ట్రంప్ వీసా బిల్లులు, భారతీయుల ఉపాధి -విశ్లేషణ


trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాపులర్ వాగ్దానాలను శరవేగంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుండి వలసలను మూడు నెలల పాటు నిషేధించి ప్రపంచ వ్యాపితంగా కాక పుట్టించిన ట్రంప్, ఇప్పుడు ఉద్యోగాల సంరక్షణ పనిలో పడ్డాడు. అమెరికా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (కాంగ్రెస్) లో ఇద్దరు సభ్యులు ఈ మేరకు రెండు వేరు వేరు బిల్లులు ప్రవేశపెట్టారు. అవి రెండూ విదేశీయులకు వీసాలు, ఉద్యోగాలు కట్టడి చేసేందుకు పరోక్షంగా ఉద్దేశించినవే. 

కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు జో లాఫ్గ్రెన్ ‘హై-స్కిల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ – 2017’ పేరుతో ఒక బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టాడు. ఇతర అంశాలతో పాటు ఈ బిల్లు H -1B వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులకు వేతనాలు రెండు రెట్లు పైగా పెంచటానికి ప్రతిపాదిస్తుంది. 

1989 లో చేసిన చట్టం ప్రకారం హెచ్ -వన్ బి వీసా కలిగిన విదేశీ ఉద్యోగులకు ఏడాదికి చెల్లించవలసిన కనీస వేతనం 60000 డాలర్లు. అప్పటి నుండి ఆ వేతనాలలో పెరుగుదల లేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 130,000 డాలర్లకు పెంచాలని జో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతిపాదిస్తున్నది. కంపెనీలు ఇష్టానుసారం వేతనాలు నిర్ణయించకుండా బిల్లులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మరొక విశేషం.  

ఈ బిల్లు ఆమోదం పొందితే భారత IT కంపెనీలు దెబ్బ తినడం ఖాయం. భారత కంపెనీలతో పాటు, అనేక అమెరికన్ ఐటి కంపెనీలకు కూడా ఈ బిల్లు ప్రతికూలం అవుతుంది. భారతీయ ఐటి నిపుణులకు ఉద్యోగాలకు ఇవ్వడానికి ఇన్నాళ్లూ దోహద పడిన కారణం: వారికి అత్యంత తక్కువ వేతనాలు చెల్లించవలసి రావడం. తక్కువ వేతనాల ద్వారా కంపెనీలకు పెద్ద మొత్తంలో లాభాలు కూడబెట్టుకోగలిగాయి. వారి వేతనాలు రెట్టింపు కంటే ఎక్కువ చేయడం అంటే అమెరికన్ ఉద్యోగులతో సమానంగా విదేశీ ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించడమే. 

మరో విధంగా చెప్పాలంటే విదేశీ ఉద్యోగులకు లేదా హెచ్ 1బి వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలకు ఇన్నాళ్లు ఉన్న ప్రోత్సాహాన్ని తాజా బిల్లు రద్దు చేస్తుంది. ఇది ఒక వైపు ఇండియా తదితర దేశాల ఐటి కంపెనీలు హెచ్ 1బి వీసా ద్వారా అతి తక్కువ వేతనదారులను అమెరికాకు తేకుండా నిరోధిస్తుంది. మరోవైపు అమెరికన్ కంపెనీలు కూడా చీప్ లేబర్ ద్వారా లబ్ది పొందే అవకాశాలను మూసివేస్తుంది. ఇండియా తదితర దేశాల నుండి హెచ్ 1బి వీసాదారుల ఉద్యోగ సేవల ద్వారా అదనంగా లబ్ది పొందే అవకాశం కంపెనీలకు ఇక ఉండదు. కనుక అనివార్యంగా అమెరికన్లకే ఉపాధి కల్పించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయి. 

“హెచ్ 1బి ప్రోగ్రాం తన వాస్తవ లక్ష్యంపై తిరిగి దృష్టి కేంద్రీకరించేందుకు నా బిల్లు ఉపకరిస్తుంది: ప్రపంచం నలుమూలల నుండి అత్యంత ఉన్నతమైన మెరుగైన తెలివితేటలను ఆకర్షించి అమెరికన్ నిపుణులకు ఉన్నత వేతనాలతో సంపాదించిన విదేశీ నైపుణ్యాన్ని అనుబంధంగా సమకూర్చడం మా లక్ష్యం. అమెరికన్ల స్ధానంలో విదేశీయులను తేవడం బదులు, విదేశీ నైపుణ్యంతో అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం” అని లాఫ్గ్రెన్ తన బిల్లును గూర్చి వివరించాడు.  

లాఫ్గ్రెన్ ఇచ్చిన వివరణ పూర్తి నిజం కాదు. ఆ బిల్లు అసలు లక్ష్యం విదేశీ ఉద్యోగులను తగ్గించి, అమెరికన్లకు ఉపాధి పెంచడమే. ఏదయితే తమ లక్ష్యం కాదని చెబుతున్నాడో అదే లాఫ్గ్రెన్ బిల్లు లక్ష్యం. లాఫ్గ్రెన్ ఇచ్చిన వివరణ ద్వారా ఆ సంగతి ధ్రువపరుచుకోవచ్చు. ఆయన ఏమన్నాడో చూడండి: 

“అత్యధిక వేతనం చెల్లించే కంపెనీలకు మార్కెట్ ఆధారిత ఉపాధి సేవలు అందించడంలో ఈ బిల్లు ద్వారా ప్రాధాన్యత లభిస్తుంది. ఇది అమెరికన్ కంపెనీలకు అవసరమైన ప్రజ్ఞను సమకూర్చుతుంది. అలాగే అమెరికన్ వేతనాలకు కోతపెట్టి, ఉద్యోగాలను విదేశాలకు తరలించి (అవుట్ సోర్స్ చేసి) అమెరికన్ల ఉపాధిని తగ్గించే కంపెనీలకు ప్రోత్సాహకాలను తొలగిస్తుంది”

ఈ మాటల్లో బిల్లు వాస్తవ లక్ష్యం ఏమిటో అర్ధం అవుతుంది.“ అయితే బిల్లు ద్వారా ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అన్నది పరిశీలనాంశం. పూర్తి స్ధాయిలో కాకపోతే అవసరం అయినంత వరకైనా ఉద్దేశిత లక్ష్యాన్ని బిల్లు నెరవేర్చుతుంది అనడంలో సందేహం అనవసరం. 

కానీ విదేశీ ఉద్యోగుల ద్వారా లాభాలు మూట గట్టుకుంటున్న కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు ఈ బిల్లుకు ప్రతిఘటన ఇస్తాయి. వారి ప్రతిఘటన విజయవంతం అయినమేరకు ఇండియా లాంటి దేశాల నుండి వచ్చే హెచ్ 1బి వీసాదారుల ఉపాధి అవకాశాలు నిలిచే అవకాశం ఉన్నది. 

బిల్లు వలన జరిగే మరో పరిణామం ఏమిటంటే ఒక్కో దేశానికి ఒక్కో మొత్తంలో వీసాల పరిమితి విధించే పధ్ధతి ఇక ఉండకపోవచ్చు. అనగా ఒక్కో దేశానికి నిర్దిష్ట మొత్తంలో హెచ్ 1బి వీసాల కోటా నిర్ణయించడం ఆగిపోతుంది. కోటా అనేది లేకుండా మెరిట్, నైపుణ్యం ఆధారంగా ఒక దేశానికీ ఎన్ని హెచ్ 1బి వీసాలైనా ఇవ్వవచ్చు.

లాఫ్గ్రెన్ బిల్లు చిన్న సంస్ధలకు నష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న మరియు స్టార్టప్ కంపెనీలకు ఇప్పటి వరకు 20 హెచ్ 1బి వీసాలు రిజర్వ్ చేసేవారు. బిల్లులో ఈ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు. అనగా ఉద్యోగుల కోసం చిన్న, స్టార్టప్ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడవలసి వస్తుంది. పెద్ద కంపెనీలతో సమానంగా వేతనాలు ఇవ్వడం చిన్న కంపెనీలకు సాధ్యం అయ్యేపని కాదు. ఫలితంగా తక్కువ వేతనాల ద్వారా హెచ్ 1బి వీసాదారులకు అవి ఉపాధి ఇవ్వలేవు. ఇక ప్రభుత్వ మద్దతు దాదాపు సంపూర్ణంగా పెద్ద కంపెనీలే కొట్టేస్తాయి. భారతీయ స్టార్టప్ కంపెనీలు అనేకం అమెరికన్ కంపెనీలకు ఐటి తదితర సేవలు అందించి లబ్ది పొందే అవకాశం కోల్పోతాయి.  

విచిత్రం ఏమిటంటే బిల్లు ప్రవేశ పెట్టిన లాఫ్గ్రెన్ అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కాదు. ఆయన ట్రంప్ ను పడదిట్టిపోస్తున్న డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు. ట్రంప్ అజెండాకు ప్రతిపక్ష డెమొక్రాట్ల మద్దతు కూడా ఉన్నదని దీని ద్వారా అర్ధం అవుతుంది.          

ఈ బిల్లుతో పాటు సెనేట్ లో కూడా వీసాల జారీలో సంస్కరణలు ప్రవేశపెడుతూ మరో బిల్లు ప్రతిపాదించబడింది. సెనెటర్ షెర్రాడ్ బ్రౌన్ ప్రవేశపెట్టిన బిల్లు పేరు: H-1B & L-1 వీసా రిఫార్మ్ యాక్ట్ (H-1B మరియు L-1 వీసా సంస్కరణ చట్టం). ఈ రెండు వీసాల జారీలో ఉన్న లోపాలను తొలగించి అమెరికా కార్మికులకు, వీసాదారులకు ఇద్దరికీ రక్షణ కల్పించడం తన బిల్లు లక్ష్యం అని సెనెటర్ బ్రౌన్ చెబుతున్నాడు. వాస్తవంలో వీసాదారుల కంటే అమెరికా కార్మికుల రక్షణకే బిల్లు ఉద్దేశించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.   

“అమెరికన్లకు తగిన వేతనాలు ఇవ్వకుండా ఎగవేస్తూ, విదేశీ కార్మికులను దోపిడీ చేయడం కోసం కార్పొరేషన్లు పాల్పడుతున్న మోసాలు, దుర్వినియోగాలను అరికట్టడమే నా బిల్లు లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్, H-1B, L-1 వీసాల జారీపై మరింత నిఘా పెడతానని చెప్పాడు. సదరు సంస్కరణ ఈ ద్వైపాక్షిక చట్టంతో ప్రారంభం అవుతుంది. అమెరికన్ వ్యాపార సంస్ధలు అమెరికన్లకు మంచి వేతనాలు చెల్లించేలా ఈ చట్టం కాపలా కాస్తుంది” అని బ్రౌన్ చెప్పాడు. 

బ్రౌన్ బిల్లు ప్రకారం అమెరికా కంపెనీలు ఏవైనా ఖాళీలు ఏర్పడితే వాటిని భర్తీ చేయడంలో మొదట విదేశీయునితో సమాన లేదా మెరుగైన అర్హతలు గలిగిన అమెరికన్ కు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికన్లలో అటువంటి అర్హత ఎవరికీ లేకపోతె లేదా అర్హత ఉన్న అమెరికన్ అందుబాటులో లేనట్లయితే అప్పుడు మాత్రమే  H-1B లేదా L – 1 వీసా కలిగిన విదేశీయునికి అవకాశం ఇవ్వాలి. 

వీసాదారులకు వేతనాల పెంపుదలను కూడా బ్రౌన్ బిల్లు ప్రతిపాదించింది. అయితే ఎంత వరకు పెంపుదల నిర్దేశించింది తెలియలేదు. పత్రికలూ కూడా ఈ అంశం గురించి చెప్పలేదు. కానీ బిల్లు ఉద్దేశ్యం / లక్ష్యం లేదా వేతన పెంపుదల లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగానే ఉన్నది. చౌక ధరకు అందుబాటులో ఉండే విదేశీయుల ఉపాధి సేవలకు బదులుగా అర్హత కలిగిన అమెరికన్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కంపెనీలను ప్రోత్సహించడం (నిజానికి ఒత్తిడి చేయడంగా చదువుకోవాలి) బిల్లు లక్ష్యం అని అమెరికన్ పత్రికలు స్పష్టం చేశాయి. 

డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ.. ఈ రెండు విభాగాలకు బ్రౌన్ బిల్లు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీసా మోసాలు, దుర్వినియోగాలు జరగకుండా ఈ విభాగాలు కాపలా కాయాలి. ఆ మేరకు వాటికి అధికారం అప్పగించబడుతుంది. బిల్లు మేరకు నిబంధనలు పాటించకపోతే కంపెనీలకు అపరాధ రుసుము విధించే అధికారం ఇస్తారు. 

ఆ విధంగా ట్రంప్ ‘అమెరికన్ సరుకులు కొనండి, అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వండి’ నినాదాన్ని శరవేగంగా అమలులోకి తెస్తున్నాడు. బిల్లు ఏ పార్టీ సభ్యుడు ప్రతిపాదించింది అన్న సంగతి అప్రస్తుతం. సదరు బిల్లు ఆమోదం పొందడానికి తగిన రాజకీయ వాతావరణం ఉన్నదా లేదా అన్నదే అసలు విషయం. అలాంటి వాతావరణాన్ని డొనాల్డ్ చక్కగా సమకూర్చి పెట్టాడు. 

ఈ బిల్లుల ప్రభావం ఇకనుండి కల్పించబడే ఉపాధి / ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే హెచ్ 1బి, ఎల్ -1 వీసాల కింద పని చేస్తున్న వారికి వర్తించదు. కానీ ఈ బిల్లులు చట్టంగా మారి అమలు చేయడం ప్రారంభం అయ్యాక వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా అమెరికాలో వాతావరణం మారిపోయే అవకాశాన్ని కాదనలేము. ప్రజల డిమాండ్లను అనుసరించి చట్టాలను వెనక నుండి వర్తించేట్లుగా సవరణలు తేవచ్చన్న భయాలు ఇప్పటికే బయలుదేరాయి. 

అదే జరిగితే పలు దేశాలతో అమెరికాకు సమస్యలు ఏర్పడడం ఖాయం. ఆ సమస్యలు అమెరికా భౌగోళిక ఆధిపత్యానికి సవాలుగా మారతాయి. కనుక ట్రంప్ ప్రభుత్వానికి తెలివి ఉంటే రిట్రాస్పెక్టివ్ గా ఈ చట్టాలను అమలు చేసే పనికి పూనుకోదు. 

ఈ రెండు బిల్లులు అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమను వృద్ధి చేసే ట్రంప్ లక్ష్యానికి అనుకూలం. కానీ గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచ దేశాలను కొల్లగొడుతున్న వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీలకు ఒకింత నష్టకరంగా పరిణమించవచ్చు. ఈ కారణం తోనే ఫైనాన్స్ కంపెనీలు కంట్రోల్ చేస్తున్న అమెరికన్ మీడియా ట్రంప్ పైన విద్వేష ప్రచారం చేస్తున్నది. 

సొంత ప్రజలకు ఉపాధి కల్పించే బాధ్యతను అమెరికా, పశ్చిమ దేశాల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేసినా ఇండియా లాండి మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు కూడా ట్రంప్ విధానాలు, ముఖ్యంగా పై రెండు బిల్లులు, హానికరం కానున్నాయి. పశ్చిమ దేశాలలో ఉపాధి తగ్గిపోతున్న నేపథ్యంలో దేశం లోపల ఉపాధి కల్పించాలన్న ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి ఆందోళన రూపాలు ధరించే అవకాశం లేకపోలేదు. 

ట్రంప్ విధానాలు అమెరికా ప్రజలకు కాస్తో కూస్తో ప్రయోజనం చేకూర్చే మాట వాస్తవం. ఏ దేశ పాలుకులైనా మొదట తమ ప్రజల ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రయత్నం చేస్తే అది ఒప్పు అవుతుంది తప్ప తప్పు కాబోదు. కాకుంటే ఇన్నాళ్లూ గ్లోబలైజేషన్ ద్వారా మూడో ప్రపంచ దేశాల సహజ వనరులను, మానవ వనరులను కొల్లగొట్టి, అక్కడి అభివృద్ధిని ఆటంకపరిచిన అమెరికా ఇప్పుడు అకస్మాత్తుగా, తన ప్రభ క్షీణిస్తున్న దశలో ప్రొటెక్షనిస్టు విధానాలు చేపట్టడం మూడో ప్రపంచ దేశాలకు అన్యాయం చేసినట్లే. 

కానీ ఇండియా లాంటి దేశాల పౌరులు ఆ అన్యాయం కంటే మించి చేయవలసిన ఆలోచన ఒకటి ఉంది. అసలు మన సహజ, మానవ వనరులను కొల్లగొట్టడానికి ఆధిపత్య దేశాలకు అనుమతి ఇచ్చి, ఉపాధి కోసం ఆ దేశాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి పరిస్ధితి మనకు కలగడం ఏమిటి? భారత ప్రజలకు ఉపాధి కల్పించవలసింది భారత పాలకులే తప్ప అమెరికా, ఐరోపా పాలకులు కాదు. అసలు దోషం భారత పాలకులలోనే ఉన్నది. వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశ వనరులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పి దేశ ప్రజలను ఉపాధి లేకుండా మాడ్చారు. ఉపాధి కల్పిస్తున్న కొద్దీ సంఖ్యలో ప్రభుత్వ పరిశ్రమలను కూడా విదేశీ కంపెనీలకు అమ్మేసారు; ఇంకా అమ్ముతున్నారు. 

కనుక ట్రంప్ తన దేశంలో వీసా నిబంధనలు మార్చాడని వగచి విదేశీ పాలకుడిని తప్పు ఎంచడానికి బదులు మన ఉపాధిపై శ్రద్ధ పెట్టని స్వార్థపర భారత పాలకులను తప్పు పట్టాలి. దేశ వనరులను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి వీలు లేదని మన పాలకుల మొఖం మీద కొట్టి చెప్పాలి. పరాధీన విధానాలు విడిచి పెట్టి దేశీయ అభివృద్ధికి దోహదపడే విధానాలు చేపట్టాలని ఒత్తిడి తేవాలి; ఆందోళనలు చేపట్టాలి. దేశ ప్రతిష్ట పేరుతో విదేశాలలోని ఉపాధిపై శాశ్వతంగా ఆధారపడే విధానాలకు స్వస్తి పలకాలని తెగేసి చెప్పాలి. దేశాభివృద్ధికి, దేశీయ ఉపాధి వృద్ధికి ఇంతకూ మించిన దగ్గర దారి, అడ్డదారి లేనే లేదు. 

    

One thought on “ట్రంప్ వీసా బిల్లులు, భారతీయుల ఉపాధి -విశ్లేషణ

  1. మధ్యతరగతి ఆశల పల్లకీని మోస్తున్న అమెరికా ఒక్కసారిగా కాడిని వదిలేస్తే ఏమిచేయాలో దిక్కుతోచని బాటసారి బ్రతుకైపోయింది.
    మీరుచెప్పింది సత్యం మెరుగైన ఉపాది అవకాశాలను కల్పించవలసిందిగా దేశీయ పరిశ్రమ వర్గాల, పాలకుల కాలర్ పట్టుకొని అడగవలసిన రోజు వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s