డీఎంకే సహకారంతో పళనిస్వామి విశ్వాస తీర్మానం గెలుపు


INDIA-POLITICS

శశికళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఈపిఎస్ (E పళనిస్వామి) విశ్వాస తీర్మానం నెగ్గాడు. ‘న్యాయం గెలుస్తుంది. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అంటూ బింకం ప్రదర్శించిన ఓపిఎస్ చివరికి బిక్క మొహం వేశాడు. ఈపిఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది ఎంఎల్ఏ లు ఓటు వేయగా వ్యతిరేకంగా కేవలం 11 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఓటు వేశారు. జయలలిత ఓటు లేదు కనుక ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎంఎల్ఏలు మద్దతు చాలు.      

పళనిస్వామి విశ్వాస తీర్మానం విజయంలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ది ప్రధాన పాత్ర. కానీ తెర పైన ఏ క్షణంలో కూడా కాంగ్రెస్ కనిపించకపోవడం ఈ నాటకంలోని విశిష్టత. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఎం కే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు వీరంగం సృష్టించడం ద్వారా స్పీకర్ తమను సస్పెండ్ చేయటానికి అవకాశం ఇచ్చారు. 

‘పధకం ప్రకారం’ హింసకు పాల్పడుతున్న డీఎంకే సభ్యులను స్పీఎకర్ సభ నుండి సస్పెండ్ చేయడంతో విశ్వాస తీర్మానం నెగ్గడానికి మార్గం సుగమం అయింది. కోరం బాగా తగ్గిపోయిన సభలో విశ్వాస తీర్మానం నెగ్గటానికి ఆ విధంగా సానుకూల వాతావరణం ఏర్పాటు చేయబడింది. మూజువాణి ఓటు ద్వారా తీర్మానం నెగ్గిందని జయ ప్లస్ ఛానెల్ ప్రకటించింది. కానీ డివిజన్ ఓటు ద్వారా తీర్మానం నెగ్గిందని ఆ తర్వాత స్పీకర్ ప్రకటించారు.

విశ్వాస తీర్మానం అనంతరం ఓపిఎస్ యధావిధిగా మీడియా ముందు కన్నీరు (రిటారికల్) కార్చారు. పనిలో పనిగా శపధాలు చేశారు. “మా పోరాటం అప్పుడే ఆగిపోలేదు” అని మర్మం ఎరింగించారు. “అమ్మ, పార్టీ నుండి తన్ని తగలేసి వ్యక్తి శశికళ. అమ్మకు నేనే అసలైన విశ్వాస పాత్రుడిని. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలో అమ్మ ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం” అని ఓపిఎస్ భవిష్యత్ వాణి వినిపించారు. పళని ప్రభుత్వంపై ప్రయోగించేందుకు బీజేపీ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయని ఓపిఎస్ సూచిస్తున్నారా?

ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో బృహన్నాటకమే ఆవిష్కృతం అయింది. కేవలం విశ్వాస తీర్మానం కోసమే ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశం ప్రారంభం కావడం తోనే డీఎంకే సభ్యుల వీరంగం మొదలయింది. వారు అంతలా వీరంగం వేయడానికి తగిన కారణం లేకపోయినా వీరంగం వేసేశారు. వాళ్ళ వీరంగానికి చెప్పిన కారణం ఇపిఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో నాటకం బహు బాగా రక్తి కట్టింది. 

సభ ఆరంభం కావడంతోనే విశ్వాసం తీర్మానంపై బలాబలాలను నిర్ధారించడానికి రహస్య ఓటింగు పధ్ధతి అనుసరించాలని డిఎంకె సభ్యులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ని స్పీఎకర్ తిరస్కరించారు. ఓటింగు ఎలా జరపాలి తాను నిర్ణయిస్తానని ఆయన చెప్పారు. అక్కడి నుండి డిఎంకె సభ్యుల గొడవ ప్రారంభం అయింది. ప్రతి ఒక్క డిఎంకె సభ్యుడూ సీటు నుండి లేచి వచ్చి స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. 

సందు లేకుండా ఆయన చొట్టూ మూగారు. ఆయన చేతులో కాగితాలు లాక్కున్నారు. మైకు ఊడబెరికారు. ఆయన ముందు ఉన్న పెద్ద బల్లను తిరగేసారు. అసెంబ్లీ అధికారులు కూర్చునే కుర్చీలను తిరగేసి గిరవాటేసారు. అందిన కాగితాలను చింపి ఎగరేశారు. స్పీకర్ ని అటూ ఇటూ తోసేశారు. స్పీకర్ భద్రతా విభాగం సభ్యులు పరుగున వచ్చి ఆయన్ని లోపలి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతూ భద్రతా సభ్యులతో ‘టగ్ ఆఫ్ వార్’ లాంటి ఆట ఆడుకున్నారు. దానితో స్పీకర్ చొక్కా చిరిగిపోయింది. అప్పటి నుండి చిరిగిన చొక్కాను స్పీకర్ సగర్వంగా ప్రదర్శించడం మొదలు పెట్టారు. 

ఈ గొడవ నేపథ్యంలో స్పీకర్ సభను ఒంటి గంటకు వాయిదా వేశారు. సభ ఒంటి గంటకు మొదలయిన తర్వాత డిఎంకె సభ్యుల వీరంగం తిరిగి ప్రారంభం అయింది. దానితో కొందరు డిఎంకె సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ అయిన సభ్యులు బైటికి వెళ్ళడానికి తిరస్కరించారు. వారిని తీసుకెళ్లడానికా అన్నట్లు మార్షల్స్ సభలో ప్రవేశించారు. తమ ఆందోళన తీవ్రం చేయడానికి డిఎంకె సభ్యులకు ఇప్పుడు మరో కారణం దొరికింది. 

సభాధ్యక్షుడు తమను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం అంటూ నినాదాలు ప్రారంభించారు. మరింత అల్లకల్లోలం సృష్టించారు. కొందరు అసెంబ్లీలోనే నేలపై తిష్టవేశారు. మైకులు విరగ్గొట్టారు. డిఎంకె నేత స్టాలిన్ కూడా వారితో కలిసి నేలపై కూర్చొని ‘రహస్య ఓటింగు జరపాల్సిందే’ అంటూ డిమాండ్ చేశాడు. 

ఈ గొడవ ఇలా సాగుతూ పోయింది. తమను మార్షల్స్ సభ బైటికి  బలవంతంగా మోసుకువెళ్లడమే లక్ష్యంగా వారి ఆందోళన కొనసాగింది. 

సభ లోపల ఇలా జరుగుతుండగానే సభ బయట పోలీసులు మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగం లోకి దించారు. మీడియాలో దృశ్యాలు చూసిన ప్రజాస్వామ్య నిపుణులు పెడ బొబ్బలు పెట్టడం ప్రారంభించారు. మీడియా యాంకర్లు తమ శక్తికొద్దీ అరుపులు మొదలెట్టారు. మీడియా నిపుణులను, వ్యాఖ్యాతలను స్థూడియోలకు పిలిపించి వారి చేత ‘పతనం అవుతున్న ప్రజాస్వామిక విలువల పట్ల’ ఆందోళన ప్రకటింపజేశారు. విశ్లేషణలు ప్రచారం చేశారు. డిఎంకె ఆందోళన డ్రామాగా దాదాపు అన్ని ఛానెళ్లూ అభివర్ణించాయి. ఒకటీ రెండు చానెళ్లు “ఈ డ్రామా విశ్వాస తీర్మానం నెగ్గేలా చేసేందుకే” అని సరిగ్గా అంచనా వేశాయి కూడా. 

ద హిందూ ఎడిటర్ లాంటి పత్రికా నిపుణులు, సోలి సొరాబ్జీ లాంటి న్యాయ నిపుణులు సభలో డిఎంకె సభ్యుల ప్రవర్తన పట్ల దిగ్భ్రాంతి ప్రకటించారు. ఖండన మండనలు జారీ చేసారు. కానీ ఎవరు దేనిని ఖండిస్తున్నారో స్పష్టత లేకుండా పోయింది. డిఎంకె సభ్యుల గొడవను ఖండిస్తున్నారా లేక గొడవ మాటున వారు చేస్తోన్న రాజకీయాన్ని ఖండిస్తున్నారా అన్నది స్పష్టం కాలేదు.

మొత్తం మీద డిఎంకె సభ్యులను బల ప్రయోగంతో సభ బైటికి పంపారని చానళ్లు చెప్పాయి. డిఎంకె నేత గుండీలు విప్పిన/ఊడిన చొక్కాతో మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు. తన పైన కూడా చేయి చేసున్నారని ఆయన చెప్పుకున్నాడు. ఎవరు, ఎందుకు చేయి చేసుకున్నారో ఆయన చెప్పలేదు. పత్రికలూ అడగనూ లేదు. ఆయన అక్కడి నుండి తన పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్ ని కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. దానితో ముంబై బయలుదేరిన గవర్నర్ ఆగిపోయారు.

ఈ లోపు స్పీకర్ సభలో తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ ఓటు పద్ధతిని అనుసరించారు. అనగా తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేస్తారో వేరు వేరుగా అడుగుతూ సభ్యులను లెక్కించారు. అనంతరం, అనుకూలంగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయని స్పీకర్ ప్రకటించారు. (Some channels are claiming 8 votes cast against confidence motion) ఆ విధంగా బల పరీక్షలో బీజేపీ గేమ్ ప్లాన్ ఓటమి చెందగా, కాంగ్రెస్ గేమ్ ప్లాన్ విజయం సాధించింది. రాజ్య సభలో మరికొంత మంది సభ్యుల మద్దతును బీజేపీ కోల్పోయింది. జి.ఎస్.టి తప్ప ఇతర బిల్లులకు జయలలిత బీజేపీ కి మద్దతుగా నిలిచింది. ఈ మద్దతు ఇప్పుడు బీజేపీ కి లేదు. ఇప్పటి వరకూ బీజేపీ ఒడిలో ఉన్న ఏఐఏడీఎంకే రాజ్యసభ సభ్యులు ఇప్పుడు కాంగ్రెస్ ఒడిలోకి చేరారు. 

డిఎంకె ఎందుకు సహకరించింది? ఎందుకంటే ఆ పార్టీకి ఏఐఏడీఎంకే చావు కావాలి. ఆ చావు తనకి అనుకూలంగా ఉండాలి. సెకండరీ నాయకత్వాన్ని ప్రోత్సహించని జయలలిత మరణంతో ఏఐఏడీఎంకే పార్టీ ఒక రాజకీయ పార్టీగా దాదాపు ఉనికిని కోల్పోయినట్లే. కాబట్టి తదుపరి ఎన్నికల్లో డిఎంకె విజయం దాదాపు ఖాయం. కానీ మిగిలి ఉన్న 4 ఏళ్ళు బీజేపీ ఏలుబడిలో ఉంటె అది డిఎంకె కు ప్రతికూలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడా పార్టీ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నది గనక. అదీ కాక మోడీ ఏలుబడిలో బీజేపీ కంటే కాంగ్రెస్ ఆకర్షణీయంగా కనిపించడం సహజం. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s