ఈ రోజు ట్రంప్ ని చంపేస్తే ఒబామా పాలనే -సి‌ఎన్‌ఎన్


CNN story

CNN story

అమెరికాకు చెందిన కార్పొరేట్ మీడియా కంపెనీ అయిన కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సి‌ఎన్‌ఎన్) తన రోత బుద్ధిని సిగ్గూ, ఎగ్గూ లేకుండా బైట పెట్టుకుంది. పదవీ స్వీకారం రోజునే, అనగా ఈ రోజే (జనవరి 20) డొనాల్డ్ ట్రంప్ తో పాటు, ఆయన బృందాన్ని హత్య చేస్తే ఒబామా పాలనే కొనసాగుతుందని ఒక వార్తా నివేదిక ప్రసారం చేసింది.

ఒక ఊహాత్మక పరిస్ధితిని చర్చించడం ద్వారా ట్రంప్ హత్యను తానూ, తన లాంటి ఇతర కార్పొరేట్ మీడియా వెనక ఉన్న వాల్ స్ట్రీట్, పెంటగాన్ కంపెనీలు ట్రంప్ చావును కోరుకుంటున్నామని సి‌ఎన్‌ఎన్ వెల్లడి చేసుకుంది. ఈ వార్తా కధనం పలువురి విమర్శలను, ఛీత్కాకారాలను ఎదుర్కొంది.

ట్రంప్ హత్య గురించి బహిరంగ చర్చ చేయడం ద్వారా సి‌ఎన్‌ఎన్ తన దుష్ట బుద్ధిని బైటపెట్టుకున్నదనీ, డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి నర్మగర్భంగా హెచ్చరించిందని విమర్శకులు తిట్టిపోశారు. దారికి రాకపోతే చావు తప్పదని సి‌ఎన్‌ఎన్ ద్వారా గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలు ఈ కధనం ద్వారా హెచ్చరించి ఉండవచ్చని గట్టి అనుమానాలు వ్యక్తం చేశారు.

పదవీ స్వీకారం రోజునే వినాశనం (disaster) సంభవిస్తే ఏం జరుగుతుంది? అని ప్రశ్నిస్తూ వివిధ అవకాశాలను సి‌ఎన్‌ఎన్ ఏకరువు పెట్టింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు హత్యకు గురయితే, లేదా బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్ధితి ఏర్పడితే ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. ఉపాధ్యక్షుడు కూడా అదే పరిస్ధితిలో ఉన్నట్లయితే (హత్యకు గురి కావడం లేదా బాధ్యత నిర్వహించలేకపోవడం) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (దిగువ సభ) స్పీకర్ ఆ బాధ్యత నిర్వహిస్తాడు. ఉపాధ్యక్షుడి బాధ్యతను సెనేట్ టెంపరరీ ఛైర్మన్ స్వీకరిస్తాడు.

ఆ నలుగురూ హత్యకు గురయితే లేదా సామర్ధ్యహీనులుగా ఉంటే హోదాల వారీగా మంత్రులు ఆ బాధ్యత స్వీకరిస్తారు. మొదట సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశీ మంత్రి) కి అవకాశం వస్తుంది. మంత్రుల హోదాలను రాజ్యాంగం ఏ వరుసలో నిర్వచిస్తే ఆ వరుసలో ఒక్కొక్కరికీ అవకాశం వస్తుంది.

trump

కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం రోజునే ఆయన, ఆయన ఉపాధ్యక్షుడు హత్యకు గురయితే ఏమిటన్న సమస్యను సి‌ఎన్‌ఎన్ ఎంతో ఉత్సుకతతో చర్చించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన మంత్రులుగా నియమించినవారికి వెంటనే అధికార హోదా దక్కదు. వారి నియామకాన్ని మొదట హౌస్, సెనేట్ లు ఆమోదించిన తర్వాత మాత్రమే బాధ్యతలు వారికి అప్పగించబడతాయి. అప్పటి వరకు నామినీలుగానే ఉంటారు. కనుక ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్ లు హత్యకు గురయితే వారి బాధ్యతలు స్వీకరించడానికి మంత్రులు ఎవరూ ఉండరు.

అలాగే జనవరి 20 మధ్యాహ్నానికల్లా పాత అధ్యక్షుడు ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీలు అధికారం కోల్పోతారు. ట్రంప్ విదేశీ మంత్రిగా ప్రతిపాదించిన రెక్స్ టిల్లర్సన్ నియామకాన్ని హౌస్, సెనేట్ లు ఆమోదించలేదు కనుక వారు, ట్రంప్, పెన్స్ ల బాధ్యతలు స్వీకరించలేరు.  అప్పుడు రాజ్యాంగం ప్రకారం పాత ప్రభుత్వ ప్రతినిధిగా రాజకీయ వ్యవహారాల విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ పోలిటికల్ ఎఫైర్స్) తాత్కాలికంగా విదేశాంగ శాఖకు అధిపతి అవుతారు.

ఈ ఏర్పాట్లు జరిగే లోపు పాత మంత్రివర్గం లోని ఒకరిని “సక్సెసర్ ఆన్-డ్యూటీ” గా నియమిస్తారు. ఆయన పేరును రహస్యంగా ఉంచుతారు. ఆయన ప్రమాణ స్వీకార సభకు హాజరు కాడు. గుర్తు తెలియని చోట ఆయనను ఉంచుతారు. ఆ వ్యక్తి కొత్త అధ్యక్షుడు, అనగా ట్రంప్ ప్రతిపాదిత వ్యక్తుల్లో ఒకరు మాత్రం కాదు. ‘సక్సెసర్ ఆన్-డ్యూటీ’ గా పాత అధ్యక్షుడు ఎంపిక చేసిన వ్యక్తి పని చేస్తాడు. అనగా ట్రంప్, పెన్స్ లు హత్యకు గురయితే వెంటనే ఒబామా చేత నియమించబడిన వ్యక్తి వెంటనే అధ్యక్ష బాధ్యతలు, రహస్యంగా, నిర్వహించడం ప్రారంభిస్తాడు.

ఆ విధంగా ట్రంప్, పెన్స్ లను జనవరి 20 తేదీనే చంపేస్తే మళ్ళీ ఒబామా ప్రభుత్వమే, ఒబామా ప్రతిపాదిత వ్యక్తి నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారాన్ని కొనసాగిస్తుంది. ఈ కధనాన్ని సి‌ఎన్‌ఎన్ తొణుకు బెణుకు లేకుండా ప్రసారం చేసింది.

సి‌ఎన్‌ఎన్ తో సహా అమెరికాలోని బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు దాదాపు సమస్తం హిల్లరీ క్లింటన్ గెలుపు కోసం కృషి చేశాయి. ట్రంప్ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతంగా సాగించాయి. ఉన్నవీ లేనివీ అసత్యాలు, అర్ధ సత్యాలు కధలు కధలుగా ప్రచురించాయి, ప్రసారం చేశాయి. కొన్ని పత్రికలు, చానెళ్లు అయితే హిల్లరీ గెలుపు ఖాయమని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా వార్తా కధనాలను తయారు చేసుకుని ప్రచురించడానికీ ప్రసారం చేయడానికి రెడీగా ఉంచుకున్నాయి.

కానీ వారి ఆశాసౌధాలను కూల్చివేస్తూ అమెరికా ప్రజలు ట్రంప్ ని గెలిపించారు. ఆ షాక్ నుండి కొన్ని మీడియా కంపెనీలు ఇప్పటికీ తేరుకోలేదు. హిల్లరీ ఓటమికి రష్యా హ్యాకింగ్ కారణం అంటూ ఎక్కడెక్కడో కారణాలు వెతుకుతూ సరికొత్త ఊహాగానాలు చేస్తూ, సాక్షాలు సృష్టించడంలో బిజీగా గడుపుతున్నాయి. ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేని సి‌ఎన్‌ఎన్, చివరికి ఆయన హత్యను కూడా ఊహించి కధనాలు ప్రసారం చేయడం బట్టి ట్రంప్ వ్యతిరేకత బహుళజాతి కార్పొరేట్ మీడియాలో ఏ స్ధాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. ఆ సమావేశంలో సి‌ఎన్‌ఎన్ విలేఖరి నుండి ప్రశ్న స్వీకరించడానికి ట్రంప్ నిరాకరించాడు. “మీరు ఫేక్ న్యూస్! మీకు ప్రశ్నించే అర్హత లేదు” అని తిరస్కరించాడు. ట్రంప్, రష్యాలోని ఓ హోటల్ లో ఒబామా ఓ సారి బస చేసిన గదిలో మంచాలపైన యూరిన్ పోయించాడని అసహ్యకర వార్తా కధనం ప్రచురించిన ‘బజ్ ఫీడ్’ వార్తా సంస్ధను ‘ఒక చెత్త’గా నిరసించాడు. (ఇలా యూరిన్ పోయించిన ఉదంతాన్ని పుతిన్ రికార్డు చేయించాడని, ఆ రికార్డులు బైటపెడతాడన్న భయంతో ట్రంప్, రష్యాకు, పుతిన్ కూ అనుకూలంగా మాట్లాడుతున్నాడన్న కధనాన్ని బజ్ ఫీడ్ ప్రచురించింది.)

ఇంత చక్కటి బాధ్యతాయుత మీడియా అమెరికాలో స్వేచ్ఛగా వర్ధిల్లుతోంది! అమెరికాలో స్వేచ్ఛ / ఫ్రీడం అంటే అర్ధం ఇదే కామోసు!

trump-assasination-01trump-assasination-02trump-assasination-03

3 thoughts on “ఈ రోజు ట్రంప్ ని చంపేస్తే ఒబామా పాలనే -సి‌ఎన్‌ఎన్

  1. ట్రంపంటే ఎందుకంత కచ్చో మీడియాకి.
    కొన్ని వార్తలూ, కార్టూన్లయితే మీడియా హీనతకు పరాకాష్ట. కొన్ని పరమ రోతగా ఉన్నాయి కూడ.
    వాడి మానాన వాడినొదిలేస్తే, అతనికి ఎలాగూ త్వరలోనే ప్రజాభిమానం సన్నగిల్లేది.
    మీడియా ఎగష్ట్రాలే అర్ధం లేనివి.
    మీడియా రెచ్చిపోయే కొలదీ, మీడియా క్రెడిబిలిటి సన్నగిల్లి, ట్రంప్ క్రెడిబిలిటి నిలబడుతున్నట్లు (బలపడడం కాదు) అనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s