
One million Treasury Bond
అమెరికా ఆర్ధిక పరపతి క్షీణిస్తున్న నేపధ్యంలో అమెరికా ఋణ పెట్టుబడులకు గిరాకీ తగ్గిపోతున్నది. అంటే అమెరికాకి అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్లు తగ్గిపోతున్నారు. ఋణ పరపతి తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. మార్కెట్ ఎకానమీ ఆర్ధిక వ్యవస్ధలు అప్పులపై ఆధారపడి రోజువారీ కార్యకలాపాలు నడిపిస్తుంటాయి. అప్పులు తెచ్చి ఖర్చు చేస్తూ ఆ తర్వాత పన్నుల ఆదాయంతో అప్పులు తీర్చుతుంటాయి. అప్పు ఇచ్చేవాళ్లు లేకపోవడం అంటే దేశ ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యంపై నమ్మకం క్షీణిస్తున్నట్లు అర్ధం.
సార్వభౌమ ఋణ పత్రాలు?
ఐరోపా ఋణ సంక్షోభాన్ని, ముఖ్యంగా గ్రీకు ఋణ సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటే అప్పు పుట్టకపోవడం అంటే ఏమిటో అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు ఖర్చుల కోసం ఋణ బాండ్లు జారీ చేయడం ద్వారా అప్పులు సేకరిస్తాయి. ఈ బాండ్లను సార్వభౌమ ఋణ పత్రాలు (సావరిన్ డెట్ బాండ్స్) అంటారు. 1 సం. నుండి 2, 5, 10 సంవత్సరాల వరకు కాలపరిమితితో కూడిన సార్వభౌమ ఋణ పత్రాలను అవసరాల మేరకు ప్రభుత్వాలు వేలం వేస్తాయి. వేలంలో ఎంత తక్కువ వడ్డీకి పత్రాలు అమ్ముడుబోతే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యంపై అంత గట్టి నమ్మకం ఉన్నట్లు అర్ధం.
ఒక దేశ సార్వభౌమ ఋణ పత్రాలు వేలంలో కొనుగోలు చేయడం అంటే ఆ దేశ అప్పులో మదుపు చేసినట్లు (పెట్టుబడి పెట్టినట్లు అర్ధం). సార్వభౌమ ఋణ పత్రాలలో మదుపు చేసినవారికి 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి నిర్దిష్ట తేదీ నాడు వడ్డీ చెల్లించబడుతుంది. ఆ నిర్దిష్ట తేదీకి (డ్యూ డేట్) చెల్లింపులు జరిగిపోవాలి. ఒక్క రోజు తేడా వచ్చినా అది ఎగవేత (డిఫాల్ట్) అవుతుంది.
ఏ దేశమైనా సార్వభౌమ ఋణ పత్రాల చెల్లింపుల్లో డీఫాల్ట్ సంభవిస్తే అది పెద్ద ప్రతికూల (నెగిటివ్) వార్త అవుతుంది. వెంటనే ఆ దేశ ఆర్ధిక పరిస్ధితి బాగా లేదని మార్కెట్లకు అర్ధం అవుతుంది. అప్పుడు ఆ దేశానికి అప్పులు ఇవ్వాలంటే వేలంలో అధిక వడ్డీ డిమాండ్ చేస్తారు. వారు కోరిన వడ్డీ ఇవ్వకపోతే అప్పు పుట్టదు. అప్పు పుట్టకపోతే ఖర్చులు నడవ్వు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేరు. ఆర్ధిక వ్యవస్ధ చక్రం స్తంభించిపోతుంది. ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుంది. రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. సామాజిక సంక్షోభం పెచ్చరిల్లుతుంది. అల్లర్లు చెలరేగుతాయి. ప్రజలు సమ్మెలకు, ఆందోళనలకు దిగుతారు.
ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధలో సార్వభౌమ ఋణ పత్రాల పాత్ర ఇంత లోతుగా ఉంటుంది. ఇంతకీ ఋణ పత్రాలలో కొనుగోలు చేసేవారు ఎవరు? వ్యక్తిగత మదుపుదారుల నుండి ఇతర దేశాల ప్రభుత్వాల వరకూ ఇలా దేశాల సార్వభౌమ ఋణ పత్రాలలో పెట్టుబడులు పెడతారు. ఎవరికైతే ఖర్చులు పోను మిగులు ఉంటుందో వారే ఇతరులకు రుణాలు ఇవ్వగలుగుతారు. వారెన్ బఫెట్, జార్జి సొరోస్ లాంటి బడా బడా ధనికులు, కంపెనీలు, ఇతరుల పొదుపు సొమ్మును సేకరించి పెట్టుబడులు పెట్టే అనేకానేక ద్రవ్య సంస్ధలు (హెడ్జ్ ఫండ్ లు, మ్యూచువల్ ఫండ్ లు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మొ.వి), యాపిల్-మైక్రోసాఫ్ట్-గూగుల్ లాంటి బడా కంపెనీలు… వీళ్ళే సార్వభౌమ ఋణ పత్రాలలో పెట్టుబడులు పెడతారు. కనుక వాస్తవంలో వీళ్ళే దేశాల ఆర్ధిక వ్యవస్ధలను శాసిస్తుంటారు.
అమెరికా సావరిన్ బాండ్లను అమెరికా ట్రెజరీ జారీ చేస్తుంది. కనుక వాటిని ట్రెజరీ బాండ్లు అని కూడా అంటారు. తరచుగా ఒక్క మాటలో ‘ట్రెజరీస్’ అని అంటుంటారు. అమెరికా ట్రెజరీస్ కు ప్రపంచంలో అత్యంత భద్రమైన మదుపు గా ఇన్నాళ్లూ పేరుంది. అంటే ట్రెజరీస్ లో మదుపు చేస్తే ఇక డబ్బు ఎక్కడికీ పోదని నమ్మకం. తక్షణ లాభాల కోసం వివిధ దేశాలలోని స్టాక్ మార్కెట్లను చుట్టి వచ్చే హాట్ మనీ (ఎఫ్‌ఐఐ – Foreign Institutional Investments), ఏదైనా తిరుగుడు బడితే వెంటనే వివిధ దేశాల్లోని స్టాక్ మార్కెట్లను వదిలిపెట్టి ఆఘమేఘాల మీద అమెరికా ట్రెజరీస్ లోకి వెళ్లిపోతాయి. అప్పుడు ఆయా స్టాక్ మార్కెట్లు దభేల్ మని కూలిపోతాయి. 1990లలో ఆసియా టైగర్స్ సంక్షోభం అలా వచ్చిందే. 2000 నాటి డాట్ కామ్ సంక్షోభం లోనూ ఎఫ్‌ఐఐల పాత్ర ఉన్నది. (2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం మాత్రం మరింత విస్తృతమైనది, లోతైనది.)
అమెరికాకు అప్పు ఇచ్చిన దేశాలలో మొదటి స్ధానం చైనాది. ఆ తర్వాత స్ధానం జపాన్ ది. గతంలో, ఏడెనిమిదేళ్ళ క్రితం వరకూ, జపాన్ ప్రధమ స్ధానంలో ఉండేది. (ప్రపంచ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో జపాన్ మూడో స్ధానం లో ఉండగా చైనా రెండవ స్ధానంలో ఉన్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం) దాదాపు 15 సంవత్సరాల నుండి అమెరికాతో భారీ మొత్తంలో వాణిజ్య మిగులు పొగువేస్తూ వచ్చింది. ఒక్క అమెరికాయే కాదు, ఇతర అనేక ముఖ్య దేశాలతో చైనాకు ఇప్పటికీ వాణిజ్య మిగులు కలిగి ఉన్నది. ఈ మిగులు చైనా ఆర్ధిక శక్తికి ప్రధాన ఆదరువు. ఆఫ్ కోర్స్, వాణిజ్య మిగులు ఏర్పడాలంటే ఆర్ధిక సామర్ధ్యం, ఉత్పాదకత, టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు… ఇవన్నీ తప్పనిసరి.
అమెరికా సార్వభౌమ ఋణ పత్రాల ప్రాధాన్యత ఏమిటో ఈ కాస్త వివరణ ద్వారా కనీస అవగాహనకు వచ్చి ఉండాలి. అమెరికా ట్రెజరీలకు గిరాకీ పడిపోవడం అంటే అమెరికాకు అప్పు ఇవ్వడానికి ఇతర దేశాలు, కంపెనీలు, సూపర్ ధనికులకు ఆసక్తి తగ్గిపోతున్నట్లుగా భావించవచ్చు. దానికి కారణం అమెరికా ఆర్ధిక సామర్ధ్యం తగ్గిపోవడమే. దేశ ఆర్ధిక వనరులను ప్రధానంగా మిలట్రీ శక్తిపై కేంద్రీకరించిన ఫలితంగా ఇతర రంగాలపై -ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రోడ్లు, రైల్వేలు, లాజిస్టిక్స్ మొ.వి), దేశీయ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ, దేశీయ మార్కెట్, ఉపాధి, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు- దృష్టి తగ్గిపోయింది. చౌక శ్రమ ద్వారా వచ్చే లాభాల కోసం ఇవన్నీ చైనా లాంటి దేశాలకు తరలివెళ్ళాయి.
ఆర్ధిక సామర్ధ్యం తగ్గిపోయాక అమెరికాకు ఇచ్చే అప్పులు వెనక్కి వస్తాయా లేదా అన్న అనుమానాలు ఋణ దాతలకు రావడం సహజం. అయితే ఇది సాధారణ వివరణ మాత్రమే. అమెరికా సార్వభౌమ ఋణ పత్రాలకు గిరాకీ పడిపోవడం వెనుక భౌగోళిక-ఆధిపత్య రాజకీయాలు కూడా పని చేస్తున్నాయి. అమెరికా ఆధిపత్య విధానాలను తిప్పి కొట్టడానికి దాని కరెన్సీ డాలర్ ను అంతర్జాతీయ కరెన్సీ స్ధానం నుండి కూలదోయడానికి చైనా, రష్యా లు పని గట్టుకుని కృషి చేస్తున్నాయి. చైనా ఆర్ధిక శక్తి వలన చైనాను అనుసరించేందుకు, దాని మాట వినేందుకు సిద్ధం అయే దేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. డాలర్ గనుక తన ప్రభను కోల్పోవడం అంటూ జరిగితే ఇక అదే అమెరికా ఆధిపత్యానికి సమాధి అవుతుంది. అందుకే డాలర్ ను కూలదొసేందుకు ప్రయత్నాలు జరగడం. చైనా, రష్యాలు బహిరంగంగా ఈ ప్రయత్నాలు సాగిస్తుండగా లండన్, జర్మనీ, జపాన్ లు చాటు మాటుగా కృషి చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అమెరికా ట్రెజరీల లాభదాయకత క్షీణిస్తున్నదన్న విషయంలో టోక్యో, బీజింగ్, లండన్ లు ఏకాభిప్రాయంతో ఉన్నాయని అమెరికా వాణిజ్య పత్రిక బ్లూమ్ బర్గ్ న్యూస్ ఫిబ్రవరి 13 తేదీన ఒక విశ్లేషణ ప్రచురించింది. అమెరికా ట్రెజరీలలో పెట్టుబడులు పెట్టిన జపాన్ కంపెనీలు అనేకం గత డిసెంబర్ లో అకస్మాత్తుగా తమ పెట్టుబడులను తగ్గించుకున్నాయని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ట్రెజరీలను వదిలి వెళ్ళడం అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ ట్రెజరీల నుండి పెట్టుబడుల ఉపసంహరణకు జపాన్ కంపెనీలు సిద్ధపడ్డాయని పత్రిక తెలిపింది. ఒక్క జపాన్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా అనేక చోట్ల ఇదే పరిస్ధితి నెలకొని ఉన్నట్లు తెలుస్తున్నది.
ట్రంప్ ఫ్యాక్టర్!
ప్రస్తుతం అమెరికా మొత్తం అప్పు 17.8 ట్రిలియన్లు. అందులో పబ్లిక్ అప్పు 13.9 ట్రిలియన్ డాలర్లు. (వాణిజ్య భాషలో దీనిని ట్రెజరీ మార్కెట్ అంటారు.) ఈ ట్రెజరీ మార్కెట్ అనాకర్షణీయంగా మారడానికి కారణాన్ని ట్రంప్ పాలన పైకి బ్లూమ్ బర్గ్ పత్రిక నెట్టివేసింది. ట్రంప్ పాలనలో లోటు మరింతగా పెరిగిపోతుందనీ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనీ, ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లు భారీగా పెంచనున్నదనీ ఫలితంగా అమెరికా ట్రెజరీ మార్కెట్ ఇక అత్యంత భద్రమైన చోటు కాబోదని మదుపుదారులు భావిస్తున్నారనీ అందుకే అమెరికా బాండ్లకు గిరాకీ పడిపోయిందని బ్లూమ్ బర్గ్ విశ్లేషించింది. కానీ ఈ విశ్లేషణ అసత్యాలు, అర్ధ సత్యాలతో కూడుకున్నది. జంట టవర్లపై దాడులను సాకుగా చూపిస్తూ వరుస యుద్ధాలను అమెరికా నెత్తిమీదికి తెచ్చి పెట్టిన జార్జి బుష్, బారక్ ఒబామాల పాత్రను పక్కనబెట్టి అధ్యక్ష పదవిలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాని ట్రంప్ పాలనపైకి దోషం అంతా నెట్టివేయడం కంటే మించిన తప్పుడు వివరణ మరొకటి ఉండబోదు.
జంట టవర్లపై దాడుల అనంతరం ‘ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం’ ప్రకటించిన జార్జి బుష్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లపైకి దండెత్తి వెళ్ళాడు. అక్కడ ఊహించని విధంగా భారీ ధన, ప్రాణ నష్టాలను అమెరికా ఎదుర్కొంది. 7 సం.ల పాటు ఇరాక్ లో యుద్ధం సాగించిన అమెరికా, చెప్పిన లక్ష్యం ఎలాగూ నెరవేర్చలేదు, తాను కోరుకున్న లక్ష్యం కూడా నెరవేర్చుకో లేకపోయింది. అధికారిక అంచనాల ప్రకారమే ఇరాక్ యుద్ధం ఖరీదు 1.7 ట్రిలియన్లు. రాయిటర్స్ వార్తా సంస్ధ ఇరాక్ యుద్ధం ఖరీదు 2 ట్రిలియన్లుగా అంచనా వేసింది. యుద్ధం కోసం చేసిన అప్పులపై వడ్డీలను కూడా కలిపితే వచ్చే మూడు దశాబ్దాలలో ఇరాక్ యుద్ధం ఖర్చు 6 ట్రిలియన్లకు చేరుతుందని బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇరాక్ యుద్ధంలో 135,000 ఇరాకీ పౌరులు మరణించారు. భద్రతా బలగాలు, ఇరాకీ తిరుగుబాటుదారులు కూడా కలిపితే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలు. కాగా 5.5 లక్షల మంది ఇరాకీలు యుద్ధం ప్రభావంతో చనిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ ఊబిలో నుండి అమెరికా ఇప్పటికీ బైటపడలేకపోతున్నది. వెనక్కి రావాలంటే ఫలానా విజయం సాధించాం అని చెప్పుకోవాలి; అలా చెప్పుకోవడానికి అక్కడ ఏమీ మిగల్లేదు సరికదా, శత్రువుగా ప్రకటించిన తాలిబాన్ తిరిగి పై చేయి సాధించడానికి సర్వ విధాలా సిద్ధమై ఉన్నది. ఆఫ్ఘన్ లో ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మిలియన్ల కొద్దీ డాలర్లు ఋణ భారం అమెరికాపై పడుతున్నది. వాట్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (బ్రౌన్ యూనివర్సిటీ) అధ్యయనం ప్రకారం ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలపై అమెరికా ఇప్పటివరకు 5 ట్రిలియన్ల వరకు ఖర్చు చేసింది. ఇరాక్, ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధాల ఖర్చును అమెరికా ఎన్నడూ బడ్జెట్ లలో చూపలేదు. అనేక పేర్లు పెట్టి వివిధ దేశాల నుండి అప్పులు సేకరించి ఖర్చు చేసింది తప్ప అమెరికా ప్రజలకు జవాబుదారీతనం వహించే విధంగా సదరు ఖర్చు లెక్కలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. అందుకే వివిధ స్వతంత్ర సంస్ధల అధ్యయనాల మీదనే పరిశీలకులు, విశ్లేషకులు ఆధారపడవలసి వస్తున్నది.
ఓ పక్క ఆఫ్ఘన్ యుద్ధం సాగుతుండగానే లిబియాపై దాడి చేసారు. ఎన్‌జిఓలను మేపి ఈజిప్టులో కిరాయి తిరుగుబాట్లు రెచ్చగొట్టారు. దానికి ‘అరబ్ వసంతం’ అంటూ లేబుల్ తగిలించారు. ఇంతలోనే సిరియాలో ఇసిస్ ని ప్రవేశపెట్టి బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు సర్వ శక్తులూ ఒడ్డింది అమెరికా. ఇసిస్ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా, కతార్ లు ఫైనాన్స్ వనరులు సమకూర్చుతున్నప్పటికీ అమెరికా కూడా ఆయుధ, సైనిక సాయం చేయకుండా మిన్నకుండ లేదు. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఒబామా అధ్యక్షరికంలో, ఆఫ్రికాలో చిన్న చిన్న సైనిక స్ధావరాలను అమెరికా పెంచుతూ పోయింది.
ఈ యుద్ధాల, సైనిక స్ధావరాల భారాన్ని అమెరికాపైన మోపిన జార్జి బుష్, బారక్ ఒబామాలు బ్లూమ్ బర్గ్ లాంటి పత్రికలకు కనిపించకపోవడం విచిత్రం. కాగా, నెల రోజులు కూడా నిండని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షరికాన్ని అమెరికా ఆర్ధిక సమస్యలకు కారణంగా చెప్పబూనడం హాస్యాస్పదం. అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ కొత్త అధ్యక్షుడిని కారణంగా చెప్పడానికి ట్రంప్ వ్యతిరేక కార్పొరేట్ మీడియా ఉత్సాహం కనబరుస్తోంది. అమెరికా ఆర్ధిక వనరులను గుప్పిట పెట్టుకున్న అమెరికా సామ్రాజ్యవాద వర్గం లోని కోర్ గ్రూపు, ట్రంప్ తమ దారికి వచ్చేవరకూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. కనుక పశ్చిమ మీడియా సాగిస్తున్న ట్రంప్ వ్యతిరేక ప్రచారం పట్లా, దానిని అనుసరిస్తున్న భారత మీడియా ప్రచారం పట్లా అప్రమత్తంగా ఉండకపోతే అయోమయంలో పడవలసి వస్తుంది.
[దీని అర్ధం ట్రంప్ ని సానుకూలంగా చూడడం కాదు. అమెరికాలోని సామ్రాజ్యవాద గ్రూపులలో ఒక వర్గానికి ట్రంప్ ప్రతినిధి. ఇన్నాళ్లూ ఆధిపత్యం వహించిన ఫైనాన్స్ కేపిటల్ కు కళ్ళెం వేసి మాన్యుఫాక్చరింగ్ కేపిటల్ కు ప్రధాన వాటా అప్పగించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. తద్వారా అమెరికా ఆర్ధిక పునాదిని దృఢం చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నాడు. ట్రంప్ సఫలం కావాలంటే భౌగోళిక ఆధిపత్య రాజకీయాలను కొంతకాలం పాక్షికంగా పక్కన పెట్టవలసి ఉంటుంది. కానీ ఫైనాన్స్ కేపిటల్ కి ప్రపంచం అంతా కావాలి. ట్రంప్ చెప్పింది పాటిస్తే తన పట్టు, పలుకుబడి శాశ్వతంగా కోల్పోవడమే అని ఫైనాన్స్ వర్గం భావిస్తోంది. ఏ పంధా ఆచరిస్తే అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకోగలమా అన్నదే ఈ గ్రూపుల వైరుధ్యం. అంతే తప్ప డొనాల్డ్ ట్రంప్ ఏమీ పులుగడిగిన ముత్యం కాదు.]
పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభం
కనుక అమెరికా ట్రెజరీస్ (సార్వభౌమ ఋణ పత్రాలు) కు గిరాకీ పడిపోవడానికి పునాది అమెరికా ఆర్ధిక సంబంధాలలోనే ఉన్నది తప్ప నిన్న మొన్న అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ లో లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెట్టుబడిదారీ వర్గం శ్రామికవర్గం నుండి మరింత మరింత వాటా గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం ప్రభుత్వం చేత పన్ను చట్టాలు, నిర్బంధ చట్టాలు, తదనుగుణమైన రాజకీయ చట్టాలు చేయిస్తుంది. శ్రామికవర్గం తన వాటా కోల్పోయేకొందీ దాని కొనుగోలు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఫలితంగా పెట్టుబడిదారీ వర్గానికి మార్కెట్ పరిధి కుచించుకుపోతుంది. దానితో లాభాలూ పడిపోతాయి. పడిపోతున్న లాభాలను పూడ్చుకోవడానికి శ్రామికవర్గం నుండి మరింత వాటా బదలాయిస్తుంది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద అమెరికాలో 1970ల నుండి కార్మిక వేతనాలు స్తంభనకు గురైనప్పటి నుండే పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభం తిరిగి బాగు చేయలేనంతగా తీవ్రం అవుతూ వచ్చింది. వరుసగా సంభావిస్తున్న ఆర్ధిక సంక్షోభాలను తాత్కాలిక చర్యలతో మాసికలు వేస్తూ పూడ్చుతూ వచ్చారు. ఈ మాసికలు మరో సంక్షోభానికి పునాది వేసాయే తప్ప పాత సంక్షోభాన్ని పరిష్కరించలేదు.
దురాక్రమణ యుద్ధాలు సైతం సాధారణ సంక్షోభాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగమే. ఓ వైపు WTO ద్వారా ప్రపంచ దేశాలపై సరళీకరణ-ప్రయివేటీకరణ-ప్రపంచీకరణ విధానాలు రుద్దుతూ మార్కెట్ దురాక్రమణలకు పాల్పడుతూనే మరోవైపు అవే విధానాలు ఆలంబనగా వృద్ధి లోకి వచ్చిన పెట్టుబడిదారీ చైనా, రష్యాలను బెదరగొట్టి నిలువరించేందుకు, మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు యుద్ధ మార్కెట్ ద్వారా లాభాలు సమకూర్చేందుకు దురాక్రమణ యుద్ధాలకు తెగబడింది. కానీ యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ అమెరికా ప్రజలకు పెను భారమయింది. ఆర్ధిక వ్యవస్ధను అసమతూకానికి గురి చేసింది. సంపదలను అలవిమాలిన రీతిలో కేంద్రీకరింపజేసింది. ఆదాయ పంపిణీలో అగాధాలు సృష్టించింది. అంతిమంగా ప్రజల కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బ కొట్టింది.
మాసికలతో పూడ్చిన పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభం 2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం రూపంలో ఫెళ్లున బద్దలయింది. ఆనాటి సంక్షోభమే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇది ఐరోపాలో ఋణ సంక్షోభంగా విస్తరించింది. జర్మనీ పెత్తనాన్ని పెంచింది. లండన్ ను బ్రెగ్జిట్ రూపంలో ఆత్మ రక్షణలో పడవేసింది. జపాన్ లో ఎడతెగని ప్రతి ద్రవ్యోల్బణంగా పాతుకుపోయింది. మూడో ప్రపంచ దేశాల పరాధీనతను చిక్కన చేసింది. [ఈ చిక్కదనాన్ని సో-కాల్డ్ ఎమర్జింగ్ దేశాలలో (నడమంత్రపు) ఆర్ధిక వృద్ధిగా చూపించి భ్రమింపజేస్తున్నారు.] అమెరికాలో ఆర్ధిక మాంద్యం కొనసాగుతూ సాగుతూనే ఉన్నది.
ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడేందుకు గాను అమెరికా సామ్రాజ్యవాదం తన ప్రభావాన్ని పాత సోవియట్ రష్యా ప్రభావిత ప్రాంతాలకు విస్తరించేందుకు పూనుకుంది. తూర్పు యూరప్ దేశాలను ఒక్కటోక్కటిగా నాటోలోనూ, యూరోపియన్ యూనియన్ లోనూ కలిపేసుకుంది. ఈయూలో చేరేందుకు వెనకా ముందూ ఆడినందుకు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసి రష్యా పక్కలోకి యుద్ధ రంగాన్ని తరలించింది. పోలండ్, బాల్టిక్ రిపబ్లిక్ లను రెచ్చగొట్టి రష్యాపై శతృత్వాన్ని పెంచింది. దక్షిణ చైనా సముద్రంలో మత్స్య, చమురు వనరులను కాజేసేందుకు ప్రాంతీయ తగాదాలు రెచ్చగొట్టింది. వియత్నాం, ఫిలిప్పైన్స్, జపాన్ లను అడ్డు పెట్టుకుని తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో తిష్ట వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రయత్నాలు మిలట్రీ బడ్జెట్ ను మరింత పెంచాయి. ఎంత చేసినా చైనాకు ఎదురోడ్డి పోట్లాడేందుకు ఆసియా దేశాలు సంసిద్ధంగా లేవు. ఫిలిప్పైన్స్ హఠాత్తుగా చైనా పక్షం చేరిపోగా, వియత్నాం చైనాతో సత్సంబంధాలకు మొగ్గు చూపుతోంది. జపాన్ ఎంత గింజుకున్నా చైనాతో గల భారీ వాణిజ్య సంబంధాలను వదులుకోలేని పరిస్ధితిలో ఉన్నది. ఖర్చు బారెడు పెడుతున్నా, ఫలితం బెత్తెడు కూడా లేకుండా పోయింది.
ఈ పరిణామాలు అనివార్యంగా అమెరికా ఆర్ధిక సామర్ధ్యం పట్లా, నాయకత్వం పట్లా అనుమానాలు పెంచుతున్నాయి. అమెరికా ట్రెజరీలను నమ్ముకుని భద్రంగా ఉండవచ్చా లేదా అన్న అనుమానాలు ఎన్నడూ లేని విధంగా కలుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వ అప్పులో ప్రధాన భాగం చైనా, జపాన్, బెల్జియం, చమురు దేశాలు భరిస్తున్నాయి. 2008లో ప్రభుత్వ అప్పులో 56 శాతం ఈ విదేశాలే మదుపు చేయగా, 2016లో వాటి భాగం 43 శాతానికి తగ్గిపోయింది. చైనా నెమ్మదిగా అమెరికా ట్రెజరీలను వదిలించుకుంటూ స్వదేశీ మార్కెట్ లో మదుపు చేస్తున్నది. ట్రెజరీల నుండి పెట్టుబడుల ఉపసంహరణ నెమ్మదిగా జరగవలసిందే. ఒక్కసారిగా జరిగితే అప్పు ఇచ్చిన దేశాలకూ నష్టమే. వేగంగా ఉపసంహరిస్తే అంతే వేగంగా ట్రెజరీల విలువ పడిపోతుంది. అనగా ట్రెజరీలలో తమ పెట్టుబడుల విలువే పడిపోతుంది. అందుకే జపాన్, చైనాలు క్రమ క్రమంగా, మార్కెట్ ను ఆటు పోట్లకు గురి చేయకుండా అమెరికా ట్రెజరీలలో పెట్టుబడులు తగ్గించుకుంటున్నాయి. జపాన్ గత నవంబర్ లో 21 బిలియన్లు ఉపసంహరించుకుంది. 2014 నుండి ఇది చాలా పెద్ద మొత్తం. చైనా గత మే నెల నుండి కాస్త కాస్త వెనక్కి తీసుకుంటున్నది. అనగా ఋణ పత్రాల నుండి పెట్టుబడుల ఉపసంహరణ స్ధిరంగా ఉంటున్నది. జపాన్, చైనాలను చూసి కొన్ని కంపెనీలు సైతం వాటిని అనుసరిస్తున్నాయి.
విదేశాలు ఉపసంహరించుకుంటున్నంత మేరకు దేశీయ డిమాండ్ ద్వారా అప్పులో కొరతను అమెరికా ప్రస్తుతానికి తీర్చుకుంటున్నది. కానీ దీర్ఘకాలికంగా చూస్తే విదేశీ డిమాండ్ స్ధిరంగా కొరవడడం ఆర్ధిక వ్యవస్ధకు క్షేమకరం కాదు. విదేశీ డిమాండ్ ఉన్నపుడే అప్పుపై వడ్డీ (దీనిని యీల్డ్ -yield- అంటారు) తక్కువ స్ధాయిలో ఉంచడానికి వీలవుతుంది. అనగా అప్పు తక్కువ వడ్డీకి దొరుకుతుంది. డిమాండ్ తగ్గితే అప్పు ఖరీదు అవుతుంది. చివరికది ఋణ సంక్షోభంగా మారిపోతుంది.
ఈ పరిణామాలన్నీ పెట్టుబడిదారీ సాధారణ సంక్షోభం తీవ్రతకు వ్యక్తీకరణ రూపాలు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధకు కేంద్ర స్ధానంలో ఉన్న అమెరికా క్రమంగా ఆ కేంద్రానికి దూరం అవుతుండగా మరే దేశమూ సదరు కేంద్రాన్ని చేరుకునే పరిస్ధితిలో లేదు. చైనా ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం దరిదాపుల్లో ఉన్నప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం ఊయలలోనే ఉన్నందున ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధలో నిలకడ లేకుండా పోయింది. వెరసి ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం చిన్న చిన్న కేంద్రాలుగా స్ధిరపడుతున్నవైపు ప్రయాణిస్తున్నది. ఈ ప్రయాణంలో ఏ కేంద్రానికీ ప్రాధామ్యత లేదు; నాయకత్వం లేదు. సూర్య కుటుంబం లోని నవగ్రహాల వలే ఒకరిపై ఒకరు ఆధారపడుతూ ఆకర్షణ-వికర్షణల (ఐక్యత-వైరుధ్యాల) మధ్య సమతూకం నెలకొనే వైపుగా ప్రయాణం సాగుతోంది. అమెరికా సార్వభౌమ ఋణ పత్రాలకు గిరాకీ పడిపోవడం నుండి ప్రస్తుతానికి మనం గ్రహించగల అంశం ఇదే.
ప్రస్తుతం అమెరికా మొత్తం అప్పు 17.8 ట్రిలియన్లు. అందులో పబ్లిక్ అప్పు 13.9 ట్రిలియన్ డాలర్లు.
సర్, మొత్తం అప్పులోనుంచి పబ్లిక్ అప్పు పోతే మిగతా అప్పుదేనిగురించో తెలియజేస్తారా?
పబ్లిక్ అప్పు అంటే ఏమిటి?
యు.యస్.యస్.ఆర్ ఉనికిలో ఉన్నప్పుడు దానికి అప్పు ఎలా పుట్టేది?
వీలుచూసుకొని వివరంగా తెలియజేస్తారా?
This is about market economies. When it was on socialist path, USSR did not need debt. It was a planned economy. There were no exploiters, no disparities in income distribution. There was plenty of assets at disposal for the govt. Moreover, individual ownership of assets was abolished. Everything was under the control of the socialist govt.
However, after the death of Joseph Stalin, Socialist construction was stopped gradually. Still, since there was state capitalism, there never arised need for debt.
Oh! Forgot about debt.
Other than public debt, the U.S. Govt holds intra-governmental debt. This is treasury securities held by govt trust funds, revolving funds etc… This debt is raised to fund govt social security operations such as Medicare, food stamps etc..
These securities can not be marketed.
శేఖర్ గారు … మీరు అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయ పరిణామాలు మరియు ఫలితాలు మీద మీరు వ్రాస్తున్న వ్యాసాలు మాలాంటి ఔత్సాకులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీకు ధన్యవాదాలు. మీరు ఇలాగే నిష్పక్ష పాతంగా వ్యాసాలు వ్రాయడం కొనసాగిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మీరు ది హిందూ పత్రికను కూడా గుడ్డిగా అనుసరించవద్దు. మీరు అనుసరిస్తున్నారని కాదు నా భావం.
Hi Srinivas, if you remember, I’ve criticised Hindu editorial outlook several times. It is an opportunistic journal. So I take only news content from it. It used to be a good one, but not any more.