ట్రంప్ ప్రొటెక్షనిజం – ఇండియా జపాన్ ల వాణిజ్య వైరం


steel-trade-war

డోనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం ప్రతిపాదించిన రక్షిత (ప్రొటెక్షనిస్టు) విధానాలు అప్పుడే ప్రభావం చూపిస్తున్నాయి. ఆరంభ రోజుల్లోనే ఇండియాపై ఆయన ప్రభుత్వం పడటం విశేషం. అయితే హెచ్1బి వీసాల రద్దు లేదా కుదింపు రూపంలో ఇండియాపై దెబ్బ పడుతుందని ఊహిస్తుండగా వాణిజ్య రంగంలో ఇండియాపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం ట్రంప్ వల్ల నేరుగా కాకుండా పరోక్షంగా పడటం మరో విశేషం.

ఇండియా అనుసరిస్తున్న ‘ప్రొటెక్షనిస్టు’ విధానాల వలన తమ ఉక్కు ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయని జపాన్ ఆరోపిస్తున్నది. జపాన్ నుండి ఉక్కు దిగుమతులపై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు, నిబంధనలు విధించిందని, ఫలితంగా ఇండియాకు చేసే ఉక్కు ఎగుమతులు గత ఏడాదిలోనే సగానికి పడిపోయాయని జపాన్ ఆరోపిస్తున్నది. ఇండియా విధించిన నిబంధనలు WTO ఒప్పందానికి విరుద్ధమని, నిబంధనలు ఎత్తివేయకపోతే WTO కు ఫిర్యాదు చేస్తామని జపాన్ హెచ్చరించింది.

జపాన్ నుండి ఇలాంటి హెచ్చరికలు వెలువడటం చాలా అరుదు. వివాదాలు తలెత్తినపుడు మూడో కంటికి తెలియకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికే జపాన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకూ జపాన్ అనుసరించిన విధానం అదే. అలాంటిది చర్చల మార్గాన్ని పక్కనబెట్టి WTO కు ఫిర్యాదు చేస్తానని నేరుగా హెచ్చరికలు జారీ చేయడం వెనుక ట్రంప్ వలన ప్రపంచ వాణిజ్య వాతావరణంలో వచ్చిన మార్పులు దోహదం చేశాయని పరిశీలకులు భావిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వాగ్దానాల్లో ప్రధానమైనది “మేక్ అమెరికా గ్రేట్ అగైన్.” ఈ నినాదానికి ఆయన ఇచ్చిన అర్ధం: అమెరికా నుండి తరలిపోయిన మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలను తిరిగి అమెరికాకు రప్పించడం; తద్వారా విదేశాలకు తరలిపోయిన అమెరికా ఉద్యోగాలను తిరిగి అమెరికాకు రప్పించడం; ఆ విధంగా అమెరికన్ల నిరుద్యోగ సమస్యను రూపుమాపడం.

ట్రంప్ చేసిన మరో వాగ్దానం: బై (buy) అమెరికా; హైర్ అమెరికా! ‘అమెరికా సరుకులనే కొనాలి, అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకోవాలి’ అని దీని అర్ధం. మామూలుగా కనిపిస్తున్న ఈ హామీ/నినాదం అమలు అయితే గనక చాలా శక్తివంతమైనది. వాణిజ్య విధానం పరంగా చూస్తే దీని అమలు ‘ప్రొటెక్షనిజం’ అవుతుంది. దేశీయ కంపెనీల వాణిజ్య ప్రయోజనాలను ‘ప్రొటెక్ట్’ చేసుకునే విధానాలు కనుక ఈ విధానాలను ఒక్క మాటతో ‘ప్రొటెక్షనిజం’ అంటారు.

‘ప్రొటెక్షనిస్టు’ విధానాలు పెట్టుబడిదారీ విధానం ప్రవచించే స్వేచ్ఛ మార్కెట్ విధానానికి విరుద్ధమైనవని అభివృద్ధి చెందిన దేశాలు ప్రభోదిస్తాయి. సైద్ధాంతికంగా ‘స్వేచ్ఛ వాణిజ్య విధానం’ ను ప్రభోదించినప్పటికీ అభివృద్ధి చెందిన పరిపక్వ పెట్టుబడిదారీ దేశాలు ఆచరణలో తమ వరకు ‘ప్రొటెక్షనిస్టు’ విధానాలు అవలంబిస్తూ, బలహీన, మూడో ప్రపంచ దేశాల పైన మాత్రం స్వేచ్ఛ వాణిజ్య విధానాలు రుద్దుతాయి. అదే తమలో తాము పోటీ పడవలసి వచ్చినపుడు వివిధ ద్వైపాక్షిక, బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల ప్రాతిపదికన, WTO ఒప్పందం ప్రాతిపదికన పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో WTO లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం కద్దు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ‘గ్లోబలైజేషన్’ కు తాను వ్యతిరేకం అని ప్రకటించారు. ప్రపంచీకరణ వల్లనే అమెరికా ఉద్యోగాలు చైనా, ఇండియా లాంటి దేశాలకు తరలిపోయాయనీ, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ అమెరికాను వదిలిపోయిందనీ, విదేశీయులు పెద్ద ఎత్తున అమెరికాకు తరలివచ్చి స్ధిరపడుతున్నారని, ఇతర దేశాల రక్షణ, భద్రతల కోసం ట్రిలియన్ల డబ్బు ఖర్చు చేయవలసి వస్తున్నదనీ, ముస్లింలు పెరిగిపోయారనీ… ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి గ్లోబలైజేషన్ లో అమెరికా ప్రజల ప్రయోజనాలు దెబ్బ తిన్నాయి గనక తాను ఆ విధానాలను వెనక్కి మళ్లిస్తాననీ ట్రంప్ హామీకి ఇచ్చారు. అమెరికన్లు, ముఖ్యానంగా పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఈ హామీలను నమ్మారు. ట్రంప్ కి ఓటు వేసి గెలిపించారు.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఇన్నాళ్లు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. 16 ట్రలియన్ల జీడీపీ తో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. ఈ స్ధానానికి చైనా క్రమంగా దగ్గర అవుతోంది. 11 ట్రలియన్ల జీడీపీతో రెండో స్ధానంలో ఉన్న చైనా అమెరికాను దాటిపోయేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. చైనా ఈ స్ధానానికి చేరుకోవడానికి కారణం కూడా గ్లోబలైజేషనే అని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు.

అయితే అమెరికా కంపెనీలకు ప్రయోజనాలు లేకుండా, వారి లాభాలు వృద్ధి చెందకుండా తమ కార్యకలాపాలను చైనా లాంటి దేశాలకు తరలించాయంటే మాత్రం అది సత్యదూరం. అమెరికా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తమ లాభాలు పెంచుకునే క్రమంలోనే, చైనాలో లభించే చౌక శ్రమను సొమ్ము చేసుకునేందుకు, అమెరికాలో కార్మిక-పర్యావరణ చట్టాలను ఎగవేసేందుకు తద్వారా అమ్మకాలు, లాభాలు పెంచుకునేందుకు ఉత్పత్తి కార్యకలాపాలను విదేశాలకు తరలించాయి.

(చైనా స్వతంత్ర దేశం. భారీ మానవ వనరులు ఉన్న దేశం. అది తన ప్రజల శ్రమ శక్తిని చౌకగా అమ్మకానికి పెట్టిందే గానీ తన జాతీయ ప్రయోజనాలను అమ్మకానికి పెట్టలేదు. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు ఎన్ని ఏర్పాటు చేసినా తమ దేశ, కంపెనీల, జాతీయ ప్రయోజనాలను ఎన్నడూ తాకట్టు పెట్టలేదు. విదేశీ వాణిజ్యంలో, ఆర్ధిక సంస్కరణల అమలులో తమ ప్రయోజనాలను ఎల్లపుడూ పై స్ధానంలో ఉంచింది. ఫలితంగా ఏటికేడూ భారీకి వాణిజ్య మిగులు పోగేస్తూ, అమెరికాకే అప్పులు ఇస్తూ, టెక్నాలజీ అభివృద్ధి చేస్తూ (అవసరం అయితే దొంగిలిస్తూ), మౌలిక సౌకర్యాలు నిర్మించుకుంటూ ఆర్ధిక శక్తిగా అవతరించింది.)

కనుక గ్లోబలైజేషన్ వల్ల అమెరికా కార్మికవర్గం (బ్రాడ్ గా శ్రామిక ప్రజలు) నష్టపోయిన మాట నిజమే గానీ అమెరికా సూపర్ ధనికవర్గం, వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, చమురు-ఆయుధ కంపెనీలు నష్టపోలేదు. పైగా అవి అత్యధిక లాభాలు పోగేసుకున్నాయి. గ్లోబలైజేషన్ ద్వారా లాభపడిన సంపన్న వర్గాలు, కంపెనీలు ట్రంప్ అజెండాను వ్యతిరేకించగా, గ్లోబలైజేషన్ వల్ల నష్టపోయిన కార్మికులు, పేదలు, మధ్య తరగతిలో ఒక సెక్షన్ ట్రంప్ కు మద్దతు ఇచ్చారు.

ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు వ్యతిరేకించారు అన్నది ప్రస్తుత చర్చ పరిధిలోనిది కాదు. కనుక దాన్ని పక్కన పెట్టేద్దాం. ట్రంప్ ప్రకటించిన వాణిజ్య, విదేశీ విధానాలు ప్రపంచ వాణిజ్యంలో ఒక్కసారిగా ‘ప్రొటెక్షనిస్టు’ విధానాల భయాలను చొప్పించాయి. స్వేచ్చా వాణిజ్య విధానాల ప్రవక్త అయిన అమెరికాయే ‘ప్రొటెక్షనిస్టు’ విధానాలు అవలంబించడం ప్రారంభిస్తే ఆ దేశానికి చేసే ఎగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇతర దేశాలు కూడా అనివార్యంగా అమెరికాను అనుసరిస్తాయి. వాణిజ్యం కష్టంగా మారుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే జరగబోయే నష్టాన్ని కొంతైనా నివారించుకోవచ్చని వివిధ దేశాలు భావించే పరిస్ధితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే జపాన్ కూడా ఇన్నాళ్లు అనుసరిస్తూ వచ్చిన సానుకూల చర్చల విధానాన్ని పక్కనబెట్టి హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధపడిందనీ, కఠినంగా వ్యవహరిస్తే తప్ప తన ప్రయోజనాలు నెరవేరవని భావిస్తున్నదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉక్కు ఎగుమతులకు సంబంధించి ఇండియాతో నేరుగా అమీ తుమీ తేల్చుకోవటానికే జపాన్ సిద్ధపడిందని వారు భావిస్తున్నారు.

ట్రంప్ ప్రకటించిన ఆర్ధిక, విదేశీ విధానాలు ఆ విధంగా ఇండియా-జపాన్ ల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. ఇండియా-జపాన్ ల మధ్య తలెత్తిన తగవు కేవలం ఆరంభం మాత్రమే కావచ్చు. భవిష్యత్తులో అమెరికా-ఐరోపా రాజ్యాల మధ్యా, అమెరికా-చైనాల మధ్యా మరిన్ని తగవులు చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

చైనాను ‘కరెన్సీ మానిపులేటర్’ (ఉద్దేశపూర్వకంగా, తమ ఎగుమతులను పెంచుకునే లక్ష్యంతో కరెన్సీ విలువ తగ్గించుకోవటం) ప్రకటిస్తానని ట్రంప్ హామీ ఇచ్చినందున అమెరికా – చైనాల మధ్య ఎపిక్ అనదగిన వాణిజ్య యుద్ధాలు చెలరేగినా ఆశ్చర్యం లేదు. “ప్రొటెక్షనిస్టు విధానాలు ప్రపంచ ఆర్ధిక వృద్ధికి ఎంతమాత్రం క్షేమకరం కాదు” అని ట్రంప్ విజయం అనంతరం చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రకటించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

డిసెంబర్ 20 తేదీన ఇండియాతో ఉక్కు ఎగుమతుల వివాదానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని జపాన్ అధికారికంగా WTO ను కోరింది. దేశీయ ఉక్కు పరిశ్రమకు రక్షణగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నదనీ, దేశీయ ఇనుము, ఉక్కుఉత్పత్తులకు మద్దతు ధర చెల్లిస్తున్నదనీ జపాన్ చెబుతోంది. ఉక్కు దిగుమతులపై 20 శాతం సుంకం విధించిందని, ఈ చర్యల వల్ల తమ ఉక్కు ఎగుమతులు సగానికి పడిపోయాయనీ జపాన్ ఆరోపిస్తున్నది.

చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుండి ఉక్కు దిగుమతులను నిరోధించే లక్ష్యంతో ఫిబ్రవరి 2016 నుండీ ఉక్కు ఉత్పత్తుల దిగుమతులకు స్ధిర ధర (floor price -మార్కెట్ పరిస్ధితులు నిర్ణయించే ధరకు ఎక్కువ గానీ తక్కువ గానీ నిర్ణయించబడే ధర) నిర్ణయించిందనీ జపాన్ ఉక్కు కంపెనీలు ఆరోపించాయి. (బహుశా జపాన్ హెచ్చరిక వెనుక చైనా, దక్షిణ కొరియాల హస్తం కూడా ఉండవచ్చని దీని ద్వారా అర్ధమవుతోంది.)

“WTO వద్ద జరిగే సంప్రదింపులు విఫలం అయినట్లయితే విచారణ నిమిత్తం కమిటీని వేయవలసిందిగా WTO ను కోరుతాము” అని జపాన్ పరిశ్రమల శాఖ అధికారి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారని ఇండియా టుడే పత్రిక తెలిపింది. సంప్రదింపులను కోరిన రెండు నెలలలోపు, అనగా ఫిబ్రవరి 2017 లోపు, పరిష్కారం కుదరకపోతే కమిటీ (ప్యానెల్) ఏర్పాటు చేయవలసి ఉంటుంది. WTO నిబంధనలకు విరుద్ధంగా ఇండియా నిబంధనలు ఉన్నాయన్నది జపాన్ ప్రధాన వాదన. నిబంధనల (restrictions) వలన జపాన్ కు ఇండియా 6వ అతి పెద్ద ఉక్కు దిగుమతిదారు స్ధానం నుండి 12వ అతి పెద్ద ఉక్కు దిగుమతిదారు స్ధాయికి పడిపోయిందని జపాన్ చెబుతున్నది.

ఇండియా వాదన వేరుగా ఉన్నది. “WTO మార్గదర్శక సూత్రాలను తుచ తప్పకుండా మేము పాటిస్తున్నాము. వివాద పరిష్కారానికి వాణిజ్య చర్చలు చేసేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని భారత ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారని పత్రిక (ఇండియా టుడే) తెలిపింది.
“వాణిజ్యం అంతా నిజాయితీగా జరగాలి. నియమాలకు విరుద్ధంగా ఎక్కడైనా వాణిజ్యం జరిగితే మా ప్రభుత్వంతో సంప్రదించి అలాంటి వారిపై అవసరమైన చర్యలు చేపడతాము” అని జపాన్ ఐరన్ & స్టీల్ ఫెడరేషన్ (వాణిజ్య సంఘం) కూడా హెచ్చరిక చేయడం గమనార్హం.

NAFTA (నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) లాంటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తాననీ, పసిఫిక్ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సైతం రద్దు చేస్తాననీ ప్రకటించిన ట్రంప్ అధ్యక్షరికంలో జపాన్ చేస్తున్న హెచ్చరికలు వాణిజ్య యుద్ధాలను నివారించడానికి బదులు మరింత దోహదపడేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s