చైనా & తైవాన్: ట్రంప్ వెనకడుగు


img_0550

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటినుండీ, అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాక కూడా చైనాపై కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, క్రమంగా చైనా వాస్తవాన్ని అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తైవాన్ ప్రధానికి ఫోన్ చేసి చైనాలో వేడి రగిలించిన ట్రంప్ చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడిన అనంతరం తన అవగాహనను మార్చుకున్నాడు. 

“అధ్యక్షుడు గ్జి విజ్ఞప్తి మేరకు ‘ఒక చైనా విధానం’ ను గుర్తించి గౌరవించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు” అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే తైవాన్ ను చైనాలో భాగంగా గుర్తించడానికి ట్రంప్ కి ఇప్పుడు అభ్యంతరం ఏమీ లేదు. ట్రంప్ దృష్టిలో ఇప్పుడు తైవాన్ అంటూ ఒక ప్రత్యేక దేశం ఏమీ లేదు. ఉన్నదల్లా చైనా ఒక్కటే. ఆ చైనాలో తైవాన్ ఒక భాగం మాత్రమే. హాంగ్ కాంగ్ కు మల్లేనే ఈ రోజో, రేపో తైవాన్ చైనాలో కలిసేదే.

తైవాన్ విషయంలో ట్రంప్ ఈ విధంగా యు టర్న్ తీసుకున్నాడు. ఆ విధంగా చైనాతో వ్యాపార సంబంధాలు అమెరికాకు చాలా ముఖ్యం అని ట్రంప్ పరోక్షంగానే అయినా అంగీకరించాడు. తైవాన్ అన్నది చైనాకు వ్యతిరేకంగా ప్రయోగించే ఒక రాజకీయ ఉపకరణం అన్న పాత అమెరికా విధానాన్నే ట్రంప్ కొనసాగించడానికి నిశ్చయించాడు. 

ఎన్నికల్లో నెగ్గినప్పటి నుండీ చైనాపై కత్తులు నూరిన ట్రంప్, ఒక్క ఫోన్ కాల్ తోనే, ఒక్కసారిగా చల్లబడడం ఒకింత అనూహ్యమే. ట్రంప్ ఎంతో కొంత చల్లబడక తప్పదని విశ్లేషకులు భావించినప్పటికీ అది జరగడానికి సమయం పడుతుందనీ, తైవాన్ ను తురుపు ముక్కగా వాడి వివిధ ఆర్ధిక-వ్యాపార రాయితీలు పొందాక చల్లబడతాడని ఊహించారు. 

తైవాన్ కు సంబంధించి ‘ఒక చైనా – రెండు వ్యవస్ధలు’ సిద్ధాంతాన్ని చైనా అనుసరిస్తుంది. చైనా విదేశీ విధానంలో ఈ సిద్ధాంతాన్ని గుర్తించడం ప్రధాన షరతుగా చైనా విదిస్తుంది. అనగా తైవాన్ ను చైనా దేశంలో భాగం గానూ, చైనా నుండి విడిపోయిన ఒకప్పటి రాష్ట్రం గానూ గుర్తించడం చైనా విదేశీ విధానంలో ఒక ముఖ్యాంశంగా ఉంటుంది. దీనికి అంగీకరించిన దేశాలతోనే చైనా సత్సంబంధాలు నెరుపుతుంది.

అమెరికా కూడా ఇన్నాళ్లూ ఈ అంశాన్ని గుర్తించింది. నిజానికి అమెరికా, పశ్చిమ దేశాలు మొదట గుర్తించింది తైవాన్ ని తప్ప చైనాను కాదు. 1949లో చైర్మన్ మావో సె-టుంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతం అయిన దరిమిలా అమెరికా మద్దతు ఉన్న బూర్జువా పాలకులు, వారి అనుచరులు, మద్దతుదారులు తైవాన్ కు పారిపోయారు. రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలవబడిన తైవాన్ కు అమెరికా మిలిటరీ పరంగా అండదండలు సమకూర్చింది.

img_0551

ఐరాస భద్రతా సమితిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లు వీటో అధికారాన్ని ఇచ్చుకున్నాయి. మూడో ప్రపంచ దేశాలకు ప్రతినిధిగా చైనాకు వీటో అధికారాన్ని ఇచ్చాయి. ఐరాస ఏర్పడే నాటికి చైనా అంతా ఒకటే. తైవాన్ లో ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడలేదు. ఉమ్మడి చైనాకు చాంగ్-కై-షేక్ ప్రభుత్వ నేతగా ఉండేవాడు. విప్లవం అనంతరం ధనిక, భూస్వామ్య, బూర్జువా వర్గాలు చాంగ్-కై-షేక్ నేతృత్వంలో తైవాన్ పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఆ విధంగా వీటో అధికారం చాంగ్-కై-షేక్ ప్రభుత్వం కింద ఉన్న చైనాకే దఖలుపరిచారు. చైనా ప్రధాన భూభాగం అప్పటికి ఐరాసలో సభ్యత్వం కలిగి లేదు. తైవాన్ నే చైనాగా గుర్తించినందున మరో చైనాకు సభ్యత్వం ఇవ్వటానికి పశ్చిమ దేశాలు నిరాకరించాయి. 

అనంతర కాలంలో పలు పరిణామాలు చర్చోప చర్చలు చోటు చేసుకున్న తర్వాత తైవాన్ స్ధానంలో చైనాకు సభ్యత్వం బదిలీ అయింది. వీటో అధికారం కూడా చైనాకు సంక్రమించింది. మావో మరణానంతరం చైనా అధికార పగ్గాలు చేపట్టిన డెంగ్ గ్జియావో-పింగ్ సోషలిస్టు నిర్మాణం నుండి చైనాను వెనక్కి మళ్ళించాడు. పెట్టుబడిదారీ నిర్మాణాన్ని పునరుద్ధరించాడు. ప్రజలను మభ్య పుచ్చడానికి పార్టీ పేరు మాత్రం చైనా కమ్యూనిస్టు పార్టీగా కొనసాగించారు. 

తైవాన్, హాంగ్ కాంగ్ (1997 లో బ్రిటన్ నుండి చైనా చేతికి వచ్చింది.) లలో సోషలిస్టు వ్యవస్ధలు నిర్మాణం కాలేదు. పెట్టుబడిదారి వ్యవస్ధలు ఉండేవి. ఈ పరిస్ధితిని సమర్ధించుకోవడానికి ‘ఒక చైనా – రెండు వ్యవస్ధలు’ సిద్ధాంతాన్ని డెంగ్ ప్రతిపాదించాడు. నిజానికి ఇది సిద్ధాంతం కాదూ, పాడూ కాదు. తమ పెట్టుబడిదారి రివిజనిస్టు పంధాని సమర్ధించుకునేందుకు ప్రతిపాదించిన సైద్ధాంతిక దివాళాకోరు విధానం.    

ఆ విధంగా తైవాన్, ఐరాసలో సభ్యత్వం కోల్పోయింది. తైవాన్ కు అధికారిక గుర్తింపు కొరవడింది. చైనా తన ఆర్ధిక వ్యవస్ధను బహిరంగం కావించి పశ్చిమ బహుళజాతి కంపెనీలకు గేట్లు బార్లా తెరిచాక చైనా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. పశ్చిమ కంపెనీలు చైనాను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పశ్చిమ దేశాలకు తైవాన్ కు ఇవ్వవలసిన రాజకీయ గుర్తింపు అప్రధానం అయిపొయింది. చైనా మాటే చెల్లుబాటు అయింది. అయితే చైనాను బెదిరించాలన్నా, వ్యాపార పరంగా రాయితీలు పొందాలన్నా తైవాన్ ను ఒక రాజకీయ ఉపకరణంగా అమెరికా అడపా దడపా ఉపయోగించడం కొనసాగించింది. 

కొత్తగా అధికారం చేపట్టిన ట్రంప్, తైవాన్ వివాదాన్ని మళ్ళీ కేంద్ర స్ధానం లోకి తేవడం ద్వారా చైనాతో ఘర్షణ పంధాను మరింత తీవ్రం చేయనున్నాడని అందరూ భావించారు. చైనాను ‘కరెన్సీ మానిప్యులేటర్’ ఇప్పటికే ప్రకటించినందున చైనాతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు తైవాన్ వివాదాన్ని తవ్వి తీస్తున్నాడని, దక్షిణ చైనా సముద్రంలో కూడా ఘర్షణలు పెచ్చరిల్లుతాయనీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలు తప్పాయని భావించడం అప్పుడే ఒక నిర్ణయానికి రాలేము కానీ, తైవాన్ విషయమై తేలికగా చల్లబడడం ద్వారా అంచనాలు సవరించుకోవలసిన పరిస్ధితిని మాత్రం ట్రంప్ కల్పించాడు. 

తాజా పరిణామంతో ఈ ప్రాంతంలో అనేక దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయని విశ్లేషకులు ఇప్పుడు భావిస్తున్నారు. ఒక్క ఆసియాలోనే కాకుండా పశ్చిమ దేశాలు, ఆఫ్రికాలలో కూడా వివిధ స్ధాయిలలో నిట్టూర్పులు వెలువడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చైనా పాదముద్ర లేని చోటంటూ ప్రపంచంలో లేదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా, మధ్య ప్రాచ్యం… ఇలా ఏచోట చూసినా చైనా పెట్టుబడి హస్తాలు విస్తరించి ఉన్నాయి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిడులు లేకుండా కేవలం వ్యాపార దృక్పధంతో తన పెట్టుబడిని విస్తరిస్తున్న చైనా పట్ల అనేక మూడో ప్రపంచ దేశాలు సానుకూలతతో ఉన్నాయి. అలాంటి చైనాతో అమెరికా ఘర్షణ పడితే ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే పరిస్ధితి వారికి వస్తుంది. అందుకే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం. 

నిజానికి ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడటానికి గ్జి జిన్ పింగ్ అంత సుముఖంగా లేదు. ఎదో ముక్తసరిగా మాట్లాడి సరిపుచ్చుకుంటే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళతాయని గ్జి భావించాడు. అందువలన తైవాన్ విషయమై ఇదమిద్దంగా ఒక అంగీకారానికి వచ్చేటట్లయితే తప్ప ఫోన్ లో మాట్లాడేందుకు గ్జి అంగీకరించలేదు. అందువలన ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడవడానికి 3 వారాలుగా మంతనాలు సాగుతున్నాయి. తైవాన్ విషయమై చైనా విధానాన్ని గుర్తించడానికి ట్రంప్ అంగీకరించాకనే ఫోన్ కాల్ కు మార్గం సుగమం అయింది. 

One thought on “చైనా & తైవాన్: ట్రంప్ వెనకడుగు

  1. ఈ విధంగా ద్వైపాక్షిక సంబంధాలలో చైనా పైచేయి సాంధించిందన్నమాట?
    అయితే,తైవాన్ ను పక్కనపెట్టడానికీ,ద.చై.సముద్రంలో ఉద్రిక్తతల కొనసాగింపునకు సంబందం లేదన్నమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s