అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన డొనాల్డ్ ట్రంప్ కంటే ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కి 2 మిలియన్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అనగా పాపులర్ ఓట్ల లెక్కలో చూస్తే ట్రంప్ ఓడిపోయినట్లు లెక్క. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కలో ట్రంప్ కే మెజారిటీ రావడంతో ఆయన విజయుడు అయ్యాడు. ఈ అపభ్రంశానికి కారణం చెబుతూ ట్రంప్, హిల్లరీ క్లింటన్ కు మిలియన్ల సంఖ్యలో అక్రమ ఓట్లు పడ్డాయని, ఆ అక్రమ ఓట్లను తొలగిస్తే, పాపులర్ ఓటింగ్ లో కూడా తనదే మెజారిటీకి అనీ వాదించారు.
ట్రంప్ ప్రకారం 2 మిలియన్లకు పైగా అక్రమ ఓట్లు హిల్లరీ ఖాతాకు జమ అయినాయి. అక్రమ ఓట్లు అంటే.., అమెరికా పౌరసత్వం లేకుండానే వేసే ఓట్లు, ఒక్కరే ఒకటి కంటే ఎక్కువ వేసే ఓట్లు, తాత్కాలిక పౌరసత్వంతో వేసే ఓట్లు, చనిపోయిన తర్వాత కూడా ఓటర్ల జాబితాలో కొనసాగిన వారి పేరుతొ పడే ఓట్లు, అక్రమ వలసలు, చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్నవారు (వీసా గడువు దాటినవారు, చదువు పేరుతో వచ్చి వెనక్కి వెళ్లనివారు)… మొ.
నార్ ఫ్లోక్ (వర్జీనియా రాష్ట్రం) లోని ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీకి చెందిన రాజకీయ శాస్త్రవేత్త జెస్సీ రిచ్మన్ బృందం 2016 ఎన్నికలలో పడిన అక్రమ ఓట్లపై అధ్యయనం చేసింది. వివిధ యూనివర్సిటీల కన్సార్టియంగా ఏర్పడి జాతీయ స్ధాయి పోలింగ్ నిర్వహించి ఒక నివేదిక తయారు చేయగా, సదరు నివేదిక ఆధారంగా జెస్సీ బృందం అధ్యయనం చేసింది. అమెరికాలో నివసిస్తున్న 20 మిలియన్ల వయోజనులకు పౌరసత్వం లేదు. జెస్సీ అధ్యయనం ప్రకారం వారిలో 6.4 శాతం మంది అక్రమంగా ఓటు వేశారు.
ఇలా అక్రమంగా వినియోగించబడిన ఓట్లలో 81 శాతం, లేదా 834,381 ఓట్లు హిల్లరీకి పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీకి వచ్చిన పాపులర్ ఓట్ల మెజారిటీతో పోల్చితే ఇవి తక్కువే. కానీ ఈ ఓట్ల వలన ఒకటి రెండు రాష్ట్రాలు హిల్లరీకి అదనంగా కలిసి వచ్చాయని జెస్సీ బృందం అంచనా వేసింది. అనగా హిల్లరీకి వాస్తవంగా జమ కావాల్సిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల కంటే అధికంగా ఆమెకు జమ అయ్యాయి. (Washington Times, Washington Post)
2 మిలియన్ల అక్రమ ఓట్లు హిల్లరీకి పడ్డాయని ట్రంప్ ఆరోపించాడు. అనగా తనకంటే హిల్లరీకి వచ్చిన మెజారిటీకి ఓట్లు అన్నీ అక్రమ ఓట్లేనని ట్రంప్ చెప్పదలిచాడు. జెస్సీ నివేదిక ఈ వాదనను నిరాకరించింది. అక్రమ ఓట్ల వలన ట్రంప్ ఖాతాలో పడవలసిన ఒకటి రెండు రాష్ట్రాలు హిల్లరీ ఖాతాలో పాడి ఉండవచ్చు గానీ, ఆమెకు వచ్చిన పాపులర్ మెజారిటీ ఓట్లు అన్నీ అక్రమ ఓట్లే అనడానికి తగిన సాక్షాలు లేవని తేల్చింది.
అమెరికా పౌరులు కాని వారు హిల్లరీ వైపు అధికంగా మొగ్గు చూపడానికి కారణాల కోసం పెద్దగా వెతుక్కోనక్కరలేదు. వలసల పట్ల కఠిన వైఖరి ప్రకటించిన ట్రంప్ పట్ల తాత్కాలిక పౌరులు, పౌరసత్వం లేనివారు సహజంగానే ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆయనను ఓడిపోవాలని కోరుకున్నారు. కార్పొరేట్ మీడియా వారిలో భయాలు రెచ్చగొట్టడానికి చేయవలసిందంతా చేసింది. ఫలితంగా హిల్లరీ క్లింటన్ అత్యధిక సంఖ్యలో అక్రమ ఓట్లు గెలుచుకుంది. ఇవి హిల్లరిపై అభిమానంతో కంటే ట్రంప్ పై వ్యతిరేకత ఫలితమే.
అమెరికాలో ఆ దేశ పౌరసత్వం లేనివారు 20 మిలియన్ల ఉన్నారన్నది కేవలం యూనివర్సిటీల అంచనా మాత్రమే కాదు. యు.ఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారమే అమెరికాలో 2012 నాటికి 22 మిలియన్ల మందికి పౌరసత్వం లేదు. వారిలో 20 మిలియన్ల వయోజనులు. అనగా 18 సం.ల వయసు పైబడిన వారు. ఇండియా లాగానే అమెరికాలో 18 ఏళ్ళు దాటితే ఓటు హక్కు వస్తుంది.
ఓటు హక్కుకు అర్హత లేనప్పటికీ వలసదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఓటు హక్కు సంపాదించి హిల్లరీకి ఓటు వేసేలా డెమొక్రటిక్ పార్టీకి పధకం రచించిందని వికీలీక్స్ బయటపెట్టిన పత్రాల ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, ప్రయిమరీ ఎన్నికలు జరుగుతున్నపుడూ, ఆ తర్వాతా డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కమిషన్ (DNC ) నేత పొడేస్టా కంప్యూటర్లు హ్యాకింగ్ కి గురయ్యాయి. రష్యాయే ఈ హ్యాకింగ్ చేసిందని ఒబామా ప్రభుత్వం ఆరోపించినప్పటికీ దానిని రష్యా, వికీలీక్స్ తిరస్కరించాయి. డెమొక్రటిక్ పార్టీకి ప్రయిమరీ ఎన్నికలలో బెర్నీ సాండర్స్ ని ఓడించి క్లింటన్ ను గెలిపించడానికి సాక్షాత్తు DNC యే కుట్ర చేయడంతో పార్టీ లోని వ్యక్తులే సమాచారాన్ని తమకు వికీ లీక్స్ కు లీక్ చేశారని వికీ లీక్స్ చెప్పినప్పటికీ కార్పొరేట్ పత్రికలు దానిని పరిగణించలేదు.