ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు అట్టహాసంగా ప్రకటించిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదని రుజువు చేసే ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అటు ప్రైవేటు బ్యాంకుల ఏటిఎంలతో పాటు ఇటు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం దొంగ నోట్లు పంపిణీ చేస్తూ ప్రధానినీ, డీమానిటైజేషన్ సమర్ధకులనూ, కాషాయ పరివార గణాన్నీ అపహాస్యం చేస్తున్నాయి.
హర్యానాలో కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఏటిఎం ఒకటి రు 2000 డినామినేషన్ తో దొంగ నోటు విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసిఐసిఐ కు చెందిన ఏటిఎం నుండి సైతం “సరిగ్గా అదే తరహా దొంగ నోటు” విడుదల కావడంతో ఇది ఆషామాషీ వ్యవహారం కాదని స్పష్టం అయింది.
సంచలనానికి కారణం ఏమిటంటే ఏటిఎం ల నుండి కస్టమర్లు విత్ డ్రా చేసే నోట్లు నేరుగా బ్యాంకుల నుండి విడుదల అయ్యేవే. బ్యాంకులకు నోట్లు పంపిణీ చేసేది ఆర్‌బిఐ యే కనుక దొంగ నోట్ల పంపిణీకి నేరస్ధులు ఏకంగా ఆర్‌బిఐ ని కూడా మోసం చేయగలుగుతున్నారని ఇది తెలియజేస్తుంది.
వివిధ బ్యాంకులు నిర్వహించే కరెన్సీ చెస్ట్ ల నుండి ఏటిఎం లలో నోట్లు పెట్టే పనిని బ్యాంకులు ప్రైవేటు సంస్ధలకు అప్పజెబుతున్నాయి. ప్రైవేటు సంస్ధల పనితనాన్ని ఆకాశానికి ఎత్తివేసే బిజేపి ప్రభుత్వ నేతలు, బ్యూరోక్రాట్ అధికారులు, ఈ దొంగ నోట్ల పనితనాన్ని ఎవరిపై ఆపాదిస్తారు? (ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో, ఆధునిక సౌకర్యాలు ప్రజలకు అందుబాటు లోకి తేవడంలో ప్రభుత్వ సంస్ధల కంటే ప్రైవేటు సంస్ధలే వేగంగా, సమర్ధవంతంగా పని చేస్తాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆ మధ్య ఘనంగా వాకృచ్చిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు.)
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రకారం ఐసిఐసిఐ దొంగ నోట్ల ఘటన ఫిబ్రవరి 23 తేదీన చోటు చేసుకుంది. హర్యానా పోలీసు కానిస్టేబుల్ రాజ్ కుమార్ రు 6000 విత్ డ్రా చేసేందుకు ఐసిఐసిఐ ఏటిఎం కు వెళ్ళాడు. ఆయనకు వచ్చిన మూడు 2000 నోట్లలో ఒకటి దొంగ నోటు అని పసిగట్టారు. సదరు నోటుకి ఆపాదించబడిన వివిధ చట్టబద్ధ లక్షణాలు అన్నీ మోడీ ప్రభుత్వ నిర్ణయాలను అపహాస్యం చేసేలా ఉండడం ఒక విశేషం.
ఉదాహరణకి కొన్ని లక్షణాలు చూడండి:
-
నోటు పైన ‘ఏక్ కదం స్వచ్చ్ తా కీ ఓర్’ అన్న పదాలు హిందీలో రాసి ఉన్నాయి. ఈ పదాలు మోడికి అత్యంత ఇష్టమైన మరియు జనానికి పైసా ప్రయోజనం లేని పెట్ ప్రాజెక్టు ‘స్వచ్చ్ భారత్’ ను అపహాస్యం చేస్తున్నట్లు గ్రహించడానికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు.
-
“భారతీయ రిజర్వ్ బ్యాంక్” కు బదులు “భారతీయ మనోరంజన్ బ్యాంకు” అని ముద్రించి ఉన్నది. మోడి తలపెట్టిన ‘డీమానిటైజేషన్’ చివరికి ఒక జోక్ గా -భారతీయుల మనసులు రంజింపజేసేదిగా- మారిందని దొంగ నోటు ముద్రణదారు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
“గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా” నోటు విలువను గ్యారంటీ చేస్తుందని కరెన్సీ నోట్లపై ముద్రించబడి ఉంటుంది. ఆ స్ధానంలో “చిల్డ్రన్స్ గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా” అని దొంగ నోటుపై ముద్రించబడి ఉన్నది. మోడి ప్రభుత్వ నిర్వహణ చిన్న పిల్లల తరహాలో ఉన్నదనీ (బహుశా తుగ్లక్ తరహాలో) ముద్రణదారు చెప్పదలిచారా?
-
నోటు కలిగిన వ్యక్తికి ఆ నోటు విలువ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంకు హామీ ఇస్తున్నట్లుగా చెప్పే వాక్యం ఉంటుంది. ఆ వాక్యం కింద ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఆ స్ధానంలో “Promises to pay the bearer 2,000 coupons” అని రాసి ఉన్నది. రూపాయలకు బదులు కూపన్లు అనడం ద్వారా పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రజల దృష్టిలో కరెన్సీ విలువను దిగజార్చారని ముద్రణదారు సూచిస్తున్నారు కావచ్చు!
బ్యాంకు అధికారులు మాత్రం తమ తప్పేమీ లేదని చెబుతున్నారు. “మా వద్ద అత్యంత అధునాతనమైన స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సార్టింగ్ మిషన్లు ఉన్నాయి. ఇవి నోట్ల గుణ గణాలను ఇట్టే పసిగడతాయి. ఏ ఒక్క ఫోర్జరీ నోటు వచ్చినా వెంటనే వేరు చేస్తుంది. ఆ వెంటనే మేము పోలీసులకు సమాచారం ఇస్తాం. కనుక బ్యాంకుల ఏటిఎం ల నెట్ వర్క్ నుండి దొంగ నోటు పంపిణీ కావడం బొత్తిగా అసాధ్యం” అని ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధి చెప్పారని టైమ్స్ పత్రిక తెలిపింది.
- Original
- Fake
- Fake
కానీ బ్యాంకు ఏటిఎం నుండి దొంగ నోటు రావడం వాస్తవమే. ఏ ఆకతాయో ‘నాకు దొంగ నోటు వచ్చింది’ అని చెబితే అనుమానించవచ్చు. కానీ ఓ పోలీసు కానిస్టేబుల్ కే అది రావడం వల్ల బ్యాంకు వాళ్ళు ‘మా ఏటిఎం తప్పు లేదు’ అని తప్పించుకోజాలరు.
స్క్రోల్ పత్రిక ప్రకారం గత రెండు వారాల్లో ఏటిఎం నుండి దొంగ నోటు రావడం ఇది మూడవ సారి. ఒక కాల్ సెంటర్ ఉద్యోగి అయిన రోహిత్ ఫిబ్రవరి 22 తేదీన ఇదే ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. ఆయనకు వచ్చిన దొంగ నోటు కూడా పై లక్షణాలే కలిగి ఉండడం గమనార్హం. ఆయన ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు మహమ్మద్ ఇషా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏటిఎం లలో డబ్బు ఉంచే పనికి ఆయన బాధ్యుడు అని పోలీసులు చెప్పారు.
అరెస్ట్ అయితే చేశారు గానీ ఆయనే దొంగ నోటుకు బాధ్యుడు అని మాత్రం పోలీసులు ఇంకా చెప్పలేదు. ఏటిఎం లలో డబ్బు ఉంచే పనికి కాంట్రాక్టు తీసుకున్న ప్రైవేటు కంపెనీ బాధ్యుడుగా ఆయనను అనుమానంతో అరెస్టు చేశారు తప్పితే నిజంగా ఆయనే తప్పు చేశాడని కాదు. ఆఫ్ కోర్స్! ఆయన తప్పు చేయలేదని కూడా పోలీసులు ఇంకా చెప్పలేదు.
ఫిబ్రవరి 25 తేదీన షాజహాన్ పూర్ లో మరో ఘటన జరిగింది. బంగారు నగల వ్యాపారి అరవింద్ గుప్తా రు 10,000 విత్ డ్రా చేసేందుకు ఎస్‌బిఐ ఏటిఎం కు వెళ్తే ఆయనకు కూడా రు 2000 విలువతో దొంగ నోటు ఒకటి వచ్చింది. ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆయనకు వచ్చింది పై తరహా దొంగ నోటు కాదు. కలర్ జిరాక్స్ మిషన్ తో స్కాన్ చేసి ప్రింట్ చేసిన దొంగ నోటు.
స్కానర్ ద్వారా కంప్యూటర్ లోకి ఇమేజ్ తీసుకుని కలర్ ప్రింటర్ తో ప్రింట్ చేసి చలామణీలో ప్రవేశపెట్టిన ఘటన గత డిసెంబర్ నెలలోనే బెంగుళూరులో జరిగిన సంగతి గమనార్హం. డీమానిటైజేషన్ దరిమిలా చోటు చేసుకున్న అస్తవ్యస్త పరిస్ధితులు కొనసాగుతున్న కాలంలోనే బెంగుళూరులో రు 2000 నోట్లను కలర్ ప్రింటర్ తో ప్రింట్ చేసి చలామణిలోకి తెచ్చారు. దాదాపు రు 70,000 విలువ గల నోట్లు ఈ విధంగా పంపిణీ చేశారు. పోలీసుల దృష్టికి వచ్చాక చలామణిలోకి రాకుండా మిగిలిపోయిన నోట్లు స్వాధీనం చేసుకుని నిందితులను (ఇంజనీరింగ్ విద్యార్ధులు) అరెస్టు చేశారు.
ఇవి కాకుండా కాశ్మీర్ లో టెర్రరిస్టుల వద్ద కూడా గత డిసెంబర్ లోనే రు 2000 నోట్లు -ఫేక్- పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ జరిగిందని ఆర్మీ ప్రకటించిన దరిమిలా చనిపోయిన వారి వద్ద దొంగ నోట్లు లభ్యం అయ్యాయి. దానితో డీమానిటైజేషన్ ద్వారా టెర్రరిస్టుల ఆర్ధిక వ్యవస్ధ వెన్ను విరిచామని ప్రకటించిన ప్రధాని మోడి ఆర్భాటపు ప్రకటన ఒట్టి గాలి మూటేనని అప్పుడే రుజువయింది.
డీమానిటైజేషన్ అమలు చేసిన మూడో నెలలోనే అతి పెద్ద విలువ గల రు 2000 ల దొంగ నోట్లు విస్తృతంగా బైటపడటం బట్టి మోడీ గారి ‘దొంగ నోట్లపై యుద్ధం’ ఆరంభం అయ్యీ కాక మునుపే ముగిసిపోయిందని, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా ఓటమి పాలయిందనీ నిర్ద్వంద్వంగా రుజువు అవుతోంది.
ఈ ఘటనలు తమ చేతగానితనాన్ని, బూటకపు వాగ్దానాలనీ, వెర్రి మొర్రి చర్యల బండారాన్నీ మాత్రమే రుజువు చేస్తున్నాయి గనుక ప్రధాని, ఆయన సంస్ధానం లోని మంత్రులు, ఆయన పార్టీ నేతలు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. జనానికి వాళ్ళు ఎప్పుడు జవాబుదారీగా ఉన్నారు గనుక?!