బ్లాడ్లీ మేనింగ్: 35 ఏళ్ళ శిక్షను 7 ఏళ్లకు కుదించిన ఒబామా


Bradley Manning

మరో రెండు రోజుల్లో అధ్యక్ష పదవి నుండి దిగిపోనున్న బారక్ ఒబామా, గత ఎనిమిదేళ్లుగా పాల్పడిన పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. వికీ లీక్స్ కు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల రహస్య సమాచారాన్ని అందజేసినందుకు మిలట్రీ కోర్టు మార్షల్ విధించిన 35 ఏళ్ళ కారాగార శిక్షను 7 సంవత్సరాలకు కుదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసాడు. ఫలితంగా 20 మిస్టర్ బ్రాడ్లీ మేనింగ్ ఉరఫ్ మిస్ చెలేసా మేనింగ్ 2045 లో విడుదల కావలసిన చెలేసా మేనింగ్ వచ్చే మే నెల 17 తేదీన విడుదల కానున్నారు.

తన పదవీ కాలంలో ఒబామా పాల్పడిన అనేక  పాపాలతో పోల్చితే బ్రాడ్లీ మేనింగ్ విడుదల సరితూగేది కాదు. నిజానికి బ్రాడ్లీ మేనింగ్ / చెలేసా మేనింగ్ కు 35 సంవత్సరాల జైలు శిక్ష వేయడమే అత్యంత అమానుష చర్య. ఈ ఏడేళ్ల కారాగారంలో చెలేసాను పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు నానా హింసలకు గురి చేశారు. ఎంతగా హింస పెట్టారంటే ఐరాస ప్రతినిధి మేనింగ్ ను సందర్శించి “దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన” గా ఆయన కారాగార హింసను అభివర్ణించేంతగా. 

సాధారణంగా ఐరాస ప్రతినిధులు అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా అరుదు. అలాంటిది మేనింగ్ పరిస్ధితిని చూసాక ఐరాస కూడా కఠినంగా వ్యాఖ్యానించక తప్పలేదు. ఆయనను ఏళ్ళ తరబడి ఒంటరిగా ఖైదు చేశారు. మొదటి రెండేళ్లు దుస్తులు కూడా ఇవ్వకుండా నగ్నంగా పడుకోబెట్టారు. ఎముకలు కొరికే చలిలో దుప్పటి లేకుండా నగ్నంగా నేలపై పడుకోబెట్టారు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి గడిపేశారు. విచారణ వాయిదా వేస్తూ పోయారు. తెలిసినవారిని, అయినవారిని ఎవరినీ కలవకుండా చేశారు. మానసికంగా బలహీనపరిచేందుకు చేయవలసింది అంతా చేశారు. వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే ప్రోద్బలంతోనే తానూ లీకేజికి పాల్పడ్డానని మేనింగ్ చేత చెప్పించటానికి తీవ్ర ఒత్తిడి తెచ్చారు. 

ఎన్ని హింసలు పెట్టినప్పటికీ అసాంజే పై వ్యతిరేక సాక్షం ఇచ్చేందుకు మేనింగ్ అంగీకరించలేదు. “నేను చేసినది దేశ ప్రయోజనాల కోసమే, అమెరికన్ ప్రజల కోసమే” అన్న అవగాహనపైన చివరి వరకూ దృఢంగా నిలబడ్డాడు. ప్రజల ప్రయోజనాల కోసం, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందు కోసం తానే వికీ లీక్స్ కు ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధ రహస్య పత్రాలను అందజేశానని మిలట్రీ కోర్టులో తొణుకూ బెణుకూ లేకుండా అంగీకరించాడు. “నేను చేసింది మంచి పనే అని భావిస్తున్నాను. అందుకు చింతించడం లేదు” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఫలితంగా మిలట్రీ కోర్టు  చెలేసా మేనింగ్ కు (అప్పటికి బ్రాడ్లీ మేనింగ్) 35 ఏళ్ళు కారాగార శిక్ష విధించింది. శిక్ష ప్రకారం ఆయన 2045 లో మాత్రమే విడుదల కావలసి ఉన్నది. 

అయితే తన పదవీ కాలంలో ఒక మంచి పని చేద్దాం అనుకున్నాడో, లేక ఈ చర్య వెనుక కూడా అమెరికా మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యజమానులు మరో ప్రయోజనం సాధించదలిచారో తెలియదు గానీ మేనింగ్ మే 17 తేదీన విడుదల కానున్నాడు.  

8 సంవత్సరాల అధ్యక్షరికంలో బరాక్ ఒబామా చేసిన పాపాలు ఏమిటి? నిజానికి ఆయన చేయని పాపం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలను రెచ్చగొట్టి, డ్రోన్ దాడులు చేసిన ఒబామా లోక కంటకుడు అనడం కరెక్ట్ గా ఉంటుంది. 2008 ఎన్నికల ప్రచారంలో ఇరాక్ జోలికి ఇక అమెరికా సైనికులు వెళ్లబోరని హామీ ఇచ్చాడు. కానీ సైన్యాలను కొనసాగించాడు. యుద్ధ నేరాలకు అమెరికా సైనికులను ప్రాసిక్యూట్ చేస్తామని ఇరాక్ అధ్యక్షుడు హెచ్చరించాక తప్పనిసరిగా సేనలను వెనక్కి తీసుకున్నాడు. కానీ రెండోసారి ఎన్నికయ్యాక మెల్ల మెల్లగా ఐసిస్ లాంటి వివిధ సాకులు చూపి అమెరికా సానికులను తిరిగి ప్రవేశపెట్టాడు. షియా, సున్నీల మధ్య సెక్టేరియన్ ఘర్షణలను రెచ్చగొట్టి టెర్రరిస్టు పేలుళ్లతో వేలాది మంది అమాయకుల ఊచకోతకు కారణం అయ్యాడు.

రష్యాతో సంబంధాలు ‘రీ సెట్’ చేసుకుంటాం అన్నాడు. పదవి చేపట్టాక రష్యాను ‘ప్రధమ శత్రువు’ గా ప్రకటించాడు. రష్యా చుట్టూ ఆయుధాలు మోహరించాడు. ఒప్పందాలను ఉల్లంఘించి తూర్పు యూరప్ రాజ్యాలను నాటోలో చేర్చుకోవడం ద్వారా నాటోను రష్యా సరిహద్దు వరకూ విస్తరింపజేశాడు. ఉక్రెయిన్ లో నాజీ శక్తుల సహాయంతో కృత్రిమ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశాడు. ఒబామా విధానం పుణ్యమాని అక్కడ ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతున్నది. రష్యాతో మరోసారి ప్రచ్చన్న యుద్ధానికి తెరతీశాడు. చైనాతో స్నేహం చేస్తానని చెప్పి దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకల్ని తిప్పుతూ ఉద్రిక్తతలకు ప్రేరేపించాడు. చైనా పొరుగు దేశాలను ఆ దేశానికీ వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. 

ఉత్తర కొరియాతో చర్చలు చేస్తానని హామీ ఇచ్చి వాస్తవంలో మరింత ఘర్షణ వైఖరి అవలంబించాడు. బెదిరింపులు సాగించాడు. దక్షిణ కొరియాతో కలిసి పదే

పదే మిలట్రీ విన్యాసాలకు దిగి ఉత్తర కొరియాకు ఉద్రిక్తత అంటగట్టాడు. అందుకు స్పందించిన ఉత్తర కొరియాపై వ్యతిరేక ప్రచారం సాగించాడు. ఇజ్రాయెల్ అక్రమ సెటిల్మెంట్ల నిర్మాణాన్ని అరికట్టి పాలస్తీనా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీకి ఇచ్చి వాస్తవంలో మరిన్ని సెటిల్మెంట్లకు మద్దతు ఇచ్చాడు. గాజాపై రెండు సార్లు దాడి చేసి పాలస్తీనీయులను ఊచకోత కోసినా గమ్మున ఉండిపోయాడు. ఐరాసలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను వీటో ప్రయోగంతో అడ్డుకున్నాడు. ఏడేళ్ల పాటు ఇరాన్ పై కఠిన ఆంక్షలు అమలు చేసి చివరి సం.లో నామమాత్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

బ్రాడ్లీ మేనింగ్ పుట్టుకతో పురుషుడు. జైలు శిక్ష పడ్డాక తన శారీరక, మానసిక లక్షణాల రీత్యా స్త్రీగా మారేందుకు అనుమతి కోరాడు. మొదట అందుకు నిరాకరించిన మిలటరీ కోర్టు తర్వాత అంగీకరించింది. అప్పటి నుండి బ్రాడ్లీ మేనింగ్, చెలేసా మేనింగ్ గా పేరు మార్చుకుని స్త్రీగా మారారు. అనగా చెలేసా మేనింగ్ ట్రాన్స్ జెండర్. భారత సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం థర్డ్ జెండర్. జెండర్ కు సంబంధించిన సమస్యతో మానసికంగా సతమతమైన మేనింగ్ జైలులో రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లింగ మార్పిడికి, చట్టబద్ధ గుర్తింపుకు కోర్టు అంగీకరించాక స్వాతన పొందారు. 

చెలేసా మేనింగ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మదపుటేనుగుతో తలపడ్డారు. అత్యంత క్రూరమైన రాజ్యానికి ఎదురు నిలిచారు. తాను న్యాయం అనుకున్న దానిపై చివరికంటా నిలిచి గెలిచారు. ఆ క్రమంలో యుద్ధరంగం కంటే ఎన్నో రెట్లు కఠినమైన అణచివేతను అనుభవించారు. రోజుల తరబడిన కత్తి యుద్ధానికి లేదా తుపాకీ యుద్ధానికి మించిన శారీరక, మానసిక హింసలను ఎదుర్కొని, సహించి, నిలిచి గెలిచిన చెలేసా మేనింగ్ ను ‘మహా యోధులు’ గా గౌరవించడం సముచితం కాగలదు. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s