శశికళ స్ట్రోక్: పన్నీర్ బహిష్కరణ, పళనిస్వామి ఎంపిక


Palanisvami stakes claim

Palanisvami stakes claim

బి‌జే‌పి ఎత్తుకు శశికళ పై ఎత్తు వేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పై బహిష్కరణ వేటు వేశారు. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా అప్పటి జయలలిత విధేయుడు, ఇప్పటి తన విధేయుడు అయిన పళని స్వామిని ఎంపిక చేసింది. ఫలితంగా పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి అవకాశాలు రాజ్యాంగ పరంగానే మూసుకుపోయాయి. శశికళ అనుచరునికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు మెరుగు పడ్డాయి.

పళనిస్వామి అప్పుడే గవర్నర్ ని కలిశారు. తనకు 127 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని చెబుతూ గవర్నర్ విద్యాసాగర్ రావుకి లేఖ సమర్పించారు. మెజారిటీ ఎం‌ఎల్‌ఏల మద్దతు ఉన్నది కనుక ప్రభుత్వం ఏర్పాటుకు తనని పిలవాలని కోరారు.

మరో వైపు పన్నీర్ సెల్వం ప్రతినిధులు కూడా గవర్నర్ ని కలిసేందుకు సమాయత్తం అయ్యారు. ఇప్పటి వరకు 12 మంది ఎం‌ఎల్‌ఏల మద్దతు మాత్రమే సంపాదించినప్పటికీ తానూ ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని ఆయన ప్రకటిస్తున్నారు. ఆ మేరకు గవర్నర్ కు కబురు పంపుతున్నారు. ఆయన తరపున ఇద్దరు ఎం‌ఎల్‌ఏలు గవర్నర్ ని కలవనున్నారు.

కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్

గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖ వివరాలను ద హిందూ పత్రిక తెలియజేసింది. ఆ వివరాల ప్రకారం తాను ముగ్గురు రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకున్నానని ఆయన కేంద్రానికి తెలిపారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్లు మోహన్ పరాశరన్, సొలి సోరాబ్జీలను సంప్రదించానని ఆయన తెలిపారు.

ఏ‌జి ముకుల్ రోహత్గి, మోహన్ పరాశరన్ లు ఇరువురూ ‘కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి’ అని సలహా ఇచ్చారని గవర్నర్ లేఖలో చెప్పారు. సోరాబ్జీ మాత్రం ‘అధిక సంఖ్యలో ఎం‌ఎల్‌ఏల మద్దతు ఉన్నవారిని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవండి’ అని సలహా ఇచ్చారని చెప్పారు.

ముగ్గురిలో ఇద్దరు సూచించిన కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కే గవర్నర్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మెజారిటీ పరీక్ష ద్వారానే 1998లో కళ్యాణ్ సింగ్ నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగింది. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పద్ధతిని ఉపయోగించి మెజారిటీ ఎవరికి ఉందో తేల్చడం అదే మొదటిసారి. చివరిసారి కూడా అదే. మళ్ళీ ఇప్పుడే ఆ మాట వినిపిస్తోంది.

కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అన్న ఏర్పాటు రాజ్యాంగంలో ఉన్నదో లేదో తెలియదు గానీ 1998లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తర ప్రదేశ్ లో అలాంటి బల పరీక్ష జరిగింది.

కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఒకే ఓటింగ్ తో ఇద్దరి బలాబలాలను తేల్చడం. సాధారణంగా విశ్వాస పరీక్ష లేదా అవిశ్వాస పరీక్ష ద్వారా సభలో మెజారిటీని ప్రభుత్వాలు నిరూపించుకోవడమో, నిరూపించుకోలేకపోవడమో జరుగుతుంది.

కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ లో సభలోని ప్రతి ఒక్క సభ్యుడూ తాను ఎవరికి మద్దతు ఇస్తున్నదీ రహస్య బ్యాలట్ పద్ధతిలో చెప్పాలి. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్ధుల పేర్లతో కూడిన బ్యాలట్ పేపర్లపై ఎం‌ఎల్‌ఏలు తాను మద్దతు ఇచ్చే పోటీదారుని పేరు ఎదుట సంతకం చేయాలి. సంతకం తప్ప ఎలాంటి మార్కు ఉండకూడదు.

ఓటింగ్ ముగిశాక ఓట్లను లెక్కిస్తారు. ఎవరికి ఎక్కువ మంది మద్దతు తెలిపితే వారే ముఖ్యమంత్రి. ఈ పద్ధతిలో పార్టీల ప్రాధామ్యం ఉండదు. పార్టీ విప్ లు పని చేయవు. ‘ఎం‌ఎల్‌ఏలు తమ అంతరాత్మ ప్రభోధం మేరకు ఓటు వేయాలి’ అన్న నినాదం రాష్ట్రపతి ఎన్నికల సమయాల్లో వినపడుతుంది కదా, అలాంటిదే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ లో జరుగుతుంది.

కాంపోజిట్ టెస్ట్ లో ఇతర పార్టీల ఎం‌ఎల్‌ఏ లు కూడా పరిగణనలోకి వస్తారు. ఈ పరీక్షలో పార్టీల కంటే వ్యక్తిగత ఇష్టాలే పని చేస్తాయి గనుక డబ్బు/ప్రలోభాలు దండిగా పని చేసే అవకాశం ఉన్నది. కానీ తమిళనాడుకు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ ఎంతవరకు సమర్ధనీయము అన్నది ఒక చర్చగా మారవచ్చు.

జయలలిత అవినీతే రుజువైంది!

ఇప్పుడు అంతా బతికి ఉన్న శశికళను తప్పు పడుతున్నారు. పన్నీర్ సెల్వం, దీప తదితర జయలలిత ఆరాధకులు ఓ వైపు శశికళ అవీనీతికి పాల్పడిందని సుప్రీం తీర్పు చెప్పిందని చెబుతూనే అదే తీర్పు జయలలిత అవినీతిని కూడా తూర్పార బట్టిందన్న సంగతిని పక్కన పెట్టేస్తున్నారు. తెలియనట్లు నటిస్తున్నారు. 

అమ్మ, చిన్నమ్మ

అమ్మ, చిన్నమ్మ

కానీ సుప్రీం కోర్టు తన తీర్పులో ప్రధానంగా జయలలిత అవినీతినే ఎండగట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితయే ప్రధాన ముద్దాయిగా కుట్రదారుగా స్పష్టం చేసింది. శశికళ కుట్రకు ప్రోత్సహించి, తోడ్పడిన ముద్దాయిగా పేర్కొంది. కేసులో అవినీతికి పాల్పడిన ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్) జయలలితే అని స్పష్టం చేసింది. “అవినీతి పబ్లిక్ సర్వెంట్ నుండే ఆరంభం అవుతుంది” అన్న గత తీర్పులను ఉటకించింది.

“జయలలిత దీన జనోద్ధరణ లక్ష్యం తోనో, మానవతా సాయం దృష్టితోనో శశికళను తన పోయెస్ గార్డెన్ నివాసంలో ఉంచుకోలేదు. తాను పాల్పడుతున్న క్రిమినల్ అవినీతి దృష్ట్యా చట్టబద్ధ పరిణామాల నుండి తనను తాను కాపాడుకునే లోతైన కోల్డ్-బ్లడెడ్ కుట్ర తోనే వారికి తన ఇంట్లో స్ధానం ఇచ్చారు.

“మేము సాక్షాలను సంపూర్ణంగా విశ్లేషించాం. కేసులోని పార్టీలు సమర్పించిన పత్రాలు పరిశీలించాం. సాక్షాలను బట్టి A1 నుండి A4 వరకు ఉమ్మడిగా కుట్రకు పాల్పడ్డారని స్పష్టం అయింది. పబ్లిక్ సర్వెంట్ అయిన A1 (జయలలిత) తన పదవీ కాలంలో (1991-96) ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారు. సదరు ఆ ఆస్తులను A2 నుండి A4 వరకు ఉన్న వారి పేర్ల కిందకు బదలాయించారు. ఆమె (జయలలిత) తరపున ఆస్తులను కూడబెట్టేందుకు వివిధ సంస్ధలు, కంపెనీలను ముసుగుగా స్ధాపించారు” అని సుప్రీం తీర్పు పేర్కొంది.

“కేసుకు సంబంధించిన నిజాలు, పరిస్ధితులు ఒక లోతైన, కుట్ర పూరితమైన పధకాన్ని, ఎటువంటి పశ్చాత్తాపం అనేది లేకుండా, అమలు చేసి విస్తారమైన ఆస్తులు కూడబెట్టారు. తమ పాపాల జాడలను కప్పి ఉంచేందుకు, అక్రమ సంపాదనలను దాచి పెట్టేందుకు బూటకపు కంపెనీలు స్ధాపించారు. తద్వారా చట్ట పాలనను మోసగించారు… ఒక్క రోజులోనే 10 కంపెనీలు నెలకొల్పారు. ఆస్తులు జమ చేయడం తప్ప ఆ కంపెనీలు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదు… నామమాత్ర ధరలకు విస్తారమైన భూములను ఆక్రమించుకున్నారు… ఆమె (జయలలిత) తన నేరాల పట్ల కేవలం అమాయకత్వాన్ని నటించేందుకు మాత్రమే తన సహ నిందితులను చేరదీశారు తప్ప ఏదో మానవతా సాయం దృష్టితో కాదు” అని సుప్రీం కోర్టు జయలలిత అవినీతిని తూర్పారబట్టింది.

“శశికళ, ఇతర ఇద్దరు సహ నేరస్ధుల నేర కార్యకలాపాల గురించి తనకేమీ తెలియదని ఆమె చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. తన తరపు ఖాతాల్లో జమ అవుతున్న ఆస్తులు, నిధులను శశికళ నిర్వహిస్తుందన్న సంగతి జయలలితకు పూర్తిగా తెలుసు. అందుకోసమే ఆమె శశికళకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ బాధ్యతలను అప్పగించారు” అని సుప్రీం కోర్టు ఎత్తి చూపింది.

Deepa

Deepa

సుప్రీం కోర్టు ప్రస్తావించిన పై అంశాలను బట్టి చూసినప్పుడు జయలలిత ప్రధాన ముద్దాయి అనీ, ఇతర ముగ్గురు ఆమెకు తోడ్పడ్డ నేరస్ధులు అనీ కోర్టు గుర్తించినట్లు అర్ధం అవుతుంది. కనుక ఓ వైపు శశికళ అవినీతిని చీదరిస్తూ అసలు నేరస్ధురాలు అయిన జయలలిత వారసత్వానికి పోటీ రావడం పన్నీర్ సెల్వం, దీపలకు బొత్తిగా పొసగని సంగతి. శశికళ అవినీతిని గుర్తిస్తే ఆమె అవినీతి జయలలిత కోసమే జరిగిందన్న సుప్రీం కోర్టు తీర్పును కూడా వాళ్ళు గుర్తించాలి. అలా గుర్తించాక ప్రధాన అవినీతి దోషి అయిన జయలలిత వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తూ ఆమెకు సహాయం చేసిన శశికళను ఎలా నిందించగలరు.

పన్నీర్ సెల్వం, దీపలకు కావలసింది అధికారమే తప్ప మరొకటి కాదు. కనుక శశికళ అవినీతి గురించి వాళ్ళు పెట్టే పెడబొబ్బలు ఒట్టి మోసపూరితం. అధికారాన్ని చేపట్టి దాన్ని బి‌జే‌పికి బహుమానంగా ఇవ్వనున్న పన్నీర్, దీప లు ఎంత మాత్రం ప్రజాదరణకు అర్హులు కాలేరు. జయలలిత ద్వారా సంక్రమించాలని భావిస్తున్న అధికార వారసత్వానికి కూడా వారు అర్హులు కారు.

అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో శశికళ ముఖ్యమంత్రి పదవి, అవినీతిలకు మించిన సమస్య ప్రజల ముందు నిలబడి ఉంది. అది తెరవెనుక బి‌జే‌పి చేస్తున్న కుతంత్రం.

తమిళనాడు సరే, దేశం భవిష్యత్తు కూడా…

తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ప్రభావం ఒక్క తమిళనాడుకే కాకుండా దేశం అంతటి పైనా పడుతుంది. పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజ్య సభలోని ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే సభ్యులు బి‌జే‌పి పక్షం చేరిపోతారు. అనగా రాజ్యసభలో బి‌జే‌పి బలం పెరుగుతుంది. మెజారిటీకి ఒకటి రెండూ ఓట్లు తగ్గితే బి‌ఎస్‌పి లాంటి పార్టీలు అమ్మకానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కనుక పన్నీర్ సెల్వం గెలుపు బి‌జే‌పికి బలాన్ని ఇస్తుంది. బి‌జే‌పి తలచిన చట్టాలు ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు చేసుకునే అవకాశం మోడికి లభిస్తుంది.

బిల్లుల ఆమోదంలో ఇన్నాళ్లూ బి‌జే‌పి ప్రభుత్వం నిస్సహాయంగా ఉందంటే కారణం దానికి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం. బిల్లుల ఆమోదంలో కాంగ్రెస్ పార్టీ, బి‌జే‌పిని ముప్పు తిప్పలు పెట్టడానికి కారణం రాజ్యసభలో కాంగ్రెస్ కు ఉన్న బలమే.

యూ‌పి‌ఏ హయాంలో కాస్త శక్తివంతమైన భూ సేకరణ చట్టంను పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాన్ని నీరుగార్చాలని యూ‌పి‌ఏ హయాం లోనే స్వదేశీ విదేశీ కంపెనీల నుండి తీవ్ర ఒత్తిళ్ళు వచ్చాయి. భూసేకరణకు ఆయా గ్రామాల ప్రజలు కనీసం 70 శాతం ఆమోదించాలని షరతు విధించడం, పర్యావరణ అనుమతులను తప్పనిసరి చేయడం, పంచాయితీలు ఆమోదాన్ని తప్పనిసరి నిబంధనగా చేయడం… ఇలాంటి నిబంధనలు చట్టంలో ఉన్నాయి.

ఈ నిబంధనల కారణంగా ఒడిసా, జార్ఖండ్, ఛత్తీస్ ఘర్ అడవుల్లో గిరిజనులను తరిమివేసి బాక్సైట్ ఖనిజాలు తవ్వుకునే అవకాశం బ్రిటన్ కంపెనీ వేదాంతకు దక్కలేదు. అలాగే సౌత్ కొరియా కంపెనీ పోస్కో ఒడిసాలో నిర్మించ తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం కూడా గిరిజనుల వ్యతిరేకత వల్ల ముందుకు వెళ్లలేదు.

ఈ నిబంధనలను నీరు గార్చి కంపెనీలకు అనుకూలంగా మార్చుతానని మోడి 2014 ఎన్నికలకు ముందు విదేశీ కంపెనీలకు గట్టి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. వరుసగా మూడుసార్లు ఆర్డినెన్స్ ను పొడిగిస్తూ పోయారు. తీవ్ర విమర్శలు రావడంతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టక తప్పలేదు. కానీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో భూసేకరణ చట్ట సవరణ (నీరు గార్చు) బిల్లు ఆమోదం పొందలేదు. ఆ విధంగా దేశంలోని పేద, గ్రామీణ, గిరిజన ప్రజల భూములకు, నివాస భూములకు, అటవీ భూములకు పెను ప్రమాదం తప్పిపోయింది.

ఇప్పుడు తమిళనాట పన్నీర్ సెల్వం, దీపల పుణ్యమాని రాష్ట్రం బి‌జే‌పి ఖాతాలో చేరితే ఈ ప్రజా వ్యతిరేక బిల్లులన్నీ మళ్ళీ తెరమీదికి వస్తాయి. కనుక తమిళనాడులో శశికళ అనుచరుడు ప్రభుత్వం ఏర్పరచేదీ లేనిదీ అలా ఉంచితే బి‌జే‌పి జేబులో ఉన్న పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని మాత్రం తమిళనాడు ప్రజలు వ్యతిరేకించాలి. దేశ శ్రామిక ప్రజల భూములు, నివాసాల భవిష్యత్తు తమిళనాడు రాజకీయాలపై ఆధారపడి ఉన్న పరిస్ధితి గ్రహించి పన్నీర్ సెల్వం అధికారం చేపట్టడాన్ని వ్యతిరేకించాలి. తద్వారా మోడి ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందకుండా చూడాలి.

పోస్ట్ స్క్రిప్ట్: జయలలిత, నరేంద్ర మోడి లాంటి నాయకులు అమాయక ప్రజలను ఎంత దారుణంగా, పచ్చిగా మోసం చేస్తున్నదీ శశికళ-జయలలిత-తమిళనాడు ఉదంతం స్పష్టం చేస్తున్నది. ఈ మోసకారులకే పిచ్చి జనం ఇప్పటికీ నీరాజనాలు పట్టడం, అందుకు ఫోర్ట్ ఎస్టేట్ సంపూర్ణ సహకారం అందివ్వడం చూస్తే ప్రజలు నిజాలు తెలుసుకునే రోజు కనుచూపు మేర తర్వాత, సుదూర తీరాల్లో అయినా ఉన్నదా అన్న అనుమానం కలగక మానదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s