పాకిస్తాన్ టెర్రర్ దేశం? అబ్బే కాదు! -బీజేపీ


img_0569

పొద్దున్న లేస్తే పాకిస్తాన్ ని తిట్టని రోజంటూ బీజేపీ కి ఉండదు. భారత సరిహద్దు దాటి ఏ దేశం వెళ్లినా పాకిస్తాన్ టెర్రరిజం గురించి చెప్పకుండా మన మంత్రులు ఉండలేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పనే అవసరం లేదు. పాకిస్తాన్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని ఆయన ఇటీవల పలు అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ చేశారు కూడా. కానీ పాక్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లును మాత్రం బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. తన అవకాశవాద రెండు నాల్కల వైఖరిని ప్రదర్శిస్తోంది.

ఇటీవల రాజ్య సభలో ఒక ప్రయివేటు బిల్లు ప్రతిపాదించబడింది. స్వతంత్ర సభ్యుడు రాజీవ్ చంద్ర శేఖర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. పాకిస్తాన్ లాంటి దేశాలను ‘టెర్రర్ దేశాలు’గా ప్రకటించాలని ఆ బిల్లు కోరుతోంది. బిల్లు పేరు ‘ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశాలను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలుగా ప్రకటించే బిల్లు – 2016 ” (The Declaration of Countries as Sponsor of Countries as Sponsor of Terrorism Bill, 2016 ). ఇలాంటి దేశాల పౌరులపై చట్టబద్ధ, ఆర్ధిక మరియు ప్రయాణ ఆంక్షలు, నిబంధనలు విధించాలని ఈ బిల్లు డిమాండ్ చేస్తుంది. (ఇలాంటి చట్టాలను మామూలుగా అయితే అమెరికా చేస్తుంది.)

పాకిస్తాన్ పైన నిరంతరం కారాలు మిరియాలు నూరే బీజేపీ ప్రభుత్వం విచిత్రంగా ఆ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఫిబ్రవరి 3 తేదీన పార్లమెంటు ముందు చర్చకు వచ్చిన ఈ బిల్లును దృఢంగా వ్యతిరేకిస్తూ హోమ్ మంత్రిత్వ సఖ పార్లమెంటు సెక్రటేరియట్ కు లేఖ కూడా రాసింది. తన వ్యతిరేకతకు బీజేపీ చెబుతున్న కారణం: “ఇలాంటి చట్టాల వలన అంతర్జాతీయ సంబంధాలకు విఘాతం కలుగుతుంది. ఇది జెనీవా సదస్సు నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధం.”  

హోమ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఏమి చెప్పారో చూడండి: “పొరుగు దేశంతో మనకు దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంలో మనకు హై కమిషన్ (దౌత్య కార్యాలయం) ఉన్నది. అలాగే ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఇండియా అంతర్జాతీయ సూత్రాలకు, ప్రమాణాలకు బద్ధురాలైన దేశం. కనుక ఏ దేశాన్నైనా టెర్రరిస్టు దేశంగా ప్రకటించడం అంత తెలివైన పని కాదు.”

ఇండియా అనేక సార్లు పాకిస్తాన్ ను ‘టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశంగా నిందించింది. దేశంలో జరిగిన అనేక టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్ ను బాధ్యురాలిని చేసింది. ఇండియాలో జరిగిన టెర్రరిస్టు దాడులకు పాక్ ప్రభుత్వమే స్వయంగా పధక రచన చేసి అమలు చేసిందనీ, పాక్ గూఢచార సంస్ధ ఐఎస్ఐ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఇండియాలో ప్రవేశపెడుతున్న దనీ ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ వేదికలపై ఎంత గొడవ చేసినప్పటికీ ఆచరణలో వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ కు వాణిజ్యపరంగా ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా కట్టబెట్టింది. UPA అనుసరించిన ఈ విధానాన్ని బీజేపీ పొల్లు పోకుండా కొనసాగిస్తోంది. 

యూరి ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ నే బీజేపీ ప్రభుత్వం నిందించింది. యూరి దాడుల అనంతరం సరిహద్దులో పాకిస్తాన్ నెలకొల్పిన టెర్రరిస్టు లాంచింగ్ ప్యాడ్ లపై దాడి చేసి నాశనం చేసినట్లు ప్రకటించింది. పఠాన్ కోట్ దాడికి కూడా పాకిస్తాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లనే బాధ్యులుగా మోడీ పేర్కొన్నాడు. తమ దేశంలోని టెర్రరిస్టులను చట్టం ముందు పెట్టి శిక్షించనిదే పాక్ తో సత్సంబంధాలు నెలకొల్పేది లేదనీ, దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోబోమనీ ప్రధాని శపధం కూడా చేశారు. ఈ విషయమై ఇప్పటికీ ఇండియా, పాక్ ల మధ్య వాగ్వివాదాలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లూ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పాక్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోంది? 

ఎందుకంటే పాకిస్తాన్ ను బీజేపీ ప్రభుత్వం ఎంతగా తిట్టిపోసినప్పటికీ అదంతా జనం వినియోగం కోసమే. వారికి కావలసింది పాకిస్తాన్ తో శత్రుత్వం కాదు. పాకిస్తాన్ ని టెర్రరిస్టు దేశంగా ప్రచారం చేయడం ద్వారా భారత ప్రజల్లో తలెత్తే భావోద్వేగాలు మాత్రమే వారికి కావాలి. వారి భావోద్వేగాలను ఓటు బ్యాంకుగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ది పొందడమే మోడీ/బీజేపీ లకు కావాలి. అంతే తప్ప పాక్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించి, అంతర్జాతీయ మద్దతును కూడగట్టి పాక్ లోని టెర్రరిస్టులను అణచివేసేలా చూడడం భారత పాలకులకు ఎన్నడూ లక్ష్యం కాదు. 

టెర్రరిజం అన్నది అంతర్జాతీయ ఆధిపత్య వ్యూహంలో ఒక పెద్ద, ముఖ్యమైన ఎత్తుగడ. అది సజీవంగా రగులుతూ ఉండాలి తప్ప చల్లార కూడదు. అమెరికా మద్దతుతో, సహాయ-సహకారాలతో, ధన-ఆయుధ-శిక్షణ మద్దతుతో ప్రపంచం అంతా విస్తరించిన టెర్రరిజం అమెరికా ఆధిపత్యానికి ప్రధానంగా లబ్ది చేకూర్చుతుండగా ఇండియా లాంటి మిత్ర దేశాలకు కూడా వాణిజ్య, విస్తరణవాద, పెద్దన్న ప్రయోజనాలకు సైతం లబ్ది కలిగిస్తున్నాయి. కాబట్టి ఒకసారి పాక్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించడం అంటూ జరిగాక ఆ దేశంతో సంబంధాలు పూర్తిగా వేరే రూపాన్ని సంతరించుకుంటాయి. 

ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవాలి. వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలి. అవసరం అయితే దౌత్య సంబంధాలు తెంచుకోవాలి. ఇవన్నీ జరిగితే  భారత వాణిజ్య వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారత వ్యాపారుల వాణిజ్యం దెబ్బ తింటుంది. పాక్ ఇంతవరకు ఇండియాకు వాణిజ్య పరంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఇవ్వలేదు. అయినప్పటికీ ఇండియా మాత్రం పాకిస్తాన్ కు ఆ హోదాను కొనసాగిస్తోంది. దానికి కారణం పాక్ తో వాణిజ్యం వాళ్ళ భారత వాణిజ్య వేత్తలకు భారీ ప్రయోజనాలు ఉండడమే. అటువంటి పాక్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంటే ఇండియాకే (ఇండియా వ్యాపార ధనికవర్గాలకే) నష్టం. 

అందువల్ల పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, పాక్ ను ఎంతగా తిట్టి పోసినా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు చెక్కు చెదరకుండా చూసుకుంటారు. జనానికి మాత్రం పాక్ తో బద్ధ వైరం ఉన్నట్లుగా ఒక మాయను సృష్టిస్తారు. ఆ మాయను చూసి జనం నిజం అని నమ్ముతారు. పాకిస్తాన్ ని ఆజన్మ శత్రువుగా భావిస్తారు. సరిహద్దులో కృత్రిమంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టినప్పుడల్లా దేశభక్తి జ్వరంతో ఊగిపోతారు. క్రికెట్ ఆట జరిగితే పూనకంతో చిందులేస్తారు. ఆటలో ఓడిపోతే ఆటగాళ్లను తిట్టిపోస్తారు. అనేక మంది తిండి నీళ్లు కూడా మానేస్తారు. ఇవన్నీ వారిని (జనాన్ని) రెచ్చగొట్టటానికి, ఉద్రిక్త భావోద్వేగాలు సృష్టించడానికీ తద్వారా వారి అసలు సమస్యలు మర్చిపోయి, పార్టీలు-నేతలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు మర్చిపోయి, వారు తమ వాగ్దానాలను నెరవేర్చలేదన్న సంగతిని మరుపులోకి నెట్టివేసుకుని మళ్ళీ అదే పార్టీలను నమ్ముకునేందుకు దోహదం చేస్తాయి. 

ఇదో నిరంతర ప్రక్రియ. జనం ఎప్పటికీ బైటికి రాకుండా నిరోధించే ప్రక్రియ. వారి వేళ్ళతోనే వారి కళ్ళని పొడిచే ప్రక్రియ. వారి భావోద్వేగాలను వారికే వ్యతిరేకంగా నిలబెట్టే ప్రక్రియ!

2 thoughts on “పాకిస్తాన్ టెర్రర్ దేశం? అబ్బే కాదు! -బీజేపీ

  1. పాకిస్తాన్ పై బి.జె.పి/మోదీకి ఎంత ద్వేషముందో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదిన వేడుకలకు చెప్పాపెట్టకుండా వెల్లినప్పుడే అర్ధమైంది! మరోసారి ఈ పనికిమాలిన తతంగాన్ని మోదీ చెంచాగాళ్ళు వ్యూహాత్మిక ఎత్తుగడగా ప్రచారం చేసుకోవడంలోనే వారి అవకాశవాదం తారాస్థాయికి చేరుకొందని సూచించింది.

    ఇప్పుడు జరిగిన సంఘటన వారి రాజకీయ దివాళాకోరుతనానికి మరో మచ్చుతునక!

  2. మూల గారు, మీరు ముస్లింలని ఎంత తిట్టినా మీరు మాంసం కొనడానికి ముస్లిం కసాయి దుకానానికే కదా వెళ్తారు. పాలకవర్గంవాళ్ళు కూడా అంతే. వాళ్ళకి అవసరమైతే పాకిస్తాన్‌ని తిడతారు, లేకపోతే అదే దేశాన్ని మెచ్చుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s