మొదట బ్లాక్ మనీ-ఉగ్రవాదం-దొంగ నోట్లపై పోరాటం అన్నారు; ఆ తర్వాత మారక వ్యవస్ధను డిజిటైజ్ చేయడమే లక్ష్యం అన్నారు’ ఇప్పుడు “పేద జనోద్ధరణ కోసమే” అంటున్నారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
మంగళవారం లోక్ సభలో తన డీమానిటైజేషన్ చర్యను సమర్ధించుకున్న ప్రధాన మంత్రి “ఇది పేదల తరపున చేస్తున్న పోరాటంలో భాగమే” అని సెలవిచ్చారు. “ఇండియాను శుభ్రం చేసేందుకు డీమానిటైజేషన్ కు నిర్ణయించాము. పేదల అభ్యున్నతికే నేను చేసే పోరాటం. పేదలకు రావలసింది దక్కడం కోసం నేనీ చర్య తీసుకున్నాను. ఈ పోరాటం కొనసాగుతుంది” అని ప్రధాని మోడీ సభలో కొలువు దీరిన ప్రజా ప్రతినిధులకు చెప్పారు.
డీమానిటైజేషన్ పై వివిధ పార్టీల సభ్యులు చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ మోడీ ఈ మాటలు చెప్పారు. డీమానిటైజేషన్ వల్ల వంద మందికి పైగా జనం చనిపోయిన సంగతిని ప్రభుత్వం తలవను కూడా తలవలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ప్రజల ఇబ్బందులు ప్రస్తావనకు నోచుకోలేదు.
క్యూలలో నిలబడటం వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమై కొందరు చనిపోయిన సంగతిని గుర్తించడానికి కూడా మోడీ నిరాకరిస్తున్నడు. ఇతర మంత్రులు కనీసం మొక్కుబడికైనా “దురదృష్టకరం” అని అంటున్నారు. మోడీకి అది కూడా ఇష్టం లేదు. గుర్తిస్తే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. తన సో కాల్డ్ పోరాటం ప్రజల ఉసురు తీసిందన్న మాట పడవలసి వస్తుంది. విమర్శను ఎదుర్కోవడం కంటే వాస్తవాలను అసలుకే నిరాకరించడమే మోడీకి తెలిసిన విద్య.
పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుండీ ‘ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్న’ ప్రధాన మంత్రి తాను ఒక దేశానికి, అందునా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికీ అత్యున్నత నాయకుడిని అన్న సంగతి మర్చిపోతున్నారు. వాగ్దానాలు చేయడంలో, తన చర్యలకు కారణాలు చెప్పడంలో నిజాయితీ లేకపోయినా కనీసం నిజాయితీగా ఉన్నట్లు కనిపించాలన్న సంగతిని విస్మరిస్తున్నారు.
లేకుంటే ఎన్నికల ప్రయోజనాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు బ్లాక్ మనీ పై పోరాటం అనీ, జనం పెద్ద ఎత్తున క్యూలలో నిలబడినప్పుడు డిజిటైజేషన్ కోసం అనీ, పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నప్పుడు ‘పేదల కోసమే’ అనీ రోటికొక పాట పాడగలరా ప్రధాన మంత్రి?!
ఘోరం ఏమిటంటే ప్రధాన మంత్రి ఏ పేదల కోసమైతే తాను పోరాడుతున్నానని చెబుతున్నారో, ఏ పేదల కోసమైతే నోట్లు రద్దు చేసానని చెబుతున్నారో ఆ పేదలే డీమానిటైజేషన్ యజ్ఞంలో శలభాల్లా మాడి మసి కావటం. దేశ వ్యాపితంగా ఒక్క ధనికుడు కూడా బ్యాంకుల ముందు క్యూలో నిలబడ లేదు. వారి ఇళ్లకే కొత్త నోట్లు కట్టలు కట్టలుగా నడిచి వచ్చాయి. పేదలు పని కోల్పోయారు. సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలు మూసివేతకు గురై ఉపాధి కోల్పోయారు. డీమానిటైజేషన్ వల్ల ప్రధాన బాధితులు పేదలు కాగా, ఆ పేదల కోసమే ‘డీమానిటైజేషన్’ అని చెప్పడానికి ప్రధాని సాహసించారు.
ప్రస్తుతం దేశం లోని ఎటిఎం మిషన్లలో నాలుగో వంతు ఖాళీగా ఉన్నాయని పత్రికలు చెబుతున్నాయి. అనగా ప్రజల అవసరాలకు మార్కెట్ అవసరాలకు తగిన మొత్తంలో కరెన్సీ ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. విత్ డ్రాల్ పై పరిమితి ఎత్తివేసాం అనడమే గానీ, అవసరానికి తగిన మొత్తంలో చాలామంది, వ్యాపారాలు, పరిశ్రమల యజమానులు, క్యాష్ ని డ్రా చేయలేకపోతున్నారు.
ప్రపంచంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనమే అని మోడీ గొప్పలు చెప్పుకుంటారు. డీమానిటైజేషన్ పుణ్యమాని ఆ అవకాశం ఇప్పుడు లేదు. చైనా కంటే మనమే వేగంగా వృద్ధి చెందుతున్నాం అని కూడా చెప్పుకోలేము.
మహా రాష్ట్రలో మునిసిపల్ ఎన్నికల్లో వచ్చిన గెలుపును ‘డీమానిటైజేషన్ కు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు’ అని మోడీ, ఇతర బీజేపీ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను మాత్రం డీమానిటైజేషన్ పై రిఫరెండంగా చెప్పడానికి మోడీ ఇష్టపడటం లేదు. “ప్రతి అంశాన్నీ ఎన్నికల ప్రిజం నుండి చూడడం మానుకోవాలి” అని మోడీ ఉపదేశం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగక మునుపే మోడీ ఓటమిని అంగీకరిస్తున్నారా?