నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ


img_0546

నిపుణులు హెచ్చరించినట్లగానే, డీమానిటైజేషన్ కష్టాలు ప్రజలని ఇంకా వదలలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో (జనవరి వేతనాల కోసం) ఉద్యోగులు, మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులు డబ్బు డ్రా చేశారు. దానితో బ్యాంకుల వద్ద కరెన్సీ నోట్లు నిండుకున్నాయి. ఎటిఎం లలో ఉంచేందుకు బ్యాంకుల వద్ద ఇక డబ్బు లేకపోవడంతో దేశంలో నాలుగో వంతు ఎటిఎం లు ఖాళీ అయిపోయాయి. ‘నో క్యాష్’ బోర్డులు అనేక ఎటిఎం ల ముందు వెక్కిరిస్తున్నాయి. 

ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ కొరత ఉంటుందని కేంద్ర అధికారులు, మంత్రులు నచ్చజెబుతున్నారు. కానీ “ఫిబ్రవరి నెల చివరి దాకా ఇదే పరిస్ధితి కొనసాగుతుంది” అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అసలు విషయాన్ని తెగేసి చెబుతున్నారు. ఉన్న పరిస్ధితిని నిజాయితీగా వివరించడానికి బదులు మళ్ళీ మళ్ళీ మసిపూసి మారేడు కాయ చేసేందుకే నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

నెల ఆరంభం కాబట్టి జనానికి డబ్బు అవసరాలు పెరుగుతాయి. ముఖ్యంగా వేతన జీవులకు ప్రతి నెలా మొదటి వారమే నెల అవసరాలు గరిష్టంగా  తీర్చుకుంటారు. వేతన జీవులకు వేతనాలు చెల్లించేది వారి యజమానులు. ప్రభుత్వ ఉద్యోగులు ఐతే తప్ప ఇతర వేతనదారులు అందరికీ వారి యజమానులు బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేసి తమ ఉద్యోగులకు / కార్మికులకు చెల్లిస్తారు. ఇవి పెద్ద మొత్తాల్లో ఉంటాయి కనుక సాధారణ పరిస్ధితుల్లో బ్యాంకులు ముందుగానే తగినంత కరెన్సీని సిద్ధం చేసుకుంటాయి. కానీ ఈసారి ఇలా సిద్ధం కావటానికి డీమానిటైజేషన్ ఆటంకం అయింది. 

ఎందుకంటే 15.44 లక్షల కోట్ల రూపాయల మేరకు పాత నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్త నోట్లను ఇంతవరకు 10 లక్షల కోట్లకు లోపలే ముద్రించి చలామణీ లోకి ప్రవేశపెట్టింది. అనగా మూడింట రెండు వంతులు మాత్రమే కొత్త కరెన్సీ ముద్రణ పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఒక వంతు నోట్లు మార్కెట్ లోకి రాలేదు. ఇవి వచ్చేదీ లేనిదీ కూడా తెలీదు. ‘డిజిటైజేషన్’ కోసం డబ్బు పరిమాణం తగ్గించి ఆన్-లైన్ చెల్లింపులకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన మూడో వంతు నోట్లు వచ్చేదీ లేనిదీ అనుమానమే. 

ప్రభుత్వ సర్వేల ప్రకారమే అనేక లక్షల మంది కార్మికులకు డబ్బు రూపం లోనే వేతనాలు అందుతున్నాయి. 560 మిలియన్ల (56 కోట్లు) ఫ్యాక్టరీ కార్మికులకు నిన్న మంగళ వారమే వేతన దినం అనే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది. వారందరికీ వేతనాలు చెల్లించడంతో కరెన్సీ ఖాళీ అయిందని బ్యాంకుల అధికారులను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.    

“పరిమిత డబ్బు వలన పెద్ద మొత్తంలో కొరత ఏర్పడింది. ఫలితంగా ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికీ డబ్బు కొరత కొనసాగుతుండడం వలన ఎటిఎం లకు తగిన మొత్తంలో డబ్బు అందడం లేదు. దీనివల్ల ముఖ్యంగా అసంఘటిత రంగంలో కార్మికులు మళ్ళీ నోట్ల కొరత ఎదుర్కొంటున్నారు. అనేక ఎటిఎం లలో డబ్బు లేదు” అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి హెచ్ వెంకటాచలం చెప్పారు.   

“మా అంచనా ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికీ మాత్రమే పరిస్ధితిలో మెరుగుదల కనిపిస్తుంది. అప్పటి వరకు కొరత కొనసాగుతుంది” అని SBI గ్రూప్ ఆర్ధిక సలహాదారు సౌమ్య కంటి ఘోష్ చెప్పారని హిందూస్థాన్ టైమ్స్ తెలియజేసింది. చిన్న పట్టణాలు, గ్రామాలలో డబ్బు కొరత ఎక్కువగా ఉన్నదని ప్రయివేటు బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. 

పరిస్ధితి ఇలా ఉంటె ప్రధాని మోడీ కాకమ్మ కబుర్లతో కాలం గడిపేస్తున్నారు. కనీసం పార్లమెంటుకు సమాధానం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకుండా పోయింది. మాటలు చెప్పి పూటలు గడిపేస్తున్న ప్రధాని మోడీకి ప్రజల అమాయకత్వం, అల్ప జ్ఞానం, మిడి మిడి జ్ఞానం లే భారీ పెట్టుబడి. 

2 thoughts on “నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ

  1. 560 మిలియన్ల (56 కోట్లు) ఫ్యాక్టరీ కార్మికులకు నిన్న మంగళ వారమే వేతన దినం అనే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.
    సర్,నిజంగా 56 కోట్లమంది భారతీయులు ఫ్యాక్టరీ కార్మికులా?
    మరి,రైతులెందరు? తక్కిన అసంఘటిత కార్మికులు ఎందరు? గృహిణులు ఎందరు?
    ఫ్యాక్టరీ కార్మికుల సంఖ్యను ఎలా లెక్కిస్తారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s