ఇండియా, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం ముంగిట ఉన్నదని చైనా ప్రకటించిన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య దలైలామా సందర్శన విషయమై ఘర్షణ చెలరేగడం కాకతాళీయమా లేక పధకం ప్రకారం జరిగిందా?
ఇండియా, చైనాల మధ్య సరిహద్దు సమస్య శాంతియుతంగా, ఎవరి జోక్యం లేకుండా… ముఖ్యంగా అమెరికా, పశ్చిమ రాజ్యాల జోక్యం లేకుండా పరిష్కారం కావడం ఇష్టం లేకనే అర్జెంటుగా దలైలామా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సందర్శనకు పధకం రచించబడిందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
నిజానికి దలైలామా అరుణాచల్ ప్రదేశ్ సందర్శించే అవకాశం ఉన్నదని గత ఏడాది అక్టోబర్ నెలలోనే ఆయన కార్యాలయం అధికారులు ప్రకటించారు. అయితే ఆయన ఎప్పుడు సందర్శించేదీ తేదీ ప్రకటించలేదు. సాధారణంగా జనవరి నెలలో జరిగే టోర్గ్యా ఫెస్టివల్ కి గానీ అక్టోబర్ లో జరిగే తవాంగ్ ఫెస్టివల్ కి గానీ ప్రముఖ అతిధులు తవాంగ్ మొనాస్టరీని సందర్శిస్తారు. అటూ ఇటూ కాకుండా మార్చి నెలలో లామా సందర్శన జరగబోవడమే అనుమానాలకు తావిస్తున్నది.
దలైలామా తవాంగ్ సందర్శిస్తారని అక్టోబర్ నెలలో ప్రకటించినప్పుడు ఆయన తవాంగ్ ఫెస్టివల్ కు రానున్నారని అంతా భావించారు. చైనా, అప్పుడే తన అభ్యంతరాన్ని ప్రకటించింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద బౌద్ధ మొనాస్టరీగా ప్రసిద్ధి చెందిన తవాంగ్ ప్రాంతం టిబెట్ లో అంతర్భాగమని, కనుక అది చైనాకు చెందుతుందని చైనా వాదిస్తుంది. ఇక్కడికి భారత రాష్ట్రపతి వచ్చినా చైనా అభ్యంతరం చెప్పడం రివాజుగా జరుగుతూ వస్తోంది. (2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సందర్శనకు చైనా అభ్యంతరం చెప్పింది.)
చైనాకు వ్యతిరేకంగా ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు దలైలామాను దేశ ద్రోహిగా చైనా పరిగణిస్తుంది. అలాంటి దలైలామా తవాంగ్ సందర్శించడం చైనాకు సుతరామూ ఇష్టం ఉండదు. తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకు తగ్గట్టుగానే గత అక్టోబర్ లో లామా తవాంగ్ సందర్శన వార్త వెలువడిన వెంటనే చైనా ఖండన జారీ చేసింది. సందర్శనకు వ్యతిరేకంగా దలై లామాను హెచ్చరించింది. లామా సందర్శనకు అనుమతించవద్దని ఇండియాను కోరింది. చైనా వ్యతిరేకత కారణమా లేక మరొకటి కారణమా అన్నది తెలియదు గానీ లామా సందర్శన ఈ ఏడు ఇంతవరకూ జరగలేదు.
“అరుణాచల్ ప్రదేశ్ సందర్శించడానికి దలైలామాకు ఇండియా అనుమతి ఇచ్చిందన్న సమాచారం చైనాకు ఆందోళన కలిగిస్తున్నది” అని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జంగ్ షువాంగ్ పత్రికల సమావేశంలో గత శుక్రవారం (మార్చి 3) మాట్లాడుతూ అన్నారు. తవాంగ్ సందర్శించాలని దలైలామాకు ఆహ్వానం పంపడం వల్ల ఇండియా-చైనా సంబంధాలకు నష్టం వాటిల్లుతుందని కూడా ఆయన చెప్పారు.
“దలైలామా సమస్య తీవ్రత గురించి, చైనా-ఇండియా సరిహద్దు సున్నితత్వం గురించీ ఇండియాకు పూర్తిగా తెలుసు. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఇండియా దలైలామాను ఆహ్వానిస్తే సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్ధిరతలకూ, చైనా-ఇండియా సంబంధాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుంది” అని గెంగ్ షువాంగ్ హెచ్చరించాడు.
మన రాష్ట్రంతో చైనాకు ఏం పని?
అంతర్జాతీయ భూ సరిహద్దు విషయంలో తలెత్తే వివాదాల విషయంలో భావోద్వేగ దృక్పధం ఎంత మాత్రం పనికిరాదు. వివిధ దేశాల సరిహద్దులు భూమి పుట్టినప్పుడే నిర్ణయమైనవి కావు. మానవ నాగరికతలోని భాష, సంస్కృతీ, జాతి, తెగ.. ఇత్యాది అంశాలు అభివృద్ధి చెందే క్రమంలో ఆయా ప్రాంతాల, దేశాల సరిహద్దులు పరస్పర అవగాహనతో నిర్ణయం అయ్యాయి. దేశాల సరిహద్దుల విషయమై ఎన్ని ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినప్పటికీ అవి అంతిమంగా సామరస్య పూర్వక చర్చల ద్వారా మాత్రమే నిర్ణయం అయ్యాయి.
భారత దేశం ఉత్తరాన తూర్పు, పశ్చిమ మరియు మధ్య సెక్టార్ లలో ఇండియా – చైనాల మధ్య ఉన్న సరిహద్దు తగాదా ఈనాటిది కాదు. బ్రిటిష్ వలస పాలన నుండి వారసత్వంగా ఇది మనకు సంక్రమించింది. అనగా బ్రిటిష్ వలస ప్రయోజనాల కోసం సృష్టించబడి, కొనసాగించబడిన సమస్య ఇది. ఈ సరిహద్దు విషయమై ఇంతవరకు ఏనాడూ చర్చలు జరగలేదు. ఇండియా, బ్రిటిష్ ఆధీనంలో ఉన్నపుడు బ్రిటన్, టిబెట్ ల మధ్య జరిగిన సిమ్లా చర్చలలో బ్రిటిష్ అధికారి మెక్ మెహన్ గీసిన రేఖ యే ఇప్పటికీ సరిహద్దుగా చెలామణిలో ఉన్నది.
బ్రిటిష్-టిబెట్ లు ఒప్పందం చేసుకున్న మెక్ మెహన్ రేఖను గుర్తించటానికి చైనా నిరాకరించింది. ఫలితంగా వివాదం కొనసాగింది. 1947లో ఇండియా, 1949లో చైనా స్వతంత్రం సాధించిన తర్వాత ఇరు దేశాల స్వతంత్ర ప్రభుత్వాలు సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవలసి ఉండగా అలా జరగలేదు. అందుకు కారణం కోసం పెద్దగా వెతుక్కోనక్కరలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో ఆ దేశం సంపూర్ణ స్వతంత్రం సాధించినప్పటికీ ఇండియా పాలకులు మాత్రం బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాద ఆధిపత్యంలోనే కొనసాగారు. అనగా స్వతంత్రం అని చెప్పినది వాస్తవంలో అధికార మార్పిడిగానే ముగిసింది తప్ప కనీసం భారత బూర్జువాలు కూడా విదేశీ ఆధిపత్యం నుండి స్వతంత్రం సాధించలేకపోయారు.
దేశం పరాధీనతలో ఉన్నప్పుడు, కొనసాగుతున్నపుడు ఆధిపత్య శక్తుల ప్రయోజనాలే ఆధిక్యత వహించడం అనివార్యం. శాంతి, సామరస్యంలతో చైనా-ఇండియాల మధ్య శాశ్వత సరిహద్దు నిర్ణయం అయితే బ్రిటన్, అమెరికా ఆధిపత్య ప్రయోజనాలకు అది విరుద్ధం అవుతుంది. అధికార మార్పిడి సందర్భంగా పశ్చిమ వలసాధిపత్య రాజ్యాలు ఏదో ఒక వివాదాన్ని రగిల్చి, ఆరని మంటలు నిరంతరం కొనసాగుతూ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. స్ధానిక శక్తులను అదుపులో పెట్టుకోవడం ద్వారా వివాద పరిష్కారం తమ చేతుల్లో పెట్టుకున్నారు.
దానితో వలస పాలన ముగిసి పాలకులు మారి, వ్యవస్ధలు మారినా ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులు మాత్రం ఇంకా నిర్ణయాలు కాలేదు. సరిహద్దు వివాదానికి ప్రధాన పునాది మరియు హేతువు ప్రధానంగా ఇదే. ఇందులో దేశభక్తి, దేశ సమగ్రత లాంటి అనవసర సెంటిమెంట్లను చొప్పించడం ద్వారా భారత పాలకులు అసలు సమస్యను మరుగుపరుస్తున్నారు. చర్చల ద్వారా సరిహద్దు నిర్ణయించుకోవచ్చన్న హేతుబద్ధ అవగాహనకు బదులు బ్రిటిష్ వాడు గీసిన సరిహద్దులు శాశ్వతమన్న తప్పుడు అవగాహనను ప్రజల్లో చొప్పించారు. తద్వారా పరిష్కారానికి దారులు మూసివేశారు. తమకు అవసరం అయినప్పుడల్లా సరిహద్దు సమస్యపై భావోద్వేగాలు రెచ్చగొట్టి వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వివాదాన్ని వినియోగించుకుంటున్నారు.
భారత-చైనా ఉత్తర సరిహద్దుకు దలైలామా వ్యవహారం అదనపు మసాలాగా తయారయింది. దలైలామా, పశ్చిమ రాజ్యాల ముఖ్యంగా అమెరికా జేబులో మనిషన్న సంగతి బహిరంగ రహస్యమే. భారత – చైనా సరిహద్దు సమస్యకు గల అంతర్జాతీయ కోణానికి దలైలామా ప్రతినిధి. అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహానికి అవసరం అయినప్పుడల్లా దలైలామా రంగం లోకి దిగడం పరిపాటి.
అంతర్జాతీయంగా చైనా – అమెరికాల మధ్య ఆధిపత్య ఘర్షణ తీవ్రం కావడం, చైనాను నిలువరించేందుకు ఆసియా-పివోట్ వ్యూహాన్ని ప్రకటించడం, దక్షిణ చైనా సముద్రం మిలట్రీకరణ… తదితర చర్యల ద్వారా ఆధిపత్యం నిలుపుకునేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మించి మిలట్రీ స్ధావరాలు నెలకొల్పడం, హిందూ మహా సముద్రం – అరేబియా సముద్రంల గుండా మెరైన్ సిల్క్ రోడ్ (ఎం.ఎస్.ఆర్) కు రూపకల్పన చేయడం, బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు దేశాలను ఈ రోడ్డులో భాగస్వామ్యులను చేసి అధునాతనమైన నౌకాశ్రయాలను నిర్మించి పెట్టడం… తదితర చర్యలు చేపట్టి అమలు చేస్తోంది.
- McMahan Line
- Maritime Silk Road
- Gwadar port
- Aksai Chin
అమెరికా, చైనాల మధ్య తేడా ఏమిటంటే అమెరికా ఎప్పటిలా ఆధిపత్యపూరిత ఆదేశాలతో, బెదిరింపులతో, జుట్టు చేత పట్టి ఆడించే ఎత్తుగడలతో ఈ చర్యలు అమలు చేస్తున్నది. చైనా అందుకు విరుద్ధంగా విరివిగా రుణ సౌకర్యాలు కల్పించడం, ఉదారంగా తానే నిర్మాణాలు చేసి ఇవ్వడం, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఒప్పందాలు చేసుకోవడం… ఇలాంటి చర్యల ద్వారా తన పునాదిని నిర్మించుకుంటోంది. దానితో ఆదేశాలు, బెదిరింపులు జారీ చేసే అమెరికా కంటే సమాన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్న చైనాయే ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నది. దానర్ధం అన్ని దేశాలూ చైనా వెనక క్యూ కడుతున్నాయని కాదు గానీ చైనా పని మాత్రం సాపేక్షికంగా కాస్త తేలికగా అవుతుండడం మాత్రం ఒక వాస్తవం.
అమెరికా, చైనాల మధ్య సాగుతున్న ఈ అంతర్జాతీయ భౌగోళిక ఆధిపత్య ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో చూసినపుడు అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-ఇండియా సరిహద్దు వివాదానికి అంతర్జాతీయ కోణం కూడా ఉన్నట్లు అర్ధం చేసుకోవడం అంత కష్టం కాదు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రకటించిన ఆసియా-పివోట్ వ్యూహంలో ఇండియాను ఇష్టపూర్వక భాగస్వామిగా భారత పాలకులు చేర్చేశారు. యూపిఏ హయాంలోనే ప్రారంభమయిన ఈ ప్రక్రియ మోడి హయాంలో సంపూర్ణం అయింది.
ఈ వ్యూహంలో ఆసియా ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణాసియాలో చైనా వ్యతిరేక శక్తిగా ఇండియాను తయారు చేసి భారత ప్రజల భావోద్వేగాలను కూడా అందుకు అనువుగా తయారు చేసేందుకు సామ్రాజ్యవాదులు, భారత దళారీ పాలకులు కట్టుదిట్టంగా కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ పై వ్యతిరేకత రెచ్చగొట్టడం, కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు తీవ్రం కావించడం, హిందూ మహా సముద్రంలో శ్రీలంక కేంద్రంగా ఇండియా-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం చేయడం, అరేబియా సముద్ర తీరంలో పాక్ కోసం చైనా నిర్మిస్తున్న గ్వదర్ పోర్టు నిర్మాణంలో సమస్యలు సృష్టించడం, అందుకోసం బలూచిస్తాన్ తిరుగుబాటుకు తిరిగి జవసత్వాలు సమకూర్చి పాకిస్తాన్ ను అస్ధిరం కావించడం… ఇవన్నీ అమెరికా-చైనాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న వాణిజ్య ఆధిపత్య యుద్ధంలో అంతర్భాగం.
ఈ యుద్ధంలో భారత పాలకులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి ప్రధాని మోడి హఠాత్తుగా బహిరంగ మద్దతు ప్రకటించడం ఈ సహకారంలో భాగమే. కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాద పరిష్కారం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నదని చైనా ప్రతినిధి ప్రకటించిన వెంటనే దలైలామా తవాంగ్ సందర్శించనున్న వార్తను రంగం మీదికి తెచ్చి సానుకూల వాతావరణాన్ని కాస్తా విధ్వంసం చేసేశారు. లామా సందర్శనను హై లైట్ చేస్తే చైనా తప్పనిసరిగా ప్రతికూలంగా స్పందించి తీరుతుంది. దానితో సరిహద్దు వివాదం పరిష్కారం విషయమై చైనా చేసిన సానుకూల ప్రకటనపై భారత జనానికి అనుమానాలు రేకెత్తుతాయి.
చైనా ప్రతినిధి ఇలా ప్రకటించాడు. “భారత ప్రభుత్వానికి మా ఆందోళనను తెలియజేశాము. రాజకీయంగా గతంలో చేసుకున్న హామీలకు కట్టుబడి ఉండాలని కోరాము. సరిహద్దు సమస్యపై ఇరుపక్షాలు చేరుకున్న ముఖ్యమైన ఏకాభిప్రాయం నుండి దూరం జరగొద్దని కోరాము. సమస్యను సంక్లిష్టం కావించే చర్యలకు పాల్పడకుండా నిభాయించుకోవాలని కోరాము. దలైలామా ముఠాకు వేదికను కల్పించవద్దనీ చైనా-ఇండియాల మధ్య అభివృద్ధి అవుతున్న దృఢమైన, స్ధిరమైన సంబంధాలను కాపాడాలని కోరాము” చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పాడు.
ఈ ప్రకటనను బట్టి ఇండియా – చైనాల మధ్య సరిహద్దు విషయమై పలు దఫాలుగా చర్చలు జరిగాయనీ, చర్చల ఫలితంగా ఒక సానుకూల ఉమ్మడి ఏకాభిప్రాయానికి ఇరు పక్షాలూ వచ్చాయనీ అర్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా పలు సంవత్సరాలుగా సామరస్య పూర్వక చర్చల ద్వారా పరిష్కారం వైపుగా తీసుకెళుతున్న వాతావరణాన్ని విధ్వంసం కావించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. అందుకోసం దలైలామాను తురుపుముక్కగా ప్రవేశపెడుతోంది. ఈ ప్రక్రియలో భారత పాలకులు పాల్గొంటూ భారత ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగడానికి స్వయంగా దోహదపడుతున్నారు.
తూర్పు సెక్టార్ లో చైనా ఆందోళనకు తగిన విధంగా భారత్ స్పందిస్తే పశ్చిమ సెక్టార్ లో భారత్ ఆందోళనకు అనువుగా తాము స్పందిస్తామని చైనా తరపు సరిహద్దు వివాద ప్రతినిధి/రాయబారి దాయి బింగువో కొద్ది రోజుల క్రితం, లామా సందర్శన వార్తపై పత్రికలు కేంద్రీకరించక మునుపు ప్రకటించాడు. అనగా అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా ఇండియా అంగీకరిస్తే కాశ్మీర్ లో (పశ్చిమ సెక్టార్) ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఇండియాలో అంతర్భాగంగా గుర్తించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ఉద్దేశం. దీనికి ‘అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని’ చైనాకు అప్పగించాలని చైనా కోరుతున్నట్లుగా భారత పత్రికలు భాష్యం చెబుతున్నాయి. కానీ దాయి చేసిన ప్రకటనను సరిగ్గా పరిశీలిస్తే ఆయన తవాంగ్ ప్రాంతం గురించి చెప్పాడు తప్ప మొత్తం అరుణాచల్ రాష్ట్రాన్ని ప్రస్తావించినట్లు కనపడదు.
2005లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. “భారత్-చైనా సరిహద్దు సమస్య పరిష్కారానికై రాజకీయ ప్రమాణాలు మరియు మార్గదర్శక సూత్రాలు” పేరుతో ఒక పత్రాన్ని ఇరు దేశాలు ఆమోదించాయి. ఇరు దేశాలు సదరు పత్రంపై సంతకాలు చేశాయి. ఈ పత్రం ఇప్పటికీ ఆచరణయుతమైనదేనని దాయి బింగువో స్పష్టం చేశాడు. ఈ పత్రం ఆధారంగానే “సరిహద్దు సమస్య పరిష్కారం ముంగిట నిలబడి ఉన్నది” అని ఆయన ప్రకటించాడు. సరిహద్దు నిర్ణయంలో ఇండియా చైనాలు స్వయంగా సాధించిన ఈ ప్రగతిని పూర్వపక్షం చేసేందుకు లామా సందర్శన వివాదాన్ని అర్జెంటుగా తెరమీదకు తేవడంలో తెరవెనుక శక్తులు సఫలం అయ్యాయి.
సరిహద్దు వివాదం చుట్టూ కృత్రిమ దేశభక్తి భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా వివాదానికి ఉన్న అంతర్జాతీయ కోణాన్ని మరుగుపరిచే లక్ష్యాన్ని కూడా భారత పాలక వర్గాలు నెరవేర్చుకుంటున్నాయి. తద్వారా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అవి కాపలా కాస్తున్నాయి. లామా సందర్శన సమస్య వెంట పరుగెట్టడం ద్వారా చైనా-ఇండియాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు నిర్ణయం కాకుండా భారత పాలకులే అవరోధం కల్పిస్తున్నారు. ఈ వైఖరి ద్వారా భారత ప్రజల ప్రయోజనాలతో పాటు బూర్జువా ప్రయోజనాలు కూడా భారత పాలకులు కోల్పోతున్నారు. అనగా భారత దళారీ పాలకులు తమ బూర్జువా ప్రయోజనాలను సైతం అమెరికా, పశ్చిమ రాజ్యాల సామ్రాజ్యవాద ప్రయోజనాల ముందు తాకట్టుపెడుతున్నారు. భారత ప్రజా సామాన్యం ఈ మోసాన్ని గుర్తించాలి. పాలకుల లొంగుబాటును నిర్జించాలి. దివాళాకోరు విదేశీ విధానాన్ని విడనాడాలని తెగేసి చెప్పాలి.