(పద్మజ షా గారు జర్నలిస్టు. హైదరాబాద్ నివాసి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కాలమిస్టు. ఈ ఆర్టికల్ మొదట ఆంగ్లంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో అచ్చయింది. తెలుగు అనువాదం మాతృక -మహిళా మాస పత్రిక- లో అచ్చయింది. అనువాదం చేసింది నేనే గనుక బ్లాగ్ లో ప్రచురిస్తున్నాను. -విశేఖర్)
ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ ఇలా అంటాడు: “మనం జబ్బు పడకుండా ఉండాలంటే చివరి ప్రయత్నంగా మనం ప్రేమించడం మొదలు పెట్టాలి. ప్రేమించ లేకపోతే కనక… మనం జబ్బు పడక తప్పదు.” మనిషిని వివేకవంతునిగా ఉంచటంలో అత్యంత అవసరమైన మానవ స్వాభావిక ప్రవృత్తి ప్రేమ. కులం, వర్గం, మతం, జాతి లేదా తెగ.. ఇత్యాదిగా గల సకల కృత్రిమ విభజనలను ప్రేమ అధిగమిస్తుంది. అది ఒకరి ఆదేశాల్ని అనుసరించి ప్రదర్శితం అయ్యేది కాదు; అది జరగాలని మీరు స్వయంగా ఆదేశిస్తే, జరుగుతుంది; దాని అవసరం లేదని మీరు భావిస్తే అది సంభవించదు.
కులం పేరుతో, రోమియో వ్యతిరేక దళాల పేరుతో లేదా లవ్ జిహాద్ పేరుతో ప్రేమలో ఉన్న యువతీ యువకులపై దాడులు జరగడం అంతకంతకూ పెరుగుతుండడం బట్టి, కండలు పెంచినప్పటికీ అస్వస్థంగా ఉన్న సమాజం మన చుట్టూ వ్యాపించి ఉన్నదని స్పష్టం అవుతోంది. ఈ రోగ పీడిత సమాజానికి ప్రేమ అంటే ఒక చెడ్డ పదం –అదొక చెడ్డ భావోద్వేగం. ప్రేమ అంటే, ఒకరి మానవత్వం తన అసలు స్వభావంతో ఆవిష్కృతం కావటం అని అర్ధం చేసుకోగల సామర్ధ్యం దానికి లేదు.
ప్రేమ రహిత అస్వస్థ సమాజం ఒక రోమియో వ్యక్త పరిచే ప్రేమ పొంగును నాశనం చేసేస్తుంది. అతని ప్రేమకు జూలియట్ తన ప్రేమ ద్వారా ప్రతిస్పందించడం వారి ఆగ్రహానికి కారణం అవుతుంది. రోమియో అండ్ జూలియట్ కధను షేక్ స్పియర్ 1590లలో రచించాడు. తెలంగాణలో మంథనికి చెందిన మన యువకుడు మధుకర్ లేదా తమిళనాడులో కుమార లింగం గ్రామానికి చెందిన వి శంకర్.., ఈ ఇద్దరు ఉన్నత కులానికి చెందిన యువతులతో ప్రేమలో పడినందుకు క్రూరంగా హత్యకు గురయ్యారు. వారు ఇద్దరిలో ఎవ్వరూ యువతులను వెంటబడి వేధించలేదు. వారి ప్రేమలకు యువతులు ఇద్దరూ సానుకూలంగానే స్పందించారు.
- Shankar & his fiancée
- Shankar hacked to death
- Shankar dead body
- Madhukar death -10tv news
“మన భారతీయులం ప్రేమ వల్ల చాలా అవమానానికి గురవుతాం, కానీ హింస విషయానికి వచ్చేసరికి చెలరేగిపోతాం. టెలివిజన్, సినిమాలు లాంటి ప్రజా సాంస్కృతిక మాధ్యమాలు హింసను ఉత్సవం రీతిలో వినియోగించుకునేందుకు నిరాటంకంగా అనుమతి ఉంటుంది. కానీ ప్రేమ వ్యక్తీకరణను మాత్రం కోపంతో తిరస్కరిస్తాం; అసంతృప్తితో రగిలిపోతాం.” 1960లలో సినిమా సెన్సార్ షిప్ విషయంలో ఒక నివేదిక వెలువరిస్తూ ఖోస్లా కమిటీ ఈ మాటలు చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్ధితిలో వచ్చిన మార్పు ఏమీ లేదు.
(Watch 10TV story in full on Madhukar murder with police and politicians’ collusion)
ప్రధానంగా స్వజాతి వివాహాల వలనా, పురుషులు స్త్రీలు మధ్య వయసు తేడా విషయమై ఖచ్చితమైన నిబంధనలు ఉండటం వలనా భారత దేశంలోని వివాహ సాంప్రదాయాలలో ప్రేమ ఎన్నడూ ఒక అంశంగా లేదు. వివాహంలో లైంగిక సంపర్కం అంటే అది కేవలం పునరుత్పత్తి విధిని నిర్వర్తించటం మాత్రమే; దానిని ‘ప్రేమ’ తో ముడి పెట్టాలన్న సందిగ్ధతకు అక్కడ తావు లేదు. కొన్ని జంటలు ఈ పరిస్ధితిని అధిగమించి వివాహం అనంతరం ప్రేమను సంపాదించడంలో విజయవంతం అవుతారా, వారు ఆశీర్వదించబడ్డవారు! కానీ నిజంగా అయితే అక్కడ ప్రేమను ఆశించలేము.
కొత్త పెళ్లి కూతుళ్లు అనేక సార్లు తమ జీవిత భాగస్వాములు తమ పట్ల ఉదాసీనంగా ఉండటం గురించి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తుంటారు. త్వరగా ఒక బిడ్డను కనెయ్యమని తల్లులు వారికి తరచుగా సలహా ఇస్తుంటారు. బిడ్డను కని పడేయటం ద్వారా ఆ కుటుంబంలో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని వారి అంచనా. అంతటితో సరి! తన బిడ్డ ద్వారా (అత్తగారి) కుటుంబంలో నివాసానికి చట్టబద్ధ హక్కును సాధించడం అన్నమాట! ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని నమ్మాలి. కానీ అనేక కేసుల్లో బిడ్డ పుట్టినా పరిస్ధితిలో ఏ మార్పు ఉండదు. ఆ తర్వాత మహిళకు క్షణం తీరిక లేకుండా పోతుంది. తన లోపల నిండా నిండి ఉన్న అనంతమైన ఖాళీతనం గురించి కాస్తంత కూడా ఆలోచించలేని పని ఒత్తిడి ఆమెను చుట్టి వేస్తుంది.
కులము, సమాజం, మతం లాంటివి ముఖ్యమైన చోట కూడా ఈ తరహా సంబంధాలే వివాహాలకు పునాదిగా ఉంటాయి. తాను ఏ సమూహంలో అయితే మసులుతుందో ఆ సమూహం నిర్దేశించిన విధంగా పెళ్లి కూతురు కుటుంబంలో, సమాజంలో తన స్ధానాన్ని అర్ధం చేసుకుని ఆ విధంగా నడచుకుని తీరాలి. కొత్తగా ఎటువంటి భావజాలాన్ని వెంటబెట్టుకుని రావలసిన అవసరం లేదు. అది వృధా శ్రమ మాత్రమే. మొదటి రోజునుండే కుటుంబంలో ఇమిడిపోయే విధంగా ఆమె “సంసార పక్షంగా, క్రమ శిక్షణతో పెంచబడినదిగా” ఉండాలి. ప్రేమ ఎన్నడైనా ఆమె ముఖంలోకి తేరిపార జూస్తే అలాంటి దాన్ని గుర్తించడానికి ససేమిరా వీలు లేదు.
యువ పెళ్లి కూతురు వంట వండడంలో నిష్ణాతులై ఉండటానికి ఎంచక్కా అనుమతి ఉంటుంది. భర్త కోసం కుటుంబం కోసం ఆమె వంట కళలో పొద్దస్తమానం మునిగి తేలుతుంటే దానిని చూసి తరించడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. ఆమెకు గొప్ప గృహిణి అన్న గుర్తింపును గ్యారంటీ చేస్తుంది. పెళ్లి కూతురు నిరంతరాయంగా కుటుంబంలో సమగ్ర భాగమై కలిసిపోతూ ఉండాలి. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో స్త్రీ పురుషుల మధ్య వయసు తేడాను గట్టిగా నిర్దేశించడానికి ప్రాధమిక కారణం ఏమిటంటే ముదిమి వయసులో పురుషుడికి సేవలు చేసేందుకు స్త్రీ తగినంత పుష్టిగా ఉండాలని ఆశించడమే. వివాహం అన్నది ప్రాధమికంగా ఇల్లు చూసుకోవడానికి చేయబడ్డ వెట్టి చాకిరీ ఏర్పాటు మాత్రమే. యువకులు తమకు నచ్చిన విధంగా భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో ఎదుర్కునే ఆదుర్దాకు పునాది కూడా ఇదే. స్వతంత్రంగా వ్యవహరించే మహిళ తనకు అప్పగించబడిన పాత్రను పోషిస్తుందా లేదా అన్నదే వారి ఆదుర్దా. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా విద్యావంతులైన పెళ్లి కూతుళ్లు కొందరు తమ కొత్త కుటుంబాల అంచనాలను నీరు గార్చడం ఆశా సౌధాలను నిలువునా కూల్చివేయడం పూర్తిగా వేరే సంగతి.
పునరుత్పత్తి, పోషణ కార్యక్రమంలోనూ, వంశవృక్షాన్ని నిరంతరాయంగా పరిరక్షించడంలోనూ భార్యలు పూర్తిగా మునిగిపోయి ఉంటే పురుషులకు ఎటువంటి సామాజిక అపప్రథ ఎదుర్కొన వలసిన అవసరం లేకుండానే తమ ఆనందాలను ఇంకెక్కడో వెతుక్కోవటానికి స్వేచ్ఛ లభించడం మనం చూస్తున్నాం. దేవదాసీలు, జోగినులు లాంటి వ్యవస్థలు దేవతలు, దేవుళ్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో మత పెద్దల పూర్తి ఆమోదంతో ఎవరికి చెందని స్త్రీలను కళాత్మకంగా దోచుకునే దుర్మార్గాలు. అలాగే ప్రతి మహిళని వారి కుటుంబాలకు ఆవల పీక్కుని తినే క్రూర సాహసకృత్యాలు పురుషులకు సమాజంలో అందుబాటులో ఉన్నాయి. వారి వేట విజయవంతం అయితే సాధారణంగా అది మళ్ళీ మహిళ తప్పే అవుతుంది.
సాంప్రదాయక ఆలోచనాపరులకు ఈ ప్రేమ అనే అంశం చాలా ప్రమాదకరమైన భావోద్వేగం. అది మరొక జీవిలోని సుఖంతో సంబంధం కలిగి ఉంటుంది; వారికి చిరపరిచితమైన తమకు ఆమోదనీయమైన సామాజిక సంబంధాలకు ఆవల మాత్రమే అది వృద్ధి పొందుతుంది. కనుక సంతోషాతిశయంతో ప్రేమలో జీవించే జంటను చూసినప్పుడల్లా వారి సాంప్రదాయక మెదడు కోపంతో రెచ్చిపోతుంది. ఎందుకంటే తమ నిషిద్ధ ప్రపంచంలో ఎప్పుడోకప్పుడు వారు అనుభవించిన ఏ కాస్త ప్రేమ అయినా జారత్వంతో ముడిపడి ఉంటుంది గనుక. మీరు పెళ్లాడిన ‘మంచి క్రమశిక్షణతో పెరిగిన’ అమ్మాయి ప్రేమకు సంబంధించిన ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండకూడదు. ఒక మహిళలోని ఆ జ్ఞానం పురుషుడి ఆధిపత్యానికి సవాలుగా పరిణమించే స్వతంత్రతా చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది మరి!
ఒకరి ఉనికికి ప్రమాదంగా మారగల కారణంతో కాకుండా మరే ఇతర కారణంతో అయినా మన సొంత రకం జీవిని చంపడం అన్నది స్వజాతి విధేయతా సూత్రాలకు విరుద్ధం. మానవులుగా మనం మరొకరిని చంపటానికి తప్పనిసరిగా సంశయించాలి. కానీ భారత దేశంలో ఇతర నమ్మకాలకు, ఇతర కులాలకు లేదా ఇతర భాషలకు చెందిన వారిని “కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే” పేరుతో చంపి పారేసే ఘటనలు, చిత్రహింసలు పెట్టే ఘటనలు ప్రతి రోజూ జరిగిపోతున్నాయి.
వివిధ ప్రజా సమూహాల మధ్య తేడాలు సృష్టించడానికి మానవ నాగరికత రంగు, భాష, దేవుళ్లు లేదా నడవడికలను బాగా దుర్వినియోగ పరిచింది. ఇలాంటి బూటకపు జీవ విభిన్నతను సృష్టించే క్రమంలో మన సొంత (మానవ) జాతీయుల మధ్య ఉండవలసిన ప్రాధమిక విధేయతను ధ్వంసం చేసుకుని అగౌరవ పరిచే కృత్రిమ విభజనలను, విభిన్నతలను మనం సృష్టించుకున్నాం.
కుల వ్యవస్ధ అటువంటి బూటకపు జీవ విభిన్నతకు ఒక తుచ్ఛమైన ఉదాహరణ. మానవులు వివిధ జాతులు, తెగలు, రంగుల విభేదాలకు అతీతంగా ఉమ్మడిగా నివసిస్తూ పునరుత్పత్తి చేసుకోగలరు. ఎందుకంటే మనం అంతా మానవులమే గనుక. మన వృత్తులు లేదా నమ్మకాలు ఏకమైనప్పటికీ మనం అందరం అంతిమంగా మానవ కుటుంబానికి చెందిన వాళ్లం. సామాజికంగా-సాంస్కృతికంగా (కృత్రిమంగా) తయారు చేయబడిన మరియు రుద్దబడిన అటువంటి బూటకపు జీవ విభిన్నతలు ప్రజలు తామున్న దోపిడీ మూసలను, వివక్షలనూ బద్దలు కొట్టుకుని బైట పడకుండా నిరోధిస్తాయి.
భారత దేశ యువత ఇలాంటి విభజనల ఉడుం పట్టు నుండి బైట పడుతూ మరింత మానవీయంగా తయారవుతున్నారు. సామాజిక నిబంధనల సరిహద్దులను అధిగమిస్తూ నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తున్న వాస్తవమే అందుకు ప్రబల సూచిక. ప్రేమించగల సామర్ధ్యమే తనకు తాను వారిని మరింత వివేకవంతులుగా మరింత సహానుభూతిపరులుగా తయారు చేయడం, ఒక ఆరోగ్యవంతమైన లక్షణం కూడా. తద్వారా వారు పాత నిర్మాణాలను, సాంప్రదాయాలను -సంపదలు పోగేయడానికి వంశ వృక్షంలోని జన్యు వారసత్వంతో కూడిన కఠిన వ్యవస్ధ ద్వారా ఆ సంపదలు తామే అనుభవించగల హక్కు సంక్రమింపజేసుకోవటానికే ఈ నిర్మాణాలు సాంప్రదాయాలు రూపొందించబడ్డాయి- పరిరక్షించుకోవాలని తపిస్తున్న శక్తుల సామాజిక, రాజకీయ ఆటలకు అతీతమైన దృక్పథాన్ని నిర్మించుకుంటున్నారు.
ఈ ప్రాధమిక లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు కుటుంబ గౌరవం మరియు వారసత్వ స్వచ్ఛతల పేరుతో ఒక విస్తృతమైన సాంస్కృతిక మాయా నాటకాన్ని దాని చుట్టూ నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరియు ప్రతి ఒక్కటీ -స్త్రీలు, పిల్లలు, దేవుళ్లు, నమ్మకం, మతాచారాలు- ఈ ప్రబల, ప్రాధమిక లక్ష్యానికి లోబడి ఉండేవే. ధనిక కులాలు మరియు వర్గాల శక్తివంతమైన సాంస్కృతిక సర్వాధిపత్యం మిగిలిన సమాజంపైన తన మాయా వలను విసిరింది. పేదలు, భ్రష్టులు సైతం వారి సాంస్కృతిక మాయాజాలాన్ని మరింత స్థిర చిత్తంతో అనుసరించి అమలు చేయటానికి సిద్ధపడుతున్నారు.
ప్రపంచ నాయకత్వానికై అర్రులు చాస్తున్న 21వ శతాబ్దపు ఇండియా ఇది. ప్రేమించడం ఎలాగో మర్చిపోయిన ఇండియా ఇది. ప్రధానంగా ఉన్నత తరగతి / ఉన్నత కుల ఆధిపత్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో “రోమియో-వ్యతిరేక దళాలు” మరియు “లవ్-జిహాదిస్టు వ్యతిరేకులు” యువకులపై ఒత్తిడులు తెచ్చి తిరిగి తమ వర్గ, కుల, సమాజ, కుటుంబ పరిధుల్లోకి తెచ్చుకుంటున్నారు. కేవలం ముక్కలు చెక్కలు అయిన అటువంటి నేల పైనే ‘ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టి లబ్ది పొందే’ రాజకీయాలు వృద్ధి చెందగలవు.
మన చుట్టూ ఉన్న ప్రేమను నాశనం చేయటానికి స్వయం-ప్రకటిత ధర్మ పరాయణ కాపలాదారుల హింసను మౌనంగా చూస్తూ ఉండటం ద్వారా మనమే పరోక్షంగా ఆమోదిస్తున్నామా? లేక మన చిన్న సామ్రాజ్యాలు నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్న శక్తుల పదాతి సైనికులుగా పని చేస్తున్న కాపలాదారులను మన చేతికి మట్టి అంటకుండా ఉండే లక్ష్యంతో మనం మౌనంగా ఉన్నామా? ఇక్కడ ఒక చచ్చిపోయిన కొడుకు అక్కడ ఒక చచ్చిపోయిన కూతురు జబ్బున పడ్డ అగ్ర రాజ్యం చెల్లించవలసిన ఒక చిన్న మూల్యమా?
“మనిషిని వివేకవంతునిగా ఉంచటంలో అత్యంత అవసరమైన మానవ స్వాభావిక ప్రవృత్తి ప్రేమ.” – chalaa manchi article nu anuvadincharu, abhinandanalu…
context valla koddigaa ardhamayindi kaanee , kinda vakyam lo ‘vaariki’ taruvata vachchina vakyam koddigaa confusing gaa undi…kasta vivaram gaa cheppagalaraa?
అది మరొక జీవిలోని సుఖంతో సంబంధం కలిగి ఉంటుంది; ‘వారికి’ చిరపరిచితమైన తమకు ఆమోదనీయమైన సామాజిక సంబంధాలకు ఆవల మాత్రమే అది వృద్ధి పొందుతుంది.
సమన్వయం గారు మీ వ్యాఖ్య మీ అభిరుచిని చూపుతోంది.
‘వారికి’ అంటే ఆ పేరా ఆరంభంలో పేర్కొన్నట్లుగా ‘సాంప్రదాయ ఆలోచనాపరులు’ అని అర్ధం. అనగా కుల, మత, జాతి, భాష, లింగ విభేధాలను వివక్షలను భారతీయ సంస్కృతి ఔన్నత్యాలుగా గుర్తిస్తూ వాటిని కాపాడుకునేవారు, సమర్ధించేవారు. ఈ విభేధాలతో కూడిన సామాజిక సంబంధాలు మాత్రమే వారికి ఆమోదనీయమైనవి, గౌరవప్రదమైనవి. వారు ఆమోదించే వివక్షల భావజాలానికి అతీతంగా ప్రగతిశీలంగా ఆలోచించి ఆచరిస్తే అది వారి దృష్టిలో భారతీయ విలువల అతిక్రమించడం.
“అది మరొక జీవిలోని సుఖంతో సంబంధం కలిగి ఉండడం” అంటే? సంప్రదాయపరుల దృష్టిలో ప్రేమ అనే విలువకు స్ధానం లేదు. వారి దృష్టిలో -ఆర్టికల్ లో మరోచోట చెప్పినట్లు- ‘ప్రేమ’ అంటే ‘శారీరక వాంఛ’ అని మాత్రమే. ఎందుకంటే వారి సాంప్రదాయక ప్రపంచంలో ‘ఒకరిని ఇష్టపడటం’ అనే ప్రక్రియ ‘శారీరక వాంఛ’ (జారత్వం) తో మాత్రమే ముడిపడి ఉంటుంది. వారి సామాజిక జ్ఞానం అంతవరకే పరిమితం. వారు శారీరక వాంఛ’ కు అతీతమైన ‘ప్రేమ’ విలువను ఊహించలేరు, అనుభూతి చెందలేరు. కాబట్టి వారి దృష్టిలో ‘ప్రేమ’ అంటే తమకు తెలిసిన సామాజిక సంబంధాలకు బయట ‘జారత్వం’ అనే లక్షణంతో కూడి అభివృద్ధి చెందే ఒక చెడ్డ విలువ.
యధాతధ అనువాదం చేసినప్పుడు తెలుగు నుడికారం మిస్ అవుతుంది. అందువలన అర్ధం చేసుకోవడంలో కొన్ని పరిమితులు ఏర్పడతాయి. కాస్త స్వేచ్ఛ తీసుకుంటేనేమో రచయిత భావానికి సరిగ్గా అద్దం పట్టామా లేదా అన్న సందిగ్ధత తొలుస్తూ ఉంటుంది. దరిమిలా కొన్ని కష్టాలు తప్పవేమో!
సర్,ప్రేమ-ఆధిపత్య సమాజ భావజాలాలగూర్చి రచయిత్రి వివరించారు. కానీ,కుటుంబ పరిధులకు లోబడి తమ పనులను చూసుకొనే సామాన్య,బీదరిక కుటుంబాలలోని ఆడవారి పనితనాన్ని గూర్చి స్పస్టత వ్యాసంలో కరువైనదని నా ఉద్దేష్యం. మగవారికే పరిమితులతో కూడిన జీవన బృతిని పొందుతున్నప్పుడు,స్త్రీల విషయంలో అది మరంత బిగిసుకుపోతుంది కదా! గనుక ఆడవారి దైనందన విషయాలగూర్చి స్పష్టం గా చర్చించడంలో రచయిత్రి స్రద్ధ చూపలేదని నా భావన.
ధన్యవాదాలు సర్! మరలా మీ బ్లాగ్ లో టపాను ప్రచురించినందుకు.
మూల గారు, లోపించిందని మీరు చెబుతున్న అంశం ఈ వ్యాసం పరిధిలోనిది కాదు. ప్రేమికుల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ గణాల వైఖరి, వారికి సమాజం నుండి అందుతున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతు గురించి చర్చిస్తూ దానికి గల నేపధ్యాన్ని రచయిత్రి వివరించే ప్రయత్నం చేశారు.
దంపతీ కుటుంభం ఈకుటుంభం ఇంచుమించు ఇటీవలది.స్త్రీ పారంపర్యం నుంచి పురుషపారం పర్యానికిద్దతి ప్రకారం హీనులమనే అభిప్రాయం కలిగించారు చివరికి స్త్రీలే ఆ పరిస్తితిని అంగీకరించేటట్టు చేశారు మార్పు చెందిన తర్వాత తల్లీ, భార్యా పరిస్తితి నిర్దిస్ట పడ్డాయి. వారికి పరిమితమైన పరిదిలొ అనుకూలత కలిగించారు. కానీ విద్య మాత్రం నామమాత్రం చేశారు.పురుషునితొ సంభందాలు నిరాకరించారు.ఒక ప.భార్యా, బర్తా సమానురాలు కాదు అతనికి తొడు కాదు కుతురుయొక్క స్తానంలొ పెట్టారు.
అనుకూలుడైన భానిస స్తితికీ భర్య స్తితికీ పెద్ద తేడా లేదు.
ఆమెకు స్వాతంత్ర్యం లేకపొవడం చేత జీవితమంతా వయస్సు రానట్లుగానే వుండిపొతుంది.స్త్రీలలొ సంస్కారం పెరగాలంటే సంఘంలొ పురుషులతొ కలసి మెలసి వుండటం అవసరం. అది ఆమెకు లేకుండా చేశారు.స్త్రీలు నివసించే ఇంటిభాగం జైలు అనలేం కానీ వారికి అందులొనే బ్రతుకు ఎర్పాటు చేస్తారు.ఈ విధమైన వ్యవహారం వలన ఆడపిల్లలొ సిగ్గు బిడియం అతి అయిపొయాయి.
స్త్రీ పురుషులమద్య వుండే బలమైన ఆకర్షన వివాహానికి కారణము కాలేదు.బార్యాబర్తల మద్య వాంచకుమించి ప్రేమ అనేది గుర్తించబడలేదు. కామమే వారిమద్య అనుభందానికి కారణం. అంతకుపుర్వం కనీసం పరిచయమైనా లేకుండానే వధువును ఎరుతారు.ఆమెకుటుంభం యొక్క హూదాకూ యిచ్చే డబ్బుకూ అంధచందాలకూ మాత్రమే ప్రాదాన్యం ఇస్యారు.ఇటువంటి వివాహాలలొ నిజమైన అనుభంధం ఎర్పడదు. తరచూ నిర్లక్ష్యం అసంత్రుప్తి మాత్రమే మిగులుతాయి. వారిని ఇంట్లొ మూసిపెట్టడం వలన దారితప్పడానికి అవకాశాలు వుండవు.కానీ మగనిని మొసగించటానికి తరుచుగా ఎదూ మార్గం చూస్తునే వుంటారు.ఆస్తి పెరగటం దానిని సంతానానికి అందచేయాలనే కొరిక దంపతీ వివాహానికికారణం పిల్లలు అతని సంతానమే అయ్యెటట్లు చూడటం ఆ దంపతుల సంత్ ఆస్తిని పరిమితం చేయటం ఈ వివాహ పద్దతియొక్క లక్ష్యం.
మన ఇండియాలాంటి వలసదేశాలలొ ఇప్పటికీ మద్యయుగం నాటి నైతికత, మానసికస్తితి భలంగా వుంది . మనకన్నా ఆర్దికంగా వున్నతస్తితిలొ వున్న కువైట్లొ స్త్రీల పరిస్తితి దారునంగా వుంది వాళ్ళతొ పొల్చుకున్నప్పుడు ఇండియాలాంటి దేశాలు మెరుగనిపిస్తాయి.అభివ్రుద్ది చెందిన దేశాలతొపొల్చుకున్నప్పుడు మన స్త్రీల పరిస్తితి అట్టడుగున వుంది. అక్కడి స్త్రీలు పురుషునితొ సమానంగా గుర్తించబడ్డారు. అయితే పైన నేను వర్నించిన లక్షణాలు వాళ్ళుకుడా అనుభవించి ఆదశను దాటుకుని వచ్చారు.