RSS సంస్ధలకు ఢిల్లీ భూముల పందేరం


img_0525

భూములు లేని పేదలకు, కనీసం ఇళ్ల స్ధలాలు కూడా లేని వారికి కాసింత జాగా ఇవ్వటానికి కూడా పాలకులకు మనసు రాదు. కానీ విదేశీ కంపెనీలకు, కార్పొరేట్లకు, ధనిక వర్గాలకు, సొంత మనుషులకు భూములు అప్పనంగా అప్పజెప్పేందుకు చట్టాలను సైతం తుంగలో తొక్కడం భారత పాలకులకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. 

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలనే అనుసరించింది. బీజేపీ/మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ ను అనుసరిస్తోంది. హిందూత్వ సంస్ధలకు, వ్యక్తులకు ఢిల్లీ లోని విలువైన భూములు పందేరం పెడుతోంది. వాజ్ పేయి హయాంలోని NDA – 1 ప్రభుత్వం కూడా ఇదే అవినీతికి పాల్పడగా మోడీ నేతృత్వం లోని NDA – 2 ప్రభుత్వం ఆ అవినీతిని కొనసాగిస్తున్నది.

ఓ వైపు అవినీతి, నల్ల ధనంలపై పోరాటం అని కబుర్లు చెబుతూ మరోవైపు భూముల పందేరం ద్వారా అవినీతికి, నల్ల ఆస్తులు కూడబెట్టేందుకు బీజేపీ / మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్టే స్వయంగా ఈ నిర్వాకానికి పూనుకోవడం గమనార్హం.

వాజ్ పేయి హయాంలో వివిధ హిందుత్వ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లోని ప్రధాన భూములను కట్టబెట్టగా UPA ప్రభుత్వం సదరు కేటాయింపులను రద్దు చేసింది. మోడీ ప్రభుత్వ కేబినెట్ రద్దు చేసిన కేటాయింపులను పునరుద్ధరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 

హిందుత్వ భావాలను, సనాతన హిందూ ధర్మాలను ప్రచారం చేసే 26 మితవాద సంస్ధలకు భూ కేటాయింపులు పునరుద్ధరిస్తూ మోడీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ద ఎకనమిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. 

వాజ్ పేయి ప్రభుత్వం హిందుత్వ, సనాతన సంస్ధలకు మొత్తం 225 చోట్ల భూములు కేటాయించింది. ఇవన్నీ నగరం లోని ప్రధాన సెంటర్లలో ఉన్నవే. రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలంటే ప్రైమ్ ల్యాండ్స్. ఈ కేటాయింపులపైన విచారణ చేసేందుకు UPA ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. వాటిలో 125 కేటాయింపులు ప్రభుత్వ, రాజకీయ ప్రచారంలో నిమగ్నం అయి ఉన్న సంస్ధలు. అందువల్ల కమిటీ వాటి జోలికి వెళ్లలేకపోయింది. మిగిలిన 100 కేటాయింపులు రాజకీయ ప్రయోజనాల నిమిత్తం జరిపిన కేటాయింపులుగా గుర్తించి వాటిలో 32 కేటాయింపుల్ని రద్దు చేసింది.             

ఈ 32 కేటాయింపుల రద్దు జాబితా ఆమోదం కోసం పలు సం.ల పాటు పట్టణాభివృద్ధి శాఖ, అటార్నీ జనరల్ కార్యాలయంల మధ్య చక్కర్లు కొట్టింది. చివరకు 29 కేటాయింపులు అమలు కాకుండా స్తంభించబడ్డాయి. ఇది బహిరంగం అయ్యాక ఈ కేటాయింపులు పొందిన 26 హిందుత్వ సంస్ధలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 3 సంస్ధలు ప్లాట్లు వెనక్కి ఇచ్చేసాయి. 

మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ కేటాయింపుల పైన మరో కమిటీ (ద్వి సభ్య) వేసింది. UPA ప్రభుత్వ సిఫారసులను ఈ కమిటీ వెంటనే రద్దు చేసి పారేసింది. స్తంభింపజేసిన కేటాయింపులను అర్జంటుగా పునరుద్ధరించింది. మూడు సంస్ధలు కోర్టుకు వెళ్లకుండా తమకు కేటాయించిన ప్లాట్లను వెనక్కి ఇచ్చాయి గదా, వాటిని కూడా తిరిగి సంస్ధలకు ఇచ్చేయాలని బీజేపీ కమిటీ సిఫారసు చేసింది.

ఈ సంస్ధల జాబితా తమ వద్ద ఉన్నదని ఎకనమిక్ టైమ్స్ పత్రిక చెప్పింది. పత్రిక ప్రకారం ఈ సంస్ధల ప్లాట్లు అన్నీ దీన్ దయాళ్ మార్గ్ రోడ్ లోనే ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకున్న ఈ సంస్ధలు ప్రధానంగా RSS తో గానీ లేదా బీజేపీ తో గానీ లేదా హిందుత్వ విద్యార్థి సంఘం ఏబీవీపీ కి గానీ చెందినవే. మిగిలినవి హిందూ ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేసేవి. 

నివసించేందుకు కాసింత జాగా లేని పేదలకు ఇదే తరహాలో భూములు ఇవ్వాలంటే ఇదే ప్రభుత్వాలకు సవా లక్షా చట్టాలు అడ్డం వస్తాయి. పేదల భూములు, నివాసాలు లాక్కోవడానికి కూడా ఈ చట్టాలు ప్రభుత్వాలకు అక్కరకు వస్తాయి. భూములు లాక్కునే చట్టాలు ధనిక వర్గాలకు పాలకుల తైనాతీలకు వర్తించవు. అలాగే భూములు పందేరం పెట్టే చట్టాలు సామాన్య ప్రజలకు ఎప్పటికీ అక్కరకు రావు. సామాన్యులకు సంబంధించినంతవరకు కాంగ్రెస్, బీజేపీ లు రెండూ ఒకటే.  

One thought on “RSS సంస్ధలకు ఢిల్లీ భూముల పందేరం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s