శశికళ నటరాజన్ కలలు కల్లలయ్యాయి. కళ్ళ ముందు ఊరిస్తూ కనిపించిన ముఖ్య మంత్రి పీఠం ఆమెకు దూరం అయిపొయింది. నోటి కాడ ముద్ద చెల్లా చెదురయింది. ముఖ్య మంత్రి కార్యాలయానికి బదులు ఆమె జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక హై కోర్టు తీర్పును పక్కనబెట్టి ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది.
తమిళనాడులో అయితే సాక్షులను జయలలిత ప్రభావితం చేస్తుందన్న పిటిషనర్ల విన్నపం దరిమిలా జయలలిత, శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకరన్ లపై ‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసు’ కర్ణాటక హై కోర్టుకు బదలాయించారు. కర్ణాటక హై కోర్టు అందరినీ నిర్దోషులుగా తీర్పు చెప్పడంతో జయలలిత విడుదలై మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేక రోజులు తర్జన భర్జనలు పడిన అనంతరం హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. జయలలిత మరణానంతరం ఏర్పడిన రాజకీయ అనిశ్చితి దరిమిలా వెంటనే తీర్పు వెలువరించాలని శశికళ కోరినప్పటికీ సుప్రీం కోర్టు అంగీకరించలేదు. తన వీలు ప్రకారమే తీర్పు చెబుతానని స్పష్టం చేసింది.
ఆ ప్రకారమే సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకరన్ లు దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కర్ణాటక హై కోర్టు తీర్పును రద్దు చేసింది. ట్రయల్ కోర్టు దోషులకు 4 సం.ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పునే సుప్రీం కోర్టు ఖాయం చేసింది కనుక అదే శిక్ష ఇప్పుడు అమలులోకి వస్తుంది. (శిక్షతో పాటు 10 కోట్లు అపరాధ రుసుము కట్టాలని కింది కోర్టు ఆదేశించింది.)
నేరం రుజువైన దరిమిలా శశికళ వచ్చే పదేళ్ల పాటు ఎలాంటి రాజకీయ పదవి చేపట్టడానికి వీలు లేదు. చట్టం ప్రకారం 6 సం.లు రాజకీయ పదవికి అనర్హులు. ఈ గడువు శిక్షా కాలం ముగిసినప్పటి నుండి మొదలవుతుంది. వెరసి 10 సం.ల తర్వాతనే ఆమె పదవికి అర్హత సాధిస్తారు. తీర్పుపై సమీక్షకు అప్పీలు చేసి, ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే తప్ప ఆమె రాజకీయ జీవితానికి తెరపడినట్లే.
సుప్రీం తీర్పు ఫలితంగా ఓ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇప్పుడు మార్గం సుగమం అయింది. పన్నీర్ సెల్వం కు మొదటి నుండి మద్దతు ఇస్తూ వచ్చిన బీజేపీ/మోడీ రాజకీయానికి విజయం లభించింది. నిజానికి సుప్రీం తీర్పు సెల్వం కంటే బీజేపీకె ఎక్కువగా సంతోషాన్నిస్తుంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వంకు బీజేపీ మద్దతు ఇవ్వడానికి కారణం ఆమె కాంగ్రెస్ మనిషి అని బీజేపీ అనుమానించడం. శశికళ భర్త నటరాజన్ పూర్తిగా కాంగ్రెస్ మనిషి అని బీజేపీ అనుమానం. శశికళ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రభుత్వ పగ్గాలు, ఏఐఏడీఎంకే రాజకీయ పునాది కాంగ్రెస్ పార్టీకి వశం చేసే కృషిలో శశికళ, నటరాజన్ లు ఉన్నారని బీజేపీ గట్టిగా అనుమానిస్తోంది. ఇందులో నిజం ఉన్నా ఆశ్చర్యం లేదు.
బీజేపీ సంతోషానికి మరో ముఖ్య కారణం దక్షిణ భారతంలో అడుగు పెట్టె సువర్ణావకాశం పన్నీర్ సెల్వం ద్వారా బీజేపీకి లభిస్తున్నది. శశికళ జైలుకు వెళ్తే ఆమె వెనుక ఉన్న MLA లను ఆర్గనైజ్ చేసే నాయకత్వం ఎవరూ లేరు. కనుక MLA లు పన్నీర్ సెల్వం పక్కకు చేరడం తప్ప నమ్మకమైన మరో మార్గం లేదు.
- Dreams Shattered
- Chinnamma
- Nephew Deepak, Niece Deepa at JJ funeral
- Sudhakaran, estranged adopted son of JJ
- Ilavarasi, Sasikala
- Natarajan
ఎదో అద్భుతం జరిగి అంతటి నాయకుడు దొరికి, ఆయనకు శశికళ ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పి, ఆయన వెనక MLA లను నిలప గలిగితే, అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఓ చెయ్యి వేస్తె తమిళనాడు రాజకీయం మాంచి రసకందాయంలో పడుతుంది. పత్రికల ప్రకారం చూస్తే శశికళ ఇప్పటికే ‘ప్లాన్ బి’ ని రూపొందించుకుంది. దాని ప్రకారం ఆమె కే ఏ సెంగోట్టైయాన్ (పార్టీ ప్రిసీడియం కొత్త అధ్యక్షుడు), ఇడప్పడి కె పళని స్వామి లను ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్నారు. జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ను కూడా ఆమె ముఖ్య మంత్రిగా ఎంపిక చేయవచ్చని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. మేనకోడలు దీప బిజేపి/పన్నీర్ సెల్వం శిబిరంలో ఉండటం విశేషం.
సుప్రీం తీర్పు జనానికి మంచిదో కాదో కూడా ఒక మాట అనుకోవాలి.
పైన చెప్పుకున్నట్లు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగడం అంటే దక్షిణ భారతంలో బీజేపీ అధికార అరంగ్రేట్రం చేసినట్లే లెక్క. ఆరంభంలో స్వతంత్రంగా ఏఐఏడీఎంకే పార్టీ కింద ఉన్నట్లు కనిపించినా తర్వాత కాలంలో, పార్టీ శశికళ చేతుల్లో ఉన్నది కనుక, ఆయన బీజేపీ నాయకుడిగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. జనాన్ని కుల, మతాల వారీగా విభజించి తగాదాలు రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేని బీజేపీ దేశంలో ఎంత విస్తరిస్తే దేశానికి, ప్రజల ఐక్య జీవనానికి అంత నష్టం. కనుక సుప్రీం కోర్టు తీర్పు ఒక విధంగా తమిళనాడు ప్రజలకు, దక్షిణ భారతానికి, మొత్తంగా దేశ రాజకీయాలకు అంత సానుకూలంగా కనిపించడం లేదు.
అలాగని శశికళకు మద్దతు ఇవ్వడానికి కూడా పెద్ద కారణాలు లేవు. ఆమె ఎన్నడూ ప్రజల చేత ఎన్నిక కాలేదు. ఆమె రాజకీయంగా ఎంతటి సమర్ధనీయురాలో గ్రహించేందుకు ప్రజల వద్ద సమాచారం లేదు. తెలిసిందల్లా జయలలితను అడ్డు పెట్టుకుని ఆమె పెత్తనం చేసి అవినీతికి పాల్పడిందని మాత్రమే. అలాంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడవలసి రావడం జనానికి దౌర్భాగ్యమే.
ఆ మాటకు వస్తే ఇప్పటి మరియు పాత ముఖ్యమంత్రుల్లో ఎవరు మాత్రం ప్రజలకు గర్వకారణంగా పని చేశారు/చేస్తున్నారు గనక? ప్రజల చేత అనేకసార్లు ఎన్నుకోబడిన ముఖ్య మంత్రులు అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ప్రజలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. ఛత్తీస్ ఘర్, జార్ఖండ్, ఒడిశా, ఆంద్ర ప్రదేశ్ లాంటి చోట్ల పోలీసులకు అపరిమిత అధికారాలు అప్పజెప్పి గిరిజనులపై అత్యాచారాలు సాగిస్తున్నారు; బూటకపు ఎన్ కౌంటర్లకు గురి చేస్తున్నారు. ఇలా చూసినప్పుడు శశికళ నటరాజన్ అనుభవ రాహిత్యం, అవినీతి పెద్ద సమస్యగా కనిపించదు.
బీజేపీ ‘విభజించు, పాలించు’ రాజకీయాలు, విదేశీ పెట్టుబడులకు సాష్టాంగ ప్రమాణం చేయడం, దళితులు-ముస్లింలపై సాగిస్తున్న అణచివేత పీడనలు లాంటివి పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ గుప్పిట్లో ఉన్న పన్నీర్ సెల్వం కంటే శశికళ నటరాజన్ మెరుగని అనిపించక మానదు. దొడ్డి దారిలో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కైవసం చేసుకున్న బీజేపీ కి రాష్ట్రాలలో బలం పెరిగేకొద్దీ రాజ్యసభలో బలం పెరిగే అవకాశాలు పెరుగుతాయి.
రాజ్యసభలో మెజారిటీ వస్తే ఇక బీజేపీ కి పట్టపగ్గాలు ఉండవు. కొద్దోగొప్పో ప్రజలకు అనుకూలంగా ఉన్న భూసేకరణ చట్టాన్ని పూర్తిగా విదేశీ కంపెనీలకు లనుకూలంగా మార్చుతూ సవరణలు చేసిన బీజేపీ రాజ్యసభలో బలం లేక ఆ సవరణలను చట్టబద్ధం చేయలేకపోయింది. ఇంకా అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు ఈ కారణంతోనే కోల్డ్ స్టోరేజిలో పెట్టవలసిన పరిస్ధితి బీజేపీ కి ఏర్పడింది. అలాంటి బీజేపీ చేతిలోకి మరిన్ని రాష్ట్రాలు వస్తే రాజ్య సభలో మెజారిటీ సాధించే వైపుగా బీజేపీకి అవకాశం ఇవ్వడమే. ఈ కారణం వల్ల సుప్రీం కోర్టు తీర్పు తమిళనాడుకు కాకుండా, దేశానికి కూడా ప్రతికూలం అవుతుంది.