కూచిభొట్ల హత్య: ఎఫ్‌బిలో కళ్యాణి గారి చర్చ


Kuchibhotla Srinivas with his wife Sunayana

[పరిచయం: కళ్యాణి SJ గారు కధలు రాస్తారు. వర్తమాన సామాజిక సమస్యలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తారు. ‘మార్క్సిజం – మతం’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసి డిప్లొమా పొందారు. సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రచనలు చేస్తుంటారు. ఫేస్ బుక్ ను ఉబుసుపోకకు కాకుండా ఉపయోగకరమైన చర్చలకు వేదికగా వినియోగించే కొద్దిమందిలో ఆమె ఒకరు. కూచిభొట్ల హత్య సందర్భంగా ఆమె హిందూత్వ ప్రతిపాదించే హిందూ జాతీయవాదంపై ఫేస్ బుక్ లో చర్చను ప్రారంభించారు. సదరు చర్చలో పాల్గొంటూ నేనూ నా అభిప్రాయం చెప్పాను. నా అభిప్రాయాన్ని బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. -విశేఖర్]

*********

చర్చ కోసం ఈ లంకె లోకి వెళ్ళండి: http://bit.ly/2lRCKD8

*********

కళ్యాణి గారు చెప్పినట్లు మోడి / హిందూత్వ మార్కు జాతీయవాదాన్ని ఖండించడానికి నిస్సందేహంగా ఇది ఒక అవకాశం. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఉంటే ఇప్పటి చర్చకు ఒక అర్ధం సమకూరుతుంది.

అన్ని రకాల జాతీయవాదాలూ ఖండనార్హం కాదు. జాతి అణచివేతకు వ్యతిరేకంగా ఒక జాతి ఐక్యం అయినపుడు అది ఖండించవలసిన జాతీయవాదం కాదు. పైగా అది అవసరమైన జాతీయవాదం.

ఇజ్రాయెల్ తన ఆర్ధిక ఆధిపత్య ప్రయోజనాలు కాపాడుకునేందుకు పాలస్తీనా అరబ్బులపై జాత్యహంకారాన్ని అమలు చేస్తుంది. యూదు జాత్యహంకార అణచివేతనుండి విముక్తి అయ్యేందుకు పాలస్తీనా జాతి, జాతీయ భావోద్వేగాలతో పోరాడితే అది సహజం, చారిత్రక అవసరం. అటువంటి జాతీయవాదాన్ని ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి, మద్దతు -వీలయితే క్రియాశీలకంగా కూడా- ఇవ్వాలి.

బ్రిటిష్ వలస అణచివేత నుండి విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటాన్ని జాతీయోద్యమంగా చెబుతారు. అయితే వాస్తవానికి భారత జాతి అనే ఏకీకృత జాతి అంటూ ఏదీ లేదు. భారత దేశం వివిధ జాతుల సమూహం. అది కూడా చారిత్రక జాతులు గిరిజన ప్రాంతాల వరకే పరిమితం. ఇతర ప్రజలు అందరూ వివిధ చోట్ల నుండి ఇక్కడికి వలస వచ్చినవారే. ఒకే భాష మాట్లాడుతున్నవారు కూడా ఒక జాతి కాదు. ఒక భాషీయులు మాత్రమే. కనుక బ్రిటిష్ పాలనపై జరిగిన పోరాటం స్వతంత్ర పోరాటమే గానీ జాతీయ పోరాటం కాదు. అది దేశభక్తి పోరాటం. వలస ఆధిపత్యం నుండి విముక్తి కోసం జరిగిన దేశ విముక్తి పోరాటం.

ఐరోపాలో రాజ్యాలు జాతి ప్రాతిపదికగా ఏర్పడినవి. జాతి ప్రాతిపదికన అక్కడ విరివిగా పోరాటాలు జరిగాయి. ఆ నేపధ్యం నుండే జర్మనీ జాతి సుప్రిమసీ గురించిన జాత్యహంకార భావోద్వేగాన్ని హిట్లర్ రెచ్చగొట్టగలిగాడు. అక్కడి జాతులకు చారిత్రక పునాది ఉన్నది. భాష, సంస్కృతి, జీవన విధానం… ఇలాంటి అంశాలలో హోమోజీనిటీ అక్కడ కనిపిస్తుంది. ఇవి చారిత్రక పరిణామంలో అభివృద్ధి చెంది ఏర్పడిన జాతులు. కనుక సమసమాజ పరిస్ధితులు ఏర్పడి ఆ పరిస్ధితుల అభివృద్ధికి తగిన భద్రత సమకూరేవరకూ ఆధిక్యతా భావనలకు తావులేని జాతీయ ఐక్యత, భావోద్వేగాలు, ఉమ్మడి ప్రయోజనం, ఉమ్మడి లక్ష్య సాధన… ఇవన్నీ ప్రాసంగికతను కలిగి ఉంటాయి. ఒక జాతిని మరొక జాతి, ఒక మనిషిని వేరొక మనిషి, ఒక దేశాన్ని మరొక దేశం అణచి ఉంచి దోపిడీ చేయగల పరిస్ధితులు నశించిన తర్వాత జాతి తన ప్రాసంగికతను కోల్పోతుంది. వైరుధ్యాలు నశించినప్పుడు ఒక్క జాతి మాత్రమే కాదు, ప్రాంత, లింగ, సంఖ్యాక… తదితర అస్తిత్వాలన్నీ తన ఉనికిని కోల్పోతాయి.

ఐరోపాకు మల్లేనే ఆఫ్రికాలో సైతం అనేక జాతులు ఉన్నాయి. అవి ఇప్పటికీ అణచివేత, ఆధిపత్యాలకు గురవుతున్నాయి. సామ్రాజ్యవాద దేశాల జోక్యం వల్ల కొన్ని నల్ల జాతులు ఇతర నల్ల జాతులపై ఆధిక్యతా ధోరణులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి జాతుల ఘర్షణలను సంకుచిత మనస్తత్వంగా కొట్టిపారవేయడానికి వీలు లేదు. అణచివేతలో ఉన్న జాతుల పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. అలాగే సామ్రాజ్యవాద ప్రయోజనాల ప్రేరణతో ఆధిక్యత ప్రదర్శిస్తున్న జాతుల అహంకారాన్ని విమర్శించాలి, వ్యతిరేకించాలి. సాధారణంగా అహంకారం ప్రదర్శించే జాతిలోని పాలక శక్తులే జాత్యంకారానికి ప్రధాన ఆలంబనగా ఉంటారు. కనుక అక్కడ వర్గ పోరాటం జరిగి కార్మికవర్గం విజయం సాధిస్తే తప్ప అహంకార ధోరణి అంతం కాదు.

అమెరికాలోనూ సరిగ్గా ఇండియాను పోలిన పరిస్ధితే. అక్కడ నేటివ్ అమెరికన్లు తప్ప ఇతరులు చారిత్రక జాతులు కాదు. అక్కడి రాష్ట్రాలు కనీసం భాష ప్రాతిపదికన ఏర్పడినవి కూడా కాదు. కనుక అక్కడ జాతీయ భావోద్వేగం నేటివ్ అమెరికన్లకు తప్ప ఇతరులకు రిలవెంట్ కాదు. నేటివ్ అమెరికన్లకు అక్కడ అస్తిత్వం దాదాపు మృగ్యం. కనుక వర్గ వైరుధ్యాలు, వర్గ పోరాటం మాత్రమే అక్కడ రిలవెంట్.

లాటిన్ అమెరికా (దక్షిణ అమెరికా ఖండం మరియు ఉత్తర అమెరికా ఖండం లోని దక్షిణ -తోక- భాగం- భాగం) లోని అనేక దేశాల్లో నేటివ్ జాతులు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. వలస వచ్చిన యూరోపియన్లు అక్కడ ఆధిపత్య వర్గాలుగా ఉన్నారు. కనుక అక్కడ జాతీయ పోరాటం (జాతి విముక్తి పోరాటం), వర్గ పోరాటం దాదాపు ఒకటిగా ఉంటాయి. అక్కడ జాతి భావన అత్యంత అవసరం.

కనుక కరుణాకర్ గారు పేర్కొన్నట్లు స్ధల, కాలాలకు అతీతమైనది ఏదీ ఉండదు. జాతి కూడా. పెట్టుబడిదారీ, ఫ్యూడల్, అర్ధ ఫ్యూడల్, వలస, అర్ధ-వలస, నయా-వలస, సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతలు ఉన్నంత వరకూ జాతి తన సానుకూల (+ve)ప్రాసంగికతను కోల్పోదు. పైగా అణచివేత నుండి విముక్తికి అది ఒక ఉపకరణంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఈ అన్ని రకాల దోపిడీ అణచివేతలకు కూడా జాతి దురహంకారం ఒక ప్రధాన ఉపకరణంగా పని చేస్తూ ఉంటుంది.

జాతి విముక్తికి, వర్గ పోరాటానికి ఆలంబనగానూ, ఉపకరణం గానూ ఉన్నప్పుడు అది ప్రగతిశీల పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అణచివేతకు సాధనంగా ఉన్నప్పుడు జాతి ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తుంది. పాలస్తీనా జాతీయ భావోద్వేగం ప్రగతిశీలమైనది. యూదు జాతీయ ఉద్వేగం జాత్యహంకార అణచివేతను కోరుతుంది కనుక ప్రగతి నిరోధకమైనది. ఆయా స్ధల, కాలాలను బట్టి జాతి పాత్రను అంచనా వేయాలి. తదనుగుణమైన అవగాహనను మార్పు కోసం పని చేస్తున్న కార్యకర్తలు చేపట్టాలి.

ఇప్పుడు కూచిభొట్ల శ్రీనివాస్ విషయానికి వద్దాం. అతని భావజాలాన్ని వ్యక్తిగతంగా ఆపాదిస్తూ అతని చావును వ్యాఖ్యానిస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే అతనేమీ ఆధిపత్య వర్గంలో లేడు. అణచివేతకు పాల్పడటం లేదు. ఆధిపత్య మరియు అణచివేత భావజాలాన్ని మోస్తున్నాడంతే. వాస్తవ పరిస్ధితులను అంచనా వేయడంలో విఫలం అయిన వారిలో చాలా మంది ఈ పొరబాటు చేస్తారు. కానీ వాస్తవం తెలుసుకున్నపుడు వారు తమ భావజాలాన్ని విస్మరించవచ్చు. (అయితే ఆధిపత్య భావజాలాన్ని మోస్టున్నంతవరకూ అతను అణచివేత వ్యతిరేక పోరాట ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తే అందుకు అతను అర్హుడే అవుతాడు. ఆ పరిస్ధితి ప్రస్తుతం లేదు కనుక ఆ చర్చ ఇక్కడ అనవసరం.)

ఇక్కడ ప్రగతికాముక కార్యకర్తలకు వచ్చిన అవకాశం ఏమిటంటే: మోడి/హిందూత్వ ప్రచారం చేస్తూ ఆచరిస్తున్న హిందూ భావోద్వేగ, ఆధిపత్య, అహంకారయుత భావజాలంలోని డొల్లతనాన్ని, ప్రగతి నిరోధకత్వాన్ని, అప్రజాస్వామికతనూ ససాక్ష్యంగా వెల్లడి చేయగలగడమే. ఇది కూచిభొట్లను వ్యక్తిగతంగా ఒంటరిని చేసి నిందించడం వైపుకి దారి తీయకూడదు. అలా చేయడమే సరైనదైతే… సమాజ విముక్తికి నాయకత్వం వహించే శక్తి ఉన్న కార్మికవర్గం లోని అనేక మందిని దూరంగా నెట్టివేయడానికి దారి తీస్తుంది. అనగా ప్రగతిశీల శక్తులను ప్రగతివైపుకు ప్రయాణించకుండా మనమే నిరోధించినట్లు అవుతుంది.

మోడి/హిందూత్వ చెబుతున్నది ఏమిటి? హిందూ జాతి ఉన్నతమైనదని; సమున్నత చరిత్ర కలిగినదని; భారత దేశం వారికి మాత్రమే చెందినదని; హిందూ మతాన్ని అనుసరిస్తున్న వారంతా ఇతర మతాల కంటే ఉన్నతులనీ; భారత దేశ చరిత్ర అంటే హిందూ చరిత్రే అనీ; విడిపోయిన భూభాగాలన్నీ కలిపి అఖండ భారత్ నిర్మించాలనీ; గుప్తుల కాలం నాటి అత్యంత అనాగరికమైన కుల అణచివేతతో కూడిన వ్యవస్ధ నిర్మాణాన్ని పునరుద్ధరించాలనీ.

ఈ భావజాలాన్ని తెలుసుకుని, అర్ధం చేసుకుని అభిమానించే సామాన్యులు (ఎంతటి విద్యావంతులైనా) చాలా కొద్దిమంది మాత్రమే. ఇలా నమ్మి అభిమానిస్తున్నవారు మాత్రమే అహంకారులు. వారు ప్రధానంగా అగ్రకుల అహంకారులు. ఎందుకంటే హిందూమతం అన్నది ప్రధానంగా కులాల ఎక్కువ తక్కువల భావజాలమే. కులమే హిందూమత సారం. అది చెప్పే నీతులన్నీ చేదు మాత్రకు తీపి పూత లాంటిది. తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు హిందూమతం చేసుకున్న షోకులే అది చెప్పే నీతులు. దాని అసలు సారం కులాల అణచివేత, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ ద్వారా ఫ్యూడల్ (వీలైతే), అర్ధ ఫ్యూడల్, దళారీ పెట్టుబడిదారీ దోపిడీని కొనసాగించడం.

హిందూ కుల వ్యవస్ధలో భ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే సుఖపడ్డారు. వారే ఆధిపత్యం చెలాయించారు. అప్పటి మరియు ఇప్పటి అగ్రకులాలు, ఇప్పుడు అగ్రకులాలుగా మారిని అప్పటి శూద్ర కులాలలోని కొందరు ఆనాటి ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అలాంటి పునరుద్ధరణ అసాధ్యమనీ, వర్గ (ఆర్ధిక) ఆధిపత్యం లేనిదే కులాధిపత్యం తమకు ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చదనీ, హిందూత్వ ప్రభోదించే భావజాలం తమను కేవలం ఆర్ధిక దోపిడీకి సాధనంగా వాడుకుంటున్నదనీ ఈ అహంకారులకు తెలియదు. అహంకారులుగా ఉన్నంతవరకు తెలిసే అవకాశమూ లేదు. కనుక వారు ప్రగతి నిరోధకులు, సమాజ మార్పుకు ఆటంకపరుస్తారు. వారి పట్ల సానుకూల దృక్పధం అవసరం లేదు. నిమ్న కులాల్లోనూ వీరికి సేవకులు తయారవుతున్నారు. వారు కూడా అక్కడ ఉన్నంతవరకూ ఖండనార్హులే. ప్రగతిశీల పోరాటానికి లక్ష్యమే.

కూచిభొట్ల హత్య హిందూత్వ భావజాలం లోని డొల్లతనాన్ని, ప్రగతినిరోధకత్వాన్ని బట్టబయలు చేసింది. హిందూత్వ ప్రభోధిస్తున్న ఆధిపత్య, అహంకార భావజాలన్నే ఇతరులూ పాటించవచ్చనీ, అలాంటి చోట్ల తామూ బాధితులుగా మిగులుతామనీ వెక్కిరించి మరీ చెప్పింది. భారత దేశంలో హిందూత్వ ఆధిపత్యం హేతుబద్ధం అయినట్లయితే, అమెరికాలో అమెరికన్ల తెల్ల ఆధిపత్య (వైట్ సుప్రిమసీ) అహంకార ధోరణి కూడా హేతుబద్ధమే అని చెంప చెళ్లుమనిపిస్తూ చెప్పింది.

అలా కాదు, అమెరికాలో భారతీయుల మనుగడ తెల్లవారితో సమాన ప్రాతిపాదికన ఉండటమే సరైనది మరియు హేతుబద్ధము అని వాదించేపనైతే, భారత దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్ధ పునరుద్ధరణ ప్రగతినిరోధకమనీ, వెనుకబాటుతనమనీ, అనాగరికమనీ అంగీకరించాల్సి ఉంటుంది. హిందూత్వ వ్యతిరేకుల పట్ల విద్వేషం విరజిమ్ముతూ ‘పాకిస్తాన్ వెళ్లిపొండని’ అహంకరించడం కూచిభొట్ల హత్యతో సమానం అని అంగీకరించాలి.

హిందూత్వ భావజాలంలోని ఈ సహజ వైరుధ్యాన్ని, ప్రగతినిరోధకతను, హేతువిరుద్ధతను కూచిభొట్ల హత్య నిరూపించింది. అందుకని ఈ సందర్భంగా హిందూ జాతీయవాదంగా చెబుతున్న హిందూత్వ భావజాలం ఆచరణీయం కాకపోగా, తిరస్కరించి చెత్తకుప్పలో పారవేయవలసిన భావజాలంగా చెప్పడానికి మన తోటి భారతీయుడైన కూచిభొట్ల హత్య అవకాశం ఇచ్చింది.

అయితే కొందరు వ్యాఖ్యాతలు చెప్పినట్లు కూచిభొట్ల హత్య నుండి అహంకారులు పాఠాలు నేర్వడం అనుమానమే. హిందూత్వ ఆధిపత్య భావజాలం ఆలంబనగా రాజకీయ-ఆర్ధిక ఆధిపత్యం చెలాయిస్తున్న పాలకవర్గాలు కూచిభొట్ల హత్యను పాఠంగా అసలే స్వీకరించరు. వారి లక్ష్యం హిందూత్వ కాదు, హిందూత్వ సాధనంగా సామాన్య హిందువుల విస్తృత ఆమోదం పొంది ఆర్ధిక దోపిడీని కొనసాగించడం మాత్రమే. కనుక వాళ్ళు కూచిభొట్ల హత్యను ఒంటరి ఘటన (ఐసోలేటెడ్ ఇన్సిడెంట్) గా కొట్టిపారేస్తారు. లేదా మౌనంతో దాటవేస్తారు. తప్పనిసరైతే ఖండనతో సరిపెట్టి మర్చిపొమ్మంటారు. ఈ శక్తులను కూచిభొట్ల ఎలాగూ కదిలించదు.

మోడీ వాగాడంబరాన్ని, అభివృద్ధి పేరుతో ఆయన చెబుతున్న కాకమ్మ కధలనూ నమ్మి హిందూత్వను అమాయకంగా నమ్మి అనుసరిస్తున్న వారికి నిజం తెలిసేలా చేసేందుకు మాత్రమే కూచిభొట్ల హత్య ఒక అవకాశం. తోటి భారతీయుడు ఎదుర్కొన్న జాత్యహంకార అఘాయిత్యం ఇలాంటి చేదు నిజాన్ని తెలియజేసేందుకు అవకాశంగా చేసుకోవలసిరావడం అత్యంత బాధాకరం. కానీ హితబోధలు వారి కళ్ళు తెరిపించడం లేదు. వాస్తవాలు కనిపిస్తున్నా వాళ్ళు కళ్ళు తెరిచి చూడలేకున్నారు. అలాంటి వారు కూచిభొట్ల హత్య లాంటి హృదయవిదారక దుర్ఘటన వల్లనైనా కళ్ళు తెరవాలని ఆశిస్తే అది ఎంత మాత్రం తప్పు కాబోదు.

4 thoughts on “కూచిభొట్ల హత్య: ఎఫ్‌బిలో కళ్యాణి గారి చర్చ

  1. శేఖర్ గారు,
    హిందూ జాతీయ వాదాన్ని ఆర్ధిక అణచి వేతలో ఒక ఉపకరణ మాత్రమే అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి ఎన్ డిఎ ప్రభుత్వం దాని ముసుగు బట్ట బయలు చేసింది.

  2. “హిందూ జాతీయ వాదాన్ని ఆర్ధిక అణచి వేతలో ఒక ఉపకరణ మాత్రమే అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.”

    ఔను తిరుపాలు గారు, ఆర్టికల్ చివర మీరు చెప్పిన అంశం ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s