
Machine Vs Labour
యంత్రాలు ప్రవేశించాక ప్రతి ఉత్పత్తి రంగం లోనూ శ్రామికుడికి ఉపాధి కరువైంది. వేల యేళ్ళుగా మనిషి శ్రమ సాధించిన అనుభవమే జ్ఞానంగా పొగుబడి శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసింది. కానీ యంత్రాలను ఆస్తిగా మార్చుకున్న కొద్ది మంది శ్రమ చేయని వర్గాలు తమ సంపదలకు మూలం మనిషి శ్రమయే అన్న సంగతి మర్చిపోయి మనిషి శ్రమ/ కూలీ/ లేబర్ / శరీర శక్తిని ఈసడించుకోవడం మొదలు పెట్టాడు.
యంత్రాలు మరింత అభివృద్ధి చెంది సూక్ష్మ రూపాలు ధరించి కంప్యూటర్ గా అవతరించాయి. దరిమిలా నానో టెక్నాలజీ ఆవిష్కృతం అయింది. స్మార్ట్ ఫోన్ రూపంలో మనిషి అర చేతిలోకి కంప్యూటర్ ఇమిడిపోయింది. కానీ ఇవన్నీ పూత, కాయ, పండు మాత్రమే. పూత పూసి, కాయ కాసి, పండు చేతికి రావాలంటే విత్తనం నాటాలి; కాండం పెరగాలి; కొమ్మలుగా విస్తరించాలి; చిటారు కొమ్మలు చిగురించి ఆకులు అల్లుకోవాలి.
అప్పుడే సూర్యుడి నుండి వేడి గ్రహించి పత్రహరితం తయారవుతుంది. ఆ పత్రహరితమే పూత, కాయ, పండు పరిణామానికి ఆహారం అవుతుంది. కానీ ఈ పూత, కాయ, పండులను చూసి మనిషి ఇక చెట్టు అవసరం లేదని భ్రమిస్తే…! వేరు, కాండము, కొమ్మ, ఆకులు లేకుండానే పూత, కాయ, పండు చేతికొస్తుందని అహంకరిస్తే…?! వాడికిక పుట్టగతులు ఉండునా?
ఉపరితల సౌందర్యాన్ని చూసి మట్టిలో మరుగున ఉండే పునాదిని విస్మరించడం, ఈసడించడం ఎంత తెలివిమాలినతనమో, స్మార్ట్ ఫోన్ లతో, అందులో ప్రవహించే సమాచారంతో దేశాన్ని ఉద్దరించుకోవచ్చని నమ్మడమూ అంతే తెలివిమాలిన తనం.
ఫేస్ బుక్ తో సమస్త అవసరాలూ తీర్చేస్తానని బీరాలు పలుకుతున్న మార్క్ జూకర్ బర్గ్, గూగుల్ తో భూ మండలాన్నంతా గుప్పెట్లో పెట్టుకోవాలని కలలు కంటున్న ఎరిక్ స్మిత్ – లారీ పేజ్ – సెర్గీ బ్రిన్ లూ, విండోస్ 10 తో దేశ దేశాల ఆయువు పట్లను అమెరికా నియో-కాన్ లకు అప్పగించాలని చూస్తున్న బిల్ గేట్స్… ఇత్యాది వీరులు బుద్ధి హీనులని భావిస్తే తప్పు ఎందుకవుతుంది?
విదేశాల్లోని ఈ బాస్ లని చూసి, వారు చెప్పే దొంగ కబుర్లు నమ్మి మొబైల్ ఇంటర్నెట్ తో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని ఇక్కడా, దేశాన్నే ఉద్ధరిస్తానని అక్కడా… ఇద్దరు పెద్ద మనుషులు భారత జనానికి నచ్చజెప్పబూనుకోవడమూ బుద్ధి హీనతే అన్నా తప్పు కాదు గాక కాదు.
అందుకు రుజువు కావాలా? ఇదిగో ఈ వీడియో చూడండి మరి!