాలు, ఆంక్షలు విధించవలసి ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు చేయనున్నాడు. (ఇప్పటికే చేస్తున్నాడు కూడా.) అమెరికా మార్కెట్ ను మూసేస్తానని బెదిరించనున్నాడు. సబ్సిడీలు ఎత్తివేయాలని, ప్రభుత్వ రంగ కంపెనీల అసమాన వాణిజ్య పద్ధతులు విడనాడాలని, ఉద్దేశపూర్వకంగా కరెన్సీ విలువను మేనిపులేట్ చేయవద్దని (కరెన్సీ పూర్తి కన్వర్టిబులిటీ అమలు చేయాలని) డిమాండ్ చేయనున్నాడు. చైనా, ఐరోపా, ఇండియాలతో సహా అనేక దేశాలు అమెరికా వినియోగంపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా వినియోగం కోసం ఎగుమతులు చేస్తూ డాలర్లు ఆర్జిస్తున్నాయి. ఈ ఎగుమతులకు ఆటంకం ఏర్పడితే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోయి వాటి ఆర్ధిక వ్యవస్థలు తల్లకిందులు అవుతాయి. ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు ఇది మరింత తీవ్రంగా హాని చేస్తుంది. సబ్సిడీలు ప్రజలకు ఎంతో కొంత అండగా ఉండగా ప్రభుత్వరంగ కంపెనీలు ఇప్పటికీ అనేక అవసరాలు తీర్చుతున్నాయి. కరెన్సీ విలువ హెచ్చు తగ్గుల పాక్షిక నియంత్రణ ద్వారా ధరలు, ద్రవ్యోల్బణం లను కొంతమేరకైనా అదుపులో ఉంచుతున్నాయి. ట్రంప్ డిమాండ్లు వీటిని అసాధ్యం చేస్తాయి. అమెరికాకు, డాలర్ కు పూర్తి పెత్తనాన్ని ఇచ్చేస్తాయి.
కనుక ట్రంప్ ప్రకటించిన ‘అమెరికా ఫస్ట్’ నినాదం అసలు లక్ష్యం అమెరికా కంపెనీల కోసం ఇతర దేశాల మార్కెట్లను మరింత బహిరంగం కావించటమే. డబల్యూటిఓ, నాఫ్తా, టిపిపి (ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్), టిటిఐపి (ట్రాన్సట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ పార్టనర్షిప్) లాంటి బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలకు ట్రంప్ వ్యతిరేకంగా ఉండటానికి కూడా ఇదే కారణం. బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల కంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకే ట్రంప్ మొగ్గు చూపుతున్నాడు. డబల్యూటిఓ కు ముందు ‘సూపర్ 301 పేరుతో అమెరికాలో ఒక చట్టం ఉండేది. ఈ చట్టం ప్రకారం తనకు నచ్చని వాణిజ్య విధానాలు పాటించే విదేశాలపై అమెరికా ఏకపక్షంగా చర్యలు తీసుకోవచ్చు. డబల్యూటిఓలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పరిచారు. అనగా అమెరికా ఏకపక్షంగా చర్య తీసుకుంటే అవతలి దేశం డబల్యూటిఓ కు ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా కూడా WTO సభ్య దేశమే కనుక తీర్పును పాటించవలసి ఉంటుంది. ఆ విధంగా WTO వాణిజ్య వివాద పరిష్కార వ్యవస్థ ‘సూపర్ 301’ ను నామమాత్రం చేసింది. ఇప్పుడు ఈ ‘సూపర్ 301’ ను పునరుద్ధరించాలని ట్రంప్ ట్రేడ్ అజెండా ఉద్ఘాటించింది. ఈ ఆలోచనతోనే బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ వ్యతిరేకిస్తూ ద్వైపాక్షిక ఒప్పందాలకు మద్దతు ఇస్తున్నాడు. ద్వైపాక్షిక ఒప్పందాల వాతావరణంలో ‘సూపర్ 301’ కు కొత్త శక్తులు వచ్చి చేరతాయి. అమెరికా దాష్టీకం చెల్లుబాటు అవుతుంది.
అయితే చైనా లాంటి దేశాలపై ‘సూపర్ 301’ ప్రయోగం పని చేయబోదు. ఎందుకంటే చైనాకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు చైనా అంతే అవసరం. రెండు ఆర్ధిక వ్యవస్థలూ ఒకదానినొకటి ముడిపడి ఉన్నాయి. అమెరికా సావరిన్ ఋణ బాండ్లలో అతి పెద్ద పెట్టుబడిదారు చైనాయే. వ్యయాన్ని భారీగా పెంచేందుకు పధకం వేసుకున్న ట్రంప్ ప్రభుత్వం అతి పెద్ద ఋణదాత అయిన చైనాతో శతృత్వం వల్ల తన పధకానికి నీళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. చైనాలో పెద్ద సంఖ్యలో ఉన్న అమెరికా కార్పొరేట్ కంపెనీలపై కార్మిక చట్టాలను విధించవచ్చు. ఆంక్షలు విధించవచ్చు. వాణిజ్య, ఉత్పత్తి కార్యకలాపాలపై ఒత్తిడి తెచ్చేలా విధానాలు చేయవచ్చు. ఇవన్నీ తిరిగి ట్రంప్ / అమెరికా కంపెనీల పైననే ఎదురు కొడతాయి.
ట్రంప్ ప్రధాన వ్యాపారమైన రియల్ ఎస్టేట్ లో లాభాలను గరిష్టం చేసుకోవడానికి ప్రొటెక్షనిస్టు విధానాలు సహకరించవు. ట్రంప్ బ్రాండ్ ద్వారా ట్రంప్ వ్యాపార సంస్ధలు ప్రధానంగా ఆర్జిస్తున్నాయి. ఇందుకు విదేశాల లోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చట్టాలతో సఖ్యత, అవగాహన అవసరం. అనగా ప్రొటెక్షనిస్టు విధానాలు ట్రంప్ వ్యాపారాలకు కూడా గండి కొడతాయి.
ఈ నేపధ్యంలో ట్రంప్ ప్రకటించిన ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని లోతుగా పరిశీలించి అర్ధం చేసుకోవాలి. ప్రొటెక్షనిస్టు విధానాలనే అమలు చేస్తే గనక ఇతర దేశాలు కూడా అవే విధానాలను చేపడతాయి. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు నెమ్మదిస్తాయి. ఆయా దేశాలు తమ తమ సొంత మార్కెట్లను అభివృద్ధి చేసుకునే పనిలో పడతాయి. మేధో వలస తగ్గిపోతుంది. విద్య పూర్తి చేసినవారు తమ దేశంలోనే ఉపాధి పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆయా దేశాల్లోని కార్మికవర్గానికి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. ఉపాధి దొరక్క పోతే ఆందోళనలలోకి దిగుతారు…..! కానీ ట్రంప్ చెప్పే ప్రొటెక్షనిస్టు ‘అమెరికా ఫస్ట్’ నినాదం ఇలాంటిది కాదు. ఆయన అసలు ఉద్దేశం పేద, బలహీన దేశాలను మరింత బలీయంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థకు కట్టిపడేసి, చైనా ఎదుగుదలను అడ్డుకుని, బహుళ ధృవ ప్రపంచ ఆవిర్భావానికి చెక్ పెట్టి అమెరికాను తిరిగి ఏకైక అగ్రరాజ్యంగా నిలపడమే. వీలు కాకపోతే బహుళ ధృవ వ్యవస్ధలో సాధ్యమైనంత గరిష్ట దోపిడీని సాధించడం!
………………అయిపోయింది.