తన చదువు వివరాలు ఆర్‌టిఐ దరఖాస్తుదారుకు ఇవ్వొద్దని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తమను కోరారనీ అందుకే ఆమె డిగ్రీ వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వలేదని స్కూల్ ఆఫ్ ఓపెన్ లర్నింగ్ (ఎస్‌ఓఎల్), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) కు వివరణ ఇచ్చింది. మంత్రి ఒత్తిడితోనే ఇరానీ చదువు వివరాలను విద్యా సంస్ధ ఇవ్వలేదని ఈ వివరణతో స్పష్టం అవుతున్నది.
స్మృతి ఇరానీ తన విద్యార్హతల వివరాలను మూడు ఎన్నికల సందర్భంగా రెండు రకాలుగా పేర్కొన్నారు. దానితో ఆమె వాస్తవంగా ఎంతవరకు చదువుకున్నారన్న విషయమై కొన్ని యేళ్లుగా వివాదం నడుస్తోంది. దేశంలో విద్యాభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు చూసే ముఖ్యమైన మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యాక ఆ పదవికి ఆమెకు ఉన్న విద్యార్హత ఏమిటన్న ప్రశ్న తలెత్తింది.
అంతేకాకుండా మూడు సార్లు రెండు వేరు వేరు విద్యార్హతలు పేర్కొనడం అంటే అఫిడవిట్ ద్వారా చట్టం సాక్షిగా ఆమె ఎన్నికల కమిషన్ కు అబద్ధం చెప్పినట్లు అవుతుంది. అబద్ధం చెప్పి ఎన్నికల్లో పోటీ చేశారన్న అపవాదుకూడా ఆమెను వెంటాడుతున్నది. ఇదే ప్రశ్న, అపవాదు ప్రధాని మోడి విషయంలోనూ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ నేతలుగా ఉన్న మంత్రి, ప్రధాన మంత్రి లకు తగిన విద్యార్హతలు ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. అలాగే తమను ఏలే నాయకులు అబద్ధాలు చెప్పేవారు కాకూడదని కూడా ప్రజలు కోరుకుంటారు. అలాంటిది స్మృతి, మోడీల విద్యార్హతలపై వచ్చిన అనుమానాలను రికార్డుల సాక్షిగా నివృత్తి చేయడానికి వారు ముందుకు రాకపోగా, వివరాలను వెల్లడించకుండా సంబంధిత విద్యా సంస్ధలను నివారించడంతో అనుమానాలు మరింత తీవ్రం అయ్యాయి.
అఫిడవిట్ లలో పేర్కొన్నట్లుగా వారి డిగ్రీ విద్యార్హతలు నిజమే అయితే వారి సర్టిఫికేట్ వెల్లడి చేసి, లేదా అందుకు యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చి అనుమానాలు నివృత్తి చేయవచ్చు. అది తేలిక కూడా. కానీ వారు దాపరికం పాటించడం, వివిధ క్లాజులు ఉపయోగిస్తూ సమాచార కమిషన్ ను కూడా వెల్లడి చెయ్యనివ్వకుండా అడ్డుపడడంతో తమకు డిగ్రీ విద్యార్హత లేకుండానే ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్న అనుమానం కలుగుతోంది.
స్మృతి ఇరానీ చదువు వివరాలు ఫలానా సెక్షన్/క్లాజు ప్రకారం ఇవ్వడం వీలు కాదు అని సమాచార కమిషన్, సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం వరకే మనకు తెలుసు. కానీ సమాచారాన్ని కమిషన్ వెల్లడి చేయకుండా స్మృతి ఇరానీయే స్వయంగా అభ్యంతరం చెప్పి అడ్డుకున్నారని వెల్లడి కావడం ఇది మొదటిసారి. అడ్డుకోవాల్సిన అగత్యం ఆమెకు ఎందుకు కలిగింది? అఫిడవిట్ లలో అబద్ధాలు ఉంటే తప్ప!
2004 ఏప్రిల్ లో స్మృతి లోక్ సభకు పోటీ చేశారు. అప్పుడామె ఢిల్లీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ లర్నింగ్ (స్కూల్ ఆఫ్ కరెస్పాండెన్స్ అని అప్పట్లో పిలిచేవారు) నుండి 1996లో బిఏ పట్టా పుచ్చుకున్నట్లు తెలిపారు. 2011, జులైలో ఆమె గుజరాత్ నుండి రాజ్య సభకు పోటీ చేశారు. ఈసారి ఆమె తన అత్యున్నత విద్యార్హత B.Com Part I (1994) గా ఆమె పేర్కొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె అవే అర్హత (B.Com Part I) పేర్కొన్నారు. ఈ రెండు అర్హతలు ఒకదానితో ఒకటి పొసగవన్నది స్పష్టమే.
ఈ అంశంలో కోర్టులో కేసు వేసినప్పటికీ చాలా కాలం గడిచిపోయింది గనుక విచారణార్హం కాదని చెబుతూ కోర్టు కేసు కొట్టేసింది. ఎలాంటి సాక్షాలు లేకుండా ఘోరమైన ఉగ్రవాద చట్టాలు మోపి వేలాది మంది గిరిజనులను విచారణ లేకుండా, ఉగ్రవాద చట్టం రద్దు అయిన తర్వాత కూడా, జైళ్ళలో కొనసాగిస్తున్న కోర్టులు మంత్రిగారి దగ్గరికి వచ్చేసరికి అసలు కేసు విచారించడానికి కూడా నిరాకరించడం దారుణం. మంత్రిని రక్షించేందుకే కోర్టు కుంటిసాకు చెప్పిందన్నది నిస్సందేహం.
అయితే కేంద్ర సమాచార కమిషన్ వద్ద మాత్రం పిటిషన్ సజీవంగా కొనసాగుతోంది. ఆర్‌టిఐ దరఖాస్తుదారు సిఐసి కి అప్పీలు చేసుకోవడంతో ఇరానీ డిగ్రీ వ్యవహారం మరోసారి వార్తలకు ఎక్కింది. ఎస్‌ఓఎల్ తనకు సరైన సమాచారం ఇవ్వలేదని అప్పీలు చేయడంతో సిఐసి విచారణ నిర్వహించి సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. హియరింగ్ సందర్భంగా ఎస్‌ఓఎల్ కు చెందిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (ఇలాంటి అధికారిని చట్టం ప్రకారం ప్రతి సంస్ధా నియమించుకోవాలి) ఓ పి తన్వర్ సిఐసి ముందు హాజరయ్యాడు. ఇది మూడో వ్యక్తికి చెందిన సమాచారం కనుక సమాచారం వెల్లడించడం గురించి తాము సంబంధిత వ్యక్తిని (స్మృతి ఇరానీని) సంప్రదించామని ఆయన కమిషన్ కు చెప్పారు.

M Sridhar Acharyulu, Information Commissioner
“ఆమె తన సమాధానంలో సమాచారం వెల్లడికి అభ్యంతరం చెప్పారు. తన విద్యార్హతల గురించిన సమాచారం వెల్లడి చేయవద్దని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిపిఐఓ) ను కోరారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం తమకు మానవ వనరుల మంత్రి, విద్యా సంస్ధపై నమ్మకం ఉంచుకున్న వ్యక్తిగా అందజేశారని, కనుక సెక్షన్ 8(1)(e) ప్రకారం దానిని వెల్లడి చేయలేకపోయామని సిపిఐఓ చెప్పారు” అని ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు తన ఆదేశంలో పేర్కొన్నారు.
స్మృతి ఇరానీ విద్యార్హతకు సంబంధించిన సమస్త పత్రాలను, రికార్డులను తమ ముందు ఉంచాలని ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఎస్‌ఓఎల్ యొక్క సిపిఐఓ ను ఆదేశించారు.
ఇన్ఫర్మేషనర్ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అధికార పర్యవేక్షణ పరిధి నుండి మానవ వనరుల శాఖను తప్పిస్తూ కొద్ది రోజుల క్రితమే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిబంధన ప్రకారం ఆ శాఖకు సంబంధించిన పాత దరఖాస్తులను విచారించిన అధికారే, ఆ విచారణ ముగిసేవరకు, తదుపరి కూడా విచారించవలసి ఉంటుంది. ఇది నిబంధన. ఫలితంగా మానవ వనరుల శాఖ శ్రీధర్ అధికార పరిధిలో లేనప్పటికీ అంతకు ముందు ఆ కేసు నిర్వహించింది శ్రీధర్ ఆచార్యులే కావడంతో ఇప్పుడు తాజాగా కూడా ఇరానీ కేసును విచారిస్తున్నారు.
మానవ వనరుల శాఖను శ్రీధర్ ఆచార్యులు పరిధి నుండి ఎందుకు తప్పించారు? అందుకు కారణం మోడి డిగ్రీ వ్యవహారం. మోడీ డిగ్రీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచాలని పరోక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన నుండి అర్జెంటుగా మానవ వనరుల శాఖను తప్పించారు. 1978 లో ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ పూర్తి చేసిన విద్యార్ధులందరి సమాచారాన్ని పరిశీలించడానికి వీలుగా అందుబాటలో ఉంచాలని ఆచార్యులు, ఢిల్లీ యూనివర్సిటీకి జనవరి 8 తేదీన ఆదేశించారు.
మోడీ 1978లో డిగ్రీ పూర్తి చేశారని గతంలో యూనివర్సిటీ అధికారికంగా చెప్పింది. కాబట్టి 1978 డిగ్రీ విద్యార్ధుల వివరాలు పరిశీలిస్తే అందులో మోడీ పేరు ఉండాలి. లేనట్లయితే ఆయన డిగ్రీ పూర్తి చేయనట్లే లెక్క. ఆ సంగతి బైటపడితే 1. మోడీ ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది 2. అబద్ధం చెప్పి ఎన్నికల్లో పోటీ చేసినట్లు తేలుతుంది 3. ఆయన కనీసం గ్రాడ్యుయేట్ కూడా కాదని దేశానికి తెలిసిపోతుంది. 2019 ఎన్నికలకు ఇది ఎంత మాత్రం ఉపకరించదు.
ఈ ఉత్తర్వులు జారీ చేసిన మూడు రోజులకే జనవరి 11 తేదీన ఆచార్యులు అధికార పరిధి నుండి మానవ వనరుల శాఖను తప్పిస్తూ సిఐసి ఆర్ కే మాధుర్ ఆదేశాలు ఇచ్చేశారు.
ఇరానీ విషయానికి వస్తే, సిపిఐఓ వినిపించిన వాదనను ఆచార్యులు తిరస్కరించారు. ఆమె డిగ్రీ సమాచారం “మూడో వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం కాదు. ఈ వాదనలో మెరిట్ గానీ, చట్టబద్ధత కానీ లేదు” అని తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. “1978 సం.లో బిఏ పాస్ అయిన అందరి విద్యార్ధుల ఫలితాల వివరాలను, వారి పేర్లు, తండ్రి పేర్లు, వచ్చిన మార్కులతో సహా అన్నింటిని పరిశీలన నిమిత్తం, యూనివర్సిటీ వద్ద ఉన్న రికార్డుల మేరకు, అందుబాటులో ఉంచాలి. సంబంధిత రిజిస్టర్ లోని పేజీల కాపీలను ఉచితంగా అందజేయాలి…” అని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు.
జాతీయ గీతాలుగా చెబుతున్న ‘జనగణమన’, ‘వందేమాతరం’ గీతాలకు అధికారికంగా భారత ప్రభుత్వం ఎలాంటి స్ధాయి కల్పించిందో వివరాలను వెల్లడి చేయడానికి నిరాకరించినందుకు ఆచార్యులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని, పర్యావరణ శాఖను గత డిసెంబర్ లో ఆచార్యులు తప్పు పట్టడం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. గీతాలకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను వెల్లడి చేసి తీరాలనీ, తద్వారా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న దురభిప్రాయాలను తొలగించి “నిజమైన దేశభక్తిని పెంపొందించేందుకు” దోహదపడాలని డిసెంబర్ 27, 2016 తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆచార్యులు కోరారు. “ప్రధాని కార్యాలయం సదరు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం, స్పందించకపోవడం సరైనది, చట్టబద్ధమైనది కాదు” అని ఆయన స్పష్టం చేశారు. “ఇది సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు గల హక్కును నిరాకరించడమే” అని శ్రీధర్ తెగేసి చెప్పారు.
జనగణమన గీతాన్ని సినిమా హాళ్లలో ప్రతి ఆట ముందు వినిపించాలని, గీతం పాడినంత సేపు సినిమాకు వచ్చినవాళ్లు నిలబడాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన నేపధ్యంలో ఐసి ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోషల్ మీడియాలో, మీడియా నివేదికల్లో జనగణమన, వందేమాతరం గీతాల పైన అనేక అపోహలు నెలకొని ఉన్నాయనీ, ఇవి తొలగిపోవాలంటే ప్రజలకు సరైన, నిఖార్సయిన అధికారిక సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ గీతాన్ని ఆలపించాలని, దానిని గౌరవించాలని జనాన్ని ఆదేశించి, అలా చేయకపోతే శిక్షించడానికి నిర్ణయించినపుడు దానికంటే ముందు ఆ గీతాల గొప్పతనం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
జనగణమన, వందేమాతరం గీతాలు వాస్తవానికి బ్రిటిష్ ప్రభువులను కీర్తిస్తూ రాసినవని అభిప్రాయాలు ఎన్నాళ్లనుండో ఉన్నాయి. తెల్లవాడిని కీర్తిస్తూ రాసిన గీతాలను వాడిని పారద్రోలాక కూడా జాతీయ గీతంగా పాడుకోవడం ఏమిటని అనేక మంది ప్రశ్నించారు; ప్రశ్నిస్తున్నారు. కనుక ఈ గీతాలు జాతీయ గీతాలుగా భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిందో, ఎప్పుడు చట్టం చేసిందో, అసలు చట్టం చేసిందో లేదో వివరాలు జనానికి తెలియడం తప్పనిసరి అవసరం. ఈ గీతాల పేరు చెప్పి, కాసేపు ఆనందిద్దామని సినిమాకు వెళ్ళినవారిని శిక్షించడానికీ, గొడవలు రేగడానికీ కూడా సాక్షాత్తు సుప్రీం కొర్టే సిద్ధం అయ్యాక సదరు గీతాల అధికారిక హోదా గురించి చట్టం ఏం చెబుతున్నదో ప్రజలకు తెలియాల్సిందే. ఈ అంశాన్ని గ్రహించి విచారణకు సిద్ధపడిన ఎం శ్రీధర్ ఆచార్యులు అభినందనీయులు.
కాగా, నిజాలతో ముందుకు రావడానికి బదులు దాపరికం కొనసాగించడం ద్వారా వివాదం మరింత కొనసాగడానికి స్మృతి, మోడి వీలు కల్పిస్తున్నారన్నది నిస్సందేహం. మోడి డిగ్రీ నిజంగానే పూర్తి చేసినట్లయితే ఎన్నికల వరకు దాచి పెట్టి ఎన్నికల ముందు బైటపెట్టడం ద్వారా విమర్శకులను పలుచన చేసి ఓట్లు నొల్లుకొనే ఎత్తుగడకు బిజేపి పాల్పడుతుండవచ్చు. డిగ్రీ పూర్తి చేయనట్లయితే ఎదోలా నిజం దాచి పరువు కాపాడుకునేందుకు తాపత్రయపడుతుండవచ్చు. కనుక విచారణను వేగవంతం చేయడం ద్వారా ఈ రెండింటికీ అవకాశాలు లేకుండా చేయవలసిన బాధ్యత సమాచార కమిషన్ పైన ఉన్నది.
Thanks to the daring I.C, Sridhar garu.