బ్రెగ్జిట్ బిల్లును ఎట్టకేలకు బ్రిటన్ దిగువ సభ ఆమోదించింది. ‘కామన్స్’ గా పిలిచే బ్రిటన్ దిగువ సభ అత్యధిక మెజారిటీతో బిల్లును ఆమోదించడం విశేషం. బిల్లు ప్రారంభ దశలో 114 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, చర్చల అనంతరం అంతిమ ఓటింగ్ లో వ్యతిరేకులు 122 కు పెరిగారు.
బ్రెగ్జిట్ బిల్లును అధికారికంగా ‘యూరోపియన్ యూనియన్ (నోటిఫికేషన్ ఆఫ్ విత్ డ్రాల్) బిల్’ గా పిలుస్తున్నారు. 650 మంది సభ్యులు ఉన్న ‘హౌస్ ఆఫ్ కామన్స్’ సభలో బిల్లుకు అనుకూలంగా 494 మంది ఓటు వేయగా బిల్లుకు వ్యతిరేకంగా 122 మంది ఓటు వేశారు. ఈ బిల్లును ఎగువ సభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ ఆమోదించిన అనంతరం బ్రిటిష్ రాణి సంతకంతో చట్టంగా అమలులోకి వస్తుంది. రానున్న కొద్ది రోజుల్లో బిల్లు లార్డ్స్ సభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది.
ప్రతిపక్ష లేబర్ పార్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బిల్లు ఆమోదం సులభం అయింది. లేబర్ పార్టీ సభ్యులంతా బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి తీరాలని ఆ పార్టీ నేత జెరోమ్ కార్బిన్ విప్ జారీ చేసాడు. విప్ ని అతిక్రమించినవారు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించాడు. దానితో బిల్లు ఆమోదం పొందడం తేలిక అయింది.
బ్రెగ్జిట్ రిఫరెండం అనంతర రోజుల్లో లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరోమీ కార్బిన్ అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. పార్టీలో తిరుగుబాటును కూడా ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన బ్రెగ్జిట్ కి అనుకూలంగా వ్యవహరించాడని పార్టీలో అనేకమంది అనుమానించడమే దానికి కారణం. ఒక విధంగా చూస్తే బ్రెగ్జిట్ ఫలితం అనంతరం రాజకీయ వాతావరణం అంతా కార్బిన్ వ్యతిరేక ఆరోపణలతో నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు.
కార్బిన్ పైకి బ్రెగ్జిట్ కి వ్యతిరేకత ప్రకటించినప్పటికీ రిఫరెండం లో ప్రచారంలో పాల్గొనలేదని ఆయన వ్యతిరేకులు తిట్టిపోశారు. అన్యమనస్కంగా ప్రచారంలో పాల్గొని బ్రెగ్జిట్ గెలవడానికి పరోక్షంగా దోహద పడ్డాడని ఆరోపించారు. విపరీత స్ధాయిలో కార్బిన్ వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో ఆయనను లేబర్ పార్టీ అధ్యక్షా పదవి నుండి తప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రజల నుండి ఆయనకు సంపూర్ణ మద్దతు అందడంతో ఆయనను కూలదోయడం సాధ్యం కాలేదు.
రెండు విడతలుగా అధికారానికి దూరం అయిన దరిమిలా ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన లేబర్ పార్టీకి నూతన జవసత్వాలు అందించడంలో జెరోమీ కార్బిన్ దే ప్రధాన పాత్ర. వామ పక్ష సెంటిమెంట్లకు ధైర్యంగా మద్దతు ప్రకటించడం ద్వారా ఆయన పార్టీలో సామాన్య కార్యకర్తల మద్దతు సంపాదించాడు. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ప్రజల్లో పార్టీ పలుకుబడి పెరిగేందుకు కృషి చేశాడు. పార్టీలోని గ్లోబలైజేషన్ మద్దతుదారులకు ఇది రుచించలేదు. లేబర్ పార్టీని వామ పక్ష రాజకీయాల వైపు తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో ఆయనపై కక్ష గట్టారు. దరిమిలా ఆయనను అణచివేసేందుకు కృషి జరిగింది. కానీ కార్యకర్తలు, ప్రజల మద్దతు వలన ఆయన వ్యతిరేకులకు అవకాశం దక్కలేదు.
ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ బిల్లు ఓటింగులో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కార్బిన్ విప్ జారీ చేయడం ఎవరినీ అంతగా ఆశ్చర్యపరచలేదు.
బ్రిటిష్ ప్రధాని ధెరిసా మే, వాస్తవానికి పార్లమెంటులో సంబంధం లేకుండానే ఆర్టికల్ 50 కింద బ్రెగ్జిట్ నోటీసు ఇవ్వాలని భావించింది. యూరోపియన్ యూనియన్ చట్టాల మేరకు, యూనియన్ బైటికి వెళ్ళాలన్న సభ్య దేశం ఆర్టికల్ 50 కింద నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే ఎగ్జిట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
అయితే బ్రెగ్జిట్ వ్యతిరేకులు బ్రెగ్జిట్ ప్రక్రియను ఆపివేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. పార్లమెంటు ఆమోదం పొందకుండా బ్రెగ్జిట్ ప్రక్రియను ఆరంభించే అధికారం ప్రధాన మంత్రికి లేదని కోర్టులో పిటిషన్ వేశారు. సదరు పిటిషన్ కింది కోర్టులు అన్నీ దాటుకుని సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు పిటిషన్ దారుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. పార్లమెంటు ఆమోదం లేకుండా బ్రెగ్జిట్ నోటీసు ఇవ్వరాదని స్పష్టం చేసింది. దానితో బ్రిటిష్ ప్రధాని బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టక తప్పలేదు.
హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కూడా బ్రెగ్జిట్ బిల్లు తేలికగానే ఆమోదం పొందుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న కొద్ది వారాల్లో బ్రెగ్జిట్ బిల్లు చట్టంగా మారుతుందని, ప్రధాన మంత్రి గతంలో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ 1 తేదీ నాటికి బ్రెగ్జిట్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతుందని వారు ఆశిస్తున్నారు.
బ్రెగ్జిట్ చర్చలకు సంబంధించి ఈయూతో చర్చలలో ప్రభుత్వం ఏయే ఎత్తుగడలు అవలంబించనున్నదీ ప్రధాని నుండి ఇంతవరకు ఎటువండి సూచనా అందలేదు. ప్రధాని పధకం ఏమిటో వెల్లడి చేయాలనీ సభ్యులు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీతో పాటు సొంత కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు కూడా ఈ విషయమై సమాచారం ఇవ్వాలని ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారు. దానితో బ్రెగ్జిట్ చర్చల పధకంపై త్వరలో శ్వేతపత్రం ప్రకటిస్తానని ధెరిసా మే హామీ ఇచ్చారు. ఫలితంగా బ్రెగ్జిట్ విషయమై బ్రిటన్ లో అలజడికి కేంద్రంగా మారిన అంశాలలో ఒకటి సద్దుమణిగినట్లే.
బ్రిటిష్ కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తి ఫలితంగా ఆమోదం పొందిన బ్రెగ్జిట్ రిఫరెండం, కార్మికవర్గానికి ఎంతవరకు మేలు చేస్తుంది అన్నది ఇంకా తెలియవలసి ఉన్నది. బ్రెగ్జిట్ ఉన్నా లేకున్నా బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్ధపై ఫైనాన్స్, పెట్టుబడి వర్గాల ఉడుం పట్టు బలహీనపడేదేమీ కాదు. కనుక బ్రెగ్జిట్ వల్ల కార్మికవర్గం లబ్ది పొందుతుంది అని చెప్పలేము. కానీ ప్రపంచ ఆర్ధిక-రాజకీయ-భౌగోళిక ఆధిపత్య పొందికలో గణనీయ మార్పు చోటు చేసుకోవడానికి బ్రెగ్జిట్ రిఫరెండం దోహదం చేసింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.