లిబియా: రష్యా, వెస్ట్ మధ్య రాజుకుంటున్న నిప్పు


libya-chad

బ్రిటిష్ రక్షణ మంత్రి మైఖేల్ ఫాలన్ రెండు రోజుల క్రితం రష్యాకు వ్యతిరేకంగా ఓ వ్యాఖ్య చేశారు. ఆ వెంటనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తన సొంత వ్యాఖ్యతో చాచి కొట్టినట్లు బదులిచ్చారు. ఇది కేవలం వాగ్వివాదమే అయినా మధ్య ప్రాచ్యంలో రష్యా, పశ్చిమ దేశాల మధ్య మరో ఘర్షణ కేంద్రం అభివృద్ధి చెందుతున్న పరిస్ధితికి ప్రబల సూచిక!

వారి వివాదం లోని అంశం లిబియా. లిబియాలో ప్రభావ విస్తరణకు రష్యా ప్రయత్నాలు చేయడం నచ్చని ఫాలన్ “ఎలుగుబంటు తన పాదాల్ని ఇక్కడ (లిబియాలో) దూర్చటం మాకు ఇష్టం లేదు” అని వ్యాఖ్యానించాడు. ఎలుగుబంటు రష్యా జాతీయ జంతువు. రష్యాను ప్రస్తావించవలసి వచ్చినపుడు అనేక చోట్ల -అది సానుకూలంగా అయినా, ప్రతికూలంగా అయినా సరే- ఎలుగుబంటు (బేర్) అని చెప్పడం పరిపాటి.

ఫాలన్ కు సెర్గీ షోయిగు జంతువుల భాషలోనే బదులిచ్చాడు. “‘జంతువు’ టాపిక్ ని ప్రస్తావించుకుంటే, వారి ఆయుధాల తొడుగు పైన ఉండేది ఏమిటి? సింహం, అవును కదా. పాత సామెత ఒకటుంది: ప్రతి సింహమూ పిల్లే గానీ ప్రతి పిల్లీ సింహం కాజాలదు, అని. ప్రతి ఒక్కరూ తమ సొంత విషయాలను మాత్రమే చూసుకోవాలి. వారి జూ లో ఎలుగుబంటుకి ఆజ్ఞలు జారీ చేయగల జంతువు ఏదీ ఉందని మేము అనుకోవడం లేదు.”

[పిల్లి, చిరుత పులి, పులి, సింహం… ఇలాంటి జంతువులను అన్నింటిని కేట్స్ గ్రూపుగా పరిగణిస్తారు. పులిని బిగ్ కేట్ అనడం తెలిసినదే. పులి తన ముందు కాళ్లని ఒకే లైన్ పై వేస్తూ నడుస్తుంది. ర్యాంప్ పైన ఫ్యాషన్ దుస్తులు ధరించి నడిచే యువతీ యువకులు పులి తరహాలో తమ అడుగులను ఒకే లైన్ పై వేస్తూ నడుస్తారు. అందుకే ర్యాంప్ పై చేసే నడకను కేట్ వాక్ అంటారు. “ప్రతి సింహం కేట్ అవుతుంది గానీ, ప్రతి కేట్ సింహం కాజాలదు” అన్న షోయిగు వ్యాఖ్యను ఈ నేపధ్యంలో అర్ధం చేసుకోవాలి.]

అమెరికా, ఐరోపాలు ఐక్య రాజ్య సమితిని అడ్డం పెట్టుకుని కుట్ర చేసి ఆరేళ్ళ క్రితం -2011 అక్టోబరులో- లిబియా దేశాధ్యక్షుడు మౌమ్మర్ గడాఫీ ని దారుణంగా చంపేశాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు లిబియా, కుక్కలు చింపిన విస్తరిగా మిగిలిపోయింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా భాసిల్లిన లిబియాలో ప్రజలిప్పుడు వైరి సాయుధ ముఠాల నిత్య ఘర్షణల మధ్య దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షుగా బ్రతుకులు ఈడ్చుతున్నారు.

అనేక ఆఫ్రికా దేశాల నల్ల జాతి ప్రజలకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించిన గడాఫీ లిబియా ఇప్పుడు కాసింత ఆసరా కోసం ప్రపంచ దేశాలకు తరలిపోయే కాందిశీకులను తయారు చేసే కార్ఖానాగా మారిపోయింది. ఐరోపా దేశాలకు వెళ్ళి బతకాలన్న ఆశతో పడవలపై వందలాదిగా ప్రయాణిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగి చనిపోతున్న దుర్ఘటనలను తలచుకుంటే లిబియన్లకు అమెరికా, పశ్చిమ దేశాలు ఎలాంటి దుర్గతి పట్టించాయో అర్ధం అవుతుంది.

లిబియాను విఫల రాజ్యం (failed state) గా మార్చడంలో సఫలం అయిన అమెరికా, పశ్చిమ దేశాలు తమ తమ ప్రత్యేక బలగాలను ఇప్పటికీ అక్కడ కొనసాగిస్తున్నాయి. చమురు వనరుల కోసం, ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం పరస్పరం తలపడుతున్న వందలాది గ్రూపులకు ఆయుధ, సలహా సహాయం అందిస్తూ వారిని తమ ప్రభావంలో ఉంచుకుంటున్నాయి. తద్వారా స్ధానిక మిలీషియా గ్రూపులే ఆలంబనగా చమురు కొల్లగొట్టేందుకు, లిబియాను మిలట్రీ ఔట్ పోస్ట్ గా మలుచుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో లిబియాలో ప్రభావం నాటేందుకు రష్యా తాజాగా పావులు కదుపుతుండటంతో  ఈ పశ్చిమ వంచిత నేల మరోసారి అంతర్జాతీయ ఆధిపత్య రాజకీయాలకు కేంద్రం అవుతున్నది. ఆ దేశంలోని చమురు వనరులపైనా, రాజకీయ అధికారం పైనా ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఘర్షణ పడుతున్న సాయుధ గ్రూపులలో బలమైన గ్రూపుతో రష్యా సంబంధాలు నెరుపుతున్నది. తలా కొన్ని సాయుధ ముఠాలను చేరదీసిన పశ్చిమ దేశాలకు, ప్రధానంగా అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీకు ఇది కంటక ప్రాయం అయింది.

గత ఒకటి రెండు సంవత్సరాలుగా ఫీల్డ్ మార్షల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వం లోని గ్రూపుతో రష్యా సమంధాలు నిర్వహిస్తున్నది. లిబియాలోని శక్తివంతమైన గ్రూపుల్లో హఫ్తార్ గ్రూపు అగ్ర స్ధానంలో ఉన్నది. తూర్పు లిబియా ప్రాంతం అంతా ఈ గ్రూపు ఆధీనంలో కొనసాగుతున్నది. తూర్పున ప్రధాన నగరమైన బెంఘాజికి సమీపం లోని తొబ్రూక్ నగరం ఈ గ్రూపుకు అధికార కేంద్రం. ఇక్కడ పార్లమెంటును సైతం హఫ్తార్ గ్రూపు నిర్వహిస్తున్నది. ఈ గ్రూపు తనను తాను లిబియన్ నేషనల్ ఆర్మీ -ఎల్‌ఎన్‌ఏ- గా పిలిచుకుంటుంది. అంతర్జాతీయంగా కూడా ఈ పేరుతోనే హఫ్తార్ గ్రూపు గుర్తింపు పొందింది.

chad-libya-conflictద న్యూ యార్కర్ పత్రిక ప్రకారం ఖలీఫా హఫ్తార్ నిజానికి సి‌ఐ‌ఏ అసెట్/ఏజెంట్. గడాఫీ సైన్యంలో మిలట్రీ కమాండర్ గా పని చేసేవాడు. చాద్, లిబియాల మధ్య 1980ల్లో జరిగిన యుద్ధంలో హఫ్తార్ కమాండర్ గా పాల్గొన్నాడు. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హఫ్తార్, చాద్ లో యుద్ధం కొనసాగించాడు. గడాఫీ వారిని వెనక్కి రమ్మని ఆదేశించాడు. వినకపోవడంతో హఫ్తార్ తో సంబంధాలు తెంచుకున్నాడు. ఫలితంగా గడాఫీపై హఫ్తార్ కత్తి గట్టాడు. హఫ్తార్ యుద్ధ ఖైదీగా చాద్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఇదే అవకాశంగా సి‌ఐ‌ఏ జోక్యం చేసుకుని చాద్ తో చర్చలు జరిపి హఫ్తార్ నూ, అతని అనుచరులు 300 మందినీ విమానంలో జైరేకు తరలించింది. కొంత కాలం తర్వాత వారిలో కొందరు లిబియా తిరిగి వెళ్ళగా హఫ్తార్ నేతృత్వంలో మిగిలిన వారికి సి‌ఐ‌ఏ అమెరికా పౌరసత్వం కల్పించింది. తద్వారా ఆయనను గడాఫీ వ్యతిరేక మిలట్రీ అసెట్ గా మలుచుకుంది.

సి‌ఐ‌ఏ పనుపున హఫ్తార్ అనేకమార్లు గడాఫీని కూలదోయడానికి దాడులు చేశాడు. 1996లో కొద్ది మంది సైన్యంతో లిబియా చేరి గడాఫీపై దాడి చేశాడు హఫ్తార్. కానీ తిరుగుబాటును గడాఫీ తేలికగా అణచివేశాడు. హఫ్తార్ తప్పించుకుని మళ్ళీ అమెరికా చేరాడు. అప్పటి నుండి 2011లో లిబియాలో అమెరికా కృత్రిమ తిరుగుబాటు ప్రవేశపెట్టేవరకూ హఫ్తార్ అమెరికాలోనే ఉన్నాడు. 2011లో సి‌ఐ‌ఏ పిలుపుతో లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో పాల్గొన్నాడు. గడాఫీ మరణానంతరం తన కింద ప్రభావ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు. అధికారం కోసం క్రమంగా అమెరికా మద్దతు ఉన్న ఆల్-ఖైదా గ్రూపులతో తలపడ్డాడు. తోబ్రూక్ కేంద్రంగా మరో ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. ఇటీవల ఇసిస్ గ్రూపుతో కూడా తలపడి సిర్టే నగరం నుండి వారిని ఖాళీ చేయించాడు.

పశ్చిమ దేశాలు, ఐరాస గుర్తించిన లిబియా ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ఖలీఫా హఫ్తార్ నిరాకరించాడు. మధ్యధరా సముద్ర తీరంలోని చమురు నిల్వల ప్రాంతాలు ఇటీవలి వరకూ ఒక స్వతంత్ర గ్రూపుగా చెప్పుకున్న సాయుధ మిలట్రీ ఆధీనంలో ఉండేవి. ఈ చమురు ప్రాంతాలను కూడా కైవసం చేసుకునేందుకు హఫ్టర్ ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అయ్యాడు. మొదట సెప్టెంబర్ 2016 లో చమురు టర్మినళ్ళు రాస్ లానుఫ్, ఆల్ సిద్రాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ స్వాధీనంలో సి‌ఐ‌ఏ, హఫ్తార్ కు సహకరించింది. ఈ రెండు టర్మినళ్ళు రోజుకు 700,000 బ్యారేళ్ళ చమురు ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలవి.

…………….సశేషం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s