స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్!
పందెంలో గెలిచే గుర్రం గురించిన సమాచారం గుర్రం నోటి నుండే వెలువడింది.
ప్రపంచంలో అత్యంత కరుడు గట్టిన టెర్రరిస్టు సంస్ధలను పెంచి పోషిస్తున్నది ఎవరో వారి నుండే అసలు వాస్తవం వెల్లడి అయింది. రక్తం రుచి మరిగిన కఠినోగ్రవాద సంస్ధలుగా అమెరికా ప్రకటించిన ఆల్-ఖైదా, దాయిష్ (ఐసిస్ / ఇస్లామిక్ స్టేట్) సంస్ధలకు ధన, ఆయుధ, లాజిస్టిక్, శిక్షణ (ట్రైనింగ్) అందిస్తున్నది అమెరికా రాజ్యమేనని అమెరికా కాంగ్రెస్ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యురాలు తులసి గబ్బర్డ్ వెల్లడి చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఆల్-ఖైదా, లిబియాలో ఆల్-ఖైదా ఇన్ ఇస్లామిక్ మాగ్రెబ్, సిరియా మరియు ఇరాక్ లలో ఆల్-నూస్రా ఫ్రంట్ మరియు దాయిష్ మొదలైన ఆల్-ఖైదా గ్రూపులకు జన్మనిచ్చి పోషిస్తున్నది అమెరికాయే అన్న సంగతి ఇపుడు రహస్యం ఏమీ కాదు.
సిరియాలో ఆరేళ్లుగా హింస, విధ్వంసాలను సృష్టిస్తూ అక్కడి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న దాయిష్ పై అమెరికా, పశ్చిమ రాజ్యాలు బూటకపు యుద్ధం సాగిస్తున్న సంగతి కూడా బహిరంగ రహస్యమే.
అయితే అమెరికా పార్లమెంటు సభ్యురాలు ఈ సంగతి బహిరంగంగా గుర్తిస్తూ సదరు చర్యలను వెంటనే ఆపేయాలని, మరీ ముఖ్యంగా సిరియాలో టెర్రరిస్టు సంస్ధలకు మద్దతు ఇవ్వడం నిలిపివేయాలని బహిరంగంగా డిమాండ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
“అనేక ఏళ్లుగా, మన ప్రభుత్వం ఈ సాయుధ మిలిటెంట్ గ్రూపులకు ప్రత్యక్ష మరియు పరోక్ష మద్దతు అందజేస్తున్నది. ఈ సంస్ధలు ఉగ్రవాద సంస్ధలైన ఆల్-ఖైదా మరియు దాయిష్ ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే సిరియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సభలో ఆమోదం పొందిన ‘స్టాప్ ఆర్మింగ్ టెర్రరిస్ట్స్ యాక్ట్ (హెచ్ఆర్608 ) ప్రకారం మన పన్ను చెల్లింపుదారులు సొమ్మును టెర్రరిస్టు మిలిటెంట్ గ్రూఫులకు ఆయుధ, ధన, గూఢాఛార సహాయాన్ని గానీ మరే ఇతర సహాయాన్ని గానీ అందజేయ కూడదు. ఆల్-ఖైదా, దాయిష్ లాంటి ఉగ్రవాద గ్రూపుల కింద పని చేసే సంస్ధలకు కూడా సహాయం చేయకూడదు” అని తులసి గబ్బర్డ్ రష్యా టుడే ఛానెల్ తో మాట్లాడుతూ ప్రకటించారు.
కానీ తులసి గబ్బర్డ్ చేసిన బహిరంగ ప్రకటన పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రచురణకు నోచుకోకపోవడం గుర్తించవలసిన విషయం. అమెరికా సాగించే కుట్రపూరిత చర్యలను ఖండించి ఎత్తి చూపే ఏ ప్రకటన అయినప్పటికీ పశ్చిమ కార్పొరేట్ పత్రికలూ, ఛానెళ్లలో స్ధానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఇలాంటి మీడియా తరచుగా మీడియా నిస్పక్షపాతం గురించీ, ఫేక్ న్యూస్ గురించీ వాపోవడమే ఒక వింత.
తులసి గబ్బర్డ్ ప్రస్తావించిన చట్టం ప్రకారం ఫెడరల్ ఏజన్సీలకు కేటాయించిన నిధులను టెర్రరిస్టులకు గానీ, టెర్రరిస్టు గ్రూపుల కింద పని చేసే ఇతర సంస్ధలకు గానీ ఏ రూపంలోనైనా అందజేయడం నిషిద్ధం. టెర్రరిస్టు వ్యక్తులకు సైతం నిధులు అందజేయరాదు. CIA , FBI , ఎన్.ఎస్.ఏ, డి.ఎన్.ఐ తదితర మిలట్రీ, గూఢాఛార, పోలీసు సంస్ధలు ఫెడరల్ ఏజన్సీల కిందికి వస్తాయి. దాదాపు ఏ ఏజెన్సీలు అన్నీ స్వదేశంలోనూ, విదేశాల్లోనూ టెర్రరిస్టు చర్యలకు పాల్పడేందుకు యువతను రిక్రూట్ చేస్తాయి; శిక్షణ ఇస్తాయి; లాజిస్టిక్ సౌకర్యాలు సమకూర్చుతాయి.
కానీ పైకి మాత్రం తాము శిక్షణ ఇచ్చే టెర్రరిస్టులపైనే యుద్ధం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటాయి. ఈ ప్రచార పర్వంలో పశ్చిమ మీడియా యావత్తూ చిత్తశుద్దిగా పాల్గొంటుంది. పశ్చిమ మీడియాను తు.చ తప్పకుండా అనుసరించే భారత కార్పొరేట్ మీడియా కూడా ఇదే ప్రచారాన్ని నెత్తిన వేసుకుని సాగిస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలకు టెర్రరిస్టు చర్యల వాస్తవాలు తలకిందులుగా చేరుతున్నాయి.
‘స్టాప్ ఆర్మింగ్ టెర్రరిస్ట్స్ యాక్ట్’ అమెరికా కాంగ్రెస్, సెనేట్ ల ఆమోదం పొందింది లేనిదీ సమాచారం అందుబాటులో లేదు. సాధారణంగా ఇలాంటి బిల్లులను కాంగ్రెస్, సెనేట్ లు ఉపేక్షించవు. కనుక ఆల్-ఖైదా, దాయిష్ లకు సి.ఐ.ఏ నేరుగా నిధులు, ఆయుధ శిక్షణ సహాయం చేస్తున్నదని పేర్కొన్న ఈ బిల్లు చట్టంగా రూపొందడం కష్ట సాధ్యం.
బిల్లు ప్రతిపాదించిన తులసి గబ్బర్డ్ వివిధ సందర్భాలలో నిజ నిర్ధారణ నిమిత్తం సిరియా సందర్శించి వాస్తవ సమాచారాన్ని సేకరించారు. గత డిసెంబర్ లో ఆల్-నూస్రా ముట్టడి నుండి విముక్తం అయిన అలెప్పో ను సైతం ఆమె సందర్శించారు. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను స్వయంగా కలిసి చర్చించారు.
very good