
White House Press Secretary, Sean Spicer
ఎన్నికల ముందు నుండీ చైనాపై కత్తులు దూస్తున్న డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి చేపట్టాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. దక్షిణ చైనా సముద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే, తగిన ప్రతిఘటన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్య రవాణా మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాలను కాపాడుకుని తీరతామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ విలేఖరుల సమావేశంలో హెచ్చరించాడు.
వైట్ హౌస్ పత్రికా ప్రతినిధి అమెరికా అధ్యక్షుడి అధికార ప్రతినిధి. కనుక షాన్ ప్రకటన చేస్తే అది ట్రంప్ చెప్పినట్లే.
“వనరులు పుష్కలంగా ఉన్న వాణిజ్య మార్గంలో మా ప్రయోజనాలు కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటాము” అని స్పైసర్ సమావేశంలో పేర్కొన్నాడు. ఏటా 4.5 ట్రలియన్ల ప్రపంచ వాణిజ్య సరుకులు ద.చై.సముద్రం గుండా రవాణా అవుతాయని ఒక అంచనా. అంటే కాకుండా భారీ మత్స్య సంపద, చమురు సంపదలకు ద.చై.సముద్రం నిలయం. దానితో సహజంగానే ఈ సముద్రంలో వాటా కోసం ప్రాంతీయ దేశాల మధ్య తగవు నెలకొంది.
ఈ సముద్రం ఒడ్డున ఉన్న చిన్న చిన్న దేశాలను రెచ్చగొట్టడం ద్వారా ఒబామా నేతృత్వం లోని అమెరికా చైనా వ్యతిరేక ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది. ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం లను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టింది. మిత్రుల రక్షణ పేరుతో యుద్ధ నౌకలు మోహరించింది. అయితే ఫిలిప్పైన్స్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అమెరికాకు దూరమై చైనాకు దగ్గరవుతున్నది. థాయిలాండ్, వియత్నాం లు చైనాకు కోపం తెప్పించకుండా మెత్తగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అమెరికాకు మద్దతు బలహీనపడే పరిస్ధితి ఏర్పడింది.
అయినప్పటికీ ఒబామా తగవులు మారి వారసత్వాన్ని కొనసాగించేందుకే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించాడని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ప్రకటన స్పష్టం చేస్తున్నది. ప్రపంచాధిపత్య రాజకీయాలను త్యజించేందుకు ఆయన సిద్ధంగా లేడని కూడా అర్ధం అవుతోంది. ఆధిపత్యం కొనసాగింపుకు ఒబామా ఒక పంధా అవలంబిస్తే, ట్రంప్ మరొక పంధా చెప్పటమే తేడా తప్ప అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య విధానంలో ఎలాంటి మార్పు రాలేదని గ్రహించవచ్చు.
రష్యా, చైనా ఇరు దేశాలతో ఘర్షణ వైఖరిని ఒబామా అవలంబించగా, డొనాల్డ్ ట్రంప్ రష్యాతో మిత్ర వైఖరి అవలంబిస్తూ చైనాతో శత్రు వైఖరి అవలంబించే విధానాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అధికారం చేపట్టాక ఆ విధానాన్నే ఆయన ధ్రువపరుస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటనలు కొనసాగాయి. కానీ రెక్స్ టిల్లర్సన్ అకస్మాత్తుగా ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
తన విదేశీ మంత్రిగా ట్రంప్ ఎంపిక చేసుకున్న రెక్స్ టిల్లర్సన్ రెండు వారాల క్రితమే దక్షిణ చైనా సముద్రం విషయమై చైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ట్రంప్ చైనా విధానం ఎలా ఉండబోతున్నదో సూచించాడు. “వాళ్ళు న్యాయంగా తమవి కాని ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. లేదా తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు” అని ఆయన ప్రకటించాడు.
అయితే టిల్లర్సన్ చేసిన మరో వ్యాఖ్య పరిశీలకులను అయోమయంలో పడవేసింది. సముద్రంలో చైనా చేపట్టిన కృత్రిమ ద్వీపాల నిర్మాణాన్ని “రష్యా, క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో సమానం”గా రెక్స్ పోల్చాడు. తద్వారా అటు రష్యానూ, ఇటు చైనానూ దాదాపు ఒకే గాటన కట్టాడు. ఇది ఇన్నాళ్లూ ట్రంప్ ప్రకటిస్తున్న విధానంతో సరిపోలడం లేదు. ఇది చూసేముందు క్రిమియా, దక్షిణ చైనా సముద్రం వ్యవహారాలను క్లుప్తంగా చూడాలి.
క్రిమియాలో జరిగింది ఏమిటి? ఉక్రెయిన్ లో ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాన్ని అమెరికా, పశ్చిమ దేశాలు స్ధానిక నాజీ ఫాసిస్టు సంస్ధలను రెచ్చగొట్టి హింసాత్మక అల్లర్లు జరిపించి కూలదోసాయి. యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు ముందు దశగా ఆమోదించవలసిన ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ను ఆమోదించడాన్ని అప్పటి ప్రభుత్వం వాయిదా వేయడంతో కక్ష గట్టి కూల్చివేశాయి. కానీ తూర్పు ఉక్రెయిన్ ప్రజలు ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. సొంతగా రిఫరెండం జరుపుకుని రష్యాలో కలుస్తామని తేల్చారు. క్రిమియా ప్రజలు కూడా రిఫరెండం జరిపి రష్యాలో కలుస్తామని కోరారారు.
రష్యా క్రిమియా రిఫరెండంను అంగీకరించి సైన్యాన్ని పంపి రష్యాలో విలీనం చేసుకుంది. తూర్పు ఉక్రెయిన్ రిఫరెండంను తిరస్కరించింది. అందుకు బదులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఫెడరల్ నిర్మాణాన్ని నెలకొల్పుకోవాలని సలహా ఇచ్చింది. అమెరికా, ఐరోపాల ప్రభావంలో ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వం అందుకు నిరాకరించి తూర్పు ఉక్రెయిన్ పైకి సైన్యాలు పంపింది. తూర్పు ఉక్రెయిన్ ప్రజలు సాయుధులై ప్రతిఘటిస్తున్నారు. ఇప్పటికీ ఈ యుద్ధం కొనసాగుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో మానవ నివాస యోగ్యం కాని చిన్న చిన్న ద్వీపాలు అనేకం ఉన్నాయి. చైనా వాటిలో కొన్నింటిని కృత్రిమంగా విస్తరింపజేస్తూ అక్కడ సైనిక స్ధావరాలను నిర్మిస్తున్నది. సముద్రంలో వాటా కోసం తగవు పడుతున్న స్ధానిక దేశాలతో చర్చలు చేసి సమస్యలు పరిష్కరించుకుందామని చైనా ప్రతిపాదించింది. కానీ తగవులోకి అమెరికా జొరబడడంతో చర్చలకు బదులు ఉద్రిక్తతలు చెలరేగాయి. తన పొరుగు సముద్ర జలాలు కనుక స్ధానిక దేశాలు అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం వాటాలు డిమాండ్ చేయడం సహజం. ఈ సమస్య సంప్రతింపుల ద్వారా పరిష్కారం అయితేనే శాంతి నెలకొంటుంది. కానీ స్ధానిక దేశాలు ప్రాంతీయంగా చర్చించుకుని శాంతియుతంగా పరిష్కరించుకుంటే అమెరికా ఆధిపత్యానికి తావు లేదు గనక సంప్రదింపులకు అమెరికా గండి కొడుతోంది.
- South China Sea
- Gaven Reefs
- Johnson Reefs
- Hughes Reefs
- The U.S. & Philippines navy in SCS
- Secretary of State nominee, Rex Tillerson
రష్యాను బలహీనపరిచేందుకు, సైనికంగా చుట్టుముట్టి రక్షణాత్మక పరిస్ధితిలో నెట్టివేసేందుకు గాను నల్ల సముద్రం, అందులోని క్రిమియా ద్వీపం తన స్వాధీనంలో ఉండాలని అమెరికా ఆరాటం. అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గం పేరుతో దక్షిణ చైనా సముద్రం వివాదంలో చొరబడి చైనాకు వ్యతిరేకంగా ఇతర దేశాలను రెచ్చగొట్టి, ఆ దేశాలకు మద్దతుగా తన ఆయుధ సంపత్తిని మోహరించి చైనా ప్రభావాన్ని బలహీనం చేయాలని కూడా అమెరికా ఆరాటపడుతోంది.
ఒబామా పాలనలో రష్యా, చైనాలకు వ్యతిరేకంగా క్రిమియా, దక్షిణ చైనా సముద్రం విధానాలను అమెరికా పై విధంగా అమలు చేసింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కూడా వివరాల జోలికి పోకుండా రష్యా యొక్క క్రిమియా విధానాన్ని, చైనా యొక్క దక్షిణ చైనా సముద్రం విధానాన్ని పోల్చుతున్నది. ఈ పోలిక ద్వారా ఒబామా లాగానే ట్రంప్ కూడా రష్యా క్రిమియాను దురాక్రమించిందని చెబుతున్నాడు. చైనాకు ఎలాగూ వ్యతిరేకంగా ఉన్నాడు కనుక ద.చై.సముద్రం విషయమై చేస్తున్న వ్యాఖ్యలలో ఆచర్యపడవలసింది ఏమీ లేదు.
ఈ విధంగా చైనా, రష్యాలను ఒకే గాటన కట్టడం ద్వారా ట్రంప్ చెప్పదలుచుకున్నది ఏమిటి? రెండూ ఒకటే అయితే రష్యాతో స్నేహం చేస్తానని చెప్పడం ఎందుకు? ఈ అయోమయ పరిస్ధితికి అర్ధం ఏమిటో పరిశీలకులకు అంతుబట్టకుండా ఉంది. ట్రంప్ పాలన ప్రారంభంలోనే ఉన్నది గనుక త్వరపడి ఒక అవగాహనకు రావడానికి విశ్లేషకులు వెనుకంజ వేస్తున్నారు గానీ, ఇప్పటివరకు చూస్తే ట్రంప్ ప్రభుత్వానికే ఒక నిర్దిష్ట అవగాహన లేదన్నట్లుగా వివిధ అధికారులు, మంత్రుల ప్రకటనలు సూచిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో వైట్ హౌస్ ప్రతినిధి తాజాగా చైనా వ్యతిరేక హెచ్చరికలు జారీ చేశాడు. “ఆ ద్వీపాలు నిజంగా అంతర్జాతీయ జలాల్లో ఉన్నట్లయితే, చైనాలో వాస్తవంగా భాగం కాకపోతే అప్పుడిక మేము అంతర్జాతీయ పరిధిలోని ప్రాంతాలను ఒకే ఒక్క దేశం స్వాధీనంలోకి తెచ్చుకోకుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటాము” అని వైట్ హౌస్ ప్రతినిధి స్పైసర్ సోమవారం (జనవరి 23) విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు.
స్పైసర్ చెబుతున్న ‘తగిన చర్యలు’ ఏమిటి? అవేమిటో స్పైసర్ కే తెలియదు. విలేఖరులు అదే ప్రశ్న వేస్తే “ముందు ముందు మేము మరింత సమాచారాన్ని సేకరిస్తాము” అని సమాధానం ఇచ్చాడు. సమాచారం లేకుండానే “తగిన చర్యలు” తీసుకుంటాం” అని హెచ్చరించడానికి ట్రంప్ వైట్ హౌస్ రెడీ అయిపోయింది. “భద్రతా విషయమై బడా ఆటలో ప్రవేశించేందుకు సిద్ధమని మేము చెప్పాము. కానీ మేము ఆ విషయంలో మిలట్రీ శక్తి ఏ మేరకు ఉపయోగించాలన్న విషయమై అంత ఆలోచన చేయలేదు” అని స్పైసర్ చెప్పాడు. చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్రంలో మిలట్రీ శక్తిని మరింత బలీయం చేసేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నట్లు స్పైసర్ మాటలు సూచిస్తున్నాయి. కానీ దానిపై వారికే ఇదమిద్ధంగా ఒక అవగాహన లేదు.
చైనా మాత్రం వెనకంజ వేయడం లేదు. టిల్లర్సన్, స్పైసర్ ప్రకటనలకు అంతే తీవ్రంగా బదులు ఇచ్చింది. “మా వనరులను ఉపయోగించుకోవడంలో గానీ, మా హక్కులు కొనసాగింపులో గానీ ఎవరైనా అడ్డం వస్తే భారీ స్ధాయిలో యుద్ధం చెలరేగక తప్పదు. అందుకు మేము సదా సిద్ధం” అని చైనా ప్రకటించింది.
అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా ఆచరణలో యుద్ధ నౌకలను అటూ ఇటూ తిప్పుకోవడం తప్పించి చైనా దూకుడును నిలువరించింది లేదని పరిశీలకుల అభిప్రాయం. మరోవైపు చైనా అమెరికా కంటే తక్కువ మాట్లాడుతున్నప్పటికీ తాను చేయదలుచుకున్నది హడావుడి లేకుండా చేసుకుపోతున్నదని కూడా వారి అభిప్రాయం. ఆచరణలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ సంగతినే చెబుతున్నాయి. ట్రంప్ బెదిరింపులు కూడా అదే కోవలోనివా అన్నది తేలవలసి ఉన్నది. అలా కాకుండా చైనాకు వ్యతిరేకంగా నిర్దిష్ట చర్యలు చేపడితే గనక (అందుకు చాలా చేయవలసి ఉంటుంది) దక్షిణ చైనా సముద్రం రానున్న ఆధిపత్య యుద్ధాలకు ప్రధాన కేంద్రంగా మారవచ్చు.