పునర్ముద్రణ (Reprint)….
మనిషి సాహచర్యంతో జంతువులు మానవ ప్రవృత్తిని అలవరుచుకుంటున్నాయా? లేక జంతువుల సాహచర్యంతో మనిషే జంతు ప్రవృత్తిలోకి ప్రయాణం కడుతున్నాడా? నేటి కాలపు మానవుని పోకడను గమనిస్తే ఈ రెండింటిలో ఏది నిజమో తేల్చుకోవడం ఒకింత కష్టం కావచ్చునేమో!
“క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేసెను”
మృగాలను క్రూరమైనవిగా మనిషి తనకు తానే నిర్ణయించేసి, వాటి కోరలు తీయడం తన విజయంగా మనిషి చెప్పుకున్న పాట ఇది. కానీ మృగం కోరలు తీయవలసిన అవసరం మనిషికి ఎందుకు వచ్చినట్లు?
మృగాలు తమ మానాన తాము బతుకుతుంటే వాటి ఆవాసంలోకి చొరబడి, వాటిదైన లోకాన్ని చెల్లాచెదురు చేయడం వల్లనే కాదా మనిషి-జంతువుల మధ్య ఘర్షణ రేగుతోంది?! ఆ లెక్కన జంతువులూ మనం పాడుకున్నట్లే పాడుకోవద్దా?!
నోరే ఉంటే జంతువుల భావాల నుండి ఎటువంటి సాహిత్యం పుట్టుకొచ్చేదో తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడవక మానదు. జంతువులపై మనిషి సాగిస్తున్న అకృత్యాలు అలాంటివి మరి!
మనిషి తన వినోదానికి జంతువులను హింసకు గురించేయడం ఎప్పటి మాటో! స్వార్ధ ప్రయోజనాలకు అడవులను నరుక్కుంటూ పోతూ జంతువులకు నిలువ నీడ లేకుండా చేయడంతో అవి జనారణ్యంలో చొరబడి అయోమయంలో, ఆత్మరక్షణ చర్యలకు దిగి చివరికి వారి చేతుల్లోనే మృత్యువాత పడడం ఇప్పుడు తరచుగా జరుగుతున్న తతంగం!
స్పెయిన్ బుల్ ఫైట్, దేవరకద్ర ఎద్దు పండగ, గోదావరి జిల్లాల కోడి పందేలు, ఎడారి దేశాల ఒంటి పందేలు, బడా బాబుల గుర్రం పందేలు, సర్కస్ పేరుతో ఎడతెగని హింస…. మనిషి వినోద అకృత్యాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వెరసి అప్పుడూ, ఇప్పుడూ ఇతర ప్రాణులు మనిషి స్వార్ధ జీవనానికి సమిధలు అవుతున్నాయి. పశు, పక్ష్యాదులు లేనిదే తన మనుగడ లేదని తెలిసీ పాశవిక అకృత్యాలు కొనసాగించడం మనిషి ప్రత్యేకత!
దారి తప్పి వచ్చిన పశువులను చేరదీసి, సాకి, తిరిగి భద్రంగా వాటి చోటుకు తీసుకెళ్లి వదిలి పెట్టే మానవాత్ములూ లేకపోలేదు. కానీ వ్యక్తిగత మద్దతు కంటే వ్యవస్ధాగత మద్దతే కీలకం. వ్యవస్ధ మద్దతు లేకుండా వ్యక్తిగత మద్దతుకు ఎందరు ముందుకు వచ్చినా అది కడవరకు కొనసాగే అవకాశం ఉండదు.
Photos: The Atlantic