పశ్చిమ దేశాలు, రష్యాల తాజా ఘర్షణ కేంద్రం లిబియా -2


Libya strong man Gen Khalifa Haftar

Libya strong man Gen Khalifa Haftar

ఐరాస గుర్తించిన ప్రభుత్వం పేరు జాతీయామోద ప్రభుత్వం (గవర్న్ మెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ -జి‌ఎన్‌ఏ). రాజధాని ట్రిపోలి ఈ ప్రభుత్వానికి అధికార కేంద్రం. ప్రస్తుతానికి పశ్చిమ దేశాలు అధికారికంగా ఈ ప్రభుత్వాన్నే గుర్తిస్తున్నాయి. అదే సమయంలో జనరల్ హఫ్తార్ నేతృత్వం లోని పోటీ ప్రభుత్వానికి కూడా అండదండలు ఇస్తున్నాయి. 20 మంది ఫ్రెంచి ప్రత్యేక బలగాలతో పాటు ఇటలీ, బ్రిటిష్, అమెరికా ప్రత్యేక బలగాల యూనిట్లు తోబ్రూక్ (హఫ్తార్) ఆర్మీతో కలిసి బెంఘాజీ నగర భద్రతలో పాల్గొన్నాయని  గత జులై (2016) లో  యూ‌ఏ‌ఈ పత్రిక ‘ద నేషనల్’ వెల్లడి చేయడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఎయిర్ ట్రాఫిక్ సంభాషణల రికార్డింగుల ద్వారా ఈ సంగతి ధృవీకరణ అయిందని పత్రిక వెల్లడించింది. దానితో ‘తూర్పు లిబియాలో హఫ్తార్ కు సహాయం కోసం అంతర్జాతీయ బలగాల ఆపరేషన్ సెంటర్ ఉన్నదని గతంలో వెలువడిన సమాచారం నిజమే అని స్పష్టం అయింది. బెంఘాజీలో హఫ్తార్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులను మట్టుబెట్టడంలో కూడా పశ్చిమ బలగాలు హఫ్తార్ కు సహకరించినట్లు తెలుస్తున్నది. (హఫ్తార్ తో పాటు, ఆయన వ్యతిరేక తీవ్రవాద గ్రూపులన్నీ గడాఫీ కూల్చివేతలో కలిసి పనిచేసినవే.) అప్పటివరకూ ట్రిపోలి లోని జి‌ఎన్‌ఏ ప్రభుత్వానికి మాత్రమే పశ్చిమ దేశాలు సహాయం చేస్తున్నాయని ప్రపంచం భావించగా, టేపుల వెల్లడితో వైరి గ్రూపు హఫ్తార్ -ఎల్‌ఎన్‌ఏ- కు కూడా అవి అండగా ఉన్నాయని స్పష్టం అయింది.

హఫ్తార్ కు తాము మద్దతు ఇస్తున్న సంగతిని పశ్చిమ దేశాలు రహస్యంగా ఉంచుతాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వమే అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అవుతుంది. కనుక దానికి పోటీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్రమం, చట్ట విరుద్ధం అవుతుంది. కనుక హఫ్తార్ గ్రూపుకి మద్దతు ఇవ్వడం అంటే అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా పశ్చిమ దేశాలు వ్యవహారాలు సాగిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఈ సమస్య వలన పైకి హఫ్తార్ గ్రూపును వ్యతిరేకిస్తున్నట్లుగా అమెరికా, పశ్చిమ దేశాలు కనిపిస్తాయి. కానీ అంతకంతకూ బలం పుంజుకుంటున్న హఫ్తార్ ను దూరం చేసుకోవడం వారి ప్రయోజనాలకు నష్టకరం. మరీ ముఖ్యంగా హఫ్తార్ తో రష్యా సంబంధాలు నెరపడం మొదలు పెట్టాక ఆయనను బుజ్జగించవలసిన అవసరం పశ్చిమ దేశాలకు మరింతగా ఏర్పడింది.

లిబియాలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎక్కడ విఫలం అయ్యాయో అక్కడే సఫలం కావడానికి రష్యా ప్రయత్నిస్తోంది. పశ్చిమ దేశాలు వినాశనాన్ని లిబియాపై రుద్దితే ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా హఫ్తార్ తో సత్సంబంధాలకు రష్యా పునాది వేసుకుంటోంది. ఈ సంగతిని యూరోపియన్ రాజకీయ విశ్లేషకులు అన్యాపదేశంగానైనా గుర్తిస్తున్నారు. జనరల్ హఫ్తార్ భవిష్యత్తులో లిబియాకు స్ధిరమైన రాజకీయ పరిష్కారాన్ని ఇవ్వగలడని సూచిస్తూ ఎల్‌ఎన్‌ఏ తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎల్‌ఎన్‌ఏ ఆధీనం లోకి వచ్చిన చమురు ప్రాంతాలలో ఆయిల్ టర్మినల్స్ తిరిగి పని చేయడం ప్రారంభిస్తే గనుక స్వయం పాలన సాగించుకోవడానికి హఫ్తార్ కు తేలిక అవుతుంది. చమురు దాహంతో తపించిపోతూ, పెట్రో డాలర్లు ఆలంబనగా ప్రపంచాధిపత్యాన్ని నిలుపుకునే అమెరికా, దాని అనుచర ఐరోపా హఫ్తార్ ను రష్యాకు వదిలిపెట్టి ఎలా ఉండగలవు?

మారుతున్న ప్రపంచ పరిస్ధితుల నేపధ్యంలో ఫీల్డ్ మార్షల్ హఫ్తార్ రష్యాతో సంబంధాలు పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. (ఇది అమెరికా, పశ్చిమ దేశాలను మరింత గంగవెర్రులు ఎత్తిస్తోంది.) గత సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో హఫ్తార్ రెండు సార్లు రష్యా సందర్శించి వచ్చాడు. అక్కడ రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ తో సుదీర్ఘ మంతనాలు జరిపాడు. సిరియా అంతర్యుద్ధంలో అలెప్పో నగరాన్ని ఇసిస్, ఆల్-నూస్రాల నుండి విముక్తి చేసే కృషిలో భాగంగా రష్యాకు చెందిన విమాన వాహక నౌక అడ్మిరల్ కుజ్నెత్సోవ్ మధ్యధరా సముద్రంలో లంగరు వేసుకుని అలెప్పోలోని టెర్రరిస్టు స్ధావరాలపై యుద్ధ విమానాలు ప్రయోగించడానికి లాంచ్ ప్యాడ్ గా పని చేసింది. కొంత కాలం పాటు కుజ్నెత్సోవ్ ను వినియోగించిన రష్యా అనంతరం రష్యాకు తిరిగి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో లిబియా తీర నగరం బెంఘాజి వద్ద కొన్ని రోజులు విడిది చేయడంతో పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు కరువైంది. హఫ్తార్ స్వయంగా కుజ్నెత్సోవ్ నౌకను సందర్శించి అక్కడ నుండి రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో వీడియో కాన్ఫరెన్స్ లో సైతం పాల్గొన్నాడు. అంతే కాకుండా ఇతర తీవ్రవాద గ్రూపులతో జరిగిన ఘర్షణల్లో గాయపడిన సైనికులను రష్యాకు పంపి వైద్య చికిత్స చేయించాడు హఫ్తార్.

నవంబరు 2016లో రష్యా సందర్శించిన మార్షల్ హఫ్తార్ తాను రష్యా సహాయాన్ని అర్ధించడానికి వచ్చానని బహిరంగంగానే ప్రకటించాడు. లిబియాలో ఇస్లామిక్ తీవ్రవాదులను అణచివేయడంలో, రూపు మాపడంలో తమకు రష్యా సహాయం ఎంతో అవసరం అని ఆయన చెప్పాడు. “మా సంబంధాలు చాలా కీలకమైనవి. ఈ రోజు మా లక్ష్యం మా సంబంధాలకు ప్రాణం పోయడమే. రష్యన్ల సహాయంతో భవిష్యత్తులో లిబియాలో టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపగలమని మేము నమ్ముతున్నాం” అని హఫ్తార్ ప్రకటించాడు. తూర్పు లిబియాలో రెండు సైనిక స్ధావరాలను నిర్మించడానికి రష్యాతో ఆయన ఒప్పందం చేసుకున్నాడు.

“రష్యా మధ్య ప్రాచ్యంలో ఒక పధకం ప్రకారం క్రమ పద్ధతిలో సమగ్ర భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో క్రమంగా ప్రభావం పెంచుకుంటున్నది. లిబియాలో మధ్యవర్తి స్ధానంలో తనను తాను ప్రవేశపెడుతున్నది. గడాఫీ హత్యానంతరం పశ్చిమ దేశాలు ఎక్కడైతే విఫలం అయ్యాయో అక్కడ సఫలం అయ్యే శక్తి యుక్తులు తనకు ఉన్నాయని ఆచరణయుతంగా చూపుకుంటోంది” అని హాలండ్ కి చెందిన లిబియా వ్యవహారాల నిపుణుడు జాకొబ్ స్వెండ్సెన్ డచ్ పత్రిక ‘పొలిటిక్’ లో విశ్లేషించడం బట్టి లిబియాలో రష్యా స్ధానంపై ఒక అవగాహనకు రావచ్చు.

ట్రిపోలి ప్రభుత్వాన్ని హఫ్తార్ గుర్తించకపోవటానికి కారణం 2015 డిసెంబర్ లో లిబియాలో కుదిరిన ఒక ఒప్పందం. లిబియాలోని వివిధ మిలిటెంట్ గ్రూపులు ఈ ఒప్పందంపై సంతకం చేశాయనీ, లిబియాలో ఇక అంతర్యుద్ధం ముగిసిందనీ, శాంతి వెల్లివిరుస్తుందనీ పశ్చిమ దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 8 ప్రకారం లిబియన్ ఆర్మీకి సుప్రీం కమాండర్ గా ప్రెసిడెన్సీ కౌన్సిల్ వ్యవహరిస్తుంది. అనగా సీనియర్ స్ధాయి అధికారుల నియామకాలు, తొలగింపులు కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన జి‌ఎన్‌ఏ కిందనే ఈ కౌన్సిల్ వ్యవహరిస్తుంది గనుక ఒప్పందంపై సంతకం చేయని ఖలీఫా హఫ్తార్ పై కూడా కౌన్సిల్ ద్వారా జి‌ఎన్‌ఏ ఆధిక్యం వహిస్తుంది. లిబియా జాతీయ స్ధాయి నేతగా, లిబియా స్ట్రాంగ్ మేన్ గా అటు అంతర్జాతీయంగానూ, ఇటు దేశం లోపలా గుర్తింపు పొందిన హఫ్తార్ కు ఇది ఎంతమాత్రం సమ్మతం కాదు. ఆర్టికల్ 8 ని తొలగిస్తే తప్ప తాను ట్రిపోలి ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని హఫ్తార్ స్పష్టం చేశాడు. దానితో పశ్చిమ దేశాలు చెప్పిన జాతీయ ఒప్పందం అమలు కావడానికి దారులు మూసుకుపోయాయి.

నిజానికి జి‌ఎన్‌ఏ ప్రభుత్వం ఏమీ ఏకశిలా సదృశం ఏమీ కాదు.   అమెరికా, పశ్చిమ దేశాలు తమ అడుగులకు మడుగులు ఒత్తే అనేక చిన్న చిన్న ఇస్లామిక్ మిలిటెంట్ సంస్ధలను కూడగట్టి ట్రిపోలి అధికారాన్ని కట్టబెట్టాయి.  అనేక మార్లు దీని స్వరూప స్వభావాలు మారుతూ వచ్చాయి. అంతర్గత కలహాల వల్ల పలుమార్లు నేతలను మార్చవలసి వచ్చింది. ఒకరితో ఒకరికి పొసగక ఒకరిద్దరు రాజీనామాలు చేయడం, కొత్తవారిని నియమించడం, మళ్ళీ సరికొత్త కలహాలు రగలడం నిత్యకృత్యం అయింది. తాజాగా 2015 చివ్రరిలో ట్యునీషియా నుండి రప్పించిన ఇస్లామిక్ నేత సర్రాజ్ ను ట్రిపోలి పాలకునిగా పశ్చిమ దేశాలు నియమించాయి. ఇన్ని పరిణామాల మధ్య ట్రిపోలిలోని జి‌ఎన్‌ఏ ప్రభుత్వం బలహీనమైనదనీ, స్ధిరమైన పాలన అందించే సామర్ధ్యం దానికి లేదనీ ఒక అభిప్రాయం అంతటా స్ధిరపడిపోయింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఇదే అభిప్రాయం నెలకొంది.

జి‌ఎన్‌ఏ ఐక్యంగా ఉంటుందన్న నమ్మకం లిబియా ప్రజల్లోనూ లేదు. ఇస్లామిక్ గ్రూపులతో నిండిన జి‌ఎన్‌ఏ ను నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. టెర్రరిస్టు గ్రూపులతో ఆరేళ్లుగా పడుతున్న విధ్వంసక, శాంతి రహిత అనుభవాలతో వారు విసిగిపోయి ఉన్నారు. పైగా తూర్పు లిబియాలో ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులను మట్టికరిపిస్తున్న హఫ్తార్, దృఢమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలడని లిబియా ధనిక వర్గాలలో అనేకమంది నమ్మకం పెట్టుకున్నారు. సాధారణ లిబియన్లలో కూడా ఈ అభిప్రాయం వ్యాపించి ఉన్నది. గడ్దాఫీ జన్మ స్ధలం సిర్టే నగరాన్ని ఇసిస్ తీవ్రవాదం నుండి విముక్తి చేయడంలో హఫ్తార్ కృషి సాటిలేనిదని వారు భావిస్తున్నారు. (అయితే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ బలగాల వాయు/బాంబు దాడుల సాయంతో సిర్టే నగరాన్ని జి‌ఎన్‌ఏ ప్రభుత్వమే విముక్తి చేసిందని పశ్చిమ దేశాలు చెబుతాయి.)

తనకు రాజకీయాలలో ఆసక్తి లేదని హఫ్తార్ చెప్పినప్పటికీ తూర్పు లిబియా ప్రభుత్వం (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ -HOR) ఆయన చెప్పు చేతుల్లోనే ఉంటుంది. అవడానికి హెచ్‌ఓ‌ఆర్ స్పీకర్ సర్వసైన్యాధ్యక్షుడు అయినప్పటికీ, హఫ్తార్ కూడా స్పీకర్ నుండే ఆదేశాలు స్వీకరిస్తాడని చెప్పినప్పటికీ హఫ్తార్ ను కాదని అక్కడ ఏమీ జరగదు. హఫ్తార్ కు లిబియా జాతీయ ప్రభుత్వం కావాలి. జాతీయ ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉండాలని పశ్చిమ దేశాల కోరిక. ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులకు వ్యతిరేకం అయిన హఫ్తార్ పట్ల (ఆ గ్రూపులను పెంచి పోషించే) పశ్చిమ దేశాలు అనుమానంతో ఉన్నాయి. హఫ్తార్ తో సంధికి అవి ప్రయత్నిస్తూనే ఆయన జి‌ఎన్‌ఏ ఆధీనంలో ఉండాలని వాంచిస్తున్నాయి.  పశ్చిమ దేశాల వ్యవహారం నచ్చని హఫ్తార్ రష్యాకు దగ్గరయ్యేందుకు సిద్ధపడ్డాడు. ఫలితంగా లిబియా ప్రస్తుతం రష్యా మరియు అమెరికా, పశ్చిమ దేశాల మధ్య మరో ఘర్షణ కేంద్రంగా మారింది. లిబియా ప్రజలు మాత్రం ఆదాయాలు లేని అనిశ్చిత ఆర్ధిక జీవనంలో క్రుంగి పోతున్నారు. ప్రగతిశీల, వామపక్ష శక్తులు ఉన్నప్పటికీ వారు నామమాత్రమే. కొద్ది మంది ప్రజల్ని కూడగట్టగల పరిస్ధితిలో కూడా వారు లేరు. వెరసి గడ్డాఫీ అందించిన స్ధిరమైన, ఆధునిక జీవనాన్ని కోల్పోయి, కొల్లగొట్టబడి భ్రష్ట జీవనం గడుపుతున్నారు. అమెరికా, ఐరోపాల దుర్మార్గమైన సామ్రాజ్యవాద ఆధిపత్య, యుద్ధోన్మాద విధానాలకు సజీవ సాక్షాలుగా ప్రపంచం ముంగిట నిలబడి ఉన్నారు.

………..అయిపోయింది.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s