చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా దేశానిదే అగ్రస్ధానం. అమెరికా అండతో, అవసరం అయితే బలవంతంగానైనా కాంట్రాక్టులు సంపాదించే సౌదీ అరేబియా అత్యధిక చమురు ఉత్పత్తి దేశంగా స్ధానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. మారిన అంతర్జాతీయ పరిస్ధితుల్లో సౌదీ తన స్ధానాన్ని రష్యాకు కోల్పోతుందని విశ్లేషకులు గత కొంత కాలంగా అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ డిసెంబర్ నెలలో చమురు ఉత్పత్తిలో రష్యా దేశం సౌదీ అరేబియాను అధిగమించింది రియాద్ లోని జాయింట్ ఆర్గనైజేషన్స్ డేటా ఇనీషియేటివ్ సంస్ధ వెల్లడి చేసింది.
చమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకోవాలని ఒపెక్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించాయి. రష్యా ఒపెక్ దేశం కాకపోయినప్పటికీ, సౌదీ-రష్యాల లమధ్య చర్చలు జరిగిన దరిమిలా ఉత్పత్తిలో కోత విధించడానికి రష్యా కూడా అంగీకరించింది. ఆ నిర్ణయం మేరకు డిసెంబర్ నెలలో రష్యా, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించినప్పటికీ రష్యా ఉత్పత్తి సౌదీని దాటి పోవడం విశేషం.
నవంబరు నెలలో రష్యా రోజుకు సగటున 10.519 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయగా డిసెంబర్ నెలలో రోజుకు 29,000 బ్యారెళ్ళు తగ్గించుకుని 10.49 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసింది. కాగా సౌదీ అరేబియా నవంబర్ నెలలో రోజుకు 10.72 బ్యారెళ్ళు ఉత్పత్తి చేయగా డిసెంబర్ లో దానిని 10.46 మిలియన్ బ్యారెళ్లకు తగ్గించుకుంది. అనగా సౌదీ అరేబియా కంటే రష్యా రోజుకు సగటున 0.03 మిలియన్ బ్యారెళ్ళు లేదా 30,000 బ్యారెళ్ళు అధికంగా ఉత్పత్తి చేసింది.
చమురు ఉత్పత్తిని జనవరి నెల నుండి తగ్గించుకోవాలని ఒపెక్ దేశాలు, రష్యా నిర్ణయించినప్పటికీ అవి డిసెంబర్ నెల నుండే కోతను ప్రారంభించాయి. ఈ కోత అనుకున్న మొత్తంలో లేనప్పటికీ గడువుకు ముందే కోత ప్రారంభించడం బట్టి చమురు దేశాలు చమురు ధరల పెరుగుదలకు ఎంతగా ఎదురు చూస్తున్నాయో అర్ధం అవుతోంది.
ఒపెక్ దేశాలు ఉమ్మడిగా రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేరకు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. ఇందులో అత్యధిక వాటాను సవీకరించేందుకు సౌదీ అరేబియా స్వచ్చందంగా మందుకు వచ్చింది. తన ఆర్ధిక వ్యవస్ధ నానాటికి కుంచించుకుపోతుండడంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి విషయమై తన బద్ధ శత్రువు ఇరాన్ తో కూడా సంప్రదింపులు జరిపింది. ఇరాన్ విధించిన షరతుల మేరకు ఇరాన్ కూడా ఉత్పత్తి కోటాలో పాల్గొంటున్నది.
ఒపెక్ సభ్య దేశం కాని అమెరికా షేల్ గ్యాస్ చమురు ఉత్పత్తి తగ్గించేందుకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. చమురు ఉత్పత్తిలో అమెరికా ఇప్పుడు మూడవ స్ధానంలో ఉన్నది. ఒపెక్ దేశాల కోత నిర్ణయం తర్వాత నవంబర్ నెల నుండి అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరగడం మొదలయింది. ఈ పెరుగుదల ప్రభావం తోనే ఇటీవల ఇండియాలో వరుసగా పెట్రోల్, డీసెల్ ధరలు పెరుగుతున్నాయి.
అయితే ఇక్కడ మోడీ ప్రభుత్వం దారుణమైన మోసానికి పాల్పడుతోంది. అంతర్జాతియంగా చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ తగ్గుదల మొత్తం ప్రజలకు చేరకుండా మోడీ ప్రభుత్వం అడ్డు పడింది. తగ్గుదల స్ధానంలో సర్వీస్ పన్నులు పెంచుతూ పోయింది. తద్వారా తగ్గుదల లాభాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకుంది. కానీ చమురు ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం పెంచిన పన్నులు తగ్గించకుండా పెరుగుదల భారాన్ని ప్రజలపైకి బదలాయిస్తున్నది. ఫలితంగా ఇప్పటికే అనామత్తుగా ఉన్న భారత ప్రజల ఆదాయం మరింతగా కుచించుకుపోతున్నది. చమురు ధరల వల్ల సమస్త సరుకుల ధరలు ప్రభావితం అవుతాయి కనుక జనం పై అనేక రెట్లు భారం పడుతోంది.
నవంబర్ నెలలో సౌదీ అరేబియా రోజుకు సగటున 8.26 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసింది. డిసెంబర్ నెలలో కేవలం 8 మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతి చేసింది. చమురు ధరలు పెరిగేందుకు తద్వారా గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్ధను దారిలో పెట్టుకునేందుకు సౌదీ తాపత్రయ పడుతోంది. కానీ సౌదీ తాపత్రయం, మోడీ లాంటి పాలకుల వల్ల, మూడో ప్రపంచ దేశాల ప్రజలకు శాపంగా మారింది.
చమురుధరల పెరుగుదల,తగ్గుదలలో మోదీ పెద్దగా నిర్ణయాలు ఏమీ తీసుకోవడంలేదుకదా! గత ప్రభుత్వపు సబ్సిడీధరల ఎత్తివేత,మార్కెట్ నిర్ణయాలకు ధరల అంశాన్ని వదిలేయడం వంటి తిరోగామి(ప్రజల అంచనాలలో) విధానాలనే కొనసాగిస్తున్నాడు. అయితే ఇందులో చింతించవలసిన అంశం మాత్రం అంతర్జాతీయంగా ధరలు పతనమైనా తను పాత పెరిగిన ధరలనే కొనసాగిస్తూ తన ఏలుబడివలనే ధరలు పెరగకుండా ఉన్నాయి చూసుకోండి అని నీచపు ప్రచారాన్ని కల్పించుకున్నడు తన చెంచాగాళ్ళవంటి అనుచరులద్వారా.