భారత దేశం భయపడినదంతా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లోనే హెచ్1 బి వీసాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ నివాసులను త్వరలో ఇంటికి పంపే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు కొట్టివేసిన ముస్లిం వలసల నిషేధం డిక్రీని మళ్ళీ మరో రూపంలో జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్ధితుల్లోనూ తాను చెప్పింది చేసి తీరే వైఖరితో అమెరికన్ భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.
ప్రస్తుతానికి హెచ్1 బి వీసా హోల్డర్ల అమెరికా నివాసానికి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ సమీప భవిష్యత్తులో వారిపై కూడా దృష్టి సారించవచ్చని కనీసం కొంతమందిని అయినా వెనక్కి పంపేసే నిర్ణయాలు చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 11 మిలియన్ల మందిని అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకు తగిన మార్గదర్శక సూత్రాలను అధ్యక్షుడు ఇప్పటికే జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.
“దేశం నుండి పంపివేసి ప్రక్రియ నుండి దేశం నుండి (చట్ట ప్రకారం) తొలగించదగిన కాందిశీకులలోని ఏ తరగతికి లేదా వర్గాలకు చెందినవారికైనా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇక ఎంత మాత్రం మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించింది” అని ఇటీవల జారీ చేసిన ఒక మెమో లో తెలియజేసింది. ఇన్నాళ్లూ కొన్ని వర్గాలకు మానవతా కారణాలతోనూ, కొన్ని ప్రత్యేక పరిస్ధితులలోనూ మినహాయింపులు ఇచ్చేవారిమనీ ఇక ఆ మినహాయింపులు ఉండవని మెమో తెలిపింది.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనాధ బాలలకు డిపోర్టేషన్ నుండి ప్రత్యేక మినహాయింపులు కల్పించాడు. చదువు నిమిత్తం వచ్చినవారు చదువు పూర్తి అయ్యాక కూడా ఎదో ఒక పేరుతొ అమెరికాలో కొనసాగడం పరిపాటి. అనేక తాత్కాలిక పత్రాలతో మినహాయింపులు పొందుతారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా లేదా మినహాయింపుల కాలం పూర్తి అయినా తర్వాత కూడా అనేకమంది అక్రమంగా అమెరికాలో నివాసం కొనసాగిస్తున్నారు. వారు సుమారు 11 మిలియన్లు (1.1 కోట్లు) ఉంటారని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. వారందరినీ దేశం నుండి పంపివేస్తే అమెరికన్లలో ట్రంప్ పలుకుబడి అమాంతం పెరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
“పత్రాలు లేని అక్రమ విదేశీ నివాసిని హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులకు ఏ సమయంలోనైనా అరెస్టు చేసేందుకు పూర్తి అధికారం ఉన్నది. వలస చట్టాలను అతిక్రమించారని వలస విభాగం అధికారులకు అనుమానం వస్తే చాలు, సదరు వలసదారులను అదుపులోకి తీసుకోవచ్చు” అని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, తమ మెమోలో నిర్మొహమాటంగా పేర్కొంది. వలస విధానంపై అమెరికా ఈ విధంగా కఠినంగా మాట్లాడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
11 మిలియన్ల మంది అక్రమ నివాసులలో భారతీయులు 3 లక్షల మంది ఉండడంతో భారత ప్రభుత్వం కూసింత ఆందోళన ప్రకటిస్తోంది. మెమో ప్రధాన లక్ష్యం నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారులని చెబుతున్నప్పటికీ దానిని అక్రమ వలసదారులు అందరికీ ఎదో వంకతో వర్తింపజేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. నిజానికి ఇలాంటి చట్టాలకు అంతర్గత (పరోక్ష) లక్ష్యాలే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం.
మెమో ప్రకారం అక్రమ వలసదారులు కింది కేటగిరీల కిందికి వచ్చినట్లయితే వారిని వెంటనే దేశం నుండి తొలగించే అధికారం హోమ్ ల్యాండ్ సెక్రటరీకి ఉంటుంది. సదరు కేటగిరీలు ఇలా ఉన్నాయి:
- అమెరికాలో ప్రవేశార్హత లేనివారు అమెరికాలో ఉండడానికి అనుమతి లేనట్లయితే మరియు పెరోల్ ద్వారా ప్రవేశం లభించనట్లయితే…
- ప్రవేశార్హత ఉన్నదీ లెండీ నిర్ణయించడానికి ముందు వరుసగా రెండు సంవత్సరాల పాటు భౌతికంగా అమెరికాలో ఉండనట్లయితే…
- అక్రమ విదేశీ వలసదారుడు తల్లిదండ్రులు లేని మైనర్ కానట్లయితే…
- రాజకీయ ఆశ్రయం కోరే ఉద్దేశం లేనివారైతే…
- తమ సొంత దేశంలో హింస, వేధింపులు ఎదుర్కొంటున్నవారు కాకపొతే…
భారతీయులలో ఇలాంటి వారు ఉండడం చాలా చాలా అరుదు; అమెరికా పౌరసత్వం కోసం ఫోర్జరీ పత్రాలు తయారు చేయకపోతే గనక. కనుక ట్రంప్ దాడి నుండి భారతీయులకు మినహాయింపు దొరకడం కష్టంగా కనిపిస్తోంది.
మోడీ రెండు రోజుల క్రితం అమెరికా సందర్శించిన అమెరికన్ పార్లమెంటరీ (సెనేట్) బృందానికి ఒక విజ్ఞప్తి చేశారు. భారత దేశం నుండి వచ్చే నిపుణులైన వర్కర్లకు కఠినతరం వీసా నిబంధనలు వర్తించకుండా ఉండేలా చూడాలనీ, ఆ మేరకు అధ్యక్షుడికి నచ్చజెప్పాలని ఆయన విన్నవించారు. ఆ విజ్ఞప్తి ద్వారా మన ప్రధాని టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, విప్రో తదితర పెద్ద పెద్ద ఐ.టి కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నారు గానీ సామాన్య ఇండియన్ అమెరికన్ల ప్రయోజనాలు కాదు.
అమెరికాలో వ్యాపారం చేస్తున్న, కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు ఇక నుండి తమ కంపెనీల ఉద్యోగులకు అమెరికాలో రెట్టింపు వేతనాలు 130,000 డాలర్ల వార్షిక వేతనం చెల్లించాలని అధ్యక్షుడు డిక్రీ జారీ చేసిన నేపథ్యంలో మాత్రమే మోడీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇంట భారీ వేతనాలు చెల్లించడం కంటే అమెరికాలో ఆపరేషన్స్ ను రద్దు చేసుకునేందుకే భారతీయ కంపెనీలు మొగ్గు చూపవచ్చు. తద్వారా భారతీయ కంపెనీలకు పొమ్మనకుండా పొగబెట్టడానికి ట్రంప్ సిద్ధం అయ్యాడు. మోడీ ఈ కంపెనీల కోసమే సెనేట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు తప్ప ఇతర సాధారణ వలసదారులు ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి ఒక్క మాటా చెప్పలేదు.
Reblogged this on agkanth's weblog.
mari maaku whatsup loo…face book loo…yoo tuoobloo enduku?…tarimikottandi…bhaarata dESaM nunchi…