కలుగులో ఎలుక బైటికి వచ్చేసింది. మాంత్రికుడి మేజిక్ రహస్యం మేజిక్ మధ్యలో ఉండగానే బద్దలైంది. మాంత్రికుడికి సహకరించవలసిన ఓ పాత్రధారి ఏ కారణం చేతనో అసంతృప్తి చెందడంతో నాటకం అంతా బట్టబయలైంది.
సమాజ్ వాదీ పార్టీ నుండి గతంలో వెళ్లగొట్టబడి ఎన్నికల ముందు తిరిగి ఆహ్వానం అందుకున్న అమర్ సింగ్ ములాయం-అఖిలేష్ ల నాటకాన్ని బైట పెట్టాడు. “ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన రాజకీయ దుమారం అంతా ముందుగానే అనుకున్న ఒక డ్రామా” అని అమర్ సింగ్ వ్యాఖ్యానించాడు.
అమర్ సింగ్ వెల్లడితో బీజేపీతో పాటు అనేకమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమే అని ధ్రువీకరణ అయినట్లయింది. బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఎస్.పి లో తండ్రీ కొడుకుల మధ్య రగిలినట్లు చూపిస్తున్నదంతా ఒట్టి నాటకమని మొదట ఊహించారు. ఈ బ్లాగ్ కూడా వెంకయ్య నాయుడు ఊహను బలపరిచింది.
“సమాజ్ వాదీ పార్టీ కురు వృద్ధుడు ములాయం సింగ్, ఆయన పుత్రుడు మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ ఇద్దరూ ఒకటే. వారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు. అదంతా ముందుగానే రూపొందించుకున్న నాటకం. అందులో మాకు అందరికీ పాత్రలు ఇవ్వబడ్డాయి. క్రమ క్రమంగా నాకు ఈ విషయం అర్ధం అయింది… రాష్ట్రంలో అఖిలేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలకొన్న అసంతృప్తి, శాంతి భద్రతల సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ నాటకం ఆడారని నాకు మెల్లగా బోధ పడింది” అని అమర్ సింగ్ చెప్పుకొచ్చారు.
అమర్ సింగ్ ఒకప్పుడు కింగ్ మేకర్ గా సుప్రసిద్ధుడు. ములాయం సింగ్ యాదవ్ కు నమ్మిన బంటుగా, వ్యూహాకర్తగా కూడా ఆయనకు పేరుంది. అలాంటి ఉద్దండ రాజకీయ పండితునికి ములాయం – అఖిలేష్ ల విభేదాలు నాటకమే అన్న సంగతి ఆలస్యంగా అర్ధం అయిందంటే బొత్తిగా నమ్మశక్యం కాకుండా ఉంది. ఆయనకు ముట్టజెబుతామన్న ప్రతిఫలం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదన్న పరిస్ధితి గ్రహించి అమర్ సింగ్ ఈ విధంగా నిజాలు వెళ్లగక్కే పనికి దిగి ఉండాలి తప్ప ఆయన, తాను చెప్పుకుంటున్నంత అమాయకుడైతే కాదు.
“తన కుమారుడి చేతిలో ఓడిపోవడానికి ములాయంకి ఇష్టమే. పార్టీ గుర్తు సైకిల్, కొడుకు, సమాజ్ వాదీ పార్టీ.. ఈ మూడూ ఆయన బలహీనతలు. పోలింగ్ రోజు కూడా వారి కుటుంబం అంతా కలిసే వెళ్ళింది. మరి ఈ నాటకం అంతా ఎందుకు?” అని అమర్ సింగ్ సి.ఎన్.ఎన్-న్యూస్ 18 తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.
అఖిలేష్ సింగ్, ములాయం తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ లు పరస్పరం పదవుల యుద్ధంలో తలపడుతున్నపుడు అమర్ సింగ్, అఖిలేష్ నుండి పదే పదే దూషణలు, తిరస్కారాలు ఎదుర్కొన్నాడు. అమర్ సింగ్ ప్రతిపాదించిన రాజకీయ సమ్మేళనాలను అఖిలేష్ అడ్డంగా తిరస్కరించాడు. అమర్ సింగ్ పార్టీని నాశనం చేస్తున్నాడని కూడా అఖిలేష్ ఆరోపణలు గుప్పించాడు. తండ్రీ కొడుకుల మధ్య వివాదాలు సృష్టించింది అమర్ సింగే అనే కూడా అఖిలేష్ వర్గం ఆరోపించింది. ఈ వ్యవహారంలో ములాయం, శివపాల్ లు అమర్ సింగ్ కు మద్దతుగా ఉన్నట్లు కనిపించారు. కానీ ఆ మద్దతు కూడా ఒట్టి నాటకమే అనీ, తనను ఉపయోగించుకునే పనిలో వాళ్ళు ఉన్నారనీ అమర్ సింగ్ గ్రహించినట్లు కనిపిస్తోంది.
విభేదాల నాటకం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత (anti-incumbancy) నుండి బయటపడటం సమాజ్ వాదీ పార్టీ లక్ష్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరుస్తానని 2012 ఎన్నికలకు ముందు అఖిలేష్ గట్టి వాగ్దానం ఇచ్చాడు. ఐదేళ్ల పాలనలో శాంతి భద్రతలు మెరుగుపడకపోగా మరింత విషమించాయని ఎల్లెడలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ అంశం నుండి కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి విభేదాల నాటకానికి తెరతీశారని చెబుతున్న అమర్ సింగ్ ను నమ్మడానికి ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు.
ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ నాటకం ఆడారని నాకు మెల్లగా బోధ పడింది” అని అఖిలేష్ చెప్పుకొచ్చారు.
sir,here it may be not akhilesh.
Right, thanks.